భీష్మ రివ్యూ

By Ravindra Siraj Feb. 21, 2020, 01:21 pm IST
భీష్మ రివ్యూ

యూత్ లో ఫాలోయింగ్ ఉన్న నితిన్ గత కొంత కాలంగా వరస పరాజయాలతో ఏకంగా ఏడాది పైగా గ్యాప్ తీసుకుని మరీ చేసిన సినిమా భీష్మ. టైటిల్ మొదలుకునిప్రమోషన్ దాకా మంచి ఆసక్తి రేపిన ఈ సినిమా వసూళ్ళ పరంగా సంక్రాంతి తర్వాత తగ్గిన జోష్ ని తిరిగి తీసుకొస్తుందన్న అంచనాలో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. ఛలోతో మొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ కుడుముల దర్శకుడు కావడం, టాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న రష్మిక మందన్న హీరొయిన్ గా నటించడం లాంటి కారణాలు హైప్ పెరగడానికి ఉపయోగపడ్డాయి. మరి నితిన్ కు లాస్ట్ బ్యాచిలర్ మూవీగా వస్తున్న భీష్మ అంచనాలకు తగ్గట్టుగా ఉండి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడా లేదా రివ్యూలో చూద్దాం పదండి

ఇంతకీ కథేంటి

జీవితాన్ని సరదాగా గడుపుతూ ఏ అమ్మాయి తన ప్రేమలో పడలేదని బాధపడే సగటు యువకుడు భీష్మ(నితిన్). ఓ సందర్భంలో ఎసిపి దేవా(సంపత్ రాజ్) కూతురు చైత్ర(రశ్మిక మందన్న)తో పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ దేవా దీనికి ఒప్పుకోడు. ఈలోగా భీష్మకు సంబంధించి ఓ షాకింగ్ నిజం అందరికి తెలుస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో పోటీదారులుగా ఉన్న భీష్మ ఆర్గానిక్స్ ఎండి(అనంత్ నాగ్), ఫీల్డ్ సైన్స్ కంపెనీ ఛైర్మెన్ రాఘవన్(జిస్సు సేన్ గుప్తా)కు మధ్యకు జరుగుతున్న కార్పొరేట్ వార్ లోకి భీష్మ ప్రవేశిస్తాడు. అసలు భీష్మ ఎవరు, అతని జీవితంలో ఎందుకు అనూహ్యమైన పరిస్థితులు ఎదురయ్యాయి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాలి.

ఎలా చేశారు

నితిన్ కు ఇలాంటి పాత్రలు టైలర్ మేడ్. గతంలో ఎన్నడూ చేయనిది కాదు కాబట్టి అలా ఈజ్ తో చేసుకుంటూ పోయాడు. కాకపోతే తన ఇమేజ్ కు మించి దర్శకుడు యాక్షన్ ఎపిసోడ్లు, ఛాలెంజ్ చేసే సీన్లు పెట్టినప్పటికీ వాటిని తన అనుభవంతో నెట్టుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేశాడు. అయితే వీటికన్నా కామెడీ టైమింగ్ తోనే ఎక్కువగా ఆకట్టుకున్నాడు నితిన్. ముఖ్యంగా వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, నరేష్ కాంబినేషన్ ఉన్న సీన్లలో బాగా నవ్వించాడు. అనంత్ నాగ్ తో ఉన్న ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగానే నటించాడు. అయితే ఇంత సీనియారిటీ ఉన్న నితిన్ ఇప్పటికీ బరువైన సన్నివేశాలకు కొంత ఇబ్బంది పడటం పడటం మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. మొత్తానికి గత మూడు సినిమాలతో పోలిస్తే నితిన్ భీష్మని మంచి ఛాయస్ గా ఎంచుకున్నాడు

హీరొయిన్ రష్మిక మందన్నకు గీత గోవిందం తర్వాత ఆ స్థాయి పాత్ర తెలుగులో దక్కలేదు కాని భీష్మను దాని తర్వాత స్థానంలో వేయొచ్చు. పర్ఫార్మెన్స్ కు స్కోప్ దక్కింది. కోపంతో ఇచ్చే ఎక్స్ ప్రెషన్లలో బాగా చేసే రష్మికకు ఇందులో కాస్త గ్లామర్ షోతో సహా అన్ని రకాల వేరియేషన్స్ దక్కాయి. సుమారు ముప్పై ఏళ్ళ తర్వాత కన్నడ వెటరన్ యాక్టర్ అనంత్ నాగ్ ని తెలుగు తెరపై చూడటం ఫ్రెష్ గా ఉంది. ఆయనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోయారు.

అశ్వద్ధామలో మెప్పించిన జిస్సు సేన్ గుప్తా ఇందులో కొంత తేలిపోయాడు. రొటీన్ విలనిజంతో పాటు ఎక్స్ ప్రెషన్స్ కన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ టాలెంట్ మీద ఇలాంటి వాళ్ళు ఆధారపడుతున్నారనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ది రెగ్యులర్ పాత్రే అయినా నవ్వించాడు. సంపత్ రాజ్ తన శైలికి భిన్నంగా చేసిన ప్రయత్నం పండింది. సీనియర్ నరేష్ పాత్రా బాగుంది. రఘుబాబు, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సత్య, శుభలేఖ సుధాకర్, అజయ్ తదితరులు ఆయా పాత్రలకు తగ్గట్టు ఒదిగిపోయారు

దర్శకుడి గురించి

ఛలోతో తనలో ఎంటర్ టైన్మెంట్ స్పార్క్ రుచి చూపించిన వెంకీ కుడుముల ఈసారి కూడా అదే స్టైల్ లో వెళ్ళిపోయాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే సీరియస్ ఇష్యూ ని జోడించినప్పటికీ తన మార్కు వినోదం ఎక్కడికక్కడ తగ్గకుండా చూసుకోవడం భీష్మను ఎక్కువ బోర్ కొట్టకుండా కాపాడింది. ఇక్కడ బలంగా నిలిచింది అతనిలోని రచయిత. ఇలాంటి కథలో రాత ఏ మాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు కాన్సెప్ట్ తో డిస్కనెక్ట్ అయిపోతారు. స్టార్ హీరోలైతే ఇలాంటి బరువైన పాయింట్లను డీల్ చేయగలరు కానీ నితిన్ లాంటి హీరోతో చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్ చాలా అవసరం.

వెంకీ కుడుముల ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నితిన్ కు ఏదో ఇమేజ్ ఉందన్న తప్పుడు లెక్కలకు పోకుండా ప్రేక్షకుడిని సాధ్యమైనంత సేపు ఎలా నవ్వించాలి అనేదాని మీదే ఫోకస్ పెట్టడం భీష్మకు చాలా ప్లస్ అయ్యింది. కంపెనీల మధ్య ఆధిపత్య పోరుని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఎందరో దర్శకులు చాలా సినిమాలు తీసేశారు. అందుకే భీష్మను జస్ట్ స్టోరీ పరంగా చదివితే దమ్ముతో మొదలుపెట్టి అత్తారింటికి దారేది వరకు ఎన్నో పోలికలు కనిపిస్తాయి.

కానీ అసలు ఆ తలంపే రాకుండా వెంకీ కుడుములు చేసిన మేజిక్ ని మెచ్చుకోవచ్చు. కాకపోతే ఎంత బాగా రాసుకునా కథ సీరియస్ మోడ్ లో వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల అంత ఎమోషన్ అవసరం లేదేమో అనిపిస్తుంది. 30 రోజుల ఛాలెంజ్, హీరోయిన్ కు ఏదో ఒక కంపెనీతో లింక్ ఉండటం, లవ్ ట్రాక్ ఇవన్నీ అన్ని సినిమాల్లో చూసినవే. అయినా కూడా ఫ్రెష్ గా అనిపించాయంటే వెంకీ రైటింగ్ కు అదనపు మార్కులు ఇవ్వొచ్చు. కాకపోతే మహర్షి తరహాలో సెకండ్ హాఫ్ లో రైతుల తరఫున బలమైన మెసేజ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం అంత కన్విన్సింగ్ గా లేదు.

అయినప్పటికీ వెంకీ కుడుముల స్క్రీన్ ప్లే విసుగును తగ్గించేలా జాగ్రత్త పడింది. అంత సీరియస్ ఇష్యూ, అంతకన్నా పవర్ఫుల్ విలన్ ఉన్నప్పుడు అన్నీ హీరోకు అనుకూలంగా జరగడం లాజిక్ కు దూరంగా సాగుతాయి. డిగ్రీ తప్పిన యువకుడు అంత పెద్ద కంపెనీని ఈజీగా నడిపించడం, విలన్ ఇతన్ని నిలువరించలేక నిస్సహాయుడిగా కనిపించడం లాంటి లోపాలు సెకండ్ హాఫ్ లో చాలా కనిపిస్తాయి. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లా వెంకీ కుడుముల భీష్మలో అన్ని చొప్పించాడు కానీ తక్కెడలో కొన్ని మాత్రమే కొలతలకు తగ్గట్టే సరిగ్గా తూగాయి. కాకపోతే తేడా కొట్టివాటిని ఇవి కొంతమేర కవర్ చేయడంతో నష్టం తగ్గింది.

టెక్నికల్ టీమ్

సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ జస్ట్ ఓకే అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఛలో తరహాలో చూసి చూడంగానే రేంజ్ లో అల్టిమేట్ ట్రాక్ ఇవ్వలేదు కానీ ఉన్నంతలో డీసెంట్ ఆల్బమ్ అనే చెప్పొచ్చు. విజువల్ గానూ ఎంగేజింగ్ గా తీయడంతో పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొంతవరకు సింక్ అయ్యింది. కాకపోతే మణిశర్మ వారసుడిగా ఇతన్నుంచి మ్యూజిక్ లవర్స్ చాలా ఆశిస్తున్నారు. వాటిని అందుకునే విధంగా స్వర సాగర్ చాలా కష్టపడాలి. 4 పాటలే ఉండటం నిడివిని కంట్రోల్ చేసింది.

సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ సాధ్యమైనంత ల్యాగ్ లేకుండా చూసుకుంది. పోరాటాలు కొంచెం ఓవర్ ది బోర్డ్ అనిపించినా మాస్ కోసం ఆ మాత్రం తప్పవని చొప్పించినట్టు ఉన్నారు. సితార బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సబ్జెక్ట్ డిమాండ్ కు తగ్గట్టు బాగానే ఖర్చు పెట్టారు.

ప్లస్ గా అనిపించేవి

ఎంటర్ టైన్మెంట్
నితిన్ రష్మిక కెమిస్ట్రీ
వెంకీ కుడుములు టేకింగ్
సినిమాటోగ్రఫీ

మైనస్ గా తోచేవి

పాటలు
సెకండ్ హాఫ్ సాగతీత
కథలో పాయింట్ పాతదే
సింక్ అవ్వని సందేశాలు

చివరిగా చెప్పాలంటే

రెండున్నర గంటల పాటు తనను మెప్పించారా లేదా అనే దాని గురించి తప్ప ఆధునిక ప్రేక్షకుడు సినిమా లోతుల్లోకి వెళ్లేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఆ రకంగా చూస్తే ఈమధ్య కాలంలో వచ్చి తీవ్రంగా నిరాశపరిచిన క్రేజీ సినిమాల కంటే భీష్మ ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపిస్తాడు. గుప్పెడు నవ్వులు, చిటికెడు సీరియస్ అంశాలు, పిడికెడు ప్రేమ వెరసి భీష్మ మరీ స్టేట్ ఫస్ట్ రాలేదు కానీ జిల్లా వరకు బెస్ట్ అనిపించేలా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఏదేదో ఊహించుకుని ఎక్కువ ఆశిస్తే ఇంతేనా అనిపిస్తాడు కానీ సగటు ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం భీష్మ పూర్తిగా ఫెయిలవ్వలేదు

ఒక్క మాటలో

భీష్మ - వినోదం సందేశం ఫిఫ్టీ ఫిఫ్టీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp