లవ్ స్టోరీ రివ్యూ

By Ravindra Siraj Sep. 24, 2021, 01:00 pm IST
లవ్ స్టోరీ రివ్యూ

థియేటర్లు తెరుచుకుని రెండు నెలలకు దగ్గరలో ఉన్నా పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించే సినిమా ఏదీ రాలేదని భావిస్తున్న తరుణంలో విడుదలైన లవ్ స్టోరీ భారీ ఓపెనింగ్స్ తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల బ్రాండ్, నాగచైతన్య-సాయి పల్లవిల కాంబినేషన్, సారంగ దరియా పాట తాలూకు సెన్సేషన్ ఇవన్నీ కలిసి అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాయి. ఒక ప్రేమకథకు ఈ స్థాయిలో బుకింగ్స్ ఎవరూ ఊహించనిది. హాళ్లకు వచ్చేందుకు జనం సిద్ధంగానే ఉన్నారని సరైన మూవీ పడితే ఆటోమేటిక్ గా హౌస్ ఫుల్ బోర్డులు పడతాయని ఒక రోజు ముందే నిరూపించిన లవ్ స్టోరీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

జుంబా డాన్స్ నేర్పిస్తూ జీవనోపాధి చూసుకున్న రేవంత్(నాగచైతన్య)దాన్ని విస్తరించేందుకు కావలసిన బ్యాంకు లోన్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. బిటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో సిటీకి వస్తుంది మౌనిక(సాయిపల్లవి). ఒకే వీధిలో ఉండటంతో ఇద్దరికీ పరిచయం మొదలవుతుంది. ఓ సందర్భంలో మౌని అద్భుతమైన డాన్స్ ప్రతిభను చూసిన రేవంత్ బిజినెస్ పార్ట్ నర్ గా చేసుకుంటాడు. ప్రేమ చిగురించడం మొదలవుతుంది. రేవంత్ కల నెరవేరి ఫిట్ నెస్ సెంటర్ తెరుస్తాడు. అంతా బాగుందన్న టైంలో మౌని బాబాయ్ నరసింహం(రాజీవ్ కనకాల)ఎంట్రీతో లవ్ స్టోరీ కొత్త మలుపు తిరుగుతుంది. మిగిలింది తెరమీద చూడాలి

నటీనటులు

యాక్టర్ గా నాగ చైతన్య ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నప్పటికీ ఎక్స్ ప్రెషన్ల పరంగా, డైలాగ్ మాడ్యులేషన్ పరంగా ఉన్న కొన్ని లోపాలను లవ్ స్టోరీలో అధిగమించి అభిమానుల అంచనాలకు మించి రాణించాడు. ఈ పాత్ర కోసం తాను ఎంత కష్టపడ్డాడో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన చైతు దానికి తగ్గ అవుట్ ఫుట్ ని తెరమీద ఇచ్చాడు. ఎప్పుడూ ట్రై చేయని కొత్త స్లాంగ్ లో కూడా మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో మంచి పరిణితి కనిపించింది. లేనిపోని మాస్ హీరోయిజం జోలికి వెళ్లకుండా చైతన్య ఇలాంటి సబ్జెక్టులను ఎంచుకోవడం చక్కని నిర్ణయం. తనకు సూట్ కానీ ఓవర్ మాస్ కన్నా ఇలాంటి క్లాసే అందరినీ దగ్గర చేస్తుంది.

ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడంలో హీరోతో సమానంగా ఇంకా చెప్పాలంటే ఒక రవ్వ అంతకన్నా ఎక్కువే ఆకట్టుకున్న సాయిపల్లవి ఫిదా తర్వాత మరో బెస్ట్ పెర్ఫార్మన్స్ ని ఇచ్చి పడేసింది. పాటల్లో డాన్స్, సంభాషణలు పలకడంతో తనకు మాత్రమే సాధ్యమయ్యే ఒకరకమైన తెంపరితనం ఇందులో కూడా పర్ఫెక్ట్ గా చేసింది. సెంటిమెంట్ డ్రామా కాస్త ఎక్కువైనప్పటికీ మౌని క్యారెక్టర్ లో తానెంతగా పరకాయప్రవేశం చేసిందో అర్థమవుతుంది. దేవయాని, ఈశ్వరి రావు, ఉత్తేజ్ తదితరులందరూ సహజంగా ఉన్నారు. రాజీవ్ కనకాలకు చాలా గ్యాప్ తర్వాత గుర్తుండిపోయే పాత్ర దక్కింది

డైరెక్టర్ అండ్ టీమ్

రాజమండ్రి రోజ్ మిల్క్ రుచి తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడా దొరకదన్నట్టు దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే సెన్సిబుల్ ఎమోషన్స్ ఇంకెవరు ట్రై చేసినా ఆ స్థాయిలో పండవన్నది చాలాసార్లు ఋజువయ్యింది. ఒక టోన్ ని సెట్ చేసుకుని అందులో నుంచి డీవియేట్ కాకుండా చెప్పాలనుకున్న పాయింట్ ని కాస్త నెమ్మదిగా అయినా మెప్పించేలా చెప్పడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. లవ్ స్టోరీలో కూడా నిజాయితీతో కూడిన అలాంటి ప్రయత్నమే కనిపిస్తుంది. అయితే ఫిదా తరహాలో ఎప్పుడూ సింపుల్ లైన్స్ తో ఆడియన్స్ ని మెప్పించలేం. అందుకే ఈసారి బాగా రిస్క్ అనిపించే సీరియస్ సబ్జెక్టును శేఖర్ కమ్ముల తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అమ్మాయిలు సమాజంలో ఎదుర్కుంటున్న రెండు ప్రధానమైన సమస్యలను డబుల్ లేయర్ తరహాలో కలిపి చెప్పాలనుకున్న శేఖర్ కమ్ముల ఎంతసేపూ తానెంత నిజాయితీగా చెబుతున్నాననేదే చూసుకున్నారు కానీ ప్రేక్షకులను రెండు ముప్పావు గంటల పాటు పూర్తిగా ఎంగేజ్ చేస్తున్నానా లేదా అనేది చెక్ చేసుకోలేదు. దీని వల్ల సినిమా చాలా నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అందులోనూ ఎంత వద్దనుకున్నా ఫిదాతో పోలిక వస్తుంది కనక మినిమమ్ ఎంటర్ టైన్మెంట్ డోస్ తగ్గడం కొంత నిరాశ కలిగిస్తుంది. ఇలా చేయడం అనవసరమని దర్శకుడు భావించవచ్చు కానీ అతన్నే నమ్ముకుని వచ్చిన ఆడియన్స్ అంచనాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలిగా.

Also Read: మాస్ట్రో రివ్యూ

ఇక కులాల మధ్య అంతరాలను ఆధారంగా చేసుకుని తెలుగులో ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి. ప్రతిచోటా ఈ స్థాయిలో వివక్ష ఉన్నా లేకపోయినా ఎంత సీరియస్ గా చెప్పాలనేదే కమర్షియల్ సక్సెస్ ని శాశిస్తుంది. శ్రీదేవి సోడా సెంటర్ దెబ్బ తిన్నది ఈ విషయంలోనే. కానీ లవ్ స్టోరీని మరీ దాని గాటన కట్టలేం కానీ మంచి ఫిల్టర్ కాఫీని తాగాలని వచ్చిన కస్టమర్ ఎంత ఆరోగ్యం కోసమైనా దానికి బదులుగా బ్లాక్ కాఫీని ఆస్వాదిస్తూ తాగలేడుగా. ఇక్కడ జరిగింది అదే. సెకండ్ హాఫ్ లో రేవంత్ మౌనిల మధ్య లవ్ ట్రాక్ రీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం నిడివిని పెంచడం కూడా కొంత అసహనానికి కారణం అయ్యింది.

ఇదంతా పక్కన పెడితే లవ్ స్టోరీ ఆద్యంతం మరీ విసిగించేలా లేకపోవడం ఊరట. క్వాలిటీ క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవడంతో శేఖర్ కమ్ముల లోపాలను వాళ్ళు ఎక్కడిక్కడ కాచుకున్నారు. పాటలు కలర్ఫుల్ గా సాగడం, కోట్ల ఖర్చు లేకపోయినా క్లీన్ గా అనిపించే విజువల్స్, హీరో హీరోయిన్ మధ్య హెల్తీ కెమిస్ట్రీ ఇవన్నీ డైరెక్టర్ మార్కులోనే సాగి ఉసూరుమానకుండా కాపాడాయి. కానీ సినిమా చాలా బాగుందని చెప్పడానికి ఇవి సరిపోలేదు. మెస్మరైజ్ చేసే మూమెంట్స్ కానీ సీన్స్ కానీ చాలా తక్కువగా ఉండటం ఫ్యామిలీ వర్గాలను ఎంత మేరకు మెప్పిస్తుందో చెప్పడం కష్టమే. సినిమా మీద వచ్చిన హైప్ కి దాన్ని మ్యాచ్ చేయడం అంత సులభంగా కనిపించడం లేదు

Also Read: సీటిమార్ రివ్యూ

దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ నిజమే. కామాంధులు మన చుట్టే ఉన్నారు. కానీ లక్షల్లో ఓ వంద మంది ఉంటారు. బయట పడక చెప్పుకోలేని వాళ్ళు వేలల్లో ఉండొచ్చు. కానీ ఈ సమస్యని జెనరలైజ్ చేసి కోట్లాది జనానికి చెబుతున్నప్పుడు ఎంతో కొంత కమర్షియల్ కోటింగ్ అవసరం. కానీ తన సహజ శైలిని వదులుకుని బయటికి రావడానికి ఇష్టపడని శేఖర్ కమ్ములని తప్పుబట్టలేం కానీ తను చెబుతున్న విషయం సినిమా మాధ్యమం ద్వారా కాబట్టి కథకు తగ్గట్టు కొంత మారాల్సిన అవసరం ఉంది. మేకింగ్ పరంగా టేకింగ్ పరంగా ఎక్కడా వేలెత్తి చూపే అవకాశం ఇవ్వలేదు కానీ అసలైన రైటింగ్ లోనే ఎదుగుదిగుడులున్నాయి

పవన్ సిహెచ్ సంగీతం లవ్ స్టోరీని నిలబెట్టిన నాలుగు స్థంబాల్లో ఒకటి. ఇప్పటికే మూడు పాటలు ఛార్ట్ బస్టర్ కాగా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని దర్శకుడి ఫీల్ తో పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా కంపోజ్ చేసిన తీరు బాగుంది. శేఖర్ కమ్ముల సినిమాలకు రెండో కన్నుగా మారిన విజయ్ సి కుమార్ ఛాయాగ్రహణ పనితనం అద్భుతం అనే మాటకు న్యాయం చేకూర్చింది. అంత అనుభవం ఉన్న మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఎందుకో మరి మొహమాటపడింది. ల్యాగ్ ని తగ్గించే అవకాశం ఉన్నా అది జరగలేదు. ఏషియన్-ఎస్విసి సంస్థల నిర్మాణ విలువలు బాగున్నాయి. అంతా ఇంతా అన్నారు కానీ లొకేషన్లను గమనిస్తే భారీ బడ్జెట్ అయితే జరగలేదు

ప్లస్ గా అనిపించేవి

చైతు సాయిపల్లవి నటన
సంగీతం
ఛాయాగ్రహణం
ప్రధాన సమస్యను ఫోకస్ చేయడం

మైనస్ గా తోచేవి

అవసరానికి మించిన నిడివి
కనీస ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం
ల్యాగ్ స్క్రీన్ ప్లే

కంక్లూజన్

బయట చక్కని వర్షం పడుతున్నప్పుడు వరండాలో రూఫ్ టాప్ కింద కూర్చుని కాఫీ తాగుతూ కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో శేఖర్ కమ్ముల సినిమాలు అలా ఉంటాయని ఆనంద్, ఫిదా, హ్యాపీ డేస్, గోదావరి లాంటి సినిమాలు రుజువు చేశాయి. కానీ లవ్ స్టోరీ ఆ బాపతులోకి రాదు. ఎండలో చెమటలు పట్టి నీడ కోసం మర్రి చెట్టు కింద నిలబడి మొక్కజొన్నపొత్తు తింటూ ఉండగా కుటుంబ సమస్యలు గుర్తుకు వస్తే ఎలా ఉంటుందో ఇది అలా సాగింది. రెండోది మనం భరించలేని అనుభూతి కాదు. కోరుకునేదే. మనం నిత్యం చూసేదే. కానీ మొదటిదానితో పోల్చుకున్నప్పుడే వస్తుంది అసలు తంటా. రెండు సమస్యలనే చక్రాలను కట్టుకుని లవ్ సైకిల్ నడిపిన శేఖర్ కమ్ముల టైర్లలో గాలి పూర్తిగా ఉందో లేదో చూసుకోలేదు. అయినా పర్లేదనుకుంటే ఆగుతూ సాగుతూ గమ్యం చేరొచ్చు

ఒక్కమాటలో - బ్లాక్ కాఫీ లాంటి సీరియస్ సినిమా

Also Read: గల్లీ రౌడీ రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp