తిమ్మరుసు రివ్యూ

By Ravindra Siraj Jul. 30, 2021, 02:16 pm IST
తిమ్మరుసు రివ్యూ

మూడు నెలలకు పైగా మూతబడిన థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్ సీస్ లోనూ టాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్ధం కావడం మూవీ లవర్స్ ని ఆనందంలో ముంచెత్తింది. ఇమేజ్ ఉన్న హీరోలు కాకపోయినా, అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా మౌత్ టాక్ ని నమ్ముకుని ఈ రోజు ఏకంగా అయిదు స్ట్రెయిట్ సినిమాలు బరిలో దిగాయి. వాటిలో కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కనిపించిన చిత్రం తిమ్మరుసు. లాక్ డౌన్ టైంలో మూడు ఓటిటి రిలీజులతో పలకరించిన సత్యదేవ్ హీరోగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

2011లో జరిగిన ఓ క్యాబ్ డ్రైవర్ హత్యకేసులో చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు పబ్ ఉద్యోగి వాసు(అంకిత్). ఎనిమిదేళ్ల తర్వాత ఇతని నిర్దోషిత్వాన్ని ఋజువు చేసే బాధ్యతను తీసుకుంటాడు లాయర్ రామ్(సత్యదేవ్). ఈ కుట్రలో భాగం పంచుకున్న ఇన్స్ పెక్టర్ భూపతిరాజు(అజయ్), లాయర్ వరాహమూర్తి(రవిబాబు)లు అడుగడుగునా రామ్ కు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. దీని వెనుక ఉన్న అసలు హంతకుడు ఎవరో అర్థం కాక రామ్ బృందం చేసిన ప్రయత్నాలు మళ్ళీ మొదటికే వస్తాయి. అసలు మర్డర్ ఎవరు చేశారు, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా

నటీనటులు

రెండు మూడు సీన్లు ఉండే చిన్న చిన్న వేషాలతో మొదలుపెట్టి ఇప్పుడు తనకంటూ ఒక మినీ మార్కెట్ ని సృష్టించుకునే దాకా ఎదిగిన సత్యదేవ్ కు మరో సారి మంచి క్యారెక్టర్ దక్కింది. కమర్షియల్ బిల్ లో తను ఫిట్ కాడు కాబట్టి ఇలాంటి డిఫరెంట్ జానర్స్ ని ట్రై చేయడం అన్ని వర్గాల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం కలిగిస్తుంది. లాయర్ పాత్రలో సత్యదేవ్ తనదైన టైమింగ్ తో దర్శకుడు ఏం ఆశించాడో దాన్ని పూర్తిగా నెరవేర్చాడు. మాస్ కోసం పెట్టిన ఫైట్లలో కొంత ఇబ్బంది పడినప్పటికీ ఫైనల్ గా మెప్పించాడు. ఓవరాల్ గా తిమ్మరుసులో ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టు అలా చేసుకుంటూ పోయాడు. మళ్ళీ పాస్ అయ్యాడు

హీరోయిన్ ప్రియాంక జవల్కర్ కు చేయడానికి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఏదో మొక్కుబడిగా ఉండాలి అన్నట్టు లాగించారు కానీ సినిమా అయ్యాక తనను గుర్తు చేసుకోవడం కూడా కష్టమే. అజయ్ ది పోలీస్ ఆఫీసర్ గా రెగ్యులర్ పాత్రే అయినా ఇంటెన్సిటీ ఉండటంతో అలవాటైన రీతిలో చేసుకుంటూ పోయాడు. వైవా హర్ష, రవిబాబు, ఝాన్సీ తదితరులు తమ పరిధి మేరకు పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బ్రహ్మాజీ, అంకిత్ లకు దాదాపుగా హీరోకు ఉన్నంత స్క్రీన్ స్పేస్ దక్కింది. వాడుకున్నారు కూడా. ఫోకస్ ఎక్కువగా హీరో అండ్ క్రైమ్ పార్ట్ మీద ఉండటంతో మిగిలిన క్యారెక్టర్స్ కు ఛాలెంజ్ అనిపించే అవకాశం దక్కలేదు.

డైరెక్టర్ అండ్ టీమ్

రీమేకులలో ఎంత సౌలభ్యం ఉంటుందో అంతే రిస్క్ ఉంటుంది. పక్కభాషలో మెప్పు పొందిన సినిమాలలో గొప్పగా ఆడినవి ఉన్నాయి. ఊసులో లేకుండా పోయినవీ ఉన్నాయి. మన ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు వాటిలో మెటీరియల్ ఉందో లేదో సరిగ్గా పసిగట్టగలిగినప్పుడే విజయం దక్కుతుంది. ఇదే దర్శకుడు శరన్ కొప్పిశెట్టి గతంలో కిరాక్ పార్టీకి ఈ సూత్రాన్ని పాటించడంలో ఫెయిల్ కావడం వల్లే దాని విషయంలో బ్యాడ్ రిజల్ట్ దక్కింది. అయినా కూడా మళ్ళీ కన్నడ సినిమానే ఎంచుకోవడం సాహసమే. అయితే అందులో కేవలం పాయింట్ ని మాత్రమే తీసుకున్నామని చెబుతూ వచ్చిన యూనిట్ మాటల్లో కొంత నిజం లేకపోలేదు.

స్వయంగా ఒక లాయరే పోలీస్ ఆఫీసర్ తరహాలో ఇన్వెస్టిగేషన్ కి పూనుకోవడం మరీ కొత్తేమి కాదు. చెట్టు కింద ప్లీడర్ తో మొదలుపెట్టి సప్తగిరి ఎల్ఎల్బి దాకా చాలానే ఉన్నాయి. అయితే అవన్నీ ఎంటర్ టైన్మెంట్ అంతర్లీనంగా కొనసాగే కోర్ట్ డ్రామాలు. కానీ తిమ్మరుసు పూర్తిగా సీరియస్ మోడ్ లో సాగుతుంది. అక్కడక్కడా రెండు మూడు జోకులు ఉన్నప్పటికీ అవేమి అంత హిలేరియస్ కాదు. పాయింట్ కు కట్టుబడి అనవసరమైన డీవియేషన్లకు పోకుండా కథనం నడిపించిన తీరు బాగుంది. సత్యదేవ్ రెగ్యులర్ హీరో కాకపోవడం వల్లే ఈ అడ్వాంటేజ్ ని శరన్ చక్కగా వాడుకున్నాడు. దానికి తగ్గట్టే ఒకే టెంపోలో స్టోరీ సాగింది.

ఎక్కడికక్కడ ట్విస్టులతో స్క్రీన్ ప్లే సాగుతున్నప్పటికీ అక్కడక్కడా ల్యాగ్ ఉండటంతో కొన్ని చోట్ల అంతగా ముందుకు సాగని ఫీలింగ్ కలుగుతుంది. గ్రిప్పింగ్ అనే పదాన్ని ఈ సినిమాకు అన్వయించలేం. ఇంట్రెస్టింగ్ అనే ట్యాగ్ కి మాత్రం న్యాయం చేకూర్చారు. సినిమాలో ఒక సన్నివేశంలో వంశీ అన్వేషణ తాలూకు ఒక చిన్న వీడియో బిట్ ప్లే చేస్తారు. ఆ చిత్రంలో విలన్ రాళ్ళపల్లి పాత్రను అతనే హంతకుడని ఊహించలేని విధంగా తీర్చిదిద్ది చివరికి షాక్ ఇవ్వడం ప్రేక్షకులకు భయంతో పాటు గొప్ప థ్రిల్ ని కలిగించింది. తిమ్మరుసులో కూడా ఆ ఛాన్స్ ఉన్నప్పటికీ సస్పెన్స్ ని ముడివిప్పే క్రమంలో ఎక్కువ మలుపులు కావాలని పెట్టినట్టు అనిపించడం వల్ల విలన్ ని రివీల్ చేసే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని గొప్పగా కాకుండా మామూలుగా నడిపించిన భావన కలిగిస్తుంది.

ట్రైలర్ లో చూసినదాన్ని బట్టి తిమ్మరుసులో ఏది ఆశిస్తామో దాన్ని దాదాపుగా ఇచ్చేశారు. ఫస్ట్ హాఫ్ లో మొదటి సగం నెమ్మదిగా సాగినప్పటికీ ఆ తర్వాత స్పీడ్ గానే సాగుంది. ఇదంతా తిమ్మరుసుని చాలా బాగుందని చెప్పాడని సరిపోలేదు. అంతా అయ్యాక ఎలా ఉందని ప్రశ్నించుకుంటే ఒకే బాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ ని చూడలేదే అనే అభిప్రాయం కలగకపోవచ్చు. ఏది ఎలా ఉన్నా సత్యదేవ్, శరన్ కొప్పిశెట్టి పూర్తిగా నిరాశపరచకుండా మెప్పించారు. అదిరిపోయే కథాకథనాలతో ఇంట్లోనే చూసే వెబ్ సిరీస్ లతో హోరెత్తిస్తున్న కొత్త జెనరేషన్ లో పోటీ పడాలంటే మెటీరియల్ ఇంకా బలంగా ఉండాలి

సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల పనితనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ప్రశంసలు దక్కించుకుంది. పాటలు లేకపోవడం గొప్ప నిర్ణయం. అప్పు ప్రభాకర్ ఛాయాగ్రహణం బడ్జెట్ సినిమాలోనూ డీసెంట్ క్వాలిటీని తీసుకొచ్చింది. పెట్టిన ఖర్చు కన్నా రిచ్ నెస్ కనిపించడంలో ఇలాంటి కెమెరా మెన్ల పాత్ర చాలా ఉంటుంది. తమ్మిరాజు ఎడిటింగ్ లెన్త్ ఎక్కువ పెరగకుండా జాగ్రత్త పడింది. రెండు గంటల పది నిమిషాల లోపే కట్ చేయడం ఊరట. మహేష్ కోనేరు సృజన్ ల నిర్మాణ విలువలు బాగున్నాయి. కోట్లకు కోట్లు డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోవడంతో నీట్ గా మేనేజ్ చేసుకున్నారు

ప్లస్ గా అనిపించేవి

సత్యదేవ్
మెయిన్ పాయింట్
సెకండ్ హాఫ్
పాటలు లేకపోవడం

మైనస్ గా తోచేవి

హీరోయిన్
కొన్ని ట్విస్టుల కన్ఫ్యూజన్
అక్కడక్కడా ల్యాగ్
పూర్తి గ్రిప్పింగ్ గా అనిపించకపోవడం

కంక్లూజన్

క్రైమ్ థ్రిల్లర్ లు పండాలంటే దానికి కావాల్సిన దినుసులు పర్ఫెక్ట్ గా సెట్ చేసుకునే స్క్రీన్ ప్లే, ఊహించని మలుపులు, ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఉక్కిబిక్కిరి చేసే వేగం. ఇవి తిమ్మరుసులో కొంచెం మోతాదు తక్కువే అయినా ఫైనల్ గా డీసెంట్ వాచ్ క్యాటగిరీలో పడిపోయి ఓకే అనిపిస్తుంది. చేయని తప్పుకు ఒక క్యారెక్టర్ ఇరుక్కుని అసలు హంతకుడిని వెతకడం అనేది ఆ మధ్య నాందిలో కూడా చూశాం. ఇది కూడా అదే బాపతే. కాకపోతే కేవలం ట్విస్టులను ఆధారంగా చేసుకుని ఏదో థ్రిల్ చేద్దామని చేసిన ప్రయత్నం వంద శాతం సంతృప్తిని ఇవ్వదు. సగం చాలని సర్దుకుంటే తిమ్మరుసుని హ్యాపీగా పలకరించి రావొచ్చు

తిమ్మరుసు - సగం బొమ్మ సగం బొరుసు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp