అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు రివ్యూ

By iDreamPost.com Dec. 12, 2019, 05:39 pm IST
అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు రివ్యూ

వ‌ర్మ‌రాజ్యంలో ప్రేక్ష‌క బిడ్డ‌లు

రాంగోపాల్‌వ‌ర్మ‌కి పిచ్చి అంటారుగానీ, నిజానికి అత‌నికేం పిచ్చిలేదు. ప్రేక్ష‌కుల‌ను పిచ్చోళ్ల‌ను చేయ‌డంలో ఎక్స్‌ఫ‌ర్ట్‌. లేక‌పోతే జ‌నాలు సినిమాకి వెళ్ల‌డానికే బ‌ద్ద‌కిస్తున్న ఈ రోజుల్లో , గురువారం ఉద‌యాన్నే హాలు దాదాపు నిండిందంటే వ‌ర్మ గొప్పత‌న‌మే. మ‌నం గుర్తు ప‌ట్ట‌డం లేదు కానీ, చాలా ఏళ్లుగా ఆయ‌న ఒక‌టే సినిమా తీస్తున్నాడు. కొన్ని రియల్ లైఫ్ పాత్ర‌లు తీసుకుని, త‌న ఆవు వ్యాసాన్ని జోడించి హైఫ్‌ క్రియేట్ చేసి ఓపెనింగ్స్ తెచ్చుకుంటాడు.

"అమ్మ‌రాజ్యం"లో సినిమా కూడా (కాసేపు డాక్యుమెంట‌రీలా కూడా ఉంటుంది) వ‌ర్మ త‌న స్టైల్ చూపించాడు. ఒక సినిమాగా చూడాల‌నుకుంటే క‌ష్ట‌మే. అయితే దీని ప్రేక్ష‌కులు కూడా స‌ప‌రేటే. రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న వాళ్ల‌కి ఇది న‌చ్చే అవ‌కాశం ఉంది.

అయితే వ‌ర్మ ల‌క్ష్యం కూడా ఇది సినిమాగా న‌చ్చాల‌ని కాదు. చంద్ర‌బాబుని విల‌న్‌గా చూపించ‌డం, ప‌వ‌న్‌, లోకేశ్, కేఏ పాల్‌ల‌ని ఎగ‌తాళి చేయ‌డ‌మే ల‌క్ష్యం కాబ‌ట్టి అది నూరు శాతం నెర‌వేరిన‌ట్టే.

ఈ సినిమాలో వ‌ర్మ ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడంటే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం తెలుగుదేశం వ‌ర్గాలు (ముఖ్యంగా క‌మ్మ‌వాళ్లు) జీర్ణించుకోలేరు కాబ‌ట్టి , జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని తెలుగుదేశంలోని రౌడీ శ‌క్తులు , జ‌గ‌న్ పార్టీలోని ఒక‌రిద్ద‌రు క‌లిసి అరాచ‌కాన్ని సృష్టిస్తారు. బెజ‌వాడ‌లో హ‌త్య‌లు జ‌రుగుతాయి. ఇదంతా క‌డ‌ప ముఠాల నెత్తిన తోసి చంద్ర‌బాబు ధ‌ర్నాలు చేస్తాడు. ఇదే అద‌నుగా భావించి మోదీ రాష్ర్ట‌ప‌తి పాల‌న విధిస్తాడు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌స్తాయి. ఈ సారి జ‌గ‌న్ 174 సీట్ల‌తో గెలుస్తాడు. బాబు ఒక్క త‌న సీటుకే ప‌రిమిత‌మ‌వుతాడు. ఇది క‌థ‌లోని ముఖ్యాంశం.

ఈ పాయింట్‌ని సీరియస్‌గా చెబితే బానే ఉండేది. అయితే వ‌ర్మ ఉద్దేశం అది కాదు. రాజ‌కీయ‌మైనా, సిన్మా అయినా, ఇంకేది అయినా జ‌నాల‌కి కావ‌ల్సింది వినోద‌మే అని ఈ సినిమా ముగింపులో వ‌ర్మే స్వ‌యంగా చెబుతాడు. అందుకే సీరియ‌స్ క‌థ‌లో చిత్ర‌విచిత్ర‌మైన కామెడీ సీన్స్ వ‌స్తుంటాయి. బ్ర‌హ్మానందం ఒకేఒక్క డైలాగ్‌తో , అనేక సీన్స్‌లో కేవ‌లం Expressions మాత్ర‌మే ఇస్తూ ఉంటాడు. ఆయ‌న ఇక సినిమాలు మానేస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్ర‌హ్మానందాన్ని చూసి ప్రేక్ష‌కుడు నవ్వాలేకానీ జాలిప‌డ‌కూడ‌దు.

వ‌ర్మ ప్ర‌త్యేక‌త ఏమంటే పాత్ర‌ల‌కి క‌రెక్ట్‌గా మ్యాచ్ అయ్యే వ్య‌క్తుల‌నే ఎంచుకుంటాడు. వారు ఆర్టిస్టులా కాదా అనేది అన‌వ‌స‌రం. ఏదోలా లాగేస్తాడు. ఈ సినిమాలో మ‌న‌కు జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, లోకేశ్, ప‌వ‌న్‌, పాల్ అచ్చం అలాగే క‌నిపిస్తారు. మాట్లాడ‌తారు.

క‌థ ఎన్నిక‌ల‌కు ముందు ప్రారంభ‌మై ఫ‌లితాల త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం (క‌థ‌లో జ‌గ‌న్నాథ‌రెడ్డి), బాబు, లోకేశ్‌ల బాధ‌, ప‌వ‌న్ వైరాగ్యం...ఇలా వాళ్ల‌మీద సెటైర్లు వేస్తూ ప్రారంభ‌మై ద‌య‌నేని ర‌మా హ‌త్య‌తో ఇంట‌ర్వెల్ వ‌స్తుంది. ఈ ర‌మ‌, దేవినేని ఉమ అని అర్థ‌మ‌వుతుంది. నిజానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌ర‌చ‌డానికి దేవినేని ఉమ‌, ఒక‌రి హ‌త్య‌కు ప్లాన్ చేస్తాడు. కానీ అత‌నే హ‌త్య‌కు గుర‌వుతాడు. చివ‌రికి బ్రాహ్మ‌ణిని కూడా వ‌ర్మ వ‌ద‌ల్లేదు. ఉమ హ‌త్య‌ని ఆమె ప్లాన్ చేస్తుంది సినిమాలో. ఈ హ‌త్య‌పై సీబీఐ ఆఫీస‌ర్ల‌గా (క‌త్తి మ‌హేశ్‌, టీవీ9 స్వ‌ప్న‌) వ‌చ్చిన వాళ్లు కేసును ప‌రిష్క‌రిస్తారు. కాసేపు వీళ్లు కామెడీ చేసి ప్రేక్ష‌కుల్ని Confuse చేస్తారు.

అసెంబ్లీ సీన్‌లో స్పీక‌ర్ (ఆలీ) ద్రాక్ష పండ్లు తింటూ , కాసేపు నిద్ర‌పోతూ గుర్ర‌క కూడా పెడ‌తాడు. మ‌న సిస్ట‌మ్‌ను ఎగ‌తాళి చేయ‌డంలో వ‌ర్మ‌కి మార్కులు వేయ‌వ‌చ్చు. ఎందుకంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అప్పుడ‌ప్పుడు జ‌నం మ‌ధ్య‌కి వ‌చ్చి నోటికొచ్చింది మాట్లాడి, తాట తీస్తా అంటూ ఉండ‌డం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ మీద కూడా ప‌వ‌న్ నాలుగైదు స‌న్నివేశాల్లో వ‌చ్చి ఇలాగే తాట తీసి వెళ్తూ ఉంటాడు. ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసిన దృశ్యాల్లో ఇదొక‌టి. ప‌వ‌న్ క‌నిపించిన‌ప్పుడ‌ల్లా ఒక విషాద గీతం వినిపిస్తూ ఉంటుంది. జ‌నం స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోకుండా అప్పుడ‌ప్పుడు హూంక‌రించే ప‌వ‌న్‌కి ఇది చుర‌క‌.

ఇక పాల్ మీద వ‌ర్మ‌కి బాగానే కోపం ఉన్న‌ట్టుంది. ఏకంగా ఆయ‌న హ‌త్య‌కే ప్లాన్ చేశాడు. చ‌చ్చిపోతాడేమోన‌ని ప్రేక్ష‌కులు భ‌య‌ప‌డేలోగా గాయాల‌తో ఆస్ప‌త్రిపాలు చేస్తాడు. బెడ్‌మీద కూడా పాల్ , తాను అన్ని సీట్ల‌కూ పోటీ చేస్తాన‌ని అన‌డం హైలైట్‌.

లోకేశ్ మీద జోకులు థియేట‌ర్లో బాగానే పేలాయి. ప‌ప్పు పాట‌తో పాటు సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ఒక‌టిరెండు జోక్స్‌ని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేశారు. చంద్ర‌బాబు చూపులు, కుట్ర‌లు అన్నీ వ‌ర్మ స్ట‌డీ చేసిన‌ట్టున్నాడు. ఒక సీన్‌లో ఎంద‌రికో వెన్నుపోటు పొడిచిన న‌న్ను ఆ దేవుడే వెన్నుపోటు పొడిచాడు. నా క‌డుపులో పిల్లిని పుట్టిచ్చాడ‌ని బాబు అంటే చ‌ప్ప‌ట్లు ప‌డ్డాయి.

ఇక జ‌గ‌న్ ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల‌కు చేరువైన విధానాల‌పై ఫోక‌స్ పెట్ట‌కుండా , హ‌త్య కేసుని జ‌గ‌న్ ఎదుర్కోవ‌డంపైనే స‌న్నివేశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సినిమా గురించి చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ల‌కి మంట‌గా, జ‌గ‌న్ అభిమానుల‌కి స‌ర‌దాగానూ ఉంటుంది. మ‌ధ్య‌లో వ‌ర్మ మార్క్ రొటీన్ స‌న్నివేశాలు బోర్ కొట్టించినా రాజ‌కీయ ఆస‌క్తి ఉన్న‌వాళ్లు ఓపిక చేసుకుని చూస్తారు.

అయితే బ‌తికి ఉన్న దేవినేని ఉమ‌ను, హ‌త్య చేసిన‌ట్టు (పేరు మార్చినా మ‌న‌కు ఉమ అని తెలిసిపోతుంటుంది) చూపించ‌డం , ఆ హ‌త్య‌ని బ్రాహ్మ‌ణి ప్లాన్ చేయ‌డం, వ‌ర్మ‌కి సెన్సేష‌న్‌గా అనిపించినా ఫిల్మ్ మేక‌ర్‌గా అది బ్యాడ్ టేస్ట్‌.


- Written By GR Maharshi

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates