English

టక్ జగదీష్ రివ్యూ

By Ravindra Siraj Sep. 10, 2021, 02:21 am IST
టక్ జగదీష్ రివ్యూ

వి, ఆకాశం నీ హద్దురా, నిశ్శబ్దం, నారప్పల తర్వాత భారీ ఓటిటి రిలీజ్ గా గత కొద్దిరోజులుగా విమర్శలు ఎదురు చూపుల్లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా టక్ జగదీష్ ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ లో చెప్పిన డేట్ టైం కంటే కాస్త ముందే వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. వినాయక చవితి పండగను టార్గెట్ చేసుకున్నఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గురించి టీమ్ విస్తృతంగా ప్రమోషన్ చేసింది. కుటుంబమంతా ఇంట్లోనే ఉండి చూసే అవకాశం ఉండటంతో వ్యూస్ పరంగానూ అంచనాలు భారీగా ఉన్నాయి. బుల్లితెరపై భారీ సందడి చేయడానికి వచ్చిన జగదీష్ టక్ లెన్త్ కు తగ్గట్టు కొలత సరిపోయిందా ఏమైనా తేడా ఉందా రివ్యూలో చూద్దాం

కథ

భూదేవిపురం ప్రజలు దేవుడిలా కొలిచే పెద్దమనిషి ఆదిశేషయ్య(నాజర్). ఇద్దరు భార్యల వల్ల కలిగిన సంతానం బోసు(జగపతిబాబు), జగదీష్ నాయుడు(నాని). అక్కా బావలు కూడా వీళ్ళతోనే కలిసి ఉంటారు. ఆదిశేషయ్య చనిపోయాక ఆస్తి కోసం వీళ్ళ కుటుంబానికి శత్రువైన వీరేంద్ర(డేనియల్ బాలాజీ)తో చేతులు కలుపుతాడు బోసుబాబు. దీంతో అందరూ విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జగదీష్ కు తెలియకుండా మరదలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్)వీరేంద్ర ఇంటికి కోడలిగా వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, చిన్నాభిన్నమైన తనవాళ్ళను జగదీష్ ఒకేతాటిపైకి ఎలా తీసుకొచ్చాడనేదే ఇంట్లోనే కూర్చుని చూడాల్సిన అసలు స్టోరీ

నటీనటులు

నానికి ఇలాంటి పాత్రలు రోజూ అన్నం తిన్నంత తేలిక. అలవోకగా చేసుకుంటూ పోయాడు. చాలా కాలం తర్వాత కమర్షియల్ టచ్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ కావడంతో న్యాయం చేశాడు. నేను లోకల్ తర్వాత మాస్ కి కనెక్ట్ అయ్యే లుక్ అండ్ మ్యానరిజంస్ ఇందులోనే చూడొచ్చు. ఎమోషన్స్ పరంగా హెవీ డోస్ ఉన్నప్పటికీ తనకు ఇది కొత్తేమి కాదు కాబట్టి నానికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. రీతూ వర్మకు మరీ ఛాలెంజింగ్ అనిపించేది కాదు కానీ ఉన్నంతలో దర్శకుడు తనకు డీసెంట్ స్పేస్ ఇచ్చాడు. గ్లామర్ షోకు దూరంగా చక్కగా పక్కింటి తెలుగమ్మాయిలా ఉంది.

నెగటివ్ షేడ్స్ ఉన్న అన్నయ్యగా జగపతిబాబు ఎప్పటిలాగే చేసుకుంటూ పోయాడు. ఎన్నో సినిమాల్లో తెల్లగడ్డం, జుత్తుతో బోర్ కొట్టేసిన లుక్ కి సెలవు ఇచ్చి హెయిర్ కి నల్ల కలర్ కొట్టేసి కాస్త వయసు తగ్గించడం నప్పింది. డేనియల్ బాలాజీ విలనీ కన్నా తిరువీర్ క్రూరత్వం పండింది. మరదలిగా ఐశ్వర్య రాజేష్ సరిపోయింది. రోహిణి, నాజర్, పార్వతి, నరేష్, రావు రమేష్, ప్రవీణ్, మాల పార్వతి, దేవదర్శిని, రఘుబాబు, కంచెరపాలెం కిషోర్ తదితరులు ఆయా పాత్రలకు తగ్గట్టు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రత్యేకంగా కమెడియన్లంటూ ఎవరూ లేకపోవడం రిలీఫ్ గానే ఉన్నా ఫైనల్ గా ఇది మైనస్సే అయ్యింది

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు శివ నిర్వాణ సినిమాల్లో కథలు ఎలా ఉన్నా ఎమోషన్లు ప్లస్ ఎంటర్ టైన్మెంట్ రెండూ బ్యాలన్స్ అవుతూ మెప్పిస్తాయి. నిన్ను కోరి, మజిలీలో జరిగింది అదే. వాటిలో చెప్పాలనుకున్న పాయింట్ తో పాటు తగినంత వినోదం పాలు ఉండేలా జాగ్రత్త పడటం హిట్ జోన్ లో పడేలా చేసింది. కాకపోతే ఈసారి ఆ డోస్ ని పక్కనపెట్టి పూర్తిగా ఉమ్మడి కుటుంబం భావోద్వేగాల మీద దృష్టి పెట్టడంతో టక్ జగదీష్ బరువుగా అనిపిస్తాడు. అన్నదమ్ములు వాళ్ళ మధ్య ఆస్తుల కోసం చంపుకునే గొడవలు నిత్యం ఎన్నో చూస్తున్నాం. నిజానికిది ఎప్పటికైనా వర్కౌట్ చేసుకోగలిగే మంచి పాయింట్. కనెక్టివిటీకి చాలా స్కోప్ ఉంది.

పాత్రల తాలూకు పరిచయం వాటి తాలూకు ఎస్టాబ్లిషమెంట్ కోసం కాస్తంత ఎక్కువ సమయం తీసుకున్న శివ గంటయ్యాక కానీ అసలు కథలోకి ఎంటర్ కారు. అప్పటిదాకా జరిగేదంతా సాదాసీదాగా ఉంటుందే తప్ప అటు టైం పాస్ చేయించడం కానీ నవ్వించడం కానీ పెద్దగా జరగదు. సన్నివేశాలు అలా వచ్చి వెళ్తూ ఉంటాయి. అలా అని పూర్తిగా చిరాకు పుట్టించవు కానీ వాటి స్థానంలో ఎక్కువ ఆశిస్తాం కాబట్టి ఏంటి మరీ ఇంత సింపుల్ గా వెళ్తోందనే ఫీలింగ్ కలుగుతుంది. సిచువేషన్ కు తగ్గట్టు అసలు పాత్రలతోనే సరదాగా కామెడీ ట్రాక్స్ డిజైన్ చేయడమో లేదా నవ్వించే ప్రయత్నమో చేసి ఉంటే బాగుండేది.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటే ప్రేక్షకులు అందులో ఫుల్ మీల్స్ తరహాలో అన్నీ ఆశిస్తారు. అంతే తప్ప కేవలం బరువైన సన్నివేశాలు, లెక్చర్ తరహాలో అనిపించే డైలాగులు కాదు. వెంకటేష్ కలిసుందాం రా అప్పట్లో క్లాసు మాస్ తేడా లేకుండా అందరిని మెప్పించి రికార్డులు సొంతం చేసుకుందంటే ఆ స్థాయిలో దాన్నో కంప్లీట్ ప్యాకేజ్ గా తీర్చిదిద్దారు కాబట్టి. ఇందులో అలా జరగలేదు. ఉదాహరణకు టక్ జగదీష్ లో కథా క్రమానికి మూలకారణమైన బోసు బాబుని ప్రెజెంట్ చేసిన తీరే సరిగా కనెక్ట్ కాదు. అతని ప్రవర్తన చాలా చోట్ల కృతకంగా అనిపించిందంటే దానికి కారణం క్యారెక్టరైజేషన్ లోపమే. తనకన్నా వీరేంద్ర తమ్ముడి పాత్ర రిజిస్టర్ అయ్యిందంటే పొరపాటు ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా పక్కనపెడితే ఫస్ట్ హాఫ్ లో జరిగిన లోపాలను సెకండ్ హాఫ్ లో మాస్ ఎపిసోడ్స్ తో కవర్ చేసే ప్రయత్నం చేశాడు శివ నిర్వాణ. ఇంటర్వెల్ బ్యాంగ్ లాజిక్ గా కాస్త దూరంగా ఉన్నా కూడా సగటు ప్రేక్షకుడి కోణంలో మంచి ట్విస్ట్ అని చెప్పొచ్చు. పొలంలో ఫైట్, రీతూ వర్మని రౌడీలు అల్లరి పెడుతుంటే జగదీష్ చెరువు గట్టు మీద చేసే పోరాట సన్నివేశం లాంటివి రెగ్యులర్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేవే. ఒకరకంగా చెప్పాలంటే ఇవి కొంత కాపాడాయి. కానీ చివరి ముప్పాతిక గంటను రెగ్యులర్ సినిమాటిక్ ఫార్ములాలో నడిపించడం, ప్రధాన పాత్రలన్నీ అర్జెంట్ గా మారిపోవాలనే ఉద్దేశంతో రాసుకున్న క్లైమాక్స్ సీన్లు బెస్ట్ అనిపించే స్థాయిలో పండలేదు.

శివ నిర్వాణను ఒక్క విషయంలో మెచ్చుకోవాలి. కథా కథనాలు నెమ్మదిగా సాగినా కూడా మరీ ఎక్కువ విసుగు రాకుండా ఎక్కడిక్కడ ప్యాచులు వేసుకుంటూ వెళ్లి ఫైనల్ గా యావరేజ్ అనిపించారు. ఇంకేదో మిస్ అయ్యిందన్న ఫీలింగ్ మాత్రం ఎప్పటికప్పుడు సినిమా చూస్తున్నంత సేపు కలుగుతూనే ఉంటుంది. ఒకదశలో కార్తీ చినబాబు సినిమా గుర్తుకు వస్తుంది. కాకపోతే అందులో మాదిరి శృతి మించిన ఓవర్ డ్రామాను చూపించకుండా డీసెంట్ గా చూపించడం కొంత ఊరట. కథ పరంగా కొన్ని పోలికలు ఉన్న మాట మాత్రం వాస్తవం. మొత్తానికి జగదీష్ పండగ పూట బ్యాడ్ ఛాయస్ స్టాంప్ వేయించుకోకుండా గట్టి ప్రయత్నమే చేశాడు

తమన్ పాటలు తన స్థాయికు తగ్గట్టు బ్లాక్ బస్టర్ రేంజ్ లో లేకపోయినా ఉన్న రెండు మూడు విజువల్ గా బాగున్నాయి. సాఫ్ట్ మూవీస్ కి ఎక్కువగా మ్యూజిక్ ఇచ్చే గోపి సుందర్ నేపధ్య సంగీతం కూడా కొన్ని మెరుపులకే పరిమితం. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం పల్లెటూరి అందాలను, కుటుంబ సంబంధాలను చక్కగా ఆవిష్కరించింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సెంటిమెంట్ సీన్స్ దగ్గర మొహమాటం తగ్గించి ఉంటే ల్యాగ్ తగ్గి ఇబ్బంది లేకుండా బాగుండేది. షైన్ స్క్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్టిస్టుల పారితోషికాలు, అవుట్ డోర్ షూటింగ్ కే బాగా ఖర్చు పెట్టినట్టున్నారు కాబోలు బడ్జెట్ అయితే తెరమీద కనిపిస్తుంది

ప్లస్ గా అనిపించేవి

నాని
ఛాయాగ్రహణం
మాస్ ఎపిసోడ్స్

మైనస్ గా తోచేవి

ఎమోషన్ల బరువు
జీరో ఎంటర్ టైన్మెంట్
నిడివి
ఫస్ట్ హాఫ్

కంక్లూజన్

పండగ పూట సరదాగా కుటుంబం మొత్తం ఇంట్లోనే కూర్చుని చూడదగ్గ సినిమాగా టక్ జగదీశ్ బృందం సినిమాను ప్రమోట్ చేసింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని ఇది ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. అలా కాకుండా ఎమోషన్లు ఎలా ఉన్నా టైం పాస్ చేయించి నాని కోసమో లేదా తెరనిండా కనిపించే ఆర్టిస్టుల కోసమో ఓసారి లుక్ వేస్తే పోలా అనుకునే ప్రేక్షకులకు టక్ జగదీష్ ఓకే అనిపిస్తాడు. ఏదైనా డైరెక్ట్ ఓటిటి సినిమా చూశాక ఇది థియేటర్లో వచ్చి ఉంటే బాగుండేది కదా అనిపిస్తే దాన్ని నిజమైన బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. కానీ మన జగదీష్ ఆ ఫీలింగ్ కి సగం దూరంలో ఆగిపోయాడు

ఒక్కమాటలో - సెంటిమెంట్ జగదీష్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates