English

చావు కబురు చల్లగా రివ్యూ

By Ravindra Siraj Mar. 19, 2021, 01:00 pm IST
చావు కబురు చల్లగా రివ్యూ

మొదటి సినిమా ఆరెక్స్ 100తోనే బ్లాక్ బస్టర్ అందుకుని యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయం ఏదీ దక్కకపోయినా అవకాశాలకు లోటు లేకుండా పోయింది. అందులోనూ మంచి బ్యానర్లు, కాంబోలు సెట్ చేసుకుంటున్న ఇతనికి చావు కబురు చల్లగాతో గీతా కాంపౌండ్ లోకి ప్రవేశించే అవకాశం దక్కింది. భారీ హైప్ లేకపోయినా ఒక ప్లానింగ్ ప్రకారం టీమ్ చేసిన ప్రమోషన్ ప్లస్ పబ్లిసిటీ ఇవాళ్టి మూడు సినిమాల పోటీలో దీనికే కాస్త ఎక్కువ బజ్ వచ్చేలా చేసింది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చావు కబురు చల్లగా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

వైజాగ్ లో ఉండే బస్తీ బాలరాజు(కార్తికేయ)శవాలను మోసుకెళ్లే వాహనం డ్రైవర్. రోజు స్మశానానికి వెళ్లి వెళ్లి ఇతనికి చావు పుట్టుకల మీద పెద్ద అభిప్రాయమంటూ ఉండదు. ఓసారి అంతక్రియల సమయంలో భర్త చనిపోయిన విధవ మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి మొదటి చూపులోనే ప్రేమించేసి వెంటపడతాడు. మెటర్నిటీ వార్డులో నర్సుగా పనిచేసే ఆమెకు ఇదంతా గిట్టదు. వ్యవహారం పోలీసుల దాకా వెళ్లినా బాలరాజు ఊరుకోడు. మల్లికను ఎలాగైనా ఒప్పించేందుకు సిద్ధపడతాడు. ఈ క్రమంలోనే తన తల్లి గంగమ్మ(ఆమని)కు సంబంధించిన ఒక షాకింగ్ ట్విస్ట్ బాలరాజుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరమీదే చూడాలి

నటీనటులు

డెబ్యూ తర్వాత అంత స్థాయిలో మళ్ళీ పెర్ఫార్మ్ చేసే అవకాశం కార్తికేయకు దొరకలేదు. గుణ 369, 90ఎంఎల్ లాంటి వాటిలో కొంత దొరికినప్పటికీ వాటి ఫలితాల వల్ల ఇతని టాలెంట్ మరోసారి ఋజువు చేసుకునే ఛాన్స్ దక్కలేదు. చావు కబురు చల్లగాలో మాస్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యే పాత్రలో బాలరాజుగా కార్తికేయ తన బెస్ట్ ఇచ్చేశాడు. ఈ క్యారెక్టర్ కు తను సూట్ అవుతాడా లేదా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ మంచి ఈజ్ తో ఒదిగిపోయాడు. లావణ్య వెంటపడే సీన్స్ లో ఎంత అల్లరిగా కనిపిస్తాడో సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అంతే బాగా నచ్చేస్తాడు

లావణ్య త్రిపాఠి విధవ మల్లికకు పర్ఫెక్ట్ ఛాయస్. లుక్స్ పరంగా తనను డీ గ్లామరస్ గా చూపించడంతో పాటు అవుట్ ఫుట్ చక్కగా రాబట్టుకున్నాడు దర్శకుడు. పెదాలను పూర్తిగా కదలించకుండా వాటిని చాలా పొదుపుగా వాడే లావణ్యకు ఇందులో పాత్ర ఆ మ్యానరిజంకు సరిగ్గా సరిపోయింది. ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్న ఆమనికి చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ క్యారెక్టర్ దొరికింది. ఆవిడా గుర్తుండిపోయేలా తనలో అసలు నటిని బయటికి తీశారు. మురళీశర్మ, ఆచంట మహేష్, శ్రీకాంత్ అయ్యంగర్, భద్రం, రజిత, భరణి తదితరులు తమ పరిధి మేరకు చేసుకుంటూ పోయారు

డైరెక్టర్ అండ్ టీమ్

కథలో నవ్యత అంటే ఇంతకు ముందు రాని పాయింట్ రాసుకోవడం ఒక్కటే కాదు, దాన్ని ప్రేక్షకులను మెప్పించేలా తుదికంటా తీయడం అనే ప్రాధమిక సూత్రాన్ని దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి సీరియస్ గా తీసుకున్నట్టు లేడు. ఓ విధవని ప్రేమించడం అనే లైన్ ఆసక్తి రేపేదిగా ఉన్నప్పటికీ దానికి అనువైన మంచి ట్రీట్మెంట్ ని సెట్ చేసుకోవడంలో ఇతను పడిన తడబాటు చివరికి నిరాశ కలిగిస్తుంది. అసలు ట్విస్ట్ ని కాసేపు పక్కనపెడితే వద్దంటున్నా ఛీ కొడుతున్నా హీరోయిన్ వెంటే హీరో పడుతూ విసిగిస్తూ ఇంటర్వెల్ కు ముందు నన్ను కాదని చెప్పడానికి ఒక కారణం చెప్పు అనే దాకా అంతా పరమ రొటీన్ గా సాగుతుంది.

కౌశిక్ ఆలోచన మంచిదే. స్త్రీలు తమ జీవిత భాగస్వామ్యులు దూరం కావడం వల్లనో లేదా వాళ్ళు మంచాన పడటం మూలనో విలువైన జీవితాన్ని ఎందుకు కోల్పోవాలి అనే అంశాన్ని వినోదాత్మకంగా ఆలోచింపజేసే విధంగా చెప్పాలనుకున్నాడు. కానీ ఎంతసేపూ హీరో వెర్షన్ లోనే ఆలోచిస్తూ తన వైపు ప్రేమలో ఎంత నిజాయితి ఉందో చెప్పాలనుకునే క్రమంలో విపరీతమైన సాగతీతతో స్క్రీన్ ప్లేని నడిపించాడు. సెకండ్ హాఫ్ కు వచ్చేటప్పటికీ మల్లిక కుటుంబంతో పాటు మనకూ బాలరాజు మీద సానుభూతి బదులు చిరాకు కలుగుతుంది. పదే పదే విసిగించి సహనానికి పరీక్ష పెడతాడు.

మన వివాహ వ్యవస్థ ఎంత బలమైనదైనప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. సాంఘికంగా కట్టుబాట్లు ఉన్నాయి. మాడ్రనైజేషన్ పేరుతో యువత ఎన్ని వెర్రి వేషాలు వేస్తున్నా పద్దతుల మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టే కొన్ని విలువలనైనా కాపాడుకుంటూ వస్తున్నాం. బాలరాజు తల్లి గంగమ్మ ట్రాక్ కు సంబంధించి కౌశిక్ పెట్టిన మలుపు వినడానికి బాగానే ఉన్నప్పటికీ సగటు ఫ్యామిలీ ఆడియన్స్ దాన్ని జీర్ణించుకోలేని విధంగా చూపించడం మైనస్సే. దాని బదులు ఆవిడ భర్తను అదే అనారోగ్యంతో చంపేసినా కొంత కన్విన్సింగ్ గా ఉండేది. ఇది డాక్యుమెంటరీ కాదు సినిమా కాబట్టి కొంత ఫార్ములా కోటింగ్ అవసరమే.

ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా టైం పాస్ చేయించిన కౌశిక్ కు సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి పెద్దగా మ్యాటర్ లేకపోయింది. దీంతో చాలా సులువుగా మల్లిక బాలరాజు ప్రేమను అర్థం చేసుకునే విధంగా ఇరికించిన ట్రాకులు మరీ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. దానికి తోడు రంగస్థలం స్టైల్ లో బాలరాజు తల్లి చావు ఎపిసోడ్ ని సెట్ చేయడం సింక్ అవ్వలేదు. నిజానికి హీరో పాత్ర కేవలం శవాలను తీసుకెళ్లే వాహనం డ్రైవర్ మాత్రమే. కానీ దర్శకుడు అతని క్యారెక్టరైజేషన్ ని శివపుత్రుడు, నేనే దేవుణ్ణి రేంజ్ లో కాటికాపరి టైపు లో పదే పదే వేదాంతం చెప్పించడం రెండో సగంలో చాలా ఓవర్ అయ్యింది.

మన నిజ జీవితంలో అన్ని పాత్రలు హీరో క్యారెక్టర్లుగా చూపించడానికి పనికిరావు. అలా అయితే కొన్ని వందల వృత్తులను ఆధారంగా చేసుకుని ఎన్నో అల్లుకోవచ్చు. కౌశిక్ ను స్టోరీ రాసుకున్నప్పుడు శవాల వాహనం డ్రైవర్ కాన్సెప్ట్ ఎగ్జైట్ చేసి ఉండొచ్చు. కానీ ఆ ప్రొఫెషన్ పరంగా బాలరాజును కాస్త డబ్బున్న చదువుకున్న కుటుంబంలోని మల్లిక ఏ కోణంలో ఇష్టపడుతుందన్న ప్రాక్టికల్ సెన్స్ మీద ఎక్కువ వర్క్ చేయలేదనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ఏమంత ఎఫెక్టివ్ గా అనిపించవు. రైటర్ గా డైరెక్టర్ గా టేకింగ్ పరంగా మంచి టాలెంట్ ఉన్న కౌశిక్ కథలో కాంఫ్లిక్ట్ మీద ఇంకా బలంగా వర్క్ చేసి ఉంటే బాగుండేది

జేక్స్ బెజోయ్ సంగీతం కథకు తగ్గట్టు సాగింది. రెండు బాగున్నాయి కానీ మిగిలినవి అవసరం లేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో చక్కని పనితనం చూపించారు. కరం చావ్లా-సునీల్ రెడ్డి ఛాయాగ్రహణం తక్కువ బడ్జెట్ సినిమా మంచి క్వాలిటీలో కనిపించేందుకు దోహదపడింది. టెక్నికల్ గా ఇందులో మరీ ఛాలెంజింగ్ అనిపించే ఎపిసోడ్స్ ఏమీ లేవు కానీ పనితనం చాలా నీట్ గా ఉంది. సత్య ఎడిటింగ్ సెకండ్ హాఫ్ మీద కొంత ఎక్కువ ఫోకస్ పెట్టుండాల్సింది. బన్నీ వాస్ నిర్మాణ విలువలు ఓకే. రిస్క్ లేని ఖర్చు కాబట్టి తెలివిగా వ్యవహరించి ఎక్కువ డిమాండ్ చేయని సబ్జెక్టుని ఎంచుకున్నారు

ప్లస్ గా అనిపించేవి

కార్తికేయ పెర్ఫార్మన్స్
స్టోరీ మెయిన్ పాయింట్
ఆమని నటన
సంగీతం

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
హీరో లవ్ సీన్లు
సాగతీత కథనం
రిజిస్టర్ కానీ ఎమోషన్లు

కంక్లూజన్

చావు పుట్టుకలకు సంబంధించిన రెండు విభిన్నమైన పాత్రలను బాలరాజు మల్లికల ప్రేమకథ రూపంలో ఏదో కొత్తగా చెప్పాలనుకున్న దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఇందులో కొంత వరకు నవ్యత చూపించగలిగాడు కానీ దీన్ని రంజింపజేసేలా ప్రెజెంట్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ఫలితంగా ఒకదశ వరకు పర్వాలేదు అనిపించినా చావు కబురు చల్లగా ఫైనల్ గా వచ్చేప్పటికి చప్పగా మారిపోతూ అంతకంటే ఎక్కువగా సందేశాలతో సహనానికి పరీక్ష పెడుతూ ఇంతేనా అని ఉసూరుమనిపిస్తుంది. డ్రామా ఎమోషన్ రెండూ బ్యాలన్స్ అయినప్పుడే ఇలాంటి విభిన్న ప్రేమకథలు అలరిస్తాయి. అలా కాకుండా వీటిలో ఏ ఒక్కటి డామినేట్ చేసినా అనుకున్న ఫలితం దక్కకుండా పోతుంది. ఇందులో జరిగింది అదే

ఒక్కమాటలో - ప్రేమ కబురు చప్పగా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates