తూటా రివ్యూ

By G.R Maharshi Jan. 01, 2020, 06:23 pm IST
తూటా రివ్యూ

ప్రేక్ష‌కుల‌కి "తూటా" దెబ్బ‌

కొత్త సంవ‌త్స‌రం ఆనందంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. కానీ మ‌న‌మొక‌టి త‌లిస్తే గౌతం మీన‌న్ ఇంకోటి త‌లిచాడ‌ని మ‌న మీదికి తుపాకీ ఎక్కుపెట్టి తూటా వ‌దిలాడు. థియేట‌ర్‌లో హాహాకారాలు, ఆర్త‌నాధాలు కొంత‌మంది అదృష్ట‌వంతులు అంద‌రి కాళ్లు తొక్కుతూ కూడా పారిపోయారు. న్యూ ఇయ‌ర్ రోజు తూటాకి వెళితే ర‌క్తగాయాలే!

ఈ మ‌ధ్య ఖైదీ, దొంగ‌చూసి త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌పై కొంచెం గౌర‌వం పెరిగింది. ఇంత‌లోనే ధ‌నుష్‌, గౌత‌మ్ క‌క్ష‌క‌ట్టి , ప్రేక్ష‌కుల్ని క‌ట్టేసి మ‌రీ కొట్టారు. దీన్ని చూసిన త‌ర్వాత ఒక మిత్రుడు ఏమ‌న్నాడంటే "31 రాత్రి డ్రంకన్‌ డ్రైవ్‌లో దొరికి జైలుకు వెళ్లినా ఇంత‌కంటే త‌క్కువ టార్చ‌రే ఉండేది" అని.

సినిమా ప్రారంభంలోనే ధ‌నుష్ ఒక ఫైట్ చేస్తాడు. ఒక‌డు అత‌న్ని కాలుస్తాడు. తూటా Slow Motionలో వ‌స్తూ ఉండ‌గా టైటిల్స్ , ప్లాష్‌బ్యాక్. హీరోకి ఒక అన్న‌. అత‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఇది అన్న‌ద‌మ్ముల క‌థ కావ‌చ్చు అనుకుంటాం. త‌ర్వాత హీరోయిన్ (మేఘాఆకాష్‌) ప‌రిచ‌యం. ఆమె అయిష్టంగా సినిమాల్లో న‌టిస్తూ ఉంటుంది. ధ‌నుష్ చ‌దువుతున్న కాలేజీల్లో షూటింగ్ జ‌రిగితే ఇద్ద‌రూ ఒక‌రికొక‌రికి ప‌రిచ‌యం. ఆ త‌ర్వాత ప్రేమ‌. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల కంటే పాట‌లే ఎక్కువ‌గా ఉంటాయి. ఒక రేంజ్‌లో నంజుకుంటారు.

హీరోయిన్‌ని ఒక‌డు పెంచి పెద్ద చేసి, సినిమాల్లో యాక్ట్ చేయించి డ‌బ్బు సంపాదించాల‌నుకుంటాడు. వాడి నుంచి త‌ప్పించుకోడానికి ఆమె Try చేస్తూ ఉంటుంది. హీరో ఆమెని త‌న ఇంటికి తెచ్చి , అమ్మానాన్న‌ల‌కి కాబోయే కోడ‌లుగా ప‌రిచ‌యం చేస్తాడు. వెతుక్కుంటూ ఆమె Caretaker వ‌చ్చి హీరోయిన్‌ని తీసుకెళ్తాడు. నాలుగేళ్లు గ‌డిచిపోతాయి. (దేవుడి ద‌య వ‌ల్ల విర‌హ గీతాలు లేవు)

ఒక‌రోజు హీరోయిన్ నుంచి ఫోన్‌. హీరో అన్న‌య్య వ‌ద్ద తాను ఉన్నాన‌ని. హీరో ముంబ‌యి వెళ్తాడు. అత‌న్ని అన్న Undercover పోలీస్ ఆఫీస‌ర్ (శ‌శికుమార్‌). అత‌న్ని పోలీసులు , మాఫియా ముఠా వాళ్లు వెతుకుతూ ఉంటారు. ఈ క‌థ ఏంటో అర్థం కాక జుత్తు పీక్కునేలోగా సినిమా అయిపోతుంది. ఒక సీన్‌లో విల‌న్ "క్లైమాక్స్ ఎలా Set చేయాలో అర్థం కావ‌డం లేదు" అంటాడు. ద‌ర్శ‌కుడి కండీష‌న్ కూడా అదే.

వెనుక‌టికి ధ‌నుష్ "రైలు" అనే సినిమా తీశాడు. అది డిజాస్ట‌ర్‌. దాని అమ్మ మొగుడు ఇది. గౌతంకి, ధ‌నుష్‌కి ఎంతోకొంత Good Will ఉంది. ఇద్ద‌రూ క‌లిసి ప్రేక్ష‌కుల్ని ఒక ర‌కంగా మోసం చేసారు.

ఫొటోగ్ర‌ఫీ మాత్రం అందంగా ఉంది. కానీ దాని వ‌ల్ల రెండున్న‌ర గంట‌లు భ‌రించ‌లేం క‌దా. అస‌లు ధ‌నుష్‌కి ఈ క‌థ‌లో ఏం కొత్త‌ద‌నం క‌నిపించిందో మ‌రి. దీన్ని చూసిన త‌ర్వాత మ‌న తెలుగు డైరెక్ట‌ర్ల మీద గౌర‌వం పెరుగుతుంది.

దీన్ని డ‌బ్బింగ్ చేసిన వాళ్ల ధైర్యానికి మెచ్చుకోవ‌చ్చు. మీక్కూడా ధైర్యం ఉంటే చూడొచ్చు. వాషింగ్ మెషిన్ల కంటే ఒక్కోసారి సినిమాలే బాగా ఉతుకుతాయి.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp