జాను రివ్యూ

By Ravindra Siraj Feb. 07, 2020, 02:12 pm IST
జాను రివ్యూ

తెలుగులో గత కొన్నేళ్లుగా మరీ చెప్పుకోదగ్గ ఫీల్ గుడ్ మూవీస్ రాని నేపథ్యంలో ఆల్రెడీ తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేసి మనవాళ్లనూ ఆకట్టుకున్న 96 రీమేక్ గా జాను మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ బెస్ట్ పెర్ఫార్మస్ గా పేరున్న శర్వానంద్ సమంతాలు మొదటిసారి జట్టు కట్టడంతో దీని మీద ఆసక్తి పెరిగింది. ప్రమోషన్ ఈవెంట్స్ లో ఇది తన కెరీర్ బెస్ట్ మూవీ అని సామ్ పదే పదే చెప్పడం కూడా హైప్ కు కారణమయ్యింది. పోలిక విషయంలో ఎలాంటి లోపాలు ఎత్తిచూపకూడదనే ఉద్దేశంతో ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఏరికోరి మరీ తీసుకొచ్చిన దిల్ రాజు ప్రయత్నం ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం

ఇంతకీ కథేంటి

రామచంద్ర(శర్వానంద్) వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ప్రకృతిని జంతువులను క్యాప్చర్ చేస్తూ వివిధ ప్రదేశాలు, దేశాలు తిరగడం అతని వృత్తి. అందులో భాగంగా వైజాగ్ లో తను చదువుకున్న స్కూల్ కు వస్తాడు. జ్ఞాపకాలు తడుముతూ ఉండగా స్నేహితులంతా కలిసి 2004 బ్యాచ్ రీ యూనియన్ మీటింగ్ హైదరాబాద్ లో ప్లాన్ చేసారని తెలుస్తుంది. ఇందుకు సింగపూర్ నుంచి జాను అలియాస్ జానకి(సమంతా)వస్తోందని తెలిసి రామ్ ఉద్వేగానికి లోనవుతాడు. అలా పదో తరగతిలో తమ ఇద్దరి మధ్య జరిగిన అందమైన ప్రేమకథను గుర్తు చేసుకుంటాడు. ఈలోగా జాను వస్తుంది. ఇక అక్కడి నుంచి క్లాస్ మేట్స్ అందరూ కలుసుకున్న సందర్భాలు ఎక్కడికి దారి తీశాయి, రామ్ జానులు ఒకరి గురించి మరొకరు తెలుసుకున్న సంగతులేంటి, ప్రేమ చివరికి ఏ మలుపు తీసుకుంది అనేదే మిగిలిన స్టోరీ

ఎవరెలా చేశారు

శర్వానంద్ లోని యాక్టర్ గురించి అనుమానపడాల్సిన సందర్భం అతనెప్పుడూ తీసుకురాలేదు. ప్రస్థానం లాంటి సీరియస్ జానర్ మొదలుకుని ఎక్స్ ప్రెస్ రాజా లాంటి ఎంటర్ టైనర్ దాకా తనను ఎలా వాడుకుంటే అలా పూర్తిగా ఇచ్చేస్తాడని చాలా సార్లు ఋజువు చేశాడు. నిజానికి జాను షూటింగ్ కు ముందు రామ్ పాత్రకు వేరే స్టార్లను ప్రయత్నించిన మాట వాస్తవం. వాళ్ళైతే ఎలా ఉండేదో ఊహించలేం కానీ శర్వానంద్ మాత్రం ఇందులో జీవించేశాడు. ఏళ్ళ తరబడి గుండెల్లో దాచుకున్న ప్రేమను, ఎడబాటును భరిస్తూ ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయిన ఒకరకమైన మెకానికల్ ఎక్స్ ప్రెషన్స్ ని చాలా సహజంగా చూపించాడు. ఒరిజినల్ వెర్షన్ లోని విజయ్ సేతుపతితో పోలిక రాకుండా 96 చూసినవాళ్లను సైతం మెప్పించేలా సాగిన ఇతని నటన వంద మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా జానుని కలిసిన సందర్భాల్లోని సంఘర్షణను బాగా మోశాడు. కెరీర్ బెస్ట్ లో ఒకటిగా జానును నిరభ్యంతరంగా వేసుకోవచ్చు

ఇక టైటిల్ రోల్ చేసిన సమంతా మరోసారి షో స్టీలర్ గా మారింది. జానకి ఏదైతే ఇంటెన్సిటీ డిమాండ్ చేసిందో దానికి ఏ మాత్రం తగ్గకుండా తను ఇచ్చిన పెర్ఫార్మన్స్ హృదయాలను తాకుతుంది. తనను ఇష్టపడిన వాడికి సంబంధించి చేదు నిజాలను తెలుసుకునే సీన్ లో, రామ్ తో ఒంటరిగా గడుపుతూ మాట్లాడుతూ ఏడ్చే సన్నివేశాలలో టచ్ చేస్తుంది. కాకపోతే వెరీయేషన్స్ ఎక్కువగా లేకుండా ఒకే నోట్ లో సాగే పాత్ర కావడంతో పాటు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఎంట్రీ ఇవ్వడం లెన్త్ తగ్గించేసింది. సెకండ్ హాఫ్ ని తన కంట్రోల్ లో తీసుకుని నిలబెట్టేసింది.

ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించే ఇద్దరు యాక్టర్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు. ముఖ్యంగా పదో తరగతి జానుగా నటించిన గౌరీ లుక్స్ తోనే చంపేసింది. జూనియర్ రామ్ గా నటించిన సాయి కిరణ్ కూడా న్యాచురల్ గా ఉన్నాడు. రఘుబాబుది చిన్న పాత్రే. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ లైట్ కామెడీని పండించారు. ఫిదా ఫేమ్ శరణ్య చాలా రోజుల తర్వాత కాస్త స్పాన్ ఉన్న పాత్ర చేసింది. మిగిలిన ఆర్టిస్టులు జస్ట్ అలా కనిపిస్తారు కానీ ఎవరికీ పెద్దగా స్కోప్ దక్కలేదు

దర్శకుడి మాటేమిటి

ఒక బాషలో ఆల్రెడీ ప్రూవ్ అయిన సినిమాను అదే దర్శకుడితో రీమేక్ చేయడంలో చాలా సౌలభ్యం ఉంటుంది. అతను ఏ ఉద్దేశంతో కథ రాసుకున్నాడో ఏ ఆలోచనతో దాన్ని తెరకెక్కించాడో అదే ఫీల్ ని చెడిపోకుండా ఇంకోసారి తీయగల సామర్ధ్యం ఆశించవచ్చు. అందులోనూ జాను లాంటి ఎమోషనల్ జర్నీలను ఇంకో డైరెక్టర్ తో రిస్క్ చేయలేము. ఇక్కడే దిల్ రాజు కరెక్ట్ ప్లానింగ్ తో ప్రేమ్ కుమార్ నే తీసుకొచ్చారు. కానీ తమిళ్ లో ఆల్రెడీ ప్రూవ్ అయిన కంటెంట్ కాబట్టి ఏ చిన్న మార్పు చేసినా ఫీల్ చెడిపోతుందేమో అన్న భయంతో ఫ్రేమ్ టు ఫ్రేమ్ మక్కికి మక్కి దించేయడం ఒక విధంగా ప్లస్ అయితే పలు విధాలుగా మైనస్ అయ్యింది. రామ్ జానకి మధ్య ప్రేమను స్కూల్ ఏజ్ లోనే సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయిన ప్రేమ్ కేవలం ఆ ఒక్క ఎమోషన్ ని బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ మొత్తం రెండు పాత్రల మధ్య సంభాషణతో సాగదీయడం ఒకరకంగా చెప్పాలంటే ఫీల్ కి బదులు బోర్ కొట్టిస్తుంది

జానుని ప్రాణంగా ప్రేమించిన రామచంద్ర ఇన్నేళ్ల తర్వాత కలిసాక తనతో ప్రవర్తన విషయంలో చాలా మెచ్యూరిటీ చూపిస్తాడు. కనీసం కౌగిలించుకునే చనువు కూడా తీసుకోకపోవడం చూస్తే ప్రేమ్ కుమార్ ఆలోచన విధానానికి శెభాష్ అనిపించేలా చేస్తుంది. అదే బాలీవుడ్లో అయితే ఇదే కథలో రామ్ జానకిలు ఏకంగా లిప్ లాక్ కిస్ చేసుకునే వాళ్ళు. కానీ ఇదొక్కటే జానుని నిలబెట్టడానికి సరిపోలేదు. ఇద్దరి మధ్య ఎన్నో సంవత్సరాల దూరం తర్వాత కలిగే భావోగ్వేగాలు ఖచ్చితంగా సున్నితంగా ఉంటాయి. అలా అని వాటిని తెరమీద డీటెయిల్డ్ గా చెప్పాలని చూడటం రెండో సగాన్ని చాలా దెబ్బ తీసింది. సన్నివేశాలు వెళ్తూనే ఉంటాయి. టైం నెమ్మదిగా సాగుతూనే ఉంటుంది. కానీ తెరమీద రామ్ జానకి తప్ప ఇంకెవరు ఉండరు. వాళ్ళ మధ్య జరిగే మాటలు, కలిగే ఫీలింగ్స్, నవ్వులు, కన్నీళ్లు వీటితోనే ప్రేమ్ కుమార్ కథ లేకుండా నడిపే ప్రయత్నం గట్టిగా చేశాడు. కానీ ఆరవ ఆడియన్స్ ఫీలైన లవ్ ని మనవాళ్ళు ఒకవేళ ఆ స్థాయిలో అందుకోలేదంటే అది ప్రేక్షకుల తప్పు కాదు. అభిరుచులకు తగ్గట్టు కథలో మార్పులు చేయకపోవడమే.

జాను నిజంగా మంచి సినిమానే. కానీ ఖచ్చితంగా చూడాల్సిన లేదా చెప్పుకోవాల్సిన సినిమాగా మిగలకపోయే అవకాశాలే ఎక్కువ. గతంలో ఇదే కోలీవుడ్ నుంచి తీసుకొచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ లాంటివి ఇక్కడ ఆడలేదు. రవితేజ లాంటి స్టార్ ఉన్నా జనం నో అనేశారు. టీవీలో ఆడటం వేరు పబ్లిక్ వాటిని థియేటర్ లో చూసి హిట్ చేయడం వేరు. జాను, ఆటోగ్రాఫ్ లాంటివి మొదటి కోవలోకి వస్తాయి. ఎంత రామ్ జానకిల మధ్య సంఘర్షణ ఉన్నా దాన్ని ఇంకా బలంగా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో ఇంతలా సాగదీయడం సగటు సినిమాగా మార్చేసింది.

ఇక్కడ దీన్ని 96తో పోల్చి ఇదంతా చెప్పడం లేదు. ఆ మాట కొస్తే తమిళంలో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్ గా మారేటప్పటికీ యావరేజ్ లేదా ఫ్లాప్ అయినవి కోకొల్లలు. అందులోనూ క్లాసిక్స్ అని పేరు తెచ్చుకున్న ఇతర భాషల్లోని 96లాంటివి తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు కొత్తగా అనిపిస్తాయనే కోణంలో ఆలోచించి ఉంటే స్క్రిప్ట్ లో మార్పులో లేదా డబ్బింగ్ చేసి వదిలేయడమో జరిగేది. మరాఠిలో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సైరాత్ ని తెలుగులో తీయకపోవడానికి కారణం అలాంటివి మనవాళ్ళు అప్పటికే చూసేశారు కాబట్టి. ఒకవేళ తీసినా ప్రయోజనం ఉండదు కాబట్టి. జానుని ఈ కోణంలో విశ్లేషించడంలో జరిగిన పొరపాటు వల్లే ఇదో సగటు సినిమాగా మిగిలిపోతుంది తప్ప ఇక్కడా అదే స్థాయి ఫలితాన్ని అందుకోవడం కష్టమే. కొన్ని ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండిన మాట వాస్తవమే కానీ రెండున్నర గంటలు వాటికోసమే జానుని భరించగలరా అనేదే రేపు బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని శాశిస్తుంది

టెక్నికల్ టీమ్

సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశాడు. తనదైన సిగ్నేచర్ ట్యూన్ తో ఆకట్టుకున్నాడు. రెండు పాటలు చాలా బాగున్నాయి. డ్యూయెట్స్ లేకుండా కేవలం ఫీల్ గుడ్ సాంగ్స్ తో అతను ఇచ్చిన ఆల్బమ్ మెలోడీ లవర్స్ ని రిపీట్ మోడ్ లో వినేలా చేస్తుంది. ఒక రెండు మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తాయి. మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం చాలా బాగుంది. స్కూల్ ఎపిసోడ్స్ తో పాటు సెకండ్ హాఫ్ ఫ్రేమ్ లో ఇద్దరే ఎక్కువ సేపు ఉన్నా విసుగు తగ్గించే ప్రయత్నం ఈయన వల్లే గట్టిగా జరిగింది. మొదటి పాటలో మహేంద్రన్ పనితనం గమనించవచ్చు. ఒరిజినల్ డైలాగులనే తెలుగులో మార్చి రాసుకున్నట్టు అనిపించే కిరణ్ సంభాషణలు సహజంగా ఉన్నాయి. రెండు మూడు సీన్లలో తప్ప మామూలుగానే అనిపిస్తాయి. దిల్ రాజుకు ఇది ఏ మాత్రం రిస్క్ లేని బడ్జెట్. ఖర్చు లేకుండా చాలా సాఫీగా టెన్షన్ లేకుండా తీసేసుంటారు

ప్లస్ గా అనిపించేవి

శర్వా, సామ్ ల పాత్రలు
స్కూల్ ఎపిసోడ్ లో గౌరీ
గోవింద్ వసంత్ సంగీతం
క్యాస్టింగ్

మైనస్ గా తోచేవి

చాలా స్లోగా సాగే నేరేషన్
సెకండ్ హాఫ్
రెండు పాత్రలతోనే సగానికి పైగా నడవటం

కంక్లూజన్

ప్రేమకథలకు ఎమోషన్ చాలా అవసరం. అలా అని చెప్పి ఎంత నెమ్మదిగా సాగదీస్తే అంత గొప్పగా స్టోరీ టెల్లింగ్ చేసినట్టు అనుకుంటే ఆన్ లైన్ లో ఫ్రీగా చూసి మెచ్చుకోవడానికి తప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ లో ఇవి సూట్ కావు. జాను అలాంటిదే. స్కూల్ వయసులో ఓ జంట విడిపోయి పదిహేనేళ్ల తర్వాత కలుసుకోవడం అనే పాయింట్ లో మంచి ఫీల్ ఉన్నప్పటికీ దాన్ని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఎంగేజింగ్ గా చెప్పడంలో ప్రేమ్ కుమార్ ఎలాంటి ప్రత్యేకతా చూపకపోవడంతో జాను ఆశించిన స్థాయి కన్నా ఒక రెండు మెట్లు కిందే ఉండిపోయింది.
ఒక్క మాటలో

జాను -- నెమ్మదిగా సాగదీసిన ప్రేమకథ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp