iDreamPost

వాట్సాప్‌ కథ ముగిసిందా..! ?

వాట్సాప్‌ కథ ముగిసిందా..! ?

ఏదైనా ఒక ప్రొడక్టు మార్కెట్‌లో విజయవంతంగా దూసుకుపోవాలంటే కష్టమర్‌ సంతృప్తే ముఖ్యం. కానీ కార్పొరేట్‌ స్థాయిలో మాత్రం సదరు సంస్థకు వచ్చే లాభాలే కీలకం. ఒక వర్గం వారి భావంలో చెప్పాలంటే తమ ప్రొడక్టునే కొనాలన్న ఒంటెద్దుపోకడలను కార్పొరేట్‌ రంగం ప్రొత్సహిస్తోందంటుంటారు. ఇలా ఒంటెద్దు పోకడలతో తమ ఉనికినే కోల్పోయిన ప్రొడక్టులు గత ఇరవయ్యేళ్ళ కాలంలోనే అనేక వందలు ఉంటాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఒంటెద్దు పోకడలకు ఏకఛత్రాధిపత్య ధోరణి ఒక కారణం అయితే తమను తాము పరిస్థితులు తగ్గట్లుగా ఆధునికీకరించుకోక పోవడం మరో కారణంగా మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తుంటారు. ఇలా తమను తాము అప్‌డేట్‌ చేసుకోని పలు సంస్థలు కాలగర్భంలో కలిసిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో ఎంతో పేరెన్నిక గన్న ఫ్యూజీ ఫిల్ముల తయారీ సంస్థలు, ఫోటో కెమెరాలు, రిస్ట్‌ వాచ్‌లు తదితర ప్రొడక్టులు తయారు చేసే సంస్థలను నిదర్శనంగా చూపిస్తుంటారు. ఇవన్నీ కూడా తమని తాము ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోకపోవడంతో మరుగున పడిపోయాయన్నది మార్కెట్‌వర్గాల వాదన.

అయితే ఒక సారి జనంలోకి చొచ్చుకుని పోయాక తాము ఏంచేసినా చెల్లుతుందన్న ఏకపక్ష ధోరణితో ఇంకొన్ని ప్రొడక్టులు వినియోగదారుల నిరాదరణకు గురవుతాయంటారు. ఇందుకు ప్రస్తుత ఉదాహరణగా వాట్సాప్‌ను చూపిస్తున్నారు. ప్రస్తుత దైనందిన జీవితంలో ప్రతి స్మార్ట్‌ ఫోన్‌లోనూ వాట్సాప్‌ ఎంతో కీలకంగా మారింది. స్మార్ట్‌ ఫోన్‌వాడే ప్రతి ఒక్కరు వాట్సాప్‌పై ఏదో రూపంలో ఆధారపడిపోతున్నారు. ఈ స్థాయిలో ఆదరణ దక్కించుకున్న ఈ యాప్‌ను ఫేస్‌బుక్‌ ఇటీవలే సొంతం చేసుకుంది. దీంతో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. యూజర్లకు మరిన్ని సేవలు అందుతున్నాయి. దీంతో పాటే పలు నిబంధనల మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఇంతకు ముందు మాదిరిగా యూజర్లకు ఎటువంటి ఆంక్షల్లేని సేవలు అందించేందుకు వాట్సాప్‌ ముగింపు పలికింది.

ఇందులో ముఖ్యంగా వాట్సాప్‌లో షేర్‌చేసుకునే సమాచారం ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు వాట్సాప్‌ వినియోగదారులు అంగీకరించాలన్న నిబంధనను ఈ యాప్‌లో చేర్చారు. ప్రస్తుతం ఇది ఆ యాప్‌ వినియోగదారుల ఆగ్రహానికి కారణమవుతోందంటున్నారు. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా ఈ అంశంపై సోషల్‌మీడియాలో పుంఖానుపుంఖాలుగా విశ్లేషణలు, సెటైర్‌లు కొనసాగుతున్నాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్‌మస్క్‌ ట్వీట్‌తో ఈ విషయం మరింత ప్రచారానికి నోచుకుంది. ఇలా యూజర్ల డాటాను ఇతర సంస్థలతో షేర్‌ చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ట్వీట్‌ చేసాడు. అంతే కాకుండా తనకు టచ్‌లో ఉండేవాళ్ళంతా ప్రత్యామ్నాయ యాప్‌లను వినియోగించాలని సూచించాడు కూడా. దీంతో ఈ కొత్త నిబంధనపై దృష్టి పెట్టిన వాట్సాప్‌ యూజర్లు తమ కొత్త మెస్సేంజర్‌ కోసం గూగుల్‌ప్లే, యాపిల్‌ ప్లే స్టోర్లలో వెతుకులాటలు ప్రారంభించారు. దీంతో వాట్సాప్‌కు ప్రత్యామ్నాయ యాప్‌లుగా ఉన్న టెలిగ్రాం, సిగ్నల్‌ వంటి యాప్‌ల డౌన్లోడ్‌లు అమాంతం పెరిగిపోయాయి.

తమ యాప్‌ ద్వారా యూజర్లు పంచుకునే డాటా విషయంలో ఫేస్‌బుక్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న వాట్సాప్‌లోని డాటాను కూడా ఫేస్‌బుక్‌ తన వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటుందన్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్న దాఖలాలు కన్పిస్తున్నాయి. ఇది అంతిమంగా వాట్సాప్‌కు వినియోగదారులను దూరం చేస్తుందని మార్కెట్‌వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. సైబర్‌ క్రైం రేటు ఏ యేటికాయేడు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లు తమ డాటా భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ యాప్‌ను వినియోగించుకునే వారి డాటాను మరో యాప్‌తో పంచుకుంటామంటే వారు నిరాకరించడానికే మొగ్గుచూపుతారు. దీంతో వాట్సాప్‌ ద్వారా ప్రస్తుతం తాము వినియోగించుకుంటున్న సేవలకు ప్రత్యామ్నాయాలను వెతకడానికి సిద్ధపడుతున్నారు. దీంతో వాట్సాప్‌ ప్రాభవం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో దీనికి ప్రత్నామ్నాయంగా ఉన్న యాప్‌లపై ఆధారపడడం పెరుగుతుందంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి