ఎంత మంచివాడవురా రివ్యూ

By Ravindra Siraj Jan. 15, 2020, 01:51 pm IST
ఎంత మంచివాడవురా రివ్యూ

నందమూరి కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోగా కళ్యాణ్ రామ్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. భారీ మార్కెట్ సంపాదించుకోలేకపోయినా తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పరుచుకుని దానికి అనుగుణంగా స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరున్న సతీష్ వేగ్నేశతో కళ్యాణ్ రామ్ జట్టు కట్టడం ఆసక్తి రేపింది. అందులోనూ ఆడియో రంగంలో దిగ్గజం అనిపించుకున్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ మొదటిసారి నిర్మాణంలోకి అడుగుపెట్టిన సినిమా కూడా ఇదే కావడం ఎంత మంచివాడవురాపై ఆసక్తిని పెంచింది. స్టార్ హీరోలే కోడి పుంజుల్లా సై అంటే సై అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల కోసం తలపడుతున్న తరుణంలో ఒకరకమైన సాఫ్ట్ ఎడ్జ్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథేంటి

బాలు (కళ్యాణ్ రామ్)నందిని(మెహ్రీన్)చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన బాలు చదువు పూర్తి చేసుకున్నాక షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెడతాడు నందిని వాటిని ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వస్తుంది. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుందని వీలైనంత సహాయం చేయడమే ఈ జీవితానికి పరమార్థమని నమ్మే బాలు దానికి తగ్గట్టే ఏ కుటుంబంలోనైనా ఎవరివల్లనైనా శూన్యం ఉందని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళిపోతాడు. ఒకసారి సూర్యగా మరోసారి ఋషిగా వేర్వేరు పేర్లతో వేర్వేరు బంధాలతో కనిపిస్తాడు.

ఇదంతా నందినికి షాకింగ్ గా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఒక తండ్రికి(తనికెళ్ళ భరణి)కొడుకుగా నటించే పరిస్థితిలో ఇసుక మాఫియా లీడర్ గంగరాజు(రాజీవ్ కనకాల)తో శత్రుత్వం ఏర్పడుతుంది. దీంతో ఇలాంటి అవసరం అందరికి ఉందని గుర్తించిన బాలు నందినిలు ఆల్ ఈజ్ వెల్ పేరుతో ఎమోషన్స్ రూపంలో మనుషులను సప్లై చేసే కంపెనీని మొదలుపెడతారు. ఇలాంటి భావోద్వేగాలను ఇచ్చి జనానికి మంచి చేయాలనుకున్న బాలుకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందా అతను ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు అనేది తెరమీద చూడాలి

నటీనటులు

నటుడిగా కళ్యాణ్ రామ్ మీద మొదటి సినిమా తొలిచూపులోనే నుంచి ఇప్పటిదాకా ఎలాంటి కంప్లయింట్ లేదు. అతనొక్కడే లాంటి రివెంజ్ డ్రామా చేసినా, పటాస్ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తీసినా అతనిలో యాక్టర్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. దానికి తోడు ఎలాంటి కథకైనా సూటవుతాడన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. కాకపోతే ఇతని సత్తాని ఎప్పటికప్పుడు వాడుకునే దర్శకులు సరిగ్గా దొరక్కపోవడంతో ఆశించిన స్థాయిలో స్టార్ గా ఎదగలేకపోయాడు. ఇదలా ఉంచితే ఈ ఎంత మంచివాడవురా మాత్రం పెర్ఫార్మన్స్ పరంగా మంచి స్కోప్ ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకునే దిశగా కళ్యాణ్ రామ్ కూడా తనవంతు పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. బరువైన ఎమోషన్స్ ఎక్కువ ఉన్న రోల్ కావడంతో వాటిని బాలన్స్ చేసుకుంటూనే అవసరమైనప్పుడు ఫైట్స్ కోసం పెట్టిన మాస్ యాంగిల్ ని కూడా బాగా చూపించాడు. మొత్తానికి తన వరకు ఏది చేయాలో దానికి పూర్తి న్యాయం చేకూర్చాడు.

మెహ్రీన్ కు ప్రాధాన్యం ఉన్న పాత్రే దక్కింది. ఉన్నంతలో తనకిచ్చిన బాధ్యత నెరవేర్చింది. ఎమోషనల్ సీన్స్ లోనూ పర్వాలేదనిపించుకుంది. సీనియర్ నటులు విజయ్ కుమార్ కు తాతగా ఇది ఎన్నో పాత్రో లెక్కబెట్టడం కష్టం.అలవోకగా చేసుకుంటూ పోయారు. తెలుగులో ఈ మధ్య అరుదుగా కనిపిస్తున్న శరత్ బాబు, సుహాసినిలు జంటగా కనిపించడం బాగుంది. ఒక రకమైన రిలీఫ్ అని చెప్పొచ్చు. విలన్ గా రాజీవ్ కనకాల తన శాయశక్తులా పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది పండలేకపోయింది. బహుశా ప్రేక్షకులకు వ్యక్తిగతంగా అతని మీదున్న సాఫ్ట్ కార్నర్ వల్ల కావొచ్చు. అంతో ఇంతో గుర్తుండేది తనికెళ్ళ భరణినే. తన సీనియారిటీతో ఈజీగా నెట్టుకొచ్చారు. వెన్నెల కిశోర్ , ప్రభాస్ శీను తదితరులు కామెడీ ట్రాక్ కోసం ఉపయోగపడ్డారు కానీ వాళ్ళవి సైతం రొటీన్ పాత్రలే. మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పే సీనియర్ నరేష్ టైమింగ్ బాగా కూడింది.

దర్శకత్వం గురించి

కెరీర్ ప్రారంభంలో ఓ రెండు సినిమాలు చేసినా ఎవరు పట్టించుకోని కారణంగా అమాంతం తన ట్రాక్ ని మార్చి ఫామిలీ జానర్ వైపు వచ్చాడు సతీష్ వేగ్నేశ. శతమానం భవతి లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకుని మంచి హిట్ కొట్టడమే కాక దానికి జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టాడు. భావోద్వేగాలను అందంగా హ్యూద్యంగా చూపించగలడన్న పేరు ఆ సినిమాతోనే వచ్చింది. అయితే దాని వల్ల వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్సో లేక ఇంకే కారణమో తెలియదు కానీ ఉపదేశాల కోసమే తీసినట్టు అనిపించే శ్రీనివాస కళ్యాణంని ప్రేక్షకులు మొహమాటం లేకుండా తిరస్కరించారు.

అందుకే ఈసారి గుజరాతి రీమేక్ వైపు మొగ్గు చూపారు సతీష్. క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకునే సతీష్ వేగ్నేశ ఈసారి దీని ఒరిజినల్ వెర్షన్ ఆక్సిజన్ లోని ఫీల్ ని ఒడిసిపట్టడంలో తడబడ్డారు. ఫలితంగా మంచివాడు చాలా గొప్పగా ఉంటాడని ఊహించుకున్న ప్రేక్షకుల అంచనాలను సతీష్ అందుకోలేకపోయారు కొన్ని కథలు వినేందుకు బాగుంటాయి. కొన్ని తీసేందుకు బాగుంటాయి వీటినే యూనివర్సల్ సబ్జక్ట్స్ అని చెప్పొచ్చు. తమిళ్ లో భాగ్యరాజ్, విక్రమన్ లాంటి కథకులు దర్శకులు అక్కడ తీసిన సినిమాలు రీమేక్ రూపంలో ఇక్కడా ఘనవిజయం సాధించడానికి కారణం అవి రెండో కోవలోకి రావడమే. దురదృష్టవశాత్తు ఎంత మంచివాడవురా మొదటి కోవలోకి వస్తుంది.

గుజరాతి ఎంటర్ టైన్మెంట్ మార్కెట్ చాలా చిన్నది. ఇక్కడిలాగా వందల కొద్దీ సినిమాలు తీయరు. బడ్జెట్ కూడా లిమిట్స్ లో ఉంటుంది. అందుకే ఆక్సిజన్ లాంటి కథలు వాళ్లకు విపరీతంగా నచ్చుతాయి. అక్కడ అవి ఎందుకు సక్సెస్ అయ్యాయనే విశ్లేషణ చేసుకున్నాకే మన తెలుగు ఆడియన్స్ కి సూట్ అవుతాయా లేదా అని చెక్ చేసుకోవాలి. 1999లో సుప్రసిద్ధ రచయిత నిర్మాత దర్శకులు మల్లెమాల గారు ఎంతో ముచ్చటపడి ఇదే తరహాలో వేరే భాషలో చరిత్ర సృష్టించిన సినిమాను ఇక్కడ వెలుగు నీడలు పేరుతో రీమేక్ చేస్తే సాయంత్రానికే బాక్సులు వెనక్కు వచ్చాయి. క్యాలికులేషన్ లో జరిగిన పొరపాటది.

ఇక్కడ ఇదంతా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఎంత మంచివాడవురా నిస్సందేహంగా చెడ్డ కథ కాదు. అదే నిజమైతే గుజరాతి ప్రేక్షకులే తిరస్కరించేవారు. కానీ నేటివిటీ, టేస్ట్, హీరో ఇమేజ్ పేరుతో దీనికి చేసిన మార్పులే దెబ్బ తీశాయని చెప్పొచ్చు. అలా అని యధాతధంగా తీస్తే హిట్ అవుతుందని కాదు. కృత్రిమంగా ఎమోషన్స్ ని పండించడం అంత సులభం కాదు. చాలా రిస్క్ తో కూడుకున్నది. ఏదో కుటుంబంలో ఒకరు లేని లోటు తీర్చడం కోసం అతని స్థానంలోకి హీరో వెళ్లడం అనేది ఎప్పటి నుంచో వర్క్ అవుట్ అవుతున్న ఫార్ములా. ఇందులోనూ అదే ట్రై చేశారు.

కాకపోతే హీరో ఏకంగా ఎన్నో కుటుంబాలకు ఆ బాధ్యతను నెత్తినేసుకోవడంతో ప్రేక్షకులు ఒకదానికి కనెక్ట్ అయ్యేలోపు ఇంకొకటి వచ్చి మొత్తంగా అసలు కాన్సెప్ట్ కు డిస్ కనెక్ట్ అయిపోతారు. సతీష్ వేగ్నేశ కథను చెప్పే క్రమంలో చాలా డీవియేషన్స్ తీసుకోవడం ఫ్లోని దెబ్బ తీసింది. ఎమోషన్స్ ని సప్లై చేయడం అనే థీమ్ లోనే బోలెడు ఆర్టిఫిషాలిటీ ఉంది. అలాంటిది కేవలం ఆ ఒక్క పాయింట్ ని బేస్ చేసుకుని సినిమా మొత్తాన్ని నడిపించాలనుకోవడమే సాహసం. ఆక్సిజన్ దర్శకుడు తాళ్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని ట్రెక్కింగ్ చేస్తే సతీష్ మాత్రం కొండ ఎత్తు చూసుకోకుండా తాళ్లు రెడీ చేసుకోవడంతో జారిపోయే ముప్పుని కొని తెచ్చుకున్నారు.

టెక్నికల్ టీమ్ గురించి

సంగీత దర్శకుడు గోపి సుందర్ ఒక రెండు పాటలు మినహాయించి మిగిలినవి రొటీన్ గా ఇచ్చేశాడు. ఆడియో వీక్ గా ఉండటంతో చూసేందుకు పర్వాలేదు అనిపించినా కథ ప్రకారం ఇన్నేసి అవసరం లేకపోవడంతో ఏవి బాగున్నాయి అనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సోసోగానే ఉంది. రాజ్ తోట ఛాయాగ్రహణం చాలా మటుకు కాపాడింది. స్క్రీన్ వైపు చూసేలా చేయగలిగింది అందమైన ఆయన కెమెరానే.

తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకాస్త నిర్ధాక్షిణ్యంగా ఉంటే ఓ పావు గంట తగ్గి ప్రేక్షకులు సేఫ్ అయ్యేవారు కాని ఆ ఛాన్స్ పోయింది. రచన పరంగా సతీష్ వేగ్నేశ అక్కడక్కడా మంచి డైలాగ్స్ రాసినప్పటికీ అచ్చం తన గత సినిమా తరహాలో సెకండ్ హాఫ్ లో క్లాసులు తీసుకోవడం పెరిగిపోవడంతో సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడాల్సి వచ్చింది. నిర్మాణ పరంగా ఆదిత్య మూవీస్, కృష్ణప్రసాద్ లు అవసరానికి మించిన బడ్జెట్ ఇచ్చి భారీగానే ఖర్చు పెట్టారు. లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి. బలమైన కంటెంట్ ఉంటె వీటికి న్యాయం జరిగేది కానీ ఆ అవకాశం లేదు.

ప్లస్ గా అనిపించేవి

కళ్యాణ్ రామ్ పాత్ర
రిచ్ క్యాస్టింగ్
కెమెరా పనితనం
ఒక పాట

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
నీరసంగా అనిపించే కథనం
అడ్డుగా వచ్చే పాటలు
స్క్రీన్ ప్లే ల్యాగ్
కృత్రిమంగా అనిపించే భావోద్వేగాలు

చివరిగా చెప్పాలంటే

ఒక కథలో బోలెడు పాత్రలు, వాటి మధ్య ఎమోషన్లు ఉన్నంత మాత్రాన ఫ్యామిలీ ఆడియన్స్ పట్టం కట్టరు. బలమైన కథనం ఉండాలి. హృదయాలను కదిలించే సున్నితమైన సంఘటనలు ఉండాలి, వినోదాన్ని పంచే ఆహ్లాదం ఉండాలి. అంతే తప్ప భావోద్వేగాల పేరిట పాత్రలతో పదే పదే కన్నీళ్లు పెట్టిస్తూ పది నిమిషాలకోసారి క్లాసులు తీసుకుంటే భరించడం కష్టం. శ్రీనివాస కళ్యాణంలో జరిగిన పొరపాటును ఇందులో సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు సరికదా దానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో సతీష్ వేగ్నేశ దీన్ని ఎంత మంచివాడవురాని తీర్చిదిద్దడం విచారకరం. ఫస్ట్ హాఫ్ కొంత పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ ని పూర్తిగా ట్రాక్ తప్పించి అటు కానీ సెంటిమెంట్ తో ఆఖరికి సినిమా చివరిదాకా చూసినవాడు మంచివాడు అనిపించారు.

ఒక్క మాటలో

ఎంత మంచివాడవురా - శృతి మించిన సెంటిమెంట్లు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp