సరిలేరు నీకెవ్వరూ రివ్యూ

By Ravindra Siraj Jan. 11, 2020, 08:32 pm IST
సరిలేరు నీకెవ్వరూ రివ్యూ

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాజ్యమేలుతున్న మహేష్ బాబు సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ కు అదో రకమైన ఉత్సాహం. హీరోలందరిలోకి అందగాడిగా పేరుండటంతో పాటు మార్కెట్ పరంగానూ వంద కోట్ల వసూళ్లను మంచి నీళ్ళు తాగినంత ఈజీగా రాబడతాడనే ఇమేజ్ మార్కెట్ ని విపరీతంగా పెంచేసింది. అందులోనూ భరత్ అనే నేను-మహర్షి వరస సక్సెస్ ల తర్వాత సరిలేరు నీకెవ్వరు మీద అంచనాలు పెరిగిపోయాయి. తీసిన నాలుగు సినిమాలతో ఫ్లాపు లేని దర్శకుడిగా అనిల్ రావిపూడి బ్రాండ్ ఒక పక్క, రాజీలేని నిర్మాణంతో భారీతనం నింపిన ముగ్గురు నిర్మాతలు మరోపక్క వెరసి సంక్రాంతి పండగకు కనులవిందైన వినోదం గ్యారెంటీ అనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు. మరి ఆ అంచనాలు నిలబెట్టుకునేలా సరిలేరు నీకెవ్వరు సాగిందా లేక లెక్క ఎక్కడైనా తప్పిందా రివ్యూలో చూద్దాం

ఇంతకీ కథేంటి

దేశరక్షణ కోసం సరిహద్దుల్లో ఉంటూ డ్యూటీనే ప్రాణంగా భావించే ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ(మహేష్ బాబు). ఒక మిషన్ లో భాగంగా కొలీగ్ అజయ్(సత్యదేవ్) ప్రమాదంలో చిక్కుకుని హాస్పిటల్ లో చేరతాడు. అతని చెల్లి పెళ్లి దగ్గరలోనే ఉందని తెలుసుకున్నఅజయ్ కృష్ణ అది పూర్తి చేయడం కోసం ఫ్రెండ్ ఊరైన కర్నూల్ వస్తాడు. అక్కడ అజయ్ తల్లి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ భారతి(విజయశాంతి)కి లోకల్ మినిస్టర్ ఎద్దుల నాగేంద్ర(ప్రకాష్ రాజ్) నుంచి హానీ ఉందని తెలుసుకుని వాళ్ళను కాపాడే బాద్యతను తీసుకుంటాడు. ఈ పోరాటంలో అజయ్ కృష్ణ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు, బోర్డర్ లో అజయ్ కు ఏమైంది తదితర ప్రశ్నలకు సమాధానం స్క్రీన్ పై చూడాల్సిందే.

ఎవరెలా చేశారు

గత ఏడాది పాతిక సినిమాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న మహేష్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. పైగా ఇందులోని పాత్ర టైలర్ మెడ్ తరహా కావడంతో చెలరేగిపోయాడు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ ఉండటంతో దూకుడు తర్వాత ఆ తరహా టైమింగ్ తో ప్రిన్స్ అదరగొట్టాడు. కొన్ని సన్నివేశాల్లో మహేష్ ఎనర్జీ చూస్తే ఇలా ప్రతి సినిమాలో చేస్తే బాగుంటుందనే ఆలోచన కలగడం సహజం. వయసు ముందుకు వెళ్తుంటే గ్లామర్ వెనక్కు లాక్కు వస్తున్న మహేష్ ఇందులో ఇంకా ఫిట్ గా కనిపించి మెస్మరైజ్ చేశాడు.

గత రెండు సినిమాల్లో ఏదో మిస్ అవుతున్నామని ఫీలవుతున్న అభిమానులు, మాస్ ఆడియన్స్ పూర్తిగా సంతృప్తి చెందేలా మహేష్ తన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ప్రకాష్ రాజ్ తో తలపడటం స్టార్ట్ అయ్యాక అజయ్ కృష్ణ పాత్ర ఇంకో లెవెల్ కు వెళ్లిపోయింది. ఎన్నడూ లేనిది డాన్సుల్లో కూడా మహేష్ స్వీట్ షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా మైండ్ బ్లాకు పాటలో ముందు నుంచి యూనిట్ చెబుతున్నట్టుగా పూనకాలు రావడం ఒక్కటే తక్కువ.

హీరొయిన్ రష్మిక మందన్న బబ్లీ గర్ల్ పాత్రలో ఆకట్టుకుంది. మీకు అర్థమవుతోందా అంటూ ప్రత్యేకంగా సెట్ చేసిన మ్యానరిజంలో బాగానే చేసింది. అయితే ఆ పాత్రకు ఎలాంటి వ్యక్తిత్వం లేకుండా హీరో వెనుక పడుతూ అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకే పని లేదన్న తరహాలో చిత్రీకరించడంతో ప్రీ ఇంటర్వెల్ నుంచి ఓ ముప్పావు గంట హీరొయిన్ మాయమైపోతుంది. దీన్ని బట్టే ఎంత మొక్కుబడిగా తన క్యారెక్టర్ ని తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. ఇక 13 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేకప్ కు సినిమా సెట్ కు దూరంగా ఇన్నేళ్ళు గడిచినా కూడా గ్రేస్ ఏ మాత్రం తగ్గకుండా భారతి పాత్రలో ఇంకెవరిని ఊహించలేనంత చక్కగా చేశారు. మహేష్ తో ఆవిడ కాంబినేషన్ సీన్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి.

ప్రకాష్ రాజ్ ది రొటీన్ విలన్ పాత్రే. ఒక్కడు సినిమాలో ఓబుల్ రెడ్డిని మించిన ఇంటెన్సిటీని మళ్ళి రీ క్రియేట్ చేయడం అసాధ్యం. అయినా కూడా ఉన్నంతలో డిఫరెంట్ గా అనిపించే ప్రయత్నం అయితే చేశారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హరిప్రియ, బండ్ల గణేష్, రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి వీళ్ళందరి ఉమ్మడి టీం ఎఫర్ట్ కామెడీ ట్రాక్ కు అంతోఇంతో బలంగా నిలిచింది. సంగీత డిఫరెంట్ గా ట్రై చేసి మెప్పించినా కొన్నిచోట్ల అతి అనిపిస్తుంది. ఓవరాల్ గా చిన్న సన్నివేశాలకు సైతం పేరున్న ఆర్టిస్టులను తీసుకోవడం వల్ల నిండుతనం వచ్చింది.

టెక్నికల్ టీమ్

దర్శకుడు అనిల్ రావిపూడిది ఎంటర్ టైన్మెంట్ స్కూల్. ఇప్పటిదాకా వినోదాన్ని కమర్షియల్ ఫార్ములాతో మిక్స్ చేస్తూ హిట్లు కొడుతూ పోయాడు. ఎఫ్2 విషయంలో పూర్తిగా హాస్యం మీద ఆధారపడి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే మహేష్ బాబు లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న కథానాయకుడు చేతికి దొరికేసరికి వాటిని మించే సినిమాను ఇవ్వాలన్న తాపత్రయంతో మాస్ మసాలాని కామెడీని బాలన్స్ చేసే ప్రయత్నం గట్టిగానే చేశాడు. ఇది కొంతమేరకే ఫలితాన్ని ఇచ్చింది.

విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మహేష్ లాంటి హీరోలను కథలో ఒకే చోట ఎక్కువ సేపు ఎంగేజ్ చేయాలని చూస్తే అంతగా పండదు. ఫస్ట్ హాఫ్ లో మహేష్ ఆర్మీ క్యాంప్ తర్వాత ట్రైన్ లోనే ఎక్కువ సేపు కనిపిస్తాడు. ఇతర పాత్రల ద్వారా హాస్యం సృష్టిస్తూ వాటిని అజయ్ పాత్రకు లింక్ చేయడమనే కాన్సెప్ట్ బాగానే ఉంది కాని ఓ మాదిరి నవ్వులు తప్ప మరీ హిలేరియస్ గా ఆ ఎపిసోడ్ అనిపించకపోవడం కొంత మైనస్ అనిపిస్తుంది. అనిల్ రావిపూడిలోని మాస్ దర్శకుడు ఇంటర్వల్ లో బయటికి వస్తాడు. అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులకు సైతం ఓ రేంజ్ లో కిక్ ఇచ్చే ఆ బ్లాక్ సినిమాకే హై లైట్.

హీరో విలన్ మొదటిసారి అంతటి భీకరమైన వార్ మూడ్ లో కలిసినప్పుడు సెకండ్ హాఫ్ లో అంతకంటే ఎక్కువ యాక్షన్ డ్రామాను ఆశిస్తాం. కాని అనిల్ ఆలోచన మరోలా సాగింది. రొటీన్ అవుతుందేమోనన్న ఫీలింగ్ కాబోలు అప్పటిదాకా ఫెరోషియస్ విలన్ గా కనిపించిన ప్రకాష్ రాజ్ ని ఒక్కసారిగా కమెడియన్ తరహాలో మార్చేశాడు. సగటు మాములు రౌడీలా ఒకదశ దాటాక హీరోకు పూర్తిగా లొంగిపోవడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. పైగా మహేష్ ప్రతి సినిమాలో సమాజానికి సందేశం ఇచ్చి తీరాలన్న ఉద్దేశంతో రాసుకున్న పార్టీ ఆఫీస్ స్పీచ్ కొంతమేర బోర్ కొట్టిస్తుంది. కథ మంచి సీరియస్ గా మలుపు తీసుకుంటోందనుకున్న ప్రతిసారి అక్కడ కామెడీని చొప్పించే ప్రయత్నం చేయడం అంతగా పండలేదు. కాకపోతే రెండు మూడు ఎలివేషన్లు ఉన్న సీన్లు కనెక్ట్ అవ్వడంతో గ్రాఫ్ మరీ దారుణంగా పడిపోకుండా కాపాడాయి. ఇది కామెడీ కోసం కథ రాసుకున్నట్టు ఉంది కాని కథలో భాగంగా కామెడీ రాయలేదు.

సరిలేరులో ఉన్న మరో బలహీనత స్టొరీ లైన్. గతంలో వచ్చిన వారసుడొచ్చాడు, అతడు టైపులో ఇంకో వ్యక్తి స్థానంలో హీరో వెళ్లి అక్కడి బాధ్యతలు నెరవేర్చడం గతంలోనే చూశాం. ఆ తలపు రాకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రీ ఇంటర్వెల్ దాకా ట్రైన్ కామెడీతో నడిపించాడు అనిల్ రావిపూడి. ప్రీ ఇంటర్వెల్ నుంచి గూస్ బంప్స్ వచ్చే ఫైట్ సీక్వెన్స్ పెట్టిన అనిల్ తర్వాత అదే టెంపోని సెకండ్ హాఫ్ లో మైంటైన్ చేయకపోవడం సంతృప్తి స్థాయిని బాగా తగ్గించేసింది.

చాలా చోట్ల డైలాగ్స్ కూడా అంతగా పేలలేదు. కొండారెడ్డి బురుజు ముందు హీరో విలన్ ముఖాముఖీ తలపడ్డాక మహేష్ ఇక బాక్సు బద్దలైపోతుందని అంటాడు. అప్పటికే ముప్పాతిక బాక్సు దర్శకుడు బద్దలు కొట్టేశాడు. మిగిలింది పావు వంతు మాత్రమే కావడంతో ఇక గంటన్నర పాటు ఎలా నడిపించాలో అర్థం కాక కొంత రేసీగా కొంత బోర్ గా సాగి ప్రేక్షకులను అయోమయంలో పడేస్తుంది. ఫైనల్ గా అనిల్ రావిపూడి బ్యాడ్ ప్రోడక్ట్ ఇవ్వలేదు కాని మహేష్ తో నెవ్వర్ బెఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ సినిమా ఇస్తాడనుకున్న అంచనాలు మాత్రం పూర్తిగా అందుకోలేకపోయాడు.

దేవిశ్రీప్రసాద్ విషయానికి వస్తే పాటల పరంగా అంతగా మెప్పించలేకపోయినా చిత్రీకరణతో చూశాక పర్వాలేదనే అనిపిస్తాయి. తన స్థాయి ఆల్బమ్ ఇచ్చి ఉంటే సరిలేరు ఖచ్చితంగా ఇంకో లెవెల్ లో ఉండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు తన బాణీని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. రత్నవేలు ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరో ప్రధానమైన అసెట్. ఇప్పటికే టెక్నీషియన్ గా టాప్ చైర్ లో ఉన్న రత్నవేలు మూడు షేడ్స్ లో సాగే కథలోని మూడ్ ని తెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. ల్యాగ్ లేకుండా కొంత భాగాన్ని కోత వేసే అవకాశాన్ని తమ్మిరాజు ఎడిటింగ్ వాడుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఎంత ఉన్నా అసలు కథలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నట్టు ప్రేక్షకులు ఫీలవ్వడానికి కారణం ఇదే అని చెప్పొచ్చు. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లు యథావిధిగా తమ బెస్ట్ ఇచ్చేశారు. నిర్మాణపరంగా అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబులు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.

ప్లస్ గా అనిపించేవి

మహేష్ బాబు పెర్ఫార్మన్స్
ఇంటర్వల్ బ్లాక్
రత్నవేలు కెమెరా
మైండ్ బ్లాకు పాట
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ గా తోచేవి

కథలో ఉన్న ల్యాగ్
ఫార్ములాలో సాగే కథనం
పాటలు
హీరోయిన్ క్యారెక్టరైజేషన్
క్లైమాక్స్

చివరిగా చెప్పాలంటే

మహేష్ బాబు ఉంటే చాలు కంటెంట్ కొంచెం అటుఇటుగా ఉన్నా ఎంజాయ్ చేస్తామనుకునే ఆడియన్స్ కు సరిలేరు నీకెవ్వరు నచ్చే అవకాశాలు ఎక్కువ. కాని అనిల్ రావిపూడి నుంచి వచ్చిన ఎఫ్2 లాంటి ఎంటర్ టైనర్స్, పటాస్ సుప్రీమ్ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్స్ ఆశించే వాళ్ళకు మాత్రం సరిలేరు నీకెవ్వరు పూర్తిగా కనెక్ట్ కాకపోయే ఛాన్స్ లేకపోలేదు. కొత్త కోణంలో పండించిన మహేష్ ఎనర్జీనే సెల్లింగ్ పాయింట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తే సరిలేరు పండగ అడ్వాంటేజ్ ని వాడుకోవచ్చు. ఎమోషన్స్ ని అండర్ ప్లే చేస్తూ వీలైనంత మహేష్ గ్రేసును వాడుకున్న సరులేరు నీకెవ్వరు అభిమానులకు ఫుల్ గా సగటు ప్రేక్షకులకు ఓ మోస్తరుగా కనెక్ట్ అవ్వొచ్చు. అంచనాలు పరిమితంగా ఉంటేనే అజయ్ కృష్ణ మెప్పిస్తాడు.

ఒక్క లైన్ లో చెప్పాలంటే

సరిలేరు నీకెవ్వరు - సగమే సరిపోయింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp