రంగ్ దే రివ్యూ

By Ravindra Siraj Mar. 26, 2021, 04:49 pm IST
రంగ్ దే రివ్యూ
Rating : 2.75/5
Main Cast: : Nithiin, Keerthy Suresh,
Director: : Venky Atluri,
Music: : Devi Sri Prasad,
Producer: : Suryadevara Naga Vamsi,

పోయిన ఏడాది లాక్ డౌన్ కు ముందు 2020 చివరి బ్లాక్ బస్టర్ భీష్మ రూపంలో పెద్ద హిట్టు అందుకున్న నితిన్ మాంచి ఉత్సాహంతో వరస సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. హ్యాట్రిక్ ఫ్లాపుల నుంచి కోలుకుని వేగం పెంచాడు. మంచి క్రియేటివ్ కాంబినేషన్లు సెట్ చేసుకున్నాడు. అయితే మొన్నామధ్య వచ్చిన చెక్ డిజాస్టర్ మరోసారి తనకు వార్నింగ్ బెల్ గా మ్రోగింది. తనకు సెట్ కానీ డిఫరెంట్ జానర్ ని ప్రయతించి మరోసారి భంగపడ్డ నితిన్ తన ఆశలన్నీ రంగ్ దే మీదే పెట్టుకున్నాడు. ప్రోమో నుంచి పాటల దాకా ప్రామిసింగ్ గా కనిపించిన ఈ ఎంటర్ టైనర్ ఇవాళ విడుదలైంది. మరి ఇది రంగుల్లో ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

అర్జున్(నితిన్)చెడ్డీలు వేసుకునే వయసులోనే ఓ గర్ల్ ఫ్రెండ్ రావాలని దేవుణ్ణి కోరుకోవడం ఆలస్యం వెంటనే పక్కింట్లోకి అను(కీర్తి సురేష్) ఫ్యామిలీ దిగుతుంది. అయితే అతను ఊహించినట్టు కాకుండా తన మీద పగతీర్చుకునే గయ్యాలమారి వచ్చిందని తెలుసుకున్నాక అనుతో అర్జున్ కు రోజూ గొడవలే ఉంటాయి. అలాగే పెరిగి పెద్దవుతారు. అర్జున్ కి ఇష్టం లేకపోయినా అను ఊహించని ఓ ప్లాన్ వేసి తనతో మూడు ముళ్ళు వేయించుకుంటుంది. ఆ తర్వాత జరిగే అసలు డ్రామానే మిగిలిన కథ.

నటీనటులు

నితిన్ ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళలో ఎంటర్ టైనర్స్ ద్వారా మెప్పించిన దాఖలాలే ఎక్కువ. నటన పరంగా మరీ గొప్పగా ఛాలెంజింగ్ గా అనిపించేవి వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. తనలో ఉన్న కొన్ని బలహీనతలు దానికి కారణం. అందుకే నితిన్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది ఇలాంటి ఎంటర్ టైనర్లే. ఇందులో యథావిధిగా చేసుకుంటూ పోయాడు. కామెడీ సీన్లు, రెగ్యులర్ ట్రాక్స్ లో ఓకే. బరువైన సన్నివేశాలు, ఎమోషన్లు వచ్చినప్పుడు ఇంకా అతను మెరుగుపడాల్సింది ఉందని కొన్ని చోట్ల తెలిసిపోతుంది. అయినా కూడా తనవైపు నుంచి చేయగలిగింది ఇచ్చేశాడు అంతే.

కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో చూడని జాలీ క్యారెక్టర్ లో డిఫరెంట్ గా కనిపించింది. దానికి తగ్గట్టే చెలరేగిపోయింది కూడా. అను పాత్ర ఏదైతే డిమాండ్ చేసిందో దాన్ని పూర్తిగా ఇచ్చి పడేసింది. మహానటి తరహా బరువైనవే కాదు ఇలాంటివి కూడా బాగా చేయగలనని ఋజువు చేసింది. ముఖ్యంగా కీర్తి అభిమానులు అనులోని షేడ్స్ ని ఎంజాయ్ చేస్తారు. నరేష్ టైమింగ్ మరోసారి ఉపయోగపడింది.వెన్నెల కిషోర్, సుహాస్, అభినవ్, సత్యం రాజేష్, బ్రహ్మాజీ తదితరులు నవ్వించే బాధ్యతను ఎప్పటిలాగే కానిచ్చేశారు. రోహిణి ఎమోషన్స్ లో తన అనుభవాన్ని ప్రదర్శించారు. ప్రేమదేశం వినీత్ చాలా కాలం తర్వాత దర్శనమిచ్చాడు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు వెంకీ అట్లూరిలో గొప్ప కథకుడు కన్నా మంచి దర్శకుడు ఉన్నాడు. అందుకే ఇతని స్టోరీస్ గతంలో ఎక్కడో చూసినట్టే అనిపిస్తాయి. తొలిప్రేమ, మిస్టర్ మజ్నులో ఆ ఛాయలను స్పష్టంగా గమనించవచ్చు. వినోదాన్ని ఎక్కువగా నమ్ముకుని లైన్ మీద తక్కువ ఫోకస్ చేసే వెంకీ ఈ రంగ్ దే లోనూ అదే సూత్రాన్ని ఫాలో అయ్యాడు. హీరో హీరోయిన్ల మధ్య తగాదాలు, వాళ్ళ మధ్య ప్రేమ పుట్టడం అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం నువ్వే కావాలి, ఆనందం లాంటి ఎన్నో సినిమాల్లో యూత్ ప్రేక్షకులు పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేశారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చారు. రంగ్ దేకు స్ఫూర్తి వాటి నుంచే అని స్పష్టంగా కనిపిస్తుంది.

అవి వచ్చి ఎన్నో సంవత్సరాలయ్యింది కాబట్టి ఇప్పుడు మళ్లీ టేకప్ చేస్తే జనం ఫ్రెష్ గా ఫీలవుతారని కాబోలు వెంకీ ఆ పాయింట్ నే తీసుకుని దానికో కొత్త ట్విస్టు జోడించి ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ కథాకథనాలు మన ఊహకనుగుణంగా సాగడం ఇందులోని ప్రధానమైన మైనస్. ఆడియన్స్ కి బాగా పరిచయమున్న ఇలాంటి లైన్ తో కథ చెబుతున్నప్పుడు హిలేరియస్ ఫన్ ఉండాలి. అప్పుడే చూస్తున్నవాళ్ళు హాయిగా నవ్వుకుంటూ అన్నీ మర్చిపోతారు. కానీ రంగ్ దే ఈ విషయంలో గ్రాఫ్ ని ఒకే మీటర్ లో కొనసాగించలేకపోయింది. అందుకే మధ్యమధ్యలో ట్రాక్ తప్పుతూ మళ్ళీ ఎక్కుతూ ఏదోలాగా మొత్తానికి గమ్యాన్ని మాత్రం చేరుకుంది.

కానీ ఇప్పుడున్న 5జి ప్రపంచంలో ఓ మాదిరిగా అనిపించే సగటు వినోదంతో పబ్లిక్ ని పూర్తిగా మెప్పించడం కష్టం. అందుకే రంగ్ దే లో ఎక్కడిక్కడ పర్వాలేదు అనిపించే స్థాయిలో టైం పాస్ అవుతున్నా కూడా ఇంతేనా అనే ఫీలింగ్ కలుగుతూ ఏదో లోటు వెంటాడుతూనే ఉంటుంది. అలా అని ఇందులో అసలేమీ లేదని కాదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో మోతాదుకి మించిన సెంటిమెంట్ తో ఏదో ఎమోషన్ ని గొప్పగా పండిస్తున్నాం అనుకున్నారు కానీ అదంతా బాగా ల్యాగ్ కు గురయ్యింది. క్లైమాక్స్ కు ముందు కూడా సుదీర్ఘమైన సంభాషణలతో క్లాసులు ఎక్కువ తీసుకోవడంతో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా కనెక్ట్ కాదు

తను రాసుకునే ప్రతి కథలో ఖచ్చితంగా ఫారిన్ కంట్రీ ఉండాలని వెంకీ అట్లూరి వ్రతం పూనాడో ఏమో కానీ ఇందులో దుబాయ్ వెళ్లకుండా ఏ మైసూర్ లోనో జైపూర్ లోనో నడిపించినా పెద్ద తేడా ఉండేది కాదు. కేవలం రిచ్ నెస్ కోసం అనుకున్నా కూడా సెకండ్ హాఫ్ లో అధిక భాగం ఓ ఇంట్లో సాగుతుంది. హైదరాబాద్ లో అంతకన్నా గొప్ప ఇంటీరియర్ ఉన్న ఇళ్ళు వందల్లో ఉన్నాయి. దేశానికి ఎంత దూరం ఉంటే అంత గొప్పగా ప్రేమను చూపించొచ్చు అనుకున్నారు కాబోలు వెంకీ నాలుగో సినిమా అయినా దేశీ మోడల్ లో ఉంటుందేమో చూడాలి. మొత్తానికి రంగ్ దే ఓ మోస్తరు ఎంటర్ టైనర్ అనిపించుకోవడం తప్ప ఆశించినంత లేదన్న మాట వాస్తవం.

ముందు నుంచి రంగ్ దేకు ప్రధాన ఆకర్షణగా చెప్పుకుంటూ వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆ మేజిక్ ని ఓ రెండు పాటల్లో చూపించగలిగిందే తప్ప ఆల్బమ్ మొత్తం కొనసాగించలేదు. ఉప్పెన లాంటి క్లాసిక్ ట్రాక్స్ తర్వాత ఎంతో ఆశించిన అభిమానులు ఈ విషయంలో కొంత అసంతృప్తికి లోనవుతారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరీ ప్రత్యేకంగా నిలవలేదు. ఛాయాగ్రహణం అందించిన పిసి శ్రీరామ్ మాత్రం తన అనుభవ నైపుణ్యంతో అదరగొట్టారు. ఓ మాములు ఎంటర్ టైనర్ కి ఇంత కలర్ ఫుల్ ఫ్లేవర్ వచ్చిందంటే దానికాయన కెమెరా కన్నే కారణం. ఇటీవలే జాతీయ అవార్డు తెచ్చుకున్న నవీన్ నూలి ఎడిటింగ్ రన్ టైంని శాయశక్తులా కుదించి ల్యాగ్ ని తగ్గించి మంచి పని చేసింది. అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ బాగుంది. సితార నిర్మాణ విలువలు ఎప్పటిలాగే చక్కగా ఉన్నాయి

ప్లస్ గా అనిపించేవి

నితిన్ కీర్తిల జోడి
కొంత కామెడీ
రెండు పాటలు
నిడివి

మైనస్ గా తోచేవి

రెగ్యులర్ ట్రీట్మెంట్
సెకండ్ హాఫ్ ల్యాగ్
కాస్త వీక్ గా అనిపించే ఎమోషన్లు
రొటీన్ కథే

కంక్లూజన్

చూసిన కథనే మళ్ళీ మళ్ళీ చూడటం, మెప్పించేలా చూపిస్తే వాటిని ఆదరించడం తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. రంగ్ దే కూడా ఆ కోణంలో అలోచించి రాసుకుని తీసిన సినిమానే. కామెడీ, ఎమోషన్స్, లవ్, ఫ్యామిలీ డ్రామా, మ్యూజిక్ ఇవన్నీ సరైన పాళ్ళలో సమకూరితేనే బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుంది. అయితే రంగ్ దే ఈ విషయంలో సగం సంతృప్తినే మిగులుస్తుంది. ఇంకోసారి చూడాలనే అనుభూతిని కలిగించదు. ఓ మోస్తరు హాస్యం, అందమైన జంట, సన్నని భావోద్వేగాలు ఉంటే చాలు టైం పాస్ అవుతుందనుకుంటే ఓకే కానీ అంతకు మించి పదే పదే గుర్తు చేసుకునే ఓ చక్కని సినిమా కావాలంటే మాత్రం రంగ్ దే మీ అంచనాలు పూర్తిగా అందుకోకపోవచ్చు

ఒక్కమాటలో - సగం వెలిగిన రంగులు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp