Maha Samudram movie review: మహా సముద్రం రివ్యూ

By Ravindra Siraj Oct. 14, 2021, 01:13 pm IST
Maha Samudram movie review: మహా సముద్రం రివ్యూ

ఆరెక్స్ 100 రూపంలో చిన్న సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం ఇవాళ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్ తో పాటు చాలా గ్యాప్ తర్వాత సిద్దార్థ్ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయడంతో ఆ కోణంలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంటెన్స్ సీరియస్ డ్రామాగా ట్రైలర్ ని కట్ చేయడం, అదితి రావు హైదరి అను ఇమ్మానియేల్ గ్లామర్ లాంటి ఆకర్షణలు మాస్ ని సైతం ఆకట్టుకున్నాయి. గత కొన్ని రోజులుగా యూనిట్ చేసిన విస్తృతమైన ప్రమోషన్ ఓపెనింగ్స్ కి బాగా ఉపయోగపడింది. మరి ఇంత హైప్ మూటగట్టుకున్న మహా సముద్రం ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

ఇది వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఇద్దరు స్నేహితుల కథ. అర్జున్(శర్వానంద్) ఉద్యోగం కాకుండా స్వంతంగా ఏదైనా బిజినెస్ లో సెటిలవ్వాలనే లక్ష్యంతో ఉంటాడు. విజయ్(సిద్దార్థ్)డబ్బు సంపాదించడం కోసం పోలీస్ ఉద్యోగానికి ప్రిపేరవుతూ ఉంటాడు. ఓ గొడవ వల్ల స్థానికంగా దందాలు చేసే ధనుంజయ్(రామచంద్రరాజు)ను విజయ్ హత్య చేసి తప్పనిసరి పరిస్థితుల్లో సిటీ వదిలి పారిపోతాడు. విజయ్ ప్రియురాలు మహా(అదితి రావు హైదరి)కి అర్జున్ ఆశ్రయం ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చిన విజయ్ తన లవర్ మహా అర్జున్ దగ్గరే ఉండటం చూసి అపార్థం చేసుకుని పగ పెంచుకుంటాడు. దీన్ని అవకాశంగా తీసుకుంటాడు గూని బాబ్జీ(రావు రమేష్). ఆ తర్వాత వీళ్ళ ప్రయాణం ఊహించని మలుపు తీసుకుంటుంది

నటీనటులు

శర్వానంద్ కు ఇలాంటి పాత్ర కొత్తేమీ కాదు. ప్రస్థానంతో మొదలుకుని రణరంగం దాకా సీరియస్ క్యారెక్టర్లు గట్టిగానే చేశాడు. ఇది కూడా అదే కోవలోకి వస్తుంది కానీ డెప్త్ పరంగా కొన్ని కొత్త వేరియేషన్స్ ఉండటంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎమోషన్ల విషయంలో ఎప్పటి లాగే చేసుకుంటూ పోయాడు. ఇక సిద్దార్థ్ స్పెషల్ అనిపిస్తాడు. తెలుగు తెరమీద చూసి చాలా కాలమే అయినా ఇప్పటికీ అదే లుక్స్ తో ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ లో ఆ మీసకట్టు అంతగా సెట్ కాలేదనిపించినా పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం తన అభిమానులను నిరాశపరచలేదు. ఈ కథకు పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించేలా ఇద్దరూ సరిపోయారు.

అదితి రావు హైదరికి ఇది మరీ గుర్తుండిపోయే పాత్ర కాదు. అయితే ఆకట్టుకునే అందంతో పాటు ఇలాంటి పాత్రలకు కావాల్సిన సీరియస్ టోన్ తన ఫేస్ లో బాగా పలుకుతుంది. అది ఋజువయ్యింది. అను ఇమ్మానియేల్ కి పై ముగ్గురితో పోల్చుకుంటే పెద్దగా స్కోప్ దక్కలేదు. మొక్కుబడిగా సాగింది. జగపతిబాబుకి ఎక్కువ మాస్ మ్యానరిజంస్ పెట్టి డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. రావు రమేష్ కొత్త బాడీ లాంగ్వేజ్ తో పర్లేదనిపించారు. కెజిఎఫ్ ఫేమ్ రామచంద్ర రాజు ఉన్నంత సేపు తన స్క్రీన్ ప్రెజెన్స్ ఫీలయ్యేలా చేశాడు. శరణ్య, వైవా హర్ష జస్ట్ ఓకే. మూడు పాత్రల చుట్టే మొత్తం కథ తిరుగుతుంది కాబట్టి మిగిలినవాళ్లు అంతగా గుర్తుండరు

డైరెక్టర్ అండ్ టీమ్

తన మొదటి చిత్రంలోనే ఎవరూ ఊహించని పాయింట్ తో మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి ఈసారి కూడా సాంప్రదాయ తెలుగు సినిమా ఫార్ములాకు భిన్నంగా కొత్త ప్రయత్నం చేయబోయాడు. వైజాగ్ బ్యాక్ డ్రాప్- డ్రగ్స్ మాఫియా - ఇద్దరు హీరోలు - ఊహించని చిన్న ట్విస్టు ఇలా సెటప్ పైకి బాగానే కనిపించింది. కానీ కథలో ఎంత సిన్సియారిటీ ఉన్నా దాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు సినిమాటిక్ టచ్ ఉండే తీరాలి. అప్పుడే థియేటర్ లో పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తున్న ప్రేక్షకుడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు. అంతే తప్ప డ్రామాను అండర్ ప్లే చేసి సన్నివేశాలను సాగదీసి నడిపిస్తే ఒకదశ దాటాక బోర్ కొడుతుంది. మహా సముద్రంలో జరిగింది ఇదే.

క్యారెక్టర్లను సరైన రీతిలోనే ఎస్టాబ్లిష్ చేసిన అజయ్ భూపతి వాటి ఇంటర్ లింక్స్ కు కావాల్సిన టెంపోని మాత్రం సరైన రీతిలో రాసుకోలేదు. నాలుగేళ్లు ముంబై వెళ్లిన విజయ్ కు 2021 4జి ప్రపంచంలో ఇన్ని సంవత్సరాలు వైజాగ్ లో కనీసం ఏం జరుగుతోంది, తన ప్రాణ స్నేహితుడు ఎలా ఉన్నాడు, అక్కడి సామ్రాజ్యం ఎవరు చేజిక్కించుకున్నారు, మహా ఏమయ్యింది లాంటివి రావు రమేష్ వచ్చి చెప్పే దాకా తెలియకపోవడం లాజిక్ కు అందదు. కన్వీనియన్స్ కోసం రాసుకున్నట్టు అనిపించడం వల్లే విజయ్ తిరిగి వచ్చాక మొదలుపెట్టే రివెంజ్ డ్రామా కొంత కృతకంగా అనిపిస్తుంది. పైగా చాలా పవర్ ఫుల్ గా ఉండాల్సిన గూని బాబ్జిని కామెడీకి క్రూరత్వానికి మధ్య నలిపేయడంతో అదీ మైనస్ అయ్యింది .

అజయ్ భూపతిలో మంచి టెక్నీషియన్ ఉన్న మాట వాస్తవం. ఎన్నో షాట్స్ లో అది స్పష్టమవుతూనే ఉంటుంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ధనుంజయ్ మర్డర్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. తర్వాతే వచ్చింది అసలు చిక్కు. పాపను శర్వా ఆప్యాయంగా తన భుజాల మీద పడుకోబెట్టినప్పుడు అదితికి ఇమాజినేషన్ డ్యూయెట్ పెట్టడం రాంగ్ ప్లేస్ మెంట్. దీనికన్నా ముందు అను ఇమ్మానియేల్ ని రీ ఎంట్రీ ఇప్పించిన దర్శకుడు అంతలోనే ఏదో ఫ్యాన్స్ కోసం అన్నట్టు ఇలా పాటను పెట్టడం లాంటి పొరపాట్లు జరిగాయి. అసలు మహా కోసం అర్జున్ పాత్ర ఎందుకంత తపిస్తుందన్న బేస్ ని ఇంకా బాగా సెట్ చేసి ఉంటే కనెక్టివిటీ పెరిగేది.

ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి ఈ కథలో స్నేహాన్ని దళపతితో పోల్చాడు. అందులో రజని మమ్ముట్టి పాత్రలకు ఒక స్థిరత్వం, నిజాయితీ ఉంటాయి. కానీ ఇక్కడ అర్జున్ విజయ్ ల మధ్య అంత గాఢత్వం కనిపించదు. కలిసి పెరిగి కలిసి తిరిగిన స్నేహితుడిలో ఇంత దుర్మార్గ కోణం ఎప్పుడూ అర్జున్ కి తట్టకపోవడం వింతే. సరే గుర్తించలేదు అనుకుందాం. అదైనా నమ్మేలా చూపించాలి. కమర్షియల్ ఫార్మాట్ లో రొటీన్ గా విజయ్ శత్రువు చెప్పే పడికట్టు మాటలు విని అర్జున్ ని చంపేందుకు రావడం ఇదంతా మరీ లాజిక్ కు అందకుండా సాగుతుంది. దాంతో సహజంగానే ఎమోషనల్ ఫీల్ కూడా తగ్గిపోయింది.

ఇలాంటి కథలు ఒకరకంగా సాహసమే. అందరూ ఆలోచించలేరు. ఆ ఒక్క కారణంగా టేకింగ్ ఎలా ఉన్నా జనం వాహ్ అనరు. ఆరెక్స్ 100లో ప్రధానంగా ప్లస్ అయిన మెయిన్ కాన్ఫ్లిక్ట్ , పాటలు ఈ మహాసముద్రంలో బాగా మిస్ అయ్యాయి. చిన్న సినిమాలకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చిన చైతన్ భరద్వాజ్ నుంచి అజయ్ భూపతి ఇలాంటి ట్యూన్స్ తో సర్దుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బిజిఎం బాగా ఇచ్చారన్న సంతృప్తితో ఆ విషయాన్ని పట్టించుకోలేదేమో. మొత్తానికి ట్రైలర్ చూసి తెచ్చుకున్న హైప్ కి పెంచుకున్న అంచనాలకు మహా సముద్రం సగం దూరం మాత్రమే చేరగలిగింది. ఈ అసంతృప్తి ఫలితాన్ని ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.

సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ పనితనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో బాగా వినిపిస్తుంది. ఇలాంటి డ్రామాకు కావాల్సిన మూడ్ ఇవ్వడంలో బాగా సక్సెస్ అయ్యాడు. ఒకటి మినహా పాటలు మరీ బెస్ట్ అనిపించేలా లేకపోవడం బాగా మైనస్. రాజ్ చోట ఛాయాగ్రహణం చాలా బాగుంది. వైజాగ్ ఫీల్ ని దించేశారు. కెఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది. చాలా చోట్ల ల్యాగ్ ఉంది. కొన్ని అవసరం లేని సీన్లు నిడివికి కారణం అయ్యాయి. వెంకట్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా కుదిరాయి. ఏకె నిర్మాణ విలువలు బడ్జెట్ లెక్కలు చూసుకోలేదు. సబ్జెక్టు డిమాండ్ మేరకు అడిగినంత ఖర్చు పెట్టారు

ప్లస్ గా అనిపించేవి

శర్వా సిద్దార్థ్ కాంబో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఛాయాగ్రహణం
ధనుంజయ్ మర్డర్ ఎపిసోడ్

మైనస్ గా తోచేవి

పాటలు
సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే ల్యాగ్
మెయిన్ పాయింట్ ని డీల్ చేసిన విధానం

కంక్లూజన్

ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కోణంలో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. మహా సముద్రంలో ఉన్న థీమ్ వాటితో పోలిస్తే విభిన్నంగా అనిపిస్తుంది. కానీ బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి అదొక్కటే సరిపోలేదు. మంచి క్యాస్టింగ్, రిచ్ ప్రొడక్షన్, డిఫరెంట్ టోన్ లో సాగే టేకింగ్ ఇవన్నీ బాగానే కుదిరినా మొదటి సగంకు సెకండ్ హాఫ్ కు మధ్య బ్యాలన్స్ చేసే క్రమంలో జరిగిన తడబాటు వల్ల ఇదో గొప్ప చిత్రం కాలేకపోయింది. కాకపోతే పండగ సెలవు పూట థియేటర్ ఎంటర్ టైన్మెంట్ తప్ప ఇంకేదీ ఇష్టపడని సగటు మూవీ లవర్స్ ఓసారి ట్రై చేయొచ్చన్న మాట తప్పించి అంతకు మించి చెప్పడానికి ఇంకేమీ లేదు

ఒక్కమాటలో - 'మాములు' సముద్రం

Also Read : వరుణ్ డాక్టర్ రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp