వకీల్ సాబ్ రివ్యూ

By Ravindra Siraj Apr. 09, 2021, 01:14 pm IST
వకీల్ సాబ్ రివ్యూ

మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమాగా వకీల్ సాబ్ అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. లాక్ డౌన్ తర్వాత ఇంత భారీ ఎత్తున విడుదలవుతున్న చిత్రం ఇదే కావడంతో పెట్టుబడి లాభాల మీద బయ్యర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ అయినప్పటికీ పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టు చాలా మార్పులు చేసినట్టు ప్రమోషన్ లో రివీల్ చేయడంతో అభిమానుల అంచనాలు దానికి తగ్గట్టే పెరిగిపోయాయి. గత సంక్రాంతి తర్వాత మళ్ళీ ఆ స్థాయి రిలీజ్ ని ఓపెనింగ్స్ దక్కించుకోబోతున్న వకీల్ సాబ్ ఇవాళ తెల్లవారుఝామునే ప్రివ్యూలతో మొదలయ్యింది. మరి రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

కథ

ముగ్గురు స్నేహితురాళ్ళు పల్లవి(నివేదా థామస్), జరీనా(అంజలి), దివ్య(అనన్య నాగళ్ళ)అనుకోకుండా ఓ రాత్రి జరిగిన సంఘటన వల్ల తీవ్ర ప్రమాదంలో ఇరుక్కుని పోలీస్ కేసు దాకా వెళ్లి కోర్టు మెట్లు ఎక్కుతారు. ఇందులో ఎంపి కొడుకు ప్రమేయం ఉండటంతో సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రారు. సరిగ్గా అదే సమయంలో వీళ్ళుండే కాలనీకి కొత్తగా వచ్చిన మాజీ లాయర్ సత్యదేవ్(పవన్ కళ్యాణ్)గురించి తెలుసుకుని అతని సహాయం కోరతారు. వృత్తిని మానేసి తాగుడుకు అలవాటైన సత్యదేవ్ ఈ కేసును టేకప్ చేసి వాళ్ళను ఎలా బయటపడేసాడనేది తెరమీద చూడాల్సిన అసలైన స్టోరీ.

నటీనటులు

తనకు గొప్ప నటన రాదని పబ్లిక్ స్టేజి మీదే ఒప్పేసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, తనను ఇష్టపడే ప్రేక్షకులకు ఏం కావాలో దాన్ని మాత్రం సంపూర్ణంగా ఇచ్చే అలవాటుని ఇందులోనూ కొనసాగించాడు. ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఇచ్చాడు. ఇంత వయసులోనూ వింటేజ్ కళ్యాణ్ ఆవిష్కరింపబడిన తీరు ఆకట్టుకుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఎంత అందంగా కనిపిస్తాడో లాయర్ పాత్రలో ఉన్నంత సేపు ఒకరకమైన ఫైర్ ని మోసుకుంటూ అందులో జీవించేశాడు. కోర్టు సీన్స్ లో ప్రకాష్ రాజ్ తో పోటీ పడే సన్నివేశాల్లో మంచి టైమింగ్ చూపించాడు. ఫైట్స్ లో సైతం ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా పవర్ చూపించిన ఎనర్జీ కన్నుల పండుగే.

తర్వాత చెప్పుకోవాల్సింది ప్రకాష్ రాజ్ గురించి. ఇది ఎప్పుడూ చేయని కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పలేం కానీ ఇంతకన్నా న్యాయం ఎవరూ చేయలేరనే తరహాలో అందులో పూర్తిగా ఒదిగిపోయారు. తన అనుభవాన్ని కోర్టు రూంలో బాగా ప్రదర్శించారు. శృతి హాసన్ గురించి చెప్పడానికి ఏమి లేదు. కొన్ని సీన్లు ఒక పాటకు పరిమితం. ఇక అసలు లీడ్స్ అయిన నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ బాధితులుగా చక్కని పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఒరిజినల్ వెర్షన్ కు తీసిపోని రీతిలో తమవంతుగా బాధ, కసి, కోపం, తెగింపు ఉన్న షేడ్స్ ని చక్కగా ప్రదర్శించారు. నీవేదాకు ఎక్కువ స్పేస్ దక్కింది. ఇక ఇతర ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంత స్కోప్ దక్కలేదు

డైరెక్టర్ అండ్ టీమ్

రీమేక్ లో ఎంత సౌకర్యం ఉంటుందో స్టార్ హీరోతో ఇలాంటి సీరియస్ సబ్జెక్టు చేస్తున్నప్పుడు అంతకన్నా ఎక్కువ రిస్క్ ఉంటుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఇది దృష్టిలో ఉంచుకునే హిందీ కన్నా తమిళ వెర్షన్ నే మార్పులు చేసేందుకు ఎంచుకున్నాడు. అదే వకీల్ సాబ్ కు జరిగిన అతి పెద్ద ప్లస్. అందులోనూ చాలా గ్యాప్ తీసుకుని హీరో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో గుర్తుంచుకుని వాటికి అనుగుణంగానే స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ విషయంలో ఏ మాత్రం బ్యాలన్స్ తప్పినా దాని ప్రభావం ఫలితం మీద పడుతుంది కాబట్టి ఆ కోణంలో ఆలోచించి తీసుకున్న జాగ్రత్తలు వకీల్ సాబ్ ని చాలామటుకు కాపాడాయి.

నిజానికి పింక్ ఒకే టోన్ లో సాగే చాలా గంభీరమైన కథ. దానికి పవర్ స్టార్ ఇమేజ్ ని బ్యాలన్స్ చేయడమనే కత్తి మీద సాముని వేణు శ్రీరామ్ మేనేజ్ చేసిన తీరు మెచ్చుకోదగింది. ఫస్ట్ హాఫ్ లో టేకాఫ్ తో పాటు అక్కడక్కడా కొంత నెమ్మదించినప్పటికీ రెండో సగంలో అతను టెంపో మైంటైన్ చేసిన తీరు వకీల్ సాబ్ స్థాయిని పెంచేసింది. అసలు పింకే చూడని వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంటర్ టైన్మెంట్ అంశాలకు ఇందులో చోటు లేదు కాబట్టి కోర్టు సన్నివేశాలు బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా నడిపిస్తూ మంచి డైలాగులు పడేలా చూసుకోవడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.

ఇది పవన్ గతంలో చేసిన పాతిక సినిమాలతో ఎక్కడా పోలిక కలగనిది. అందులోనూ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి మసాలాలు లేనిది కావడంతో ఎంటర్ టైనింగ్ యాంగిల్ లో చూస్తే ప్యూర్ మాస్ కంటెంట్ కోరుకుంటే ప్రేక్షకులను కొంత నిరాశ పరిచే అవకాశం లేకపోలేదు. అయితే పింక్ చూసినవాళ్ళు దాంతో పోలిక పెట్టుకుంటూ చూస్తే మాత్రం ఫీల్ కాలేరు. అజిత్ చేసిన నీర్కొండ పార్వై కన్నా ఇది మెరుగ్గా అనిపించడం ఖాయం. పవన్ రేంజ్ యాక్టర్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న తరుణంలో కం బ్యాక్ కోసం ఇలాంటి సబ్జెక్టుని ఎన్నుకోవడం ఖచ్చితంగా మంచి నిర్ణయమే.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి చెలరేగిన అనుమానాలను శ్రీరామ్ వేణు తన టేకింగ్ తో చెక్ పెట్టారు. పవన్ ఎనర్జీని ఎలా వాడుకోవాలో తూకం వేసి మరీ సెట్ చేసిన తీరు బాగా నప్పింది. అసలు కథలో లేని నాలుగు ఫైట్లు జొప్పించినా కూడా అవి ఇరికించిన ఫీలింగ్ కలగకుండా జాగ్రత్త పడటం బాగుంది. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ తన మీద విమర్శలకు తావివ్వకుండా వకీల్ సాబ్ ఎంచుకోవడం ద్వారా సరైన నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టే కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న శ్రీరామ్ వేణు దాన్ని సమర్ధవంతంగా నడిపించడంతో ఫైనల్ గా సాబ్ ఈజీగా పాసైపోయాడు.

అలా అని ఇది అల్ ఇన్ వన్ ప్యాకేజీ కాదు. కొన్ని లోపాలు ఉన్నాయి. పవన్ తో పాటు కొన్ని పాత్రలకు పెట్టిన తెలంగాణ స్లాంగ్ కృతకంగా ఉంది. పడికట్టు మాటలతో ఏదో డిఫరెంట్ గా చేశామనుకున్నారు కానీ క్లిక్ కాలేదు. ఫ్లాష్ బ్యాక్ చాలా రొటీన్ గా అనిపించడంతో పాటు లాయర్ వృత్తిని వదిలేయడానికి సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయింది. కాలేజీ విద్యార్థిగా ఏదైనా పవర్ ఫుల్ ఎపిసోడ్ డిజైన్ చేసి ఉంటే స్థాయి పెరిగేది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలకు కోర్ట్ డ్రామా ఎంతమేరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం కానీ ఇది కమర్షియల్ ఫలితం మీద ప్రభావం చూపించే అవకాశం కొట్టిపారేయలేం.

సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమా గురించి చాలా సార్లు చెప్పినట్టు నిజంగానే అంచనాలకు మించి తన ప్రాణం పెట్టాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యింది. ఇప్పటికే హిట్ అయిన పాటలు తెరమీద చక్కని చిత్రీకరణ తోడై ఇంకా బాగా అనిపించాయి. పిఎస్ వినోద్ ఛాయాగ్రహణం భారీతనంతో పాటు సినిమా టోన్ ని డిఫరెంట్ మూడ్స్ లో చూపించడంలో సక్సెస్ అయ్యింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ నీట్ గానే సాగింది కానీ కమర్షియల్ ఫ్లేవర్ ని ఎలాగూ మిక్స్ చేశారు కాబట్టి నిడివి కొంచెం తగ్గి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఫైట్లు మాత్రం గూస్ బంప్స్ ఇచ్చేలా వచ్చాయి. వందల కోట్లు డిమాండ్ చేసే ప్రాజెక్ట్ కాకపోవడంతో దిల్ రాజు డీసెంట్ బడ్జెట్ తో కానిచ్చేశారు

ప్లస్ గా అనిపించేవి

పవన్ కళ్యాణ్
తమన్ సంగీతం
కోర్ట్ సీన్స్
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్ కొంత
సాధారణ మాస్ కి కనెక్ట్ అవ్వడంలో డౌట్
ఫ్లాష్ బ్యాక్

కంక్లూజన్

జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ డంని అప్పుడూ ఇప్పుడూ ఒకేలా మైంటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత సినిమాగా వచ్చిన వకీల్ సాబ్ అంచనాలను భారీగా కాదు కానీ సంపూర్ణంగా అందుకుందనే చెప్పాలి. ఇలాంటి కథను ఇంతకన్నా కమర్షియల్ గా చెప్పలేం అనే తరహాలో శ్రీరామ్ వేణు దర్శకత్వం మెప్పించగా తన అభిమాన హీరోకి మొదటిసారి సంగీతం అందించిన అవకాశాన్ని తమన్ అద్భుతంగా వాడుకోవడంతో వకీల్ సాబ్ అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను కూడా మెప్పించేలానే సాగాడు. ఆర్గుమెంట్ లేకుండా టికెట్ కు సరిపడా న్యాయమైతే దక్కిందనే చెప్పాలి

ఒక్క మాటలో - కేసు గెలిచిన వకీల్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp