English

రాజరాజ చోర రివ్యూ

By Ravindra Siraj Aug. 19, 2021, 02:03 pm IST
రాజరాజ చోర రివ్యూ

విభిన్నమైన కథాంశాలు ఎంపిక చేసుకుంటాడని పేరున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందిన సినిమా రాజరాజ చోర. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇందులో కామెడీకి మాస్కులు ఎగిరిపోతాయి ఎక్స్ ట్రాగా తెచ్చుకోండి అని తను చెప్పిన తీరు ఆల్రెడీ ఆడియన్స్ లో ఆసక్తిని రేపింది. పాగల్ కోసం విశ్వక్ సేన్ చెప్పిన తరహాలో శ్రీవిష్ణు చెప్పింది కూడా ఉత్తి హైప్ కోసమా లేక నిజంగా ఇందులో అంత విషయం ఉందా అనే దాని మీద యూత్ లోనూ అంచనాలు రేగాయి. దర్శకుడిగా హర్షిత్ గోలి డెబ్యూ మూవీగా రూపొందిన ఈ మూవీలో మేఘ ఆకాష్, సునైనా తనకు జంటగా నటించారు. మరి ఇది ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

భాస్కర్(శ్రీవిష్ణు)జిరాక్స్ షాపులో పనిచేస్తూ డబ్బులు సరిపోక కుటుంబ అవసరాల కోసం దొంగతనాలు మోసాలు చేస్తుంటాడు. పెళ్ళై భార్య విద్య (సునైన), కొడుకు ఉన్నప్పటికీ వాళ్లకు తెలియకుండా బయట సంజన(మేఘ ఆకాష్)అనే మరో అమ్మాయితో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని అబద్దం చెప్పి లవ్ ట్రాక్ నడిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓసారి పోలీస్ ఆఫీసర్ విలియమ్స్(రవిబాబు)కి పట్టుబడతాడు భాస్కర్. జైల్లో ఉన్న తన భర్త కోసం లాయర్ చదువుతున్న విద్య రంగంలోకి దిగుతుంది. అసలు భాస్కర్ ఇలా రెండు ట్రాకులు నడపడానికి కారణం ఏంటి, చివరికి అతను ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే అసలు స్టోరీ

నటీనటులు

శ్రీవిష్ణుకి మంచి టైమింగ్ ఉంది. ఒకరకమైన యాసతో ముఖ్యంగా కామెడీని బాగా పండిస్తాడు. ఇక ఎమోషన్ల సంగతి సరేసరి. నీది నాది ఒకే కథలో ప్రూవ్ అయ్యింది. ఇది దృష్టిలో ఉంచుకునే దర్శకుడు హసిత్ శ్రీవిష్ణు కోసం పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ అయిన క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు. దానికి తగ్గట్టే అతను కూడా రెండు రకాలుగా చెలరేగిపోయాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలలో భావోద్వేగాలు కూడా పండించాడు. ఇంటర్వెల్ లాంటి ఎపిసోడ్లు పేలడానికి శ్రీవిష్ణు యాక్టింగ్ చాలా దోహదపడింది. బహుశా ఇలాంటి క్యారెక్టర్ దొరికిన కాన్ఫిడెన్స్ తోనే స్టేజి మీద అలా మాట్లాడాడు కాబోలు. నిజంగానే తనకు గత కొన్నేళ్లలో దొరికిన మంచి పాత్ర ఇది

ఊహించని విధంగా సునైన పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది. ఇద్దరు హీరోయిన్లలో తనే హై లైట్ అవ్వడం విశేషం. మేఘ ఆకాష్ కూడా తనకిచ్చిన పరిధిలో బాగానే ఒదిగిపోయింది. రవిబాబుకు చాలా కాలం తర్వాత ఎక్కువ స్పేస్ ఉన్న పాత్ర దొరకడంతో ఆడేసుకున్నాడు. గంగవ్వ ఓకే. తనికెళ్ళ భరణి, కాదంబరి కిరణ్, ఇందుకుసుమ, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్ ఇలా ఆర్టిస్టుల సెలక్షన్ లో హసిత్ తీసుకున్న శ్రద్ధ మంచి అవుట్ ఫుట్ తీసుకురావడానికి దోహదపడింది. వీళ్ళు తప్ప ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు ఇంకెవరు లేరు

డైరెక్టర్ అండ్ టీమ్

జబర్దస్త్ లాంటి లౌడ్ కామెడీకి బాగా అలవాటు పడిన మెజారిటీ ప్రేక్షకులను మెప్పించేలా ఎంటర్టైనర్స్ ని డీల్ చేయడం ఇప్పుడున్న దర్శకులకు సవాల్ గా మారింది. ఏదో ఆషామాషీ జోకులకు థియేటర్లలో పగలబడి నవ్వెంత సీన్ ఇప్పుడు లేదు. బూతు లేకుండా సునిశితమైన హాస్యాన్ని కాస్త కొత్తగా చెప్పగలిగిగే చాలు ఆడియన్స్ పెదవులపై చిరునవ్వులు పూయించొచ్చు. దర్శకుడు హసిత్ గోలి ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని రాజరాజ చోరని తీర్చిదిద్దిన తీరు టైంపాస్ తరహాలో సాగింది. ఇది ఇంతకుముందు చూసిన సినిమాలా వుందే అనే ఫీలింగ్ కలగకుండా తీసుకున్న శ్రద్ధ వర్కౌట్ అయ్యింది.

జానర్ ఏదైనా క్యారెక్టరైజేషన్లు చాలా ముఖ్యం. హసిత్ ఈ విషయంలో చేసిన హోమ్ వర్క్ ఆకట్టుకుంటుంది. కేవలం శ్రీవిష్ణు మీదే దృష్టి పెట్టకుండా ఎవరి ప్రాధాన్యం వాళ్లకు దక్కేలా కథలోని లింక్స్ ని ఇంటర్ కనెక్ట్ చేసిన విధానం అక్కడక్కడా వచ్చిన ల్యాగ్ ని దాదాపుగా కవర్ చేసుకుంటూ పోయింది. అయితే ఎంత కామెడీ కోసమైనా మరీ ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంది. ఇందులో జరిగింది అదే. నవ్విస్తే చాలు లాజిక్ ని ఎవరు పట్టించుకుంటారు అనే రీతిలో హసిత్ చేసిన పొరపాట్లు లేకపోలేదు. వీటిని కూడా హ్యాండిల్ చేసి ఉంటే చోర స్థాయి ఇంకా ఎక్కువ పెరిగేది.

ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్మెంట్ కోసం రాసుకున్న సీన్లు కొంత స్లోగా ఉండటంతో ఇంప్రెషన్ అంతగా కలగదు. అరగంట అయ్యాక వేగం పెరుగుతుంది. పాత్రలను రిజిస్టర్ చేయడం కోసం ఇవి అవసరమే అయినప్పటికీ ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచే రేస్ మొదలయ్యేది. ఆ తర్వాత స్పీడ్ తగినంత ఉండటంతో మొదట్లో జరిగింది మర్చిపోతాం. టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు వర్త్ ఉన్న టెక్నీషియన్ల సహాయంతో హసిత్ చాలా మటుకు ఎక్కడిక్కడ లోపాలను కవర్ చేసుకుంటూ వచ్చాడు. హీరోకి రెగ్యులర్ లవ్ ట్రాక్ కాకుండా దానికి అదనంగా అతనికి ఆల్రెడీ పెళ్ళై ఉండటం అనే ఆలోచన ఖచ్చితంగా డిఫరెంట్ అనే చెప్పాలి.

ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర పూర్తి పైసా వసూల్ ఫీలింగ్ కలుగుతున్న టైంలో సెకండ్ హాఫ్ గ్రాఫ్ కొంత అటుఇటు కావడం మైనస్ గానే చెప్పుకోవాలి. ఎమోషనల్ సీన్లకు సంబంధించి వాటిని వాడుకునే క్రమంలో హసిత్ కొంత తడబాటుకు గురయ్యాడు. దీనివల్ల మొదటి సగం ఇచ్చిన ఇంపాక్ట్ తర్వాత లేకపోయినా కూడా అదేమీ పెద్ద లోటుగా ఫీలవ్వాల్సిన అవకాశం హసిత్ ఇవ్వలేదు. ఏదో సరదాగా నాలుగు నవ్వులు, బోర్ కొట్టకుండా ఓ మాదిరి ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వాళ్ళకు నిరాశ కలిగించని విధంగా రాజరాజ చోర మెప్పించాడు. కాకపోతే మరీ మాస్కులు ఊడిపోయేంత కాదు కానీ పెదవులకు కాస్త పనిచెప్పెంత ఉంది

వివేక్ సాగర్ పనితనం సంగీతం విషయంలో అటు పాటల పరంగా ఇటు నేపధ్య సంగీతం రెండింటిలోనూ తన ముద్ర చూపించింది. మరీ గొప్ప మ్యూజికల్ ట్రీట్ అనలేం కానీ సబ్జెక్టు మూడ్ కు తగ్గట్టు చక్కని కంపోజింగ్ చేశారు. వేదరామన్ ఛాయాగ్రహణం మంచి క్వాలిటీని ఇవ్వడంలో దోహదపడింది. ఎడిటింగ్ పరంగా విప్లవ్ తన మీద ఎక్కువ కంప్లయింట్ లేకుండా చూసుకున్నారు. నిడివి రెండుంపావు గంటల లోపే ఉండటం ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ పరంగా రిస్క్ ఏమి లేకపోవడంతో నిర్మాతలు విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు దానికి అనుగుణంగా ఖర్చుపెట్టారు

ప్లస్ గా అనిపించేవి

శ్రీవిష్ణు పెర్ఫార్మన్స్
ఫస్ట్ హాఫ్ కామెడీ
ట్విస్టులు
సంగీతం

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్ ల్యాగ్
కొన్ని లాజిక్స్ మిస్
కొంత ఎమోషన్ సాగతీత

కంక్లూజన్

కామెడీ ఎంటర్ టైనర్స్ లక్ష్యం నవ్వించడం. కుదిరితే కాసిన్ని ఎమోషన్లను ఆలా లైట్ గా టచ్ చేయడం. రాజరాజ చోర ఈ రెండు పనులను సంపూర్ణంగా కాకపోయినా మంచి మార్కులు తెచ్చుకునే స్థాయిలోనే పండించింది. ఏ ఉద్దేశంతో దర్శకుడు ఈ కథ రాసుకున్నాడో అది నెరవేరింది. బ్రోచేవారేవారురా స్టైల్ లో వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ సినిమా సంతృప్తి పరుస్తుంది కానీ సినిమా మొత్తం మరీ పగలబడి పొట్ట చెక్కలయ్యేంత హాస్యాన్ని ఆశిస్తే మాత్రం జస్ట్ ఒకే అనిపిస్తుంది

ఒక్క మాటలో - టైంపాస్ చోర

Also Read : పాగల్ రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates