రెడ్ రివ్యూ

By Ravindra Siraj Jan. 14, 2021, 12:31 pm IST
రెడ్ రివ్యూ

ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ ఇమేజ్ ని నిలబెట్టుకునే సరైన కథ కోసం ఎదురు చూసి మరీ ఎనర్జిటిక్ హీరో రామ్ ఎంచుకున్న సబ్జెక్టు రెడ్. కెరీర్ కొంత డల్ గా ఉన్న సమయంలో నేను శైలజ రూపంలో పెద్ద బ్రేక్ ఇచ్చిన కిషోర్ తిరుమలకు ఏరికోరి మరీ ఈ బాధ్యతను అప్పగించాడు. ఈ కాంబోలో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ అంచనాలు అందుకోలేకపోయినా ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది. లాక్ డౌన్ కు ముందే ఫస్ట్ కాపీ సిద్ధమైన రెడ్ ఓటిటి ఆఫర్లు ఎంత టెంప్ట్ చేసినా చలించకుండా థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. మరి ఇంత సహనంతో వెయిట్ చేసిన ఈ సినిమా కోరుకున్న ఫలితం దక్కిందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

తను నడుపుతున్న సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ ఉన్న బ్లాక్ లోనే పని చేస్తున్న మహిమ(మాళవిక శర్మ)ను ప్రేమిస్తూ ఉంటాడు సిద్దార్థ్(రామ్). మరోవైపు ఆదిత్య(రామ్)స్నేహితుడు వేమా(సత్య)తో కలిసి చిల్లర మోసాలు చేస్తూ పబ్బం గడుపుకునే టైపు. ఊహించని పరిస్థితుల్లో ఇద్దరు కవలలు ఓ యువకుడి మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నాగేంద్ర(సంపత్ రాజ్)సిద్దార్థ మీద వ్యక్తిగత కక్షతో దీన్ని పర్సనల్ గా తీసుకుంటాడు. మరి అసలు హంతకుడు ఎవరు అనేది తెరమీదే చూడాలి.

నటీనటులు

అభిమానులు, ఇండస్ట్రీ తనకిచ్చిన ట్యాగ్ లైన్ కు తగ్గట్టు మంచి ఎనర్జీతో కదం తొక్కే రామ్ మొదటిసారి డ్యూయల్ చేయడం రెడ్ లోని ప్రధాన ఆకర్షణ. రెగ్యులర్ డబుల్ ఫోటో ఫార్ములాలో కాకుండా రెండు పాత్రలను డిఫరెంట్ గా డిజైన్ చేయడమే ఇందులో ప్రత్యేకత. దానికి తగ్గట్టే రామ్ తన బాడీ లాంగ్వేజ్ తో సిద్దార్థ,ఆదిత్యగా అదరగొట్టేశాడు. హెయిర్ స్టైల్ ఒకేలా ఉండి ఎందుకో అతకలేదని అనిపించినప్పటికీ తన టైమింగ్ తో బాగా నిలబెట్టాడు. సిద్దార్థ్ చేసిన క్యారెక్టర్ మాస్ ని బాగా ఆకట్టుకుంటుంది. డాన్సుల విషయంలోనూ రామ్ ఐటమ్ సాంగ్ లో మెరుపులతో అలరించాడు.

హీరోయిన్లలో ఇన్స్ పెక్టర్ లో నటించిన నివేత పేతురాజ్ కు ఎక్కువ స్కోప్ దక్కింది. కేసును విచారణలో తెలివైనదానిలా భావిస్తూ పొరపాటు పడే పాత్రలో బాగా నటించింది. తనతో పోలిస్తే మాళవిక శర్మ, అమృత అయ్యర్ క్యారెక్టర్లకు ఇచ్చిన స్పేస్ ఏమి లేదనే చెప్పాలి. వెన్నెల కిషోర్, సత్య కామెడీ భాగానికి ఉపయోగపడగా సంపత్ రాజ్, సోనియా అగర్వాల్. పోసాని, నాజర్, పవిత్ర లోకేష్ తదితరులు ఆయా పాత్రలకు తగ్గట్టు చేసుకుంటూ పోయారు. అంతా రామ్ టూ మ్యాన్ షో కావడంతో ఒకరిద్దరు తప్ప ఇంకెవరు ఎక్కువ హై లైట్ కాలేదు.

డైరెక్టర్ అండ్ టీమ్

రీమేకులు రెండు రకాలు. ఒకటి మక్కికి మక్కి కలర్ జిరాక్స్ చేసి రిస్క్ లేకుండా చూసుకోవడం. ఇందులో సక్సెస్ కు ఎంత అవకాశం ఉంటుందో ఫెయిల్యూర్ కూ అంతే ఛాన్స్ ఉంది. రెండోది ఇక్కడి హీరో ఇమేజ్, ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు అవసరమైన మార్పులు గట్రా చేసుకోవడం. గబ్బర్ సింగ్ రెండో టైపు అయితే ఈ రెడ్ ఫస్ట్ క్యాటగిరీలో పడింది. పైకి చాలా మార్పులు చేశామని చెప్పుకున్నారు కానీ రెడ్ దర్శకుడు కిషోర్ తిరుమల దాదాపుగా ఒరిజినల్ వెర్షన్ నే ఫాలో అయిపోయాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే తమిళ తడంలో ఏదీ మిస్ కాకుండా యాజిటీజ్ తీసుకుంటూ పోయాడు. కొన్ని జోడించాడు అంతే తప్ప దేన్నీ తీసేయలేదు.

ఎంత పక్కపక్క రాష్ట్రాల ఆడియన్స్ అయినా సెన్సిబిలిటీస్ లో తేడాలుంటాయని గతంలో ఎన్నో రీమేకుల ఫలితాలు ఋజువు చేశాయి. కల్ట్ అనిపించుకున్న 96 తెలుగులో వచ్చేటప్పటికీ జానుగా డిజాస్టర్ అయ్యింది. అందుకే స్క్రిప్ట్ ని లాక్ చేసేముందే లోతైన విశ్లేషణ చాలా అవసరం. రెడ్ రెగ్యులర్ డబుల్ యాక్షన్ డ్రామా కాదు. ఒకే పోలిక ఉన్న అన్నదమ్ముల కథకు క్రైమ్ డ్రామాని జోడించిన సస్పెన్స్ థ్రిల్లర్. చాలా డిఫరెంట్ గా అనిపించే ఈ పాయింట్ అక్కడ ఏ ఇమేజ్ లేని అరుణ్ విజయ్ చేయడంతో ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా తెరమీద చూసి సర్ప్రైజ్ అయ్యి ఘన విజయం అందించారు.

ఇక్కడ రామ్ పరిస్థితి అలా కాదు. ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ అతనికో కొత్త ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. అభిమానులకు కొత్త తరహా అంచనాలు మొదలయ్యాయి. అందుకే రెడ్ లో వాటిని అందుకునే అవకాశం ఉందనే ఏరికోరి మరీ ఎంచుకున్నాడు. కానీ ప్రేక్షకుల కోణంలో చూస్తే రెడ్ అంత గొప్పగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ లో జరిగే లవ్ స్టొరీ, ఆదిత్యకు సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ చాలా చప్పగా మాములుగా సాగుతాయి. అంతో ఇంతో సత్య పేల్చే జోకులు తప్ప ఇంకేది పెద్ద ఎంటర్ టైన్ చేయదు. పోలీస్ స్టేషన్ లోనే అసలు డ్రామా మొదలవుతుంది. అలా అని ఇదేదో గ్రిప్పింగ్ గా సాగదు. పడుతూ లేస్తూ, ఆసక్తిని కలిగిస్తూ, అంతలోనే దాన్ని పడేస్తూ ఎగుడుదిగుడుగా వెళ్ళిపోయింది.

విచారణ జరగడం మొదలయ్యాక ఎంక్వయిరీ సీన్లు కొంత మేర బాగానే ఉన్నప్పటికీ ఎగ్జైట్ మెంట్ అనిపించే ఎపిసోడ్ ఏదీ లేకపోవడం రెడ్ కు ప్రతికూలంగా మారింది. అందులోనూ హీరోల చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ చాలాసేపు రన్ చేయడం ఎమోషనల్ గా ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో అదంతా బోర్ కొట్టిస్తుంది. రెండు పాత్రల మధ్య ఉన్న కనెక్షన్ తమిళంలో ఎస్టాబ్లిష్ అయినట్టుగా తెలుగులో కాలేదు. ఇద్దరి మధ్య ఫైట్ తప్ప ఇంకే పోరాట దృశ్యాలు లేవి. ఇది మాస్ కు కొరుకుడు పడదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ సినిమా నుంచి ఆశిస్తున్న అంశాలు సంపూర్ణంగా లేకపోవడం రెడ్ ని కొంత వెనుకబడేలా చేసినా ఫైనల్ గా టూ బ్యాడ్ అనిపించుకోకుండా కనీసం ఫ్యాన్స్ వరకైనా జస్ట్ ఒకే అనిపిస్తుంది. కామన్ ఆడియెన్స్ కి కష్టమే.

ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలి ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ మరోసారి తన బీజీఎం అవుట్ ఫుట్ తో ఆకట్టుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో పోలిస్తే తక్కువ స్థాయి అనిపిస్తుంది. తన అనుభవాన్ని ఉపయోగించి సమీర్ రెడ్డి ఇచ్చిన ఛాయాగ్రహణం టాప్ స్టాండర్డ్ లో ఉంది. పీటర్ హైన్స్ పోరాటాలు బాగా కుదిరాయి. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ పర్వాలేదు. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న రెండున్నర గంటల నిడివిని ఫాలో అయిపోయారు. పాటలు ఇరికించకపోవడం రిలీఫ్. స్రవంతి నిర్మాణ విలువలు ఎప్పటిలాగే లోపాలను ఎంచే అవకాశం ఇవ్వలేదు.

ప్లస్ గా అనిపించేవి

రామ్ డబుల్ ఎనర్జీ
నేపధ్య సంగీతం
కొన్ని ట్విస్టులు
కెమెరా వర్క్

మైనస్ గా తోచేవి

లవ్ ట్రాక్స్
ఇద్దరు హీరోయిన్లు
స్లో టేకింగ్
యాక్షన్ ఎపిసోడ్ల కొరత

కంక్లూజన్

సంక్రాంతి బరిలో మాస్ ఎంటర్ టైనర్ గా బరిలో దిగిన రెడ్ ఫైనల్ గా జస్ట్ ఓకే క్రైమ్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది. ముఖ్య భాగమంతా ఇన్వెస్టిగేషన్ మోడ్ లోనే సాగినప్పటికీ సాధారణంగా ప్రేక్షకులు ఇలాంటి వాటి నుంచి ఆశించే టెంపో లేకపోవడం రెడ్ స్థాయిని తగ్గించేసింది. కాసిన్ని ట్విస్టులు థ్రిల్స్ ఉంటే చాలనుకుంటే నిరాశపరచదు కానీ అంతకన్నా ఎక్కువ ఊహించుకుని థియేటర్ లో అడుగు పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రామ్ అభిమాని అయ్యుండాలి.

రెడ్ - ఓన్లీ ఫర్ రామ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp