డిస్కో రాజా రివ్యూ

By Ravindra Siraj Jan. 24, 2020, 02:17 pm IST
డిస్కో రాజా రివ్యూ

మాస్ మహారాజాగా తనదైన టైమింగ్ తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ ఏడాదికి పైగా గ్యాప్ తో చేస్తున్న సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. అందులోనూ విభిన్న కథలతో ఆకట్టుకునే దర్శకుడిగా విఐ ఆనంద్ కున్న పేరు దీని పట్ల ఆసక్తిని పెంచింది. అయితే రవితేజ గత సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న కోరికతో అభిమానులున్న నేపథ్యంలో హీరో డైరెక్టర్ ఇద్దరి మీద ఒత్తిడైతే ఉంది. ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన టీజర్లు పాటలు పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో డిస్కో రాజా మీద ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గాక వస్తున్న మొదటి మూవీగా డిస్కో రాజా ఏ మేరకు అంచనాలు అందుకుందో రివ్యూ చూద్దాం.

కథ

లడఖ్ ప్రాంతంలోని మంచు కొండల్లో వాసు(రవితేజ)కు బ్రెయిన్ డెడ్ జరిగి చనిపోయే స్థితికి చేరుకుంటాడు. అరుదైన ప్రక్రియ మీద పరిశోధన చేస్తున్న కొందరు డాక్టర్లు రిలైవ్ బయో ల్యాబ్ లో వాసు మీద ప్రయోగాలు చేసి అతనికి ప్రాణం పోస్తారు. టీమ్ లో పరిణితి(తాన్యా హోప్) ఉంటుంది. కానీ అనూహ్యంగా వాసు తన గతాన్నంతా మర్చిపోయి ఉంటాడు. గుర్తుతెచ్చుకునే క్రమంలో ల్యాబ్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే తన పేరు డిస్కో రాజా(రవితేజ)అని తెలుసుకుంటాడు. డిస్కో రాజా కోసమే వెతుకుతున్న బర్మా సేథ్(బాబీ సింహా)కు తన శత్రువు బ్రతికే ఉన్న విషయం తెలుస్తుంది. అసలు డిస్కో రాజా ఎవరు, ఎందుకు ఇలాంటి ప్రమాదకర స్థితిలోకి నెట్టబడ్డాడు, అతని జీవితంలో ఉన్న హెలెన్(పాయల్ రాజ్ పుత్)ఏమైంది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాల్సిందే

ఎవరెలా చేశారు

రవితేజ బలమంతా తన ఎనర్జీలోనే ఉంది. ఇడియట్ తో మొదలుపెడితే ఇప్పటిదాకా అది తగ్గలేదు సరికదా అంతకంతా పెరుగుతూనే వచ్చింది. కథ ఎలాంటిదైనా తనకు మాత్రమే సాధ్యమయ్యే మ్యానరిజంతో ఆకట్టుకోవడం రవితేజ ప్రత్యేకత. కాకపోతే ఈమధ్య కొన్ని రొటీన్ మూస కథలు చేయడంతో అతనికి విజయలక్ష్మి దూరమయ్యింది కానీ లేకపోతే యాభై రెండేళ్ల వయసులో ఇంత టెంపో చూపించడం అంత ఈజీ కాదు. సినిమా ఎలా ఉందనే సంగతి పక్కనపెడితే రవితేజ మరోసారి ఇందులో చెలరేగిపోయాడు.

కథలోని కీలకమైన బ్యాక్ డ్రాప్ 80వ దశకంలో సాగుతుంది కాబట్టి లుక్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ, బాడీ లాంగ్వేజ్ లో చూపించిన వ్యత్యాసం బాగా హెల్ప్ అయ్యాయి. నిజానికి ఇది రవితేజకు ఒక ఛాలెంజ్ లాంటిది. స్టోరీ లైన్ డిమాండ్ ప్రకారం రెగ్యులర్ గా కనిపిస్తే చేస్తే సరిపోదు. అందుకే దానికి తగట్టుగా మాస్ రాజా తనను తాను మలుచుకున్న తీరు మెచ్చుకోదగినదే. పాత్ర తాలుకు సంబంధం లేని వేరియేషన్స్ ని చక్కగా చూపించాడు.

విలన్ బర్మా సేతుగా బాబీ సింహా వయసులో రెండు వ్యత్యాసాలు ఉన్న పాత్రలో జీవించేశాడు. కళ్ళతోనే క్రూరత్వం ఒలికిస్తూ హావభావాలను సెటిల్డ్ గా చూపిస్తూ తనలోని వర్సటాలిటీని ఇందులో బాగా చూపించాడు. కాకపోతే తమిళ సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్ళు ఇందులో ఎక్కువ ఆశించకపోవడం ఉత్తమం. ఇక హీరో నుంచి యుటర్న్ తీసుకుని క్యారెక్టర్ రోల్స్ కు వచ్చేసిన సునీల్ డిఫరెంట్ గా కనిపించాడు . యాక్టింగ్ విషయంలో రవితేజ తర్వాత తనే ఒక పిల్లర్ లా నిలబడ్డాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తను మాత్రం గుర్తుండిపోతాడు.

హీరోయిన్లు నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ ఇద్దరూ గ్లామర్ పరంగా ఉపయోగపడ్డారే తప్ప పెర్ఫార్మన్స్ పరంగా అంత ఎక్కువ స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో పాయల్ కే మంచి పాట, పాత్రా దక్కాయి. నభ నటేష్ పర్వాలేదు. తాన్య హోప్ ఫస్ట్ హాఫ్ కే పరిమితం. డ్యూయెట్లు లేవు కాబట్టి గ్లామర్ పరంగా వీళ్ళ నుంచి ఏదైనా ఆశిస్తే మాత్రం ఏమి దక్కదు. ఆరెక్స్ 100 ఫేమ్ రాంకీది మరీ చిన్న పాత్ర. నెగటివ్ షేడ్స్ ట్రై చేసిన సీనియర్ నరేష్ తేలిపోయారు. వెన్నెల కిశోర్, సునీల్, సత్య, సత్యం రాజేష్ ఇలా లిస్టు పెద్దదే ఉంది కాని ఎవరికి గుర్తుండిపోయే పాత్రలు దక్కలేదు.

దర్శకుడి గురించి

విఐ ఆనంద్ ది రెగ్యులర్ కమర్షియల్ స్టైల్ కాదు. ఎంచుకున్న కథల్లోనే వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. దానికి మంచి ట్రీట్మెంట్ ని జోడించి ప్రేక్షకులను ఎంగేజ్ అయ్యేలా చేయడంలో ఇతనికి మంచి నేర్పు ఉంది. అది టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడాలో ప్రూవ్ అయ్యింది కూడా. కాకపోతే విదేశీ చిత్రాల నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందే ఆనంద్ వాటిని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలుచుకోవడంతో ఎక్కడో లెక్క తప్పడంతో ఒక్క క్షణం ఫలితం నిరాశ కలిగించింది. అలా అని మాస్ ఫార్ములాకు వెళ్ళిపోయి తన ఉనికిని కోల్పోయే సాహసం చేయకుండా డిస్కో రాజా లాంటి టిపికల్ కథాంశం ఎంచుకోవడం నిజంగా మెచ్చుకోదగినదే. కానీ వినగానే ఎగ్జైట్మెంట్ కు గురి చేసే ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా కీలకం. హీరో ఇమేజ్, మార్కెట్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దాన్ని రాసుకుంటే మాత్రం తేడా కొడుతుంది. పూర్తిగా కాదు కాని డిస్కో రాజాలో ఈ పొరపాటు చాలా జరిగింది.

ఇలాంటి Sci-fi థ్రిల్లర్లు తెలుగులో రావడం అరుదు. ఆ కోణంలో చూస్తే విఐ ఆనంద్ ఆలోచనకు వంక పెట్టలేం. కథానాయకుడు గతాన్ని మర్చిపోవడం అన్నది కొత్తగా వచ్చింది కాదు. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ విజేతలులో అచ్చం ఇదే పాయింట్ ఉంటుంది. కాకపోతే అది ప్యూర్ యాక్షన్ డ్రామా. దీంట్లో సైన్స్ ఫిక్షన్ అనే ఎలిమెంట్ జోడించారు. అంతే తేడా. ఆ మాటకొస్తే ఆ విజేతలు కూడా హాలీవుడ్ మూవీ బోర్న్ ఐడెంటిటి నుంచి స్ఫూర్తి పొందినదే. డిస్కో రాజాలో బేసిక్ ప్రెమిస్ పకడ్బందీగా రాసుకున్న ఆనంద్ ఒక్కసారిగా హీరో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయ్యాక దాన్నొక రొటీన్ మాఫియా డ్రామాగా మార్చడంతో గ్రాఫ్ అమాంతం పడిపోయి క్రమంగా ఆసక్తిని చంపేస్తుంది. మున్ముందు జరగబోయే సీన్లను ఈజీగా గెస్ చేసే అవకాశం ఇవ్వడంతో సెకండ్ హాఫ్ అతి నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ తడబడ్డ డిస్కో రాజా క్లైమాక్స్ దాకా తిరిగి లేవడు. దాని వల్ల అంతోఇంతో అంతంతమాత్రంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి తగ్గిపోతుంది.

ఇంటెలిజెంట్ కథలకు మాస్ ఫార్ములాను మిక్స్ చేయడం చాలా రిస్క్. కానీ విఐ ఆనంద్ ఈ కూర్పును నేర్పుగా ఒడిసిపట్టే ప్రయత్నంలో తాను సగటు దర్శకుడిగా మారిపోయి ఆలోచించడంతో ఒకదశ దాటాక డిస్కో రాజా తనలో ప్రత్యేకతను కోల్పోయాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇది కొంత ఇస్మార్ట్ శంకర్ ఛాయల్లోనే సాగినా విఐ ఆనంద్ లోని మెచ్యూర్డ్ డైరెక్టర్ మరీ అంత మాస్ మసాలా వైపు కథను మలుపు తిప్పకుండా కాస్త డిఫరెంట్ గానే చెప్పాలని చూశాడు. బహుశా ఎక్కడ అభిమానుల అంచనాలకు దూరంగా వెళ్తున్నామన్న ఆలోచన వచ్చిందేమో డిస్కోరాజాని ప్రహసనంగా మార్చేశాడు. మొదటి సగంలో కూడా కథ ఎక్కువగా ముందుకు సాగకపోవడం, థ్రిల్ కోసం లేనిపోని అయోమయాన్ని క్రియేట్ చేయడం ఫ్లోని దెబ్బ తీసింది. ఫలితంగా ఎక్కడా వావ్ అనిపించదు డిస్కోరాజా.

హీరో విలన్ మధ్య 80లలో సాగే వార్ చాలా సిల్లీగా రాసుకోవడం కూడా ప్రభావం చూపించింది. బ్యాచ్ లో అందరూ కామెడి చేసేవాళ్లను పెట్టుకుని డిస్కోరాజా అంత పెద్ద డాన్ ఎలా అయ్యాడో లాజిక్ కి దూరంగా సాగుతుంది. ఇది చాలదన్నట్టు ఇలాంటి కథల్లో సింపుల్ గా తెగ్గొట్టాల్సిన ప్రేమ కథను అవసరానికి మించి సాగదీయడం బోర్ కొట్టిస్తుంది. మెయిన్ ట్విస్ట్ వరకు స్ట్రైకింగ్ పాయింట్ ఉంది కాని దాని చుట్టూ అల్లుకున్న కనెక్టింగ్ థ్రెడ్స్ రొటీన్ గా ఉండటంతో డిస్కోరాజా ఎంటర్ టైన్ మెంట్ కి, యాక్షన్ కి, ఎమోషన్ కి మధ్య నలిగిపోయి ప్రేక్షకులు జాలి పడేలా చేసుకున్నాడు. ఇంత ఖర్చు పెట్టి రెట్రో లుక్ సృష్టించాం కాబట్టి ఎక్కువ సేపు ఉండాలన్న తాపత్రయంతో రాసుకున్న సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. మొత్తానికి విఐ ఆనంద్ లోని మంచి టెక్నీషియన్ ని ఓ మాములు దర్శకుడు ఆక్రమించి డిస్కోరాజాని ఓడించాడు

టెక్నికల్ టీమ్ సంగతేంటి

రవితేజ కిక్ తోనే మొదటి బ్రేక్ అందుకున్న సంగీత దర్శకుడు తమన్ కు ఈ హీరోతో ఇది పదకొండో సినిమా. దాన్ని బట్టే వీళిద్దరి మధ్య ఎంత ర్యాపో కుదిరిందో అర్థం చేసుకోవచ్చు. మధ్యలో ఒకటి రెండు ఆల్బమ్స్ తేడా కొట్టినా ఈ కాంబినేషన్ నిరాశపరిచింది తక్కువ. ఇప్పటికే డిస్కోరాజా ఆడియో మ్యూజిక్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొంతవరకే హెల్ప్ అయ్యాడు తమన్. నలభై ఏళ్ళ కిందటి థీమ్ కాబట్టి దానికి తగ్గట్టే ఇన్స్ ట్రుమెంటేషన్ తో మొదలుకుని మూడ్ ని క్యారీ చేసే విధంగా ఇచ్చిన స్కోర్ బాగానే హెల్ప్ అయ్యింది. కానీ డిస్కోరాజా మరీ గొప్పగా చెప్పుకునే రేంజ్ లో నిలవలేకపోయింది.

ఇక కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ డిస్కో రాజాను ఇంకో లెవెల్ కు తీసుకెళ్లింది. కలర్ టోన్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేయడంతో మొదలుకుని రవితేజ లుక్స్ చాలా యంగ్ గా చూపించడంలో ఇతని పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించిన తీరు హై స్టాండర్డ్ లో ఉంది. శ్రవణ్ ఎడిటింగ్ సినిమాని క్రిస్ప్ గా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నించింది. పాటలు తక్కువగా ఉండి లెంత్ రెండున్నర గంటల లోపే ఉన్నా ల్యాగ్ అనిపిస్తుంది. దానికి కారణం కథనం నడిచే విధానం కూడా. రచనా సహకారం అందించిన అబ్బూరి రవి సంభాషణలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఎస్ఆర్టి నిర్మాణ విలువలు రిచ్ గా సాగాయి. రాజీ లేకుండా ఖర్చు పెట్టేశారు.

ప్లస్ గా అనిపించేవి

రవితేజ ఎనర్జీ
స్టోరీ లైన్
తమన్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ

మైనస్ గా తోచేవి

స్లోగా సాగే నెరేషన్
రొటీన్ మాఫియా ట్రాక్
పండని కామెడీ
హెలెన్ తో లవ్ ఎపిసోడ్
ఒక్క పాటే బాగుండటం
సెకండ్ హాఫ్

చివరి మాట

బాగా వర్షం పడుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఎండ పడితే చిరాకు పడతాం. అలా కాకుండా మంచి వేడిగా ఉన్న వాతావరణంలో వర్షం పడితే ఆస్వాదిస్తాం. అలా కాకుండా మైనస్ డిగ్రీలు ఉండే చోట కాస్త ఎండ తగిలినా ఆనందంతో చిందులు వేస్తాం. అది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. రవితేజ సినిమాలు కూడా అంతే. ఏవి ఏ మోతాదులో ఉండాలో దాని ప్రకారమే ఉండి వాటిని కొలతల ప్రకారం సరిగ్గా చూపించగలిగితేనే మాస్ మహారాజా ఎనర్జీని స్క్రీన్ మీద ఎంజాయ్ చేయగలం. అలా కాకుండా ఏది అటు ఇటు అయినా అసలుకే మోసం వస్తుంది. డిస్కోరాజాలో జరిగింది ఇదే. మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నప్పటికీ దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయడంలో జరిగిన తడబాటులో వల్ల ఆఖరికి ఇందులో ఏముందనే ప్రశ్న ప్రేక్షకుడి మదిలో తలెత్తుతుంది. మెనూ కొత్తది కానీ వంటకాలు పాతవే తరహాలో ఉంది డిస్కోరాజా వ్యవహారం. కానీ ఏవీ రుచిగా లేకపోవడం విచారకరం.

ఒక్క మాటలో చెప్పాలంటే

డిస్కో రాజా - ట్రాక్ తప్పిన మె(రె)ట్రో ట్రైన్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp