వైల్డ్ డాగ్ రివ్యూ

By Ravindra Siraj Apr. 02, 2021, 02:22 pm IST
వైల్డ్ డాగ్ రివ్యూ

ఎన్నడూ లేనిది ఇటీవలి కాలంలో ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న నాగార్జున కొత్త సినిమా వైల్డ్ డాగ్ ఇవాళ థియేటర్లలో అడుగుపెట్టింది. లాక్ డౌన్ వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తొలుత ఓటిటి రిలీజ్ కోసం నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వాలనుకుని మళ్ళీ నిర్ణయం మార్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే అభిమానులకు దీని మీద ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ గత వారం రోజులుగా టీమ్ విస్తృతంగా ప్రమోషన్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కలిగింది. అహిషోర్ సాల్మన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద రూపొందిన వైల్డ్ డాగ్ మెప్పించిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

దేశంలో అరాచకాలు సృష్టించడానికి తీవ్రవాదులు పన్నిన కుట్రలో భాగంగా పలుచోట్ల అమర్చిన బాంబుల వల్ల ఎన్నో అమాయక ప్రాణాలు బలవుతాయి. దీంతో ఈ ఘటన వెనుక ఉన్న దోషులను పట్టుకునేందుకు ప్రభుత్వం ఎన్ఐఏ టీమ్ ని రంగంలో దించుతుంది. అతని మనస్తత్వం వల్ల డిపార్ట్మెంట్ వైల్డ్ డాగ్ అని పిలుచుకునే విజయ్ వర్మ(నాగార్జున) అయిదుగురు ఉన్న బృందాన్ని లీడ్ చేస్తూ నేపాల్ లో దాక్కున్న టెర్రరిస్టు ఖలీద్ ని పట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటాడు. కానీ అడుగడుగునా ప్రమాదాలు తారసపడే ఈ ప్రయాణంలో వైల్డ్ డాగ్ బృందం ఎలా విజయం సాదించిందన్నదే తెరమీద చూడాల్సిన అసలు స్టోరీ

నటీనటులు

ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే నాగార్జున వైల్డ్ డాగ్ రూపంలో మరో నాన్ కమర్షియల్ సాహసానికి సిద్ధపడటం మెచ్చుకోదగ్గ విషయం. అభిమానులు, సాధారణ ఆడియన్స్ కోరుకునే రెగ్యులర్ అంశాలు లేకపోయినా సబ్జెక్టులోని సీరియస్ నెస్ గుర్తించి దానికి తగ్గట్టు విజయ్ వర్మగా అందులో ఒదిగిపోయిన తీరు చాలా బాగా వచ్చింది. మూడు దశాబ్దాలకు పైగా ఉన్న అనుభవం ఉన్న నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు కానీ ఈ వయసులోనూ ఇలాంటి రిస్కీ పాత్రలు చేయడం ద్వారా నాగ్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. ఈసారి ఏజ్ ను మరీ ఎక్కువ దాచలేకపోయారు.

దియా మీర్జా ఓ రెండు మూడు సీన్లకే పరిమితం. సయామీ ఖేర్ అందంగానే ఉంది కానీ ఎక్స్ ప్రెషన్ల పరంగా తన లోపాలు బయటపడకుండా దర్శకుడు బాగానే మేనేజ్ చేశారు. అతుల్ కులకర్ణి, అవినాష్ కురువిల్లవి రెగ్యులర్ పాత్రలే. ఖలీద్ పాత్రధారి క్యారెక్టర్ డిమాండ్ చేసినంత క్రూరంగా లేడు. వైల్డ్ డాగ్ టీమ్ లో ఉన్న అలీ రెజాతో పాటు మిగిలినవాళ్లు అంత పర్ఫెక్ట్ ఛాయస్ కాదు. ఎన్ఐఏ ఆఫీసర్స్ కు ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ చూపించలేకపోయారు. ఇంకొంచెం బెటర్ క్యాస్టింగ్ చేసుకుని ఉంటే బాగుండేది. వీళ్ళు తప్ప ఇంకెవరు తర్వాత కనీసం గుర్తు కూడా ఉండరు.

డైరెక్టర్ అండ్ టీమ్

టెర్రరిస్టుల థీమ్ తో ఇలాంటి ప్రయత్నం చేయడం ముమ్మాటికి మంచి ఆలోచనే. బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. బ్లాక్ ఫ్రైడేతో మొదలుపెడితే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ దాకా చాలా వచ్చాయి. వీటిలో కొన్ని అద్భుతమైన ఆదరణ దక్కించుకోగా మరికొన్ని చేదు ఫలితాన్ని అందుకున్నాయి. దర్శకుడు అహిషోర్ సాల్మన్ వీటి నుంచి ప్రభావితం చెందాడో లేదో తెలియదు కానీ ఒకవేళ నిజమే అయితే అందులో హిట్ అయినవి ఏ కారణంగా పబ్లిక్ ని మెప్పించాయో కొంత హోమ్ వర్క్ చేయాల్సింది. కమర్షియల్ ఎలిమెంట్స్ కి చోటు లేని ఇలాంటి వాటిలో ఎంగేజింగ్ డ్రామా చాలా ముఖ్యం.

ఇప్పటికీ హైదరాబాద్ వాసుల జ్ఞాపకాల్లో సజీవంగా ఉన్న గోకుల్ ఛాట్ పేలుళ్లను నేపథ్యంగా తీసుకోవడం ప్రారంభంలో బాగానే కనెక్ట్ చేశారు. కానీ కథ ముందుకెళ్లే క్రమంలో స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా సాగడం క్రమంగా ఆసక్తిని తగ్గిస్తూ వెళ్ళింది. సబ్జెక్టు డిమాండ్ చేయడంతో నేపాల్ దాకా వెళ్లి ఇంత కష్టపడిన అహిషోర్ ఎడ్జ్ అఫ్ ది సీట్ కి కావాల్సిన అరెస్టింగ్ మెటీరియల్ ని మాత్రం సరైన రీతిలో రాసుకోలేదు. తుపాకీ మూవీలో ఇంటర్వెల్ కు ముందు స్లీపర్ సెల్స్ ని తన ఫ్రెండ్స్ తో కలిసి విజయ్ చంపేసే ఎపిసోడ్ ఎంత అద్భుతంగా పేలిందో గుర్తుందిగా. అదే తరహా మెరుపులు వైల్డ్ డాగ్ లోనూ ఉంటే దీని స్థాయి ఎక్కడికో పెరిగేది.

ఇదేదో బ్యాడ్ ఫిలిం అని ఇదంతా చెప్పడం లేదు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడు తానేం చూడబోతున్నాడో ముందే క్లారిటీ ఉంటుంది. వైల్డ్ డాగ్ రొటీన్ కాదని స్పష్టంగా తెలుసుకునే హాల్లోకి అడుగుపెడతాడు. అలాంటప్పుడు అతను ఊహించని కథనం తెరమీద కనిపించాలి. అప్పుడే థ్రిల్ అవుతాడు. షాక్ కలిగించే వాస్తవాలను అంతకన్నా రెట్టింపు స్థాయిలో ప్రెజెంట్ చేయాలి. అప్పుడే కోరుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కానీ వైల్డ్ డాగ్ లో మిస్ అయ్యింది ఇదే. రచయితగా బ్లాక్ బస్టర్స్ లో పాలు పంచుకున్న సాల్మన్ ఇందులో చాలా సన్నివేశాలను కూర్చిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదో మిస్ అయ్యిందనే ఫీలింగ్ పావుగంటకోసారి కలుగుతుంది.

ముమ్మాటికి ఇది ప్రోత్సహించాల్సిన ప్రయాత్నమే. కానీ ఆ ఒక్క కారణం వైల్డ్ డాగ్ ని గొప్ప సినిమాగా నిలపలేకపోయింది. లాజిక్స్ ని కొన్ని చోట్ల కన్వీనియన్స్ కోసం వదిలేయడం, హీరో టీమ్ లో ఉండే వాళ్ళు సగటు మాములు మనుషుల్లా సిల్లీగా ఆలోచించడం కొన్ని సీన్స్ ని వీక్ గా మార్చేసింది. అయితే టెక్నికల్ గా అహిషోర్ మంచి స్టాండర్డ్స్ ని చూపించాడు. నాగ్ గత సినిమాలు మన్మథుడు 2, ఆఫీసర్ కన్నా ఇది ఎన్నో రెట్లు నయం అనే ఫీలింగ్ అయితే కలిగించగలిగాడు. ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసి ఉంటే హిందీ నుంచి రీమేక్ రైట్స్ కోసం డిమాండ్ ఏర్పడే కంటెంట్ వచ్చి ఉండేది. కానీ ఛాన్స్ మిస్ అయ్యింది

పాటలే లేని వైల్డ్ డాగ్ తన పనితనమంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో చూపించాడు తమన్. కొన్ని బలహీనమైన సన్నివేశాలకు ప్రాణం పోశాడు. బెస్ట్ అనలేం కానీ తమన్ కన్నా మంచి అవుట్ ఫుట్ ఇంకెవరైనా ఇచ్చి ఉండేవారా అంటే ఖచ్చితంగా సమాధానం దొరకదు.శానియల్ డియో ఛాయాగ్రహణంకు అగ్ర తాంబూలం ఇవ్వొచ్చు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ తనకిచ్చిన అవుట్ డోర్ లొకేషన్స్ ని, తక్కువ స్కోప్ ఉన్న ఇంటీరియర్స్ ని బాగా ఆవిష్కరించాడు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ నీట్ గా సాగింది. మురళి ఆర్ట్ వర్క్ బాగుంది. కిరణ్ సంభాషణలు పర్వాలేదు. మ్యాట్నీ నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.

ప్లస్ గా అనిపించేవి

నాగార్జున
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఛాయాగ్రహణం
నిడివి

మైనస్ గా తోచేవి

ఆసక్తిగా సాగని కథనం
క్యాస్టింగ్
చాలా సింపుల్ థ్రిల్స్
ఫ్లాట్ నెరేషన్

కంక్లూజన్

తెలుగులో చాలా అరుదుగా తీవ్రవాద నేపథ్యంలో సీరియస్ థ్రిలర్స్ వస్తుంటాయి. ఆ కోణంలో చూస్తే ఇది ఆహ్వానించాల్సిన సినిమానే. కానీ టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి బ్యాక్ డ్రాప్ లోనే ఓటిటిలోనూ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్ లు వస్తున్నప్పుడు అలా పోల్చుకుని చూస్తే వైల్డ్ డాగ్ జస్ట్ ఓకే అనిపిస్తుందే తప్ప చాలా బాగుందనే ఫీలింగ్ కలిగించదు. టీమ్ అంతా కష్టపడినప్పటికీ రైటింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కేవలం టేకింగ్ పరంగా మాత్రమే ప్రశంసలు దక్కించుకుంది. ఏదేమైనా నాగార్జున మార్కెట్ లెక్కలు చూసుకోకుండా ఒక మంచి ప్రయత్నంగా చేసిన వైల్డ్ డాగ్ ని అంచనాలను తగ్గించుకుని చూస్తే మరీ విపరీతమైన అసంతృప్తి ఖచ్చితంగా కలగదు

ఒక్కమాటలో - వాచబుల్ డాగ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp