ప్రతి రోజూ పండగే రివ్యూ

By G.R Maharshi Dec. 20, 2019, 01:45 pm IST
ప్రతి రోజూ పండగే రివ్యూ

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ ప్ర‌తిరోజూ పండ‌గే!

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ర‌చయిత టాల్‌స్టాయ్ 134 ఏళ్ల క్రితం Death Of Ivan Ilych అనే క‌థ రాశాడు. చనిపోతామని ముందే తెలిస్తే ఆ వ్య‌క్తి ప‌డే బాధ క‌థ‌లో ఉంటుంది. దీని ఆధారంగా క్లాసిక్ డైరెక్ట‌ర్ కురుసోవా 1952లో "ఇకిరు" తీశాడు. ఎంతో కాలం బ‌త‌క‌న‌ని తెలిసిన ఒక వ్య‌క్తి, మిగిలిన జీవిత‌న్నా ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డేలా అర్ధ‌వంతంగా బ‌త‌క‌డం ఈ సినిమా క‌థ‌.

1971లో రాజేష్‌ఖ‌న్నా, అమితాబ్‌ల సూప‌ర్‌హిట్ సినిమా ఆనంద్ కూడా ఇదే క‌థ‌. ఒక క్యాన్స‌ర్ పేషెంట్ తాను పోయేలోగా ఇత‌రుల జీవితాల్లో సంతోషాన్ని నింప‌డం ఇతివృత్తం. క‌ల్ హోన‌హో సినిమా కూడా ఇలాంటిదే. Tom Hanks న‌టించిన ఫిల‌డేల్పియా కూడా ఇదే త‌ర‌హా సినిమా.

ఇవే క‌థ‌ల‌ను తిరిగేస్తే ప్ర‌తిరోజూ పండ‌గే అవుతుంది. ఒక పెద్దాయ‌న‌కు లంగ్ క్యాన్స‌ర్‌. ఐదు వారాలు మాత్ర‌మే బ‌తుకుతాడు. ఆ కొన్నిరోజులు ఆయ‌న సంతోషంగా బ‌త‌కాల‌ని మ‌నుమ‌డి కోరిక‌. అత‌నేం చేశాడ‌నేదే సినిమా. శ‌త‌మానంభ‌వ‌తీ క‌థ‌లో భార్యాభ‌ర్త‌లుంటారు. దీంట్లో ఒక ముస‌లాయ‌న ఉంటాడు. అదే క‌థ‌కి మ‌ర‌ణాన్ని జోడిస్తే ప్ర‌తిరోజూ పండ‌గే అవుతుంది. డైరెక్ట‌ర్ మారుతీకి కూడా ఈ అనుమానం వ‌చ్చి రావు ర‌మేష్‌తో ఒక డైలాగ్ శ‌త‌మానంభ‌వతీ సినిమా గురించి చెప్పిస్తాడు.

క‌థ సింపుల్‌గా చెప్పాలంటే స‌త్య‌రాజ్ తాత‌, సాయిధ‌ర‌మ్‌తేజ మ‌నుమ‌డు. ఐదు వారాల‌కు మించి బ‌త‌క‌ని తాత కోరిక‌ల‌ని మ‌నుమ‌డు తీర్చాల‌నుకుంటాడు. తాత వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ప్రేమించిన ఆవిడ‌తో మాట్లాడిస్తారు. విడిపోయిన స్నేహితున్ని క‌లుపుతాడు. ఆయ‌న మ‌నుమ‌రాలిని పెళ్లి చేసుకుంటానంటాడు. నాయ‌న‌మ్మ స‌మాధి స్థ‌లాన్ని ఆక్ర‌మించాల‌ని చూస్తున్న వాళ్ల‌ని తంతాడు. (హీరో ఎలివేష‌న్ కోసం రెండు ఫైట్స్ ఉన్నాయి కానీ, అవి సినిమాకి అన‌వ‌స‌రం)

ఫ‌స్టాప్‌కి ఇవ్వ‌న్నీ అయిపోతాయి. సెకండాఫ్‌లో క‌థ లేదు. అందుక‌ని ఒక పాట‌, ఫైట్ , కుటుంబ స‌భ్యులంద‌రినీ ర‌ప్పించ‌డం. వాళ్లు స‌త్యారాజ్ చావు కోసం ఎదురు చూడ‌డం, చివ‌రిలో హీరో వాళ్ల‌కి బుద్ధి చెప్ప‌డం ఇంతే క‌థ‌. స‌త్య‌రాజ్ చావుకి ద‌గ్గ‌ర‌గా ఉన్నాడ‌నేది మెయిన్ పాయింట్‌. కుటుంబ స‌భ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విష‌యంపై ఒక సినిమా తీయ‌డం అంత ఈజీ కాదు.

అనుభ‌వం లేని ద‌ర్శ‌కుడైతే బోర్ కొట్టించి చేతులెత్తేసే వాడే. కానీ మారుతి , మ‌ర‌ణం అనే పాయింట్‌కి ఎమోష‌న్స్ క‌లిపినంత మాత్రాన వ‌ర్క‌వుట్ కాద‌ని గ్ర‌హించాడు. అందుకే ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ని Detail గా స్ట‌డీ చేసి ప్ర‌జెంట్ చేశాడు. కృష్ణ‌వంశీ సినిమాల్లో క‌నిపించిన‌ట్టు సెకెండాఫ్ అంతా ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ బోలెడు జ‌నం క‌నిపిస్తుంటారు. ప్ర‌తి ఒక్క‌రికీ సొంత క్యారెక్ట‌ర్ ఉండ‌డం వ‌ల్ల , ఆ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారు.

మారుతీకి ఇంకో విష‌యం కూడా తెలుసు. ఇంత ఎమోష‌న్‌ని సాయిధ‌ర‌మ్ మోయ‌లేడ‌ని, అత‌ని న‌ట‌న‌లో కొంచెం మెచ్యూరిటీ ఉన్న‌ప్ప‌టికీ క్లైమాక్స్‌లో ఎమోష‌న్స్ ప‌ల‌క‌లేదు. అదే నాని, శ‌ర్వానంద్ లాంటి వాళ్ల‌కి ఈ సీన్ దొరికితే ఒక రేంజ్‌లో చేసేవాళ్లు.

ఈ స‌మ‌స్య ఉంది కాబ‌ట్టే స‌త్య‌రాజ్‌, రావు ర‌మేష్‌ల‌ని అటుఇటు స్తంభాలుగా నిల‌బెట్టి, హీరోని Thread (థ్రెడ్‌) గా వాడుకున్నాడు. నిజానికి వాళ్లే ఈ సినిమా హీరోలు. అక్క‌డ‌క్క‌డ Drop అయినా మ‌ళ్లీ వీళ్లిద్ద‌రే నిల‌బెట్టారు.

25 ఏళ్ల క్రితం విదేశీ ఉద్యోగాల వేట మ‌న దేశంలో Start అయిన‌ప్పుడే, ఒంట‌రి త‌ల్లిదండ్రుల కాలం మొద‌లైంది. పిల్ల‌లు ఇక్క‌డికి రారు. వీళ్లు త‌ర‌చూ వెళ్ల‌లేరు. వీడియో కాల్‌లో చూస్తూ మాట్లాడుకోవ‌డ‌మే. ప్ర‌తి ప‌ల్లెలోనూ ఇప్పుడు వీళ్లు క‌నిపిస్తారు. డ‌బ్బుకి లోటు ఉండ‌దు. పెద్ద ఇల్లు ఉంటుంది. కానీ ప‌ల‌క‌రించే మ‌నుషులుండ‌రు. ప‌నివాడి సంర‌క్ష‌ణ‌లో ఉంటారు.

పిల్ల‌ల‌ని కూడా ఏమీ అన‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే అమెరికాలో ఉద్యోగ భ‌ద్ర‌త ఉండ‌దు. సెల‌వలు పెట్టి ప‌దేప‌దే వ‌స్తే జాబ్ పోతుంది. ఇంకొక‌టి దొర‌క‌డం అంత Easy కాదు.

ఇంత సంక్లిష్టంగా బ‌తికిస్తున్న ప‌రిస్థితులే క్రూర‌మైన‌వి. స్వ‌త‌హాగా వారు క్రూరులు కాదు. తండ్రి చ‌నిపోతే రాలేక వీడియోలో అంత్య‌క్రియ‌లు చూసి ఏడ్చిన వాళ్లు నాకు తెలుసు.

కానీ ప్ర‌పంచంలో ఎక్క‌డైనా మ‌నుషులొక్క‌టే. ఎమోష‌న్స్ ఒక‌టే. ఈ పాయింట్ మీదే శ‌తమానంభ‌వ‌తి అడింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆడుతుంది. ఫ్యామిలీ ఎమోష‌న్స్ మీద సినిమాలు చాలా త‌క్కువ‌గా వ‌స్తాయ్ కాబ‌ట్టి.

దీంట్లో ఒక మూల‌క‌థ లేక‌పోవ‌డం ఒక లోపం. కురుసోవా తీసిన "ఇకిరు" లో పిల్ల‌ల పార్కు క‌బ్జా కాకుండా హీరో పోరాడుతాడు. స‌త్య‌రాజ్‌కి దీంట్లో ల‌క్ష్య‌మంటూ లేదు. పిల్ల‌లు కంటికి క‌నిపించాల‌నే స‌గ‌టు తండ్రి తాప‌త్ర‌యం త‌ప్ప‌. అందుకే ర‌క‌ర‌కాల సీన్స్ అతికించిన‌ట్టు వ‌స్తుంటాయి. మారుతీ మార్క్ కామెడీ వ‌ల్ల ఆ సీన్స్ పాసై పోయాయి.

టిక్‌టాక్ అమ్మాయిగా రాశీఖ‌న్నా క్యూట్‌గా ఉంది. సెకెండాఫ్‌లో ఊరికే బొమ్మ‌లా నిల‌బ‌డి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డం త‌ప్ప ఇంకేమి చేయ‌లేక‌పోయింది. "ఓ బావా , త‌కిట‌త‌కిట" ఈ రెండు పాట‌ల ఫిక్చ‌రైజేష‌న్ చాలా బాగుంది. ఫొటోగ్ర‌ఫీ సూప‌ర్‌.

సాయిథ‌ర‌మ్‌కి హిట్ ప‌డింది. కానీ ఈ సినిమా హీరో స‌త్య‌రాజ్‌. అదే ఇబ్బంది. శైల‌జారెడ్డి అల్లుడు లాంటి చెత్త తీసిన త‌ర్వాత మారుతి త‌న బ‌లం ఏంటో క‌నిపెట్టిన‌ట్టున్నాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp