మధ రివ్యూ

By Ravindra Siraj Mar. 13, 2020, 01:11 am IST
మధ రివ్యూ

చిన్న సినిమాలకు మనుగడ కష్టంగా మారిన పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుని పరిశ్రమ వర్గాల నుంచి మంచి మద్దతు దక్కించుకున్న సినిమా మధ. తెలిసిన స్టార్ క్యాస్ట్ పెద్దగా లేకుండా కేవలం కొత్త నటీనటులతో ఓ యువ దర్శకురాలు చేసిన ప్రయత్నం కావడంతో అందరి దృష్టి దీనిపైకి మళ్లింది. లిమిటెడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకునే థ్రిల్లర్ జానర్ కావడంతో ఆ వర్గం ప్రేక్షకులకు దీనిపై మంచి ఆసక్తే రేగింది. అందులోనూ ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో మధ గురించి మాట్లాడుకోవడం ఈ మధ్యకాలంలో బాగా కనిపించింది. మరి కంటెంట్ నే నమ్ముకుని వచ్చిన మధ అంచనాలకు తగ్గట్టు సాగిందా లేదా అనేది రివ్యూ లో చూద్దాం

కథ

నిషా (త్రిష్ణ ముఖర్జీ) యాడ్ ఏజెన్సీలో ప్రూఫ్ రీడర్. ఫోటోగ్రాఫర్ అయిన అర్జున్(వెంకట్ రాహుల్)తో బార్ లో మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు ఊరికి దూరంగా బంగాళాలో ఆపరేషన్ బ్రహ్మ పేరు మీద ఓ డాక్టర్(అప్పాజీ అంబరీష) ప్రయోగాలు చేస్తుంటాడు. షూటింగ్ పని మీద అర్జున్ ఊరికి వెళ్ళాక నిషాకు చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అందరూ తనని వింతగా చూడటం మొదలుపెడతారు. ఆఖరికి తనను మెంటల్ అస్సైలం(పిచ్చాసుపత్రి)లో చేరుస్తారు. అక్కడికి వెళ్ళాక నిషా లైఫ్ ఇంకా భయంకరంగా మారుతుంది. వాచ్ మెన్ గోపాల్(అనీష్ కురువిల్లా)సహాయం చేయడానికి సిద్ధపడతాడు. అసలు నిషాకు ఏమయ్యింది, అర్జున్ కు ఇదంతా తెలియకుండా ఎలా ఉంది, ఆ ఆసుపత్రి వెనుక రహస్యం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చెప్పడం భావ్యం కాదు.

ఎలా చేశారు

ఈ సినిమాకు లైఫ్ హీరోయిన్ త్రిష్ణ ముఖర్జీ నటన. చాలా సహజంగా విపత్కర పరిస్థితులను ఎదురుకుని తట్టుకునే పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయింది. మొదట్లో కాస్త తడబడ్డట్టు కనిపించినా ఆసుపత్రిలో చేరాక తన పెర్ఫార్మన్స్ తో నిషాకు లైఫ్ ఇచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సీన్స్ లో కట్టిపడేస్తుంది. కథ మొత్తం తన మీదే కేంద్రీకృతమయ్యిందనే సత్యాన్ని గుర్తుపెట్టుకుని సాధ్యమైనంత మేర అవుట్ ఫోకస్ కాకుండా యాక్ట్ చేసిన తీరు నిజంగా మెచ్చదగినదే. రెగ్యులర్ హీరోయిన్ల తరహాలో త్రిష్ణలో ఎలాంటి గ్లామరస్ ఫీచర్స్ లేవు. కేవలం టాలెంట్ తో నెగ్గుకురావాల్సిన ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ కి త్రిష్ణ తనవరకు న్యాయం చేసింది.

ఇక ప్రేమికుడి పాత్రలో చేసిన వెంకట్ రాహుల్ కి చాలా పరిమితమైన స్కోప్ దక్కింది. ఫస్ట్ హాఫ్ కాస్త ఎక్కువగానే కనిపించినా రెండో సగంలో కొద్దిసేపు మాత్రమే ప్రత్యక్షమవడం అతని పరిధిని చాలా తగ్గించేసింది. అనుమానం వచ్చేలా లుక్స్ తో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కొన్ని చోట్ల బాగానే పండాయి. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది అనీష్ కురువిల్లా గురించి. మరీ బెస్ట్ అని చెప్పలేకపోయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో రెండు షేడ్స్ ని బాగా క్యారీ చేశాడు. కాకపోతే భారీ కాయం కొంత ఎబ్బెట్టుగా అనిపించినా ఓవరాల్ గా ఓకే అనిపిస్తాడు. డాక్టర్ గా అప్పాజీ అంబరీష, ఎస్ఐగా రవివర్మలు కేవలం రెండు మూడు సన్నివేశాలతో సర్దుకోవాల్సి వచ్చింది. సైకాలజీ ప్రొఫెసర్ గా బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ కాస్త ఎక్కువ స్పాన్ దక్కించుకుని పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక కొత్త ఆరిస్టులు డిమాండ్ మేరకు చేసుకుంటూ పోయారు కనక ప్రత్యేకంగా ఇంకెవరిని ప్రస్తావించాల్సిన అవసరం పడలేదు

దర్శకురాలి గురించి

శ్రీవిద్య బసవ. గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. చాలా చిన్న వయసులోనే మెగా ఫోన్ చేతబట్టి ఎన్నో కష్టనష్టాలు భరించి మధ లాంటి చిన్న సినిమాను ఇక్కడిదాకా తీసుకొచ్చి మాట్లాడుకునేలా చేయడం నిజంగా ప్రశంసనీయం. తనలో ఉన్న బెస్ట్ టెక్నీషియన్ ని సినిమా మొదలైన కాసేపటికే చూపించిన శ్రీవిద్య మొదటి నుంచి చివరి దాకా ఒకే టోన్ మైంటైన్ చేయడంలో కొంతమేరకు సఫలీకృతమైనప్పటికీ ఎక్కడో ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటి థ్రిల్లర్స్ ని డీల్ చేయడం చాలా కష్టం. అందులోనూ సైకాలజీ అనే సబ్జెక్టుని టచ్ చేసినప్పుడు చాలా రీసెర్చ్ అవసరం. శ్రీవిద్య దానికి తగ్గ హోమ్ వర్క్ స్క్రిప్ట్ పరంగా చాలా చేసుకున్న విషయం ఒకపక్క అర్థమవుతూనే ఉంటుంది కానీ మరోపక్క ఎన్నో ప్రశ్నలు లాజిక్స్ రూపంలో వెంటాడుతూనే ఉంటాయి.

మధలో కాన్సెప్ట్ పరంగా చాలా కొత్త విషయాలు ఉన్నాయి. మెడికల్ గా ఇంత వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ కూడా ఉంది. ఒక సస్పెన్స్ ఎలిమెంట్ తో కథను మొదలుపెట్టి క్రమంగా ఒక్కో చిక్కుముడిని అల్లుకుంటూ పోతూ హీరోయిన్ పాత్ర మీద చూసేవాళ్లకు జాలి కలిగేలా ఫస్ట్ హాఫ్ లో శ్రీవిద్య చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే ఆసుపత్రికి వెళ్ళాక అక్కడి నుంచి కథా గమనం అదే స్పీడ్ లో వెళ్ళకపోవడం మధను దెబ్బ తీసింది. ప్రీ క్లైమాక్స్ వచ్చే దాకా కథ వేగంగా ముందుకు సాగదు. నిషా మీద ఇంకా సానుభూతి కలిగించాలనే క్రమంతో పేర్చిన సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయి. నిషా పడుతున్న బాధను అప్పటికే ఎమోషనల్ గా యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులకు ఆపై చూపించేదంతా అవసరం లేదనిపిస్తుంది. అందులోనూ కథలో కీలకమైన ట్విస్టుల్లో ఒకదానిని ముందే గెస్ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ అసలు ట్విస్ట్ దగ్గర టెంపోని అమాంతం పెంచడం మధను కొంతమేర కాపాడింది. కానీ సినిమా మొత్తాన్ని నిలబెట్టేందుకు అది సరిపోలేదు.

టెక్నికల్ గా శ్రీవిద్య బసవ ఉన్నతమైన ప్రమాణాలు చూపించింది. అందులో సందేహం లేదు. లైటింగ్ స్కీం మొదలుకుని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయించుకునే దాకా తను తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అడుగడుగునా కనిపిస్తుంది. అయితే ఇలాంటి థ్రిల్లర్స్ కి కన్సిస్టెంట్ గా టెంపో ఉండటం చాలా అవసరం. కేవలం గంటా నలభై నిముషాలు మాత్రమే ఉన్న నిడివి కూడా అక్కడక్కడా కాస్త సాగదీసినట్టు అనిపించడం స్క్రీన్ ప్లే లోపమే. నిజానికి ఇలాంటి సినిమాల్లో కమర్షియల్ అంశాలు లేదా పాటలు ఆశించడం పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే వీటి టార్గెట్ వేరు. కథనం ఎంత రేసీగా ఉంటే ఇలాంటి మూవీస్ ని ఆడియన్స్ అంత ఎంజాయ్ చేస్తారు. శ్రీవిద్య తనవరకు బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ సామాన్య ప్రేక్షకుడు సైతం అబ్బురపడేలా ఓ థ్రిల్లింగ్ మేజిక్ ని మాత్రం పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది. కానీ ఇంత యంగ్ ఏజ్ లో ఫిలిం మేకర్ గా తను చేసిన ప్రయత్నం మాత్రం ముమ్మాటికీ మెప్పుకు అర్హమైందే. అందులో సందేహం లేదు. కాకపోతే ఎన్నో అవార్డులు, పురస్కారాలు రిలీజ్ కు ముందే సొంతం చేసుకున్న మధ నుంచి కనివిని ఎరుగని ఓ అద్భుతమైన థ్రిల్లర్ ని ఆశిస్తే మాత్రం అసంతృప్తి తప్పదు.

సాంకేతిక వర్గం

మధకు ప్రధానమైన బలం నరేష్ కుమరన్ నేపధ్య సంగీతం. చాలా బలహీనమైన సన్నివేశాలను తన సౌండ్ తో నిలబెట్టాడు. కొన్నిచోట్ల ధ్వని ఎక్కువైనట్టు అనిపించినా ప్రేక్షకుడిని కథలో ఇన్వాల్వ్ చేయించడం కోసం అతను ఎంచుకున్న కంపోజింగ్ మెథడ్ ఆకట్టుకుంది. ఉన్న ఒక్క పాట మెలోడీగా సాగినా అంతగా గుర్తుండిపోయేది కాదు. అభిరాజ్ నాయర్ ఛాయాగ్రహణం బాగుంది. దర్శకురాలి ఆలోచనలకు తగ్గట్టు నిషా పాత్రలోని షేడ్స్ ని, ఆసుపత్రిలోని భయానక వాతావరణాన్ని చూపించిన తీరు చాలా సహజంగా వచ్చింది. ప్రశాంత్ సాగర్ సంభాషణలు పర్వాలేదు. ఇలాంటి జానర్ మూవీస్ లో వీటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు కాబట్టి ఉన్నంతలో ఓకే అనిపిస్తాయి. బడ్జెట్ తక్కువైనా క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఉన్నంతలో నిర్మాతలు తమ అభిరుచిని చాటుకున్నారు

ప్లస్ గా అనిపించేవి

త్రిష్ణ నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
ప్రీ క్లైమాక్స్ ట్విస్టులు

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్ నెమ్మదించడం
మరీ ఎక్కువ థ్రిల్స్ అనిపించకపోవడం
కొన్ని బేసిక్ లాజిక్స్ మిస్ కావడం
ఒకే పాత్ర మీదే ఫోకస్ పెట్టడం

చివరిగా చెప్పాలంటే

తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. వైవిధ్యం, నవ్యతను చూపించే ప్రయత్నంలో శ్రీవిద్య బసవ లాంటి దర్శకులు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మధ లాంటి సినిమాలు తీసుకొస్తున్నారు. కమర్షియల్ లెక్కలను పక్కనపెడితే ఇలాంటి ప్రయత్నాలను వీలైనంత ప్రోత్సహించడం అవసరమే. కానీ తెరవెనుక కష్టం ఎంతున్నా ఫైనల్ గా ప్రేక్షకుడు తను ఖర్చు పెట్టిన కాలానికి డబ్బుకు అంచనాలకు న్యాయం జరిగిందా లేదా అని మాత్రమే చూసుకుంటాడు. అది సంపూర్ణంగా ఇవ్వలేనినాడు స్టార్ డైరెక్టర్ అయినా డెబ్యూ చేస్తున్న అప్ కమింగ్ దర్శకులైనా ఫలితం ఒకేలా ఉంటుంది. మధ దురదృష్టవశాత్తు ఈ కోవలోకే వచ్చినప్పటికీ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే వాళ్ళను మరీ తీవ్రంగా నిరాశపరచదు. కానీ సగటు ఆడియన్స్ కి మాత్రం మధ ఒక మాములు సగటు థ్రిల్లర్ గా అనిపించే అవకాశాలే ఎక్కువ

ఒక్క మాటలో

మధ - జస్ట్ ఓకే థ్రిల్లర్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp