ఓ పిట్ట కథ రివ్యూ

By Ravindra Siraj Mar. 06, 2020, 03:22 pm IST
ఓ పిట్ట కథ రివ్యూ

చిన్న సినిమాలకు మనుగడ చాలా కష్టమవుతున్న తరుణంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఓ పిట్ట కథ తన స్థాయికి తగ్గ పెద్ద పోటీతోనే బరిలోకి దిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ని తెరకు పరిచయం చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా తీసుకురావడంతో ప్రేక్షకుల దృష్టి దీనిపైకి మళ్ళింది. సింపుల్ లవ్ స్టొరీలా అనిపించినా ఇందులో కావలసినంత క్రైమ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని ట్రైలర్ చూసాక క్లారిటీ వచ్చింది. ఇలాంటి జానర్ ని ఇష్టపడే ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఓ పిట్ట కథలో నిజంగా అంత కథ ఉందా లేదా రివ్యూలో చూద్దాం

మరి కథేంటి ?

అనగనగా కాకినాడ దగ్గర ఓ చిన్న పల్లెటూరు. అక్కడ చలాకీగా చురుగ్గా ఉండే అమ్మాయి వెంకటలక్ష్మి(నిత్య శెట్టి). తనతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఆ అమ్మాయి నాన్న సినిమా థియేటర్లోనే పని చేస్తుంటాడు ప్రభు(సంజయ్ రావు). మావయ్య కోసం చైనా నుంచి వచ్చిన బావ క్రిష్(విశ్వంత్) కూడా వెంకటలక్ష్మిని చూసి మనసు పారేసుకుంటాడు. ఇది జరుగుతుండగానే వెంకటలక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఎవరు చేశారో అర్థం కాక అందరిని అనుమానించే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఇన్స్ పెక్టర్ అజయ్ కుమార్(బ్రహ్మాజీ) రంగప్రవేశం చేస్తాడు. అసలు వెంకటలక్ష్మి ఏమైంది, ప్రభు, సంజయ్ లకి ఈ మిస్సింగ్ కి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఇక్కడ చెప్పని కథ ఇంకేమైనా దాచారా లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి

నటీనటులు

సినిమా మొత్తం మీద చెప్పుకోదగిన ఆర్టిస్ట్ ఒక్క నిత్య శెట్టినే. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెగాస్టార్ లాంటి సీనియర్లతో జంకు లేకుండా నటించిన అనుభవం కాబోలు తన డెబ్యులో కూడా అదే స్పార్క్ ని చూపించే ప్రయత్నం చేసింది. అచ్చమైన తెలుగు అమ్మాయి కావడంతో డైలాగ్ మాడ్యులేషన్ తో పాటు ఎక్స్ ప్రెషన్లు సహజంగా వచ్చాయి. హైట్ తక్కువగా ఉన్నా తన చురుకుదనంతో కవర్ చేసింది. ఇక తనకు అలవాటైన పాత్రలో విశ్వంత్ బాగానే చేసుకుంటూ పోయాడు. పాత్రలో ఎలాంటి ప్రత్యేకత లేదు కానీ చివరి అరగంట కొంత స్కోప్ దక్కింది .

ఇక అందరి ఫోకస్ తనపై పడేలా చేసుకున్న సంజయ్ రావు ఆశించిన స్థాయిలో హావభావాలు పలికించలేకపోయాడు. పాత్ర పరంగా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఇంకా రాటుదేరాల్సింది చాలా ఉందనే విషయం స్పష్టమవుతుంది. బ్రహ్మాజీ ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు వేసిన పోలీస్ వేషాన్ని తనకు అలవాటైన రీతీలో చేసుకుంటూ పోయాడు. ప్రభు ఫ్రెండ్ గా నటించిన ఆర్టిస్ట్ ఏదోలా ఉన్నాడు. ఇతర చిన్న పాత్రల కోసం జూనియర్ ఆర్టిస్ట్ లను తీసుకున్నారు కాబోలు అంతంతమాత్రంగానే చేశారు.

దర్శకుడి గురించి

టాలీవుడ్ లో క్రైమ్ ఎలిమెంట్ ఉన్న లవ్ స్టోరీస్ రావడం అరుదే. అందులోనూ ముక్కోణపు ప్రేమ అనే కాన్సెప్ట్ జోడించడం ఎంతో కొంత వైవిధ్యం జోడించేదే. దర్శకుడు చందు ముద్దు ఈ కోణంలో ఆలోచించే ఓ పిట్ట కథను రాసుకున్నాడు. ఇలాంటి స్క్రీన్ ప్లే ఎప్పుడూ లేదని యూనిట్ ప్రమోషన్లో తెగ ఊదరగొట్టింది కానీ నిజానికి ఇందులో అంత విషయం లేదు. చిన్న ట్విస్ట్ పెట్టుకుని 2 గంటల 08 నిమిషాలు సరిపడేలా కథ రాసుకోవడంలో చందు ముద్దు ఫెయిల్ అయ్యాడు. రెండు ప్రేమ కథలను పదే పదే ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తూ చాలా సార్లు అసహనం కలిగిస్తాడు. మెయిన్ పాయింట్ లో మంచి ట్విస్టులు ఉన్నప్పటికీ దాని చుట్టూ ఎంగేజ్ చేసే స్థాయిలో కథనం రాసుకోకపోవడంతో ప్రీ క్లైమాక్స్ వచ్చేదాకా కథ ఎంతకీ ముందుకు సాగదు.


కథలో భాగంగా ట్విస్టులు వస్తే బాగుంటుంది. అంతే తప్ప ముందు ట్విస్టులు రాసుకుని ఆ తర్వాత కథ సెట్ చేసుకుంటే బెడిసి కొట్టే అవకాశాలే ఎక్కువ. ఓ పిట్ట కథలో జరిగింది ఇదే. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి చుట్టూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ని నాన్ లీనియర్ ఫార్మట్ లో చెప్పాలని ప్రయత్నించిన చందు ఈ క్రమంలో చాలా తడబాటుకు గురయ్యాడు. కథలో ఎంత గొప్ప మలుపులు ఉన్నాయో చెప్పాలని మరీ ఎక్కువ సాగదీయడంతో థ్రిల్ కాస్తా కిల్ అయ్యింది. నిజం చెప్పాలంటే ఇందులో ఉన్న స్టొరీ మెటీరియల్ ఒక గంట నిడివికి మాత్రమే సరిపోతుంది. కాని దాన్ని ఏకంగా రెండుంపావు గంటలకు రాసుకోవడంతో తేడా వచ్చేసింది. దానికి తోడు ఎంటర్ టైన్మెంట్ కోసం చందు రాసిన కామెడీ ట్రాక్స్ మరీ బేసిక్ స్థాయిలో ఉన్నాయి. నవ్వు రాదు సరికదా దర్శకుడు ఇంత వెనక్కు ఎలా ఆలోచించాడా అనే అనుమానం కలుగుతుంది.

ఫాంటసీ సినిమాలలో లాజిక్స్ అక్కర్లేదు కాని సహజత్వంతో నడిచే క్రైమ్ స్టోరీస్ కి మాత్రం అవి చాలా అవసరం. ఎవరికైనా నమ్మశక్యం కాని రీతిలో కనిపించే ఒక వీడియోని పట్టుకుని ఓ పోలీస్ ఆఫీసర్ హంతకుడెవరో నిర్ధారణకు రావడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. దాన్ని చివర్లో సమర్ధించుకునేలా ఒక చిన్న సన్నివేశం పెట్టారు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఊహించని ట్విస్టులు పెడితే చాలు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు మిగిలిన కథా ఎలా ఉన్నా సర్దుకుంటారు అనే లెక్కలో ఓ పిట్ట కథ మొత్తంగా దారి తప్పింది. చందు ముద్దు పనితనం చివరి అరగంటలో కాసేపు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన చోట్ల ఓ మాములు సగటు దర్శకుడు కనిపిస్తాడే తప్ప టీం గొప్పగా చెప్పుకున్నట్టు ఇందులో మరీ అంత విశేషమైతే లేదు. ఫైనల్ గా అవుట్ పుట్ ఎలా ఉన్నా చందులోని మంచి టెక్నీషియన్ అతనిలోని రైటర్ చేతిలో ఓడిపోయాడు

సాంకేతిక వర్గం

సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు కథ నేపధ్యానికి తగ్గ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మరీ మేజిక్ చేసే స్థాయిలో లేకపోవడం ఒక మైనస్. ఒకవేళ ఇవి కనక క్యాచీగా ఉండి ఆకట్టుకునేలా కంపోజ్ చేసి ఉంటే పిట్టకథకు కొంతైనా ప్లస్ అయ్యేది. సునీల్ కుమార్ ఛాయాగ్రహణం మెచ్చుకోదగిన స్థాయిలో సాగింది. చిన్న సినిమా కావడంతో బడ్జెట్ పరిమితులను దాటుకుని ఉన్నంతలో మంచి అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వెంకట్ ప్రభు ఎడిటింగ్ అంతంతే. కాస్త కత్తెరకు పని చెప్పినా ఇంకొంచెం వేగంగా సాగేది. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు చాలా లిమిట్స్ పెట్టుకుని ఖర్చు చేశారు

ప్లస్ గా అనిపించేవి

లొకేషన్లు
నిత్య శెట్టి
కెమెరా పనితనం
ప్రీ క్లైమాక్స్ లో కొన్ని ట్విస్టులు

మైనస్ గా తోచేవి

సంజయ్ రావు యాక్టింగ్
స్లోగా సాగే ప్రేమకథలు
రిపీట్ ఫ్లాష్ బ్యాక్స్
పాటలు

చివరిగా చెప్పాలంటే

చాలా గొప్ప కథ అని చెప్పుకున్న పిట్ట కథలో నిజంగా పిట్టంత కథే ఉంది. సినిమాల్లో క్రైమ్ అనే పదార్థం కొవ్వొత్తి లాంటిది. దాన్ని ఒడిసిపట్టుకోవడంతో ఏ మాత్రం పొరపాటు చేసినా చూసుకునేలోపే చేయి కాలుతుంది. పిట్టకథలో జరిగింది అదే. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కొత్తదే అయినప్పటికీ పదే పదే ప్రేమను ఇరికించడంతో పూర్తిగా భరించలేని ప్రహసనంగా మారిపోయింది.

చూపించిన తీరు ఎలా ఉన్నా కాసిన్ని థ్రిల్స్ కోసం రెండు గంటలు కూర్చునే ఓపిక ఉందంటే పిట్ట కథను ఛాయస్ గా పెట్టుకోవచ్చు

ఒక్క మాటలో

ఓ పిట్ట కథ - నస ఎక్కువైన ట్విస్టుల వ్యధ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp