చూసీ చూడంగానే రివ్యూ

By Ravindra Siraj Jan. 31, 2020, 08:17 pm IST
చూసీ చూడంగానే రివ్యూ

సింపుల్ ఎమోషన్స్ ఉన్న కథలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసే నిర్మాత రాజ్ కందుకూరి తన అబ్బాయి శివని హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమా చూసి చూడంగానే. ప్రమోషన్ జరుగుతున్న విధానాన్ని బట్టి ఇదో రామ్ కామ్ ఎంటర్ టైనర్ అనే ఇంప్రెషన్ వచ్చేసింది కాబట్టి దానికి తగ్గట్టే యూత్ దీని పట్ల బాగానే ఆసక్తి చూపించారు. చాలా రోజుల తర్వాత లేడీ డైరెక్టర్ తీసిన మూవీగా కూడా చూసి చూడంగానే ప్రత్యేకత సంతరించుకుంది. మరి శేష సింధూ రావు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ సినిమాని రూపొందించారా లేదా రివ్యూలో చూద్దాం

కథ

సిద్ధూ(శివ కందుకూరి)కాలేజీకి వెళ్లే కుర్రాడు. తల్లితండ్రులతో(పవిత్ర లోకేష్-అనీష్ కురువిల్లా)పెద్దగా బాండింగ్ ఉండదు చదువులో వీక్ గా ఉన్నందుకు బలవంతంగా మేనేజ్ మెంట్ కోటా కింద బిటెక్ లో జాయిన్ చేయిస్తారు. తన క్లాస్ మెట్ ఐశ్యర్య(మాళవిక)ని ప్రేమిస్తాడు శివ. కొన్నాళ్ళు బాగానే కలిసి తిరిగినా ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఓ మూడేళ్ళ తర్వాత పెళ్ళిళ్ళ ఫోటోగ్రాఫర్ గా మారిన శివ జీవితంలోకి వెడ్డింగ్ డ్రమ్మర్ శృతి(వర్ష)ప్రవేశిస్తుంది. కొత్త ప్రేమకథ మొదలువుతుంది. అంతా ఓకే అనుకుంటున్న టైంలో శివ శృతిల మధ్య కొన్ని సంఘటనల వల్ల విడిపోయే పరిస్థితి వస్తుంది. ఈలోగా వర్షకు వేరొకరితో ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అవుతుంది. మరి వీళ్ళిద్దరూ తమ గ్యాప్ ని ఎలా పూడ్చుకుని ఒక్కటయ్యారు అనేదే బాలన్స్ కథ

ఎలా చేశారు

శివ మొదటి సినిమాతో జస్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాడు. డెబ్యూ కాబట్టి ఎక్కువ రంధ్రాన్వేషణ చేయకుండా చూస్తే మున్ముందు మంచి హీరోగా తయారయ్యే మెటీరియల్ ఇతనిలో ఉంది. కాకపోతే ఈ చూసి చూడంగానే ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఇది మరీ కొత్తదనం లేని కథ కావడంతో ఎక్కువ పెర్ఫర్మ్ చేయడానికి స్కోప్ లేకపోయింది. ఉన్నంతలో తల్లితో ఉన్న ఎమోషనల్ సీన్స్ లో, కాలేజీ సన్నివేశాల్లో కొంతమేర బాగానే చేశాడు కానీ అబ్బా ఏం కుర్రాడు అనిపించేంత సీన్ ఇందులో లేదు. ప్రేమకథలతో పాటు కాస్త డిఫరెంట్ జానర్స్ ను ట్రై చేస్తే కెరీర్ ను చక్కగా మలుచుకోవచ్చు

హీరోయిన్లలో ప్రధాన పాత్ర పోషించిన వర్ష బొల్లమను షో స్టీలర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తనకు మంచి అవకాశాలు దక్కాయి. అన్నింటిని వాడుకుంది కూడా. సానబెడితే టాలెంటెడ్ యాక్ట్రెస్ గా మారే ఛాన్స్ చాలా ఉంది. మాళవిక సతీషన్ లుక్స్ పరంగా బాగుంది కానీ మరీ ఎక్కువ స్పాన్ దక్కలేదు. పవిత్ర లోకేష్ , అనీష్ కురువిల్లాలవి అరిగిపోయిన పేరెంట్స్ పాత్రలు. వాళ్ళూ దానికి తగ్గట్టే చేసుకుంటూ పోయారు అంతే. కాకపోతే యాక్టింగ్ పరంగా పవిత్ర డామినేషన్ బాగా సాగింది. కొంతలో కొంత కమెడియన్ గా చేసిన వెంకటేష్ కాకమాను నవ్విస్తాడు. ఇతగాడు లేకపోతే ఈ స్క్రిప్ట్ ఇంకా నీరసంగా నడిచేది. అవసరాల శ్రీనివాస్ ని అవసరం లేకపోయినా ఇరికించారు కాబట్టి ఆయనా ఇరుగ్గానే నటించి వెళ్ళిపోయాడు

ఎలా తీశారు

సాధారణంగా ప్రేమకథల్లో ఎక్కువ నవ్యత ఆశించకూడదు. ఎందుకంటే అవన్నీ సింపుల్ పాయింట్ మీద నడిచిపోతాయి. ఒక్క చిన్న మలుపో లేక ఏదో ఒక పాత్రకు సంబంధించి కీలకమైన ట్విస్టో పెడితే చాలు ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయిపోతారు. కానీ దానికి సపోర్ట్ గా బలమైన ఎంటర్ టైన్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడెప్పుడో వచ్చిన బొమ్మరిల్లు ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపించడానికి కారణం అదే. హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్లు చాలా బలంగా ఉంటాయి కాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ చూసి చూడంగానేలో అలాంటి ఫీల్ సగం కాదు కదా పావు వంతు కూడా దక్కదు. దర్శకురాలు శేష్ సింధూరావు మరీ అవుట్ డేటెడ్ ప్లాట్ తీసుకున్నారనిపిస్తే అది చూస్తున్న ప్రేక్షకుడి తప్పు కాదు. ఎక్కడిదాకో ఎందుకు రాజ్ కందుకూరి గత చిత్రం మెంటల్ మాదిలో దీనికే చాలా పోలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా లవ్ థ్రెడ్ విషయంలో. యూత్ లవ్ స్టోరీ అంటే ఒక బ్రేక్ అప్ ఇంకో హీరోయిన్ తో ప్యాక్ అప్ అనే ఫార్ములా నుంచి బయటికి వస్తే ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో మంచి కథలను రాసుకోవచ్చు. లేదు గిరిగీసుకుని ఇదే సర్కిల్ ఉంటూ ఆలోచిస్తామంటేనే అసలు చిక్కు

సింపుల్ లైన్ తో కథను అనుకున్నప్పుడు దానికి దన్నుగా నిలిచే వినోదాన్ని పండించాలి. అది హీరో పక్కన ఫ్రెండ్ మీద ఆధారపడితే సరిపోదు. ప్రధాన పాత్రల మధ్య కూడా జరగాలి. అది ప్రేమ కావొచ్చు అల్లరి కావొచ్చు ఇంకోటి కావొచ్చు భావోద్వేగం ఏదైనా చూస్తున్నంత సేపు విసుగు రాకుండా ఉంటే చాలు. ఇలాంటి వాటిలో ఎంత సేపు ఎమోషన్స్ మీద తప్ప యాక్షన్ మీద ఆధారపడలేం కాబట్టి దానికి అనుగుణంగానే ట్రీట్మెంట్ ఉండాలి. ఒక అమ్మాయితో హీరోకు బ్రేకప్ అయ్యిందంటే అసలు హీరోయిన్ తో ఇంకో ట్రాక్ ఉంటుందని ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేస్తాడు. ఆ ఫీలింగ్ ని వీలైనంత త్వరగా పోగొట్టాలి అంటే వాళ్లిద్దరి మధ్య బాండింగ్ మంచి ఇంటెన్స్ తో ఉండాలి. కానీ చూసి చూడంగానేలో ఈ గ్రాఫ్ ఒకసారి పైకి లేస్తే ఐదు సార్లు కిందపడుతుంది. దీంతో కోలుకోవడానికి పట్టే టైం కన్నా పడిపోవడానికి తీసుకునే సమయమే ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వర్ష ట్రాక్ వల్ల ఓ మాదిరిగా సెకండ్ హాఫ్ నడిచింది కానీ లేదంటే చూసి చూడంగానే పూర్తిగా చూడాల్సిన అవసరం లేకపోయేది

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరొకటి ఉంది. ఇపుడు వెబ్ సిరీస్ ల పేరుతో చాలా రిచ్ కంటెంట్ అతి తక్కువ ధరతో ప్రేక్షకులు ఇళ్లలోనే చూస్తున్నారు. అలాంటిది వందలు ఖర్చు పెట్టుకుని థియేటర్ దాకా రావాలంటే దర్శక నిర్మాతలు తమ సినిమా ద్వారా చాలా సాలిడ్ రీజన్ చూపించాలి . అంతే తప్ప బరువు తక్కువగా ఉండే ఇలాంటి రొటీన్ లవ్ స్టోరీస్ తో డిజిటల్ హక్కుల రూపంలో ఆదాయం తెచ్చుకోవచ్చేమో కానీ హాళ్ల దగ్గర జనాన్ని రప్పించలేరు. పోనీ యువతైనా ఇలాంటి ప్రతి సినిమాను ఆదరిస్తున్నారా అంటే అదీ లేదు. వాళ్ళ డిమాండ్ కూడా కంటెంట్ గురించే. చూసి చూడంగానే బ్యాడ్ ఫిలిం అయితే కాదు. కానీ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోరుకునేంత విషయం లేకపోవడంతో ఇంతకు ముందే వాడేసిన ప్రేమ కథ చూసిన ఫీలింగ్ కలుగుతుందే తప్ప ఇంకేదీ ఉండదు

టీమ్ సంగతేంటి

గోపి సుందర్ ని సంగీతం కోసం తీసుకుని టీమ్ మంచి పనే చేసింది. మరీ గొప్ప అవుట్ ఫుట్ అని కాదు కానీ రెండు మంచి మెలోడీస్ తో మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటాడు. నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉంది. నిన్ను కోరి, గీత గోవిందం స్థాయిలో ఆశించకుండా చూస్తే గోపి సుందర్ ఎక్కువ నిరాశపరచలేదనే చెప్పాలి. వేదరామన్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ని ఆహ్లాదకరంగా చూపించారు. బడ్జెట్ పరిమితులను దాటుకుని క్వాలిటీ స్క్రీన్ మీద కనిపించిందంటే కెమెరా వర్క్ కారణమని చెప్పొచ్చు. రవి గిరజాల ఎడిటింగ్ రెండు గంటల లోపే ఫైనల్ వెర్షన్ ని లాక్ చేసినా ల్యాగ్ అనిపించిందంటే అది ముమ్మాటికీ రైటింగ్ లోపమే. రాజ్ కందుకూరి ప్రొడక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. సింపుల్ సెటప్ కాబట్టి బడ్జెట్ వర్రీ అయ్యేంత ఏమి లేదు ఇందులో

ప్లస్గాఅనిపించేవి

హీరోయిన్ వర్ష
ఓ రెండు పాటలు
కెమెరా పనితనం

మైనస్గాతోచేవి

కొత్తదనం లేని కథ
స్క్రీన్ ప్లే ల్యాగ్
పాత్రలు తక్కువగా ఉండటం
అంతంత మాత్రం కామెడీ

చివరిమాట

అన్ని ప్రేమ కథలు కంచికి చేరవు. కొన్ని మిడిల్ డ్రాప్ అయిపోయి ఎక్కడికో వెళ్లిపోతాయి. మరికొన్ని ప్రయాణం చేయలేక తిరిగి మొదలుపెట్టిన చోటికే వెళ్లిపోతాయి. చూసి చూడంగానే రెండో క్యాటగిరీ. కొంతవరకు సాఫీగా సాగినా పూర్తి స్థాయిలో మెప్పించడంలో దర్శకురాలి తడబాటు వల్ల మంచి కాఫీలా ఉంటుందనుకున్న సినిమా కాస్తా కాచి వడబోసిన వేడి నీటిలా కొంచెం ఉపశమనం ఇస్తుంది అంతే. వేడి తగిలితే చాలు కాఫీ అయితే ఏంటి హాట్ వాటర్ అయితే ఏంటి అనుకుంటే చూసి చూడంగానే మీ టేస్ట్ కి తగ్గట్టే ఉంటుంది. లేదు మా అంచనాలు మాకుంటాయి అనుకుంటే కాస్త ఆలోచించుకుని వెళ్ళాలి

ఒక్కమాటలో

చూసి చూడంగానే - పాత సీసాలో పాత ప్రేమ
 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp