Adbhutham Movie Review : అద్భుతం రివ్యూ

By Ravindra Siraj Nov. 19, 2021, 02:21 pm IST
Adbhutham Movie Review : అద్భుతం రివ్యూ
Rating : 2.25/5
Main Cast: : Teja Sajja, Shivani Rajasekhar,
Director: : Mallik Ram,
Music: : Rathan,
Producer: : Chandra Sekher Mogula,

ఓ బేబీ, జాంబీ రెడ్డి, ఇష్క్ లతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరైన ఒకప్పటి బాల నటుడు తేజ కొత్త సినిమా అద్భుతం ఇవాళ డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా విడుదలయ్యింది. 2019లో తీసిందయినప్పటికీ పలు కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం కావడంతో డెబ్యూ మూవీ కాస్తా నాలుగో సినిమా అయ్యింది. సుమంత్ తో నరుడా డోనరుడా తీసిన మల్లిక్ రామ్ దీనికి దర్శకుడు. అయితే కథను ప్రశాంత్ వర్మ అందించడం విశేషం. ట్రైలర్ కట్ ఆసక్తి రేపడంతో అంతో ఇంతో దీని మీద అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్ట్ ఓటిటి కావడంతో ఎక్కువ శాతం ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. మరి ఈ అద్భుతం టైటిల్ కు న్యాయం చేకూర్చిందా దానికి ఇంకో దిశలో వెళ్లిందా రివ్యూలో చూద్దాం

కథ

టీవీ రిపోర్టర్ గా పని చేసే సూర్య(తేజ సజ్జ)కు చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేక విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవాలని ఎత్తైన బిల్డింగ్ కి చేరుకుంటాడు. అదే సమయంలో జెర్మనీ వెళ్లేందుకు రాస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పదే పదే ఫెయిలవుతున్న వెన్నెల(శివాని రాజశేఖర్) కూడా సూసైడ్ చేసుకోవాలని ఓ సరస్సు దగ్గరకు వెళ్తుంది. అనుకోకుండా ఒకేసారి ఇద్దరికీ పరస్పరం మెసేజులు వెళ్తాయి. దీంతో తమ ప్రయత్నాన్ని మానుకుని పరిచయం పెంచుకుంటారు. మాటల్లో తాము ఒకే సమయంలో లేమని తెలుసుకుంటారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీళ్ళ ప్రేమకథ చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి

నటీనటులు

తేజ సజ్జకు నటనపరంగా ఇది మొదటి సినిమానే అయినా సూర్య క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. మొహంలో ఇంకా లేలేత టీనేజ్ ఛాయలు ఉండటంతో బరువైన పాత్రలకు సరితూగడేమో అనిపించినా పోను పోను మెచ్యూరిటీ వచ్చే కొద్దీ నటుడిగా పరిణితి చెందడానికి అవకాశం ఉంది. కాకపోతే అది అతను గుర్తించాలి. ఆశ్చర్యకరంగా శివాని రాజశేఖర్ పెర్ఫార్మన్స్ బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూసినందుకు కాబోలు మంచి ఈజ్ తో మెప్పించింది. గొప్ప అందం లేకపోయినా చలాకీతనంతో అభినయించి చాలా ఫ్రేమ్స్ లో జీవితను గుర్తుకుతెస్తుంది. గ్లామర్ క్యారెక్టర్స్ తో కాకుండా ఆవిడలాగే గుర్తింపు తెచ్చుకోవచ్చు.

శివాజీరాజా ఉన్నది కాసేపే అయినా తండ్రి పాత్రలో యథావిధిగా వంకలు లేకుండా నటించేశారు. సత్య ఉన్నన్ని సీన్లు అలా అలా నవ్వించాయి. కృష్ణతేజ ఓకే. దేవి ప్రసాద్ క్రమంగా రొటీనవుతున్నారనిపిస్తోంది. నాన్నమ్మగా తులసి గారు తన అనుభవాన్ని రంగరించారు. ఐడ్రీం అంజలి, చమ్మక్ చంద్రలు కొన్ని సన్నివేశాలలో కనిపిస్తారు. బిగ్ బాస్ అరియనా కొద్ది సెకండ్లకే పరిమితం. ఇతర ఆర్టిస్టులు మరీ గుర్తుపెట్టుకునేలా ఎవరూ లేరు. రెండు పాత్రల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో మిగిలినవాళ్లకు స్కోప్ లేదు

డైరెక్టర్ అండ్ టీమ్

ఒకే ఆలోచన ఇద్దరు దర్శకులకు రావడం అరుదే కానీ ఒకే కాన్సెప్ట్ ని కొరియన్ నుంచో హాలీవుడ్ నుంచో ఒకేసారి తీసుకోవడం మాత్రం కాకతాళీయం. కొద్ది నెలల క్రితం వచ్చిన ప్లేబ్యాక్ సినిమాకి ఇప్పుడీ అద్భుతం థీమ్ కి చాలా దగ్గరి పోలికలు ఉండటం ఈ కారణం వల్లే. ఎక్కడి నుంచి స్ఫూర్తి చెందారనేది పక్కన పెడితే దర్శకుడు మల్లిక్ రామ్ సాధ్యమైనంత మేరకు దీన్ని నీట్ గా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించడం ఒక్కటే మెచ్చుకోదగిన అంశం. ఫస్ట్ హాఫ్ చాలా మటుకు సరదాగా అక్కడక్కడా నవ్విస్తూ పెద్దగా ఇబ్బంది లేకుండా టైం పాస్ చేయిస్తుంది. ఎక్కువ ల్యాగ్ లేకుండా స్ట్రెయిట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతుంది. మరీ బోర్ గా ఉండదు.

అసలు సమస్య సెకండ్ హాఫ్ లో వచ్చింది. ట్విస్ట్ రివీల్ చేశాక రెండు కాలాలకు సంబంధించిన ఆ ఇద్దరి ప్రయాణాన్ని ట్విస్టులతో నడిపించాలని చూసిన మల్లిక్ రామ్ ప్రయత్నం ఆశించినంత ఎగ్జైటింగ్ గా లేకపోవడం కొంత నిరాశ పరుస్తుంది. ఇలాంటి కథల్లో లాజిక్స్ పట్టించుకోకూడదు. నిజమే. కానీ అలా జరగాలంటే ఆడియన్స్ కి ఎలాంటి ఆలోచనలు రానంత అరెస్టింగ్ గా స్క్రీన్ ప్లే ఉండాలి. కానీ రెండో సగంలో ఇది మెల్లగా నడవటమే అద్భుతం స్థాయిని తగ్గించింది. ప్లే బ్యాక్ లో క్రైమ్ ఎలిమెంట్ ని జోడించడంతో థ్రిల్ కి స్కోప్ దక్కింది. అది కూడా సరిగ్గా కుదరక కన్ఫ్యూజన్ డ్రామాగా మారిపోయింది. కానీ ఇందులో ఆ ఛాన్స్ లేదు.

ఎంతసేపు సూర్య వెన్నెల మధ్య లవ్ ట్రాక్, వాళ్ళ మధ్య ఎమోషన్స్ మీద దృష్టి పెట్టిన మల్లిక్ రామ్ అదనంగా ఇంకేవైనా సబ్ ప్లాట్స్, ఇంటర్ లింకింగ్ కి పనికొచ్చే కొత్త పాత్రలను సృష్టించి ఉంటే బాగుండేది. అలా కాకుండా గంటకు పైగా పాస్ట్ ప్రెజెంట్ అంటూ పదే పదే కథను ఒకే చోట తిప్పుతున్న ఫీలింగ్ కలగడంతో వేగం తగ్గిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఎమోషన్ ని హైకి తీసుకెళ్లాలని హై ఇంటెన్స్ డ్రామా నడిపించి చివర్లో సినిమాటిక్ ట్విస్ట్ ఇవ్వడం కూడా అంతగా కనెక్ట్ కాలేదు. ఎంత వర్తమానం భవిష్యత్తులు కలిసి మాట్లాడుకున్నా విధిని మార్చలేమనే సూత్రం చెప్పిన దర్శకుడు దానికి అనుగుణంగా ఉండాల్సిన లాజిక్స్ కొన్ని మిస్ అయ్యారు.

ఇవన్నీ కాసేపు పక్కనపెడితే మల్లిక్ రామ్ లో మంచి టెక్నీషియన్ ఉన్న మాట వాస్తవం. ప్రతి ఫ్రేమ్ నీట్ గా సాగుతుంది. కొన్ని అవసరం లేని సన్నివేశాలు, కృత్రిమంగా అనిపించే పాత్రల స్వభావాలు ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా ఇంకా బాగా రాసుకుని ఉంటే పేరుకి న్యాయం జరిగేది కదా అనిపిస్తుంది. వెన్నెల తండ్రిని కూతురి పెళ్లి విషయంలో మూర్ఖంగా అనిపించే మంకుపట్టుతో చూపించడం, పరీక్ష రాసే టైంలో వెన్నెల ప్రవర్తన కొంచెం ఓవర్ గా అనిపించడం లాంటివి ఎక్కువ కన్విన్సింగ్ గా లేవు. కాకపోతే థియేటర్ కాకుండా ఈ సినిమా ఓటిటి వాచ్ క్యాటగిరిలోకి రావడంతో బ్యాడ్ స్టాంప్ పడే బాధ తప్పించుకుంది

సంగీత దర్శకుడు రధన్ పనితనం బాగుంది. పాటలు ఒక్కటీ గుర్తుండవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా చక్కగా ఇచ్చాడు. విద్యాసాగర్ ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో సాగింది. బడ్జెట్ పరిమితులు ఉన్నా తెరమీద క్వాలిటీ కనిపించడంలో ఈయన పాత్ర చాలా ఉంది. లక్ష్మి భూపాల సంభాషణలు బాగున్నాయి. ఆలా మొదలైంది టైపు కామెడీని అక్కడక్కడా గుర్తుకు తెస్తారు. గ్యారీ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే ల్యాగ్ తగ్గేది. ఇలాంటివి ఎడిటింగ్ చేయడం నిజంగా కష్టమే. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణం గురించి కంప్లయింట్ లేదు. డీసెంట్ బడ్జెట్ ఇచ్చారు

ప్లస్ గా అనిపించేవి

తేజ సజ్జ
శివాని ప్రెజెన్స్
ఛాయాగ్రహణం
ఫస్ట్ హాఫ్

మైనస్ గా తోచేవి

రెండో సగం ల్యాగ్
పాటలు
తెలిసిన కాన్సెప్ట్

కంక్లూజన్

థియేటర్ సినిమా ఓటిటి మూవీ అని ఇప్పుడు బిగ్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ రెండుగా విడిపోయింది కాబట్టి చూసే దృక్పథం, కలిగే అభిప్రాయం కూడా మారుతోంది. ఆ కోణంలో చూస్తే అద్భుతం ఇంట్లోనే వీక్షించే డీసెంట్ క్యాటగిరిలో వేయొచ్చు. అలా కాకుండా ఏవేవో ఊహించుకునో లేదా గతంలో ప్లే బ్యాక్ చూసింటేనో కొంత నిరాశ కలగొచ్చు. ప్రపంచ సినిమా ఓటిటి రూపంలో ముంగిట్లో ముగ్గులు వేస్తున్న తరుణంలో ఇకపై రచయితలు దర్శకులు స్ఫూర్తి చెందే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అద్భుతాలుగా నిలవాల్సిన ఇలాంటి కాన్సెప్ట్ లు మెత్తబడిన అప్పడాలుగా మారతాయి

ఒక్క మాటలో - అంతద్భుతం కాదు

Also Read : Raja Vikramarka Review : రాజా విక్రమార్క రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp