జీవితాన్ని వెతుకుతూ ... సోమశిల జలాల్లో ఒక రోజు

By Vivek Segileti Mar. 27, 2020, 09:10 pm IST
జీవితాన్ని వెతుకుతూ ... సోమశిల జలాల్లో ఒక రోజు

మునక ప్రాంత ఊర్ల, రైతుల పరిస్థితులెలా ఉంటాయో చూడాలని చాలా రోజుల్నుంచి అనుకుంటున్నా గానీ ఎక్కడా కుదరట్లేదు. శ్రీశైలం వెళ్లే అవకాశాలు చాల తక్కువ అదే సోమశిల అయితే పక్కనే ఒక గంట మనది కాదనుకుంటే వెళ్లి చూసి రావొచ్చు. అలా ఎన్నో రోజుల నుండి మనసులో ఉన్న ఆలోచనలు కాస్తా కరోనా దెబ్బకు ఒక రూపుదిద్దుకున్నాయి.

సోమశిల బ్యాక్ వాటర్లో మునిగి తమ అస్థిత్వాన్ని కోల్పోయి పేరుకు మాత్రమే మిగిలున్న బైగ్గారి పల్లె, మలినేటి పట్నం, చెండువాయి చూసి వద్దామని మ్యాపులో వెతికి మళ్లా తోడెవరూ రారులే అని ఎందుకో ఆగిపోయా.

రేపు పొద్దున నాలుగు గంటలకు చేపలకు వెళ్తున్నాం వస్తావా అని రాజా అన్నాడు.
ఎక్కడికి వెళ్లేది?
సోమశిల బ్యాక్ వాటర్.
వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు సరే అన్నాను.


-- ** --
అదేంటో మరి అలారం లేదు ఏమీ లేదు అయినా గానీ కరెక్టుగా నాలుగ్గంటలకల్లా మెలుకువ వచ్చింది. వాళ్లు వీళ్లు అందరం రెడీ అయ్యి బయల్దేరేసరికి టైం నాలుగున్నర్రయ్యింది. మెత్తం నాలుగు బండ్లు. ఎనిమిది మంది మనుషులం.

గాలి చల్లగా తోలుతోంది. బైకు స్పీడు పెరిగేకొద్దీ చలి మరింత ఎక్కువవుతోంది. వెంకట సుబ్బయ్య బైకు తోలుతుంటే నేను వెనకాల కూర్చిని అవీ ఇవీ మాటలు చెబుతూ ముందుకు సాగాము. పది కిలో మీటర్లు పైగా తారురోడ్డు. జామ్ జామ్మని స్పీడుగా వచ్చాము. తర్వాత రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డు. ముందు వెళ్లే బండ్లు ఆ పుల్ల దుమ్ము లేపుకుంటూ పోతుంటే ఆ పౌడర్ మా మొహాలకు అంటుకుంటోంది.

రోడ్డుపై నుంచి అడవి మార్గంలోకి దిగాము. ఆ రాళ్ల బాటల్లో నా సీబీజెడ్ బండి ఎగురుకుంటూ, తొసుకుతూ ముందుకు సాగుతోంది. దానికే గనుక మనసంటూ ఒకటుంటే ఛీ ఈ ముసలి వయసులో ఏందిరా నాకీ ఖర్మ వీని చేతిలో వచ్చి పడ్డా అనుకుంటుంది కాబోలు.

ఆ రాళ్ల బాట వదిలి మరో రోడ్డు మారాల్సి రావడం అది ఇంకా ఘోరంగా ఉండడంతో విష్ణు వాళ్లొచ్చిన కొత్త గిక్సర్ బండిని అక్కడే ఆపి మా దాంట్లో మరియు రాజా దాంట్లో ఇద్దరూ అడ్జస్ట్ అయ్యారు. ముగ్గురి తాలూకు బరువుకు బండి మూలిగే శబ్ధాలు వినబడుతూనే ఉన్నాయి.

సూర్యుడు తన ఎండలతో విజృంభించడానికి అస్త్రాలు సన్నద్ధం చేసుకుంటుండగా, పక్షులు రాత్రి పూట నిద్ర తాలూకు బడలికను మరిచి ఆహార వేటకు సిద్ధమవుతుండగా రెడ్డి వారి పేట దగ్గర చేపలు పట్టేవాళ్ల గుడిసెల దగ్గరికి చేరాము. రెండే గుడిసెలు ఉన్నాయి. అక్కన్నించి చూస్తే కనుచూపు మేరా నీళ్లే కనపడుతున్నాయి మసక మసకగా.
చేపలు పట్టే వాళ్లని లేపితే రాత్రి పట్టలేదన్నా కొద్దిసేపు ఆగండి వల వేసి పట్టిస్తామన్నారు. ఇక చేసేదేమీ లేక అందరం అక్కడ కూర్చుండిపోయాం. కొండ చాటున మేముండడంతో సూర్యోదయం తాలూకు పగటి వెలుగులు ఇంకా మొదలవ్వలేదు.

దూరంగా ఒక మనిషి కనపడడంతో అటుగా వెళ్లి మాటలు కలిపాను. ముగ్గురూ అన్నవరం నుండి ఇక్కడ పనిచెయ్యడానికి వచ్చారంట. జీతమెంతంటే భోజనాలు పెట్టి రోజుకు నాలుగొందల కూలీ అన్నారు. నీటి ఒడ్డునే ఆ తడిలోనే వారి నిద్ర. నేల మింద బురద తడి అలాగే ఉంది చేపల నీచు వాసన ముక్కు పుటాలచు తాకుతోంది కానీ వారికవేమీ పట్టడం లేదు. అలవాటయిన శరీరాలేమో. సంగతేందని అడిగితే మాకివన్నీ అలవాటేనయ్యా. బెస్త వాళ్లమని చెప్పాడు.

ఇంటికెళ్లడానికి రైళ్లుంటాయా అని అడిగితే లేవన్నా అని బయట జరుగుతున్న సంగతంతా చెప్పాను. అది విన్న అతని కళ్లల్లో విచారం స్పష్టంగా కనిపిస్తోంది. పోతామున్నా యట్టైనా పోతాం. రోడ్డెక్కితే ఆటోలు పట్టుకునైనా పోతామని జంకుతూ చెప్పాడు. కానీ యాడ అన్నవరం యాడ కడప. కొద్ది రోజులు తప్పదంతే.

రాత్రంతా లంగరేసి ఆపిన పడవకు ఉన్న చిల్లులోంచి నీళ్లు లోపలికొచ్చాయి. ఒ మనిషి తోడుతుంటే వెళ్లి కూర్చున్నా. పక్కన పల్లెతనే. యానాదోల్లంట. సన్నగా, నల్లగా మెరుస్తున్న దేహం, రింగులు తిరిగి పొడవుగా సాగి ఉన్న వెంట్రుకలు. జీతానికే పనిచేస్తున్నాడు. మూడు పూటలా భోజనం పదకొండు వేలు డబ్బులు. మాట్లాడుతూనే నీళ్లన్నీ తోడేశాడు.

తెలవారుతుండగా చేపలు పట్టే వాళ్లు ఒక్కొక్కరే పడవ దగ్గరికి నేను కాకుండా మొత్తం ఎనిమిది మంది. నేను కూడా మీతో వస్తానన్నా అని అందులోనే కూర్చున్నా. ముగ్గరు వేరే చిన్న పడవలో ఎక్కారు మేము ఆరుమందిమి ఇంకో పడవ.

లంగరు తీసి బయల్దేరేటపుడు స్వామి తల్లీ ఒక్కో చేప పది కిలోలు పడాలి అని మొక్కి లోపలికి తోశాడు. డ్రైవరు ఒక తెడ్డు మిగతా ఇద్దరు చెరో వైపు తెడ్లు వేస్తుండగా ముందుకు సాగితిమి. రాత్రి పట్టి నీళ్లల్లోనే దాచిపెట్టి ఉంచిన పదైదు కిలోల చేపల్ని తీసుకుని ఓనరు, యానాదోల్ల అతను చిన్న పడవతో బయటికి వెళ్లిపోగా మేము ఏడుమందిమి ఒక పడవలో చేపల వేటకు బయల్దేరితిమి.

వలకు ఒక కొన ఒడ్డున బేసి ఇంగో పక్క వదులుకుంటూ ముందుకు వెళ్లాము. ఒకాయన పైన తేలాల్సిన బెండ్లు ఉన్నె లైను నీళ్లలో వేస్తుంటే ఇంకొకాయన కిందికి దిగాల్సిన తాడు వేస్తూ ఉన్నాడు. నలుగురు తెడ్లు వేస్తుంటే, ఇద్దరు వలలు వేస్తూ ముందుకు సాగాము.

ఆ తెడ్లు వేసే వాళ్లలో సంటెన్నతో బో తమాషా. పాడు చెవుడు మనిషి. తెడ్డు ఆపు సంటా అని పడవ డ్రైవరు ఒకపక్క మొత్తుకుంటున్నా వినకుండా వేస్తూనే ఉండటం వల్ల ఒకపక్కకి వెళ్లాల్సిన పడవ ఇంకో పక్కకు వెళ్లేది. దానికి ఆయన చిరాకు పడటం. తెడ్డాపు తెడ్డాపు అని ఒకపక్క మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా అలాగే వేయడం వల్ల వల బిర్రు తగిలుతాందని గెట్టిగా అరిచ్చే అప్పుడు ఆపుతాడు.

అట్టా పడవను నడుపుకుంటూ వల యు ఆకారంలోకి తెచ్చి పడవను గట్టున ఆపి రెండు కొనలు పట్టి లాగడం మొదలుపెట్టారు. ఆ లాగడంలో వాళ్లకు సాయం చెయ్యడానికి మా వాళ్లు కూడా ఒక చెయ్యేశారు.
-- ******************************* --
అక్కన్నుంచి పక్కకొచ్చి సుధాకర్, విష్ణు వాళ్లు మంట మింద చేపలు కాలుస్తుంటే యాప్పుల్ల నోట్లో వేసుకుని నీళ్లు పుక్కిలించి అటువైపు వెళ్లాను. రెండు చేపలు బాగా కాలి నోరూరిస్తుంటే తినడం మొదలుపెట్టాము. పొద్దున్నే భలే రుచిలే. ఇంగా కావాలనిపిస్తోంది గానీ పచ్చి చేపలు లేవు.

అక్కన్నుంచి వాళ్లందరూ వల దగ్గరికి పోగా మొత్తం నీళ్లను చూద్దామని కొండ ఎక్కడం మొదలుపెట్టాను. కొండ చూసే దానికి చిన్నగానే ఉంది గానీ ఎక్కతుంటే తలలో నుంచి చెమటలు కారిపోతున్నాయి. పైకెక్కుతుంటే నా కదలికలు చూసి ఒక బెల్లాయి తన గూటి నుండి జివ్వున ఎగిరిపోయింది. అక్కడికెళ్లి చూస్తే గూడు అందులో ఒక్కటే గుడ్డు. మళ్లీ తన గూటికి వచ్చి గుడ్డు పొదుగుద్దా లేదా అనే డౌటు కొడుకోంది. ఎందుకంటే మనిషి అలికిడైతే బెల్లాయిలు మళ్లీ గూటి దగ్గరికి రావు అని చిన్నప్పుడు చాలా వినేవాళ్లం.

అక్కడి నుండి కిందికి చూస్తే దూరంగా సగం నీటిలో మునిగి తమ అస్థిత్వాన్ని బయటి ప్రపంచానికి చాటి చెప్పాలని ఉబలాటపడే రెండు పురాతన గుడులు దర్శనమిచ్చాయి. నీట మునిగిన ఊర్ల తాలూకు శిథిలాలేమీ కంటికి కనపడ్డంలేదు. నెమళ్ల అరుపులు ఘనంగా వినిపిస్తున్నాయి.

రెడ్డి వారిపేట అనే ఒక ఊరు మాత్రం కనపడుతోంది. ఇరవై ఇండ్ల దాకా ఉన్నాయి. అన్నీ పెంకుటిల్లులే. మేకలు మేపడం, బొగ్గులు కాల్చడమే వారి జీవనాధారంలా అనిపించింది. కొండ పైకెక్కే సరికి తిన్న చేప కాస్తా అరిగిపోయి విపరీతమైన దప్పికగా ఉంది. అక్కన్నుంచి చూస్తే దాదాపూ ఐదారు కిలోమీటర్ల మేర నీళ్లు కనపడుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో నా అందాల్ని కూడా చూడవయా అంటూ అక్కడక్కడా కనిపించే నీళ్లలోనించి బయటికి చొచ్చుకుని వచ్చిన కొండల అందాలు. వాటికి సూర్యోదయం మరింత రమ్యతని జోడిస్తోంది.

ఎవరికో మేలు చేసే ప్రాజెక్టు కోసం కట్టుకున్న ఇండ్లను వదిలి, కన్నతల్లి లాంటి జన్మభూమిని వదిలి, చిన్ననాటి జ్ఞాపకాలను నీటిలో సమాధి చేసి ఊరిడిచి వెళ్లిన వీరి త్యాగం ముందు రైతుల త్యాగం రైతుల త్యాగం అని భ్రమపడే ఆ రియల్ ఎస్టేట్ ఆశావహుల పబ్లిసిటీ త్యాగాలు ఏ పాటివి అనిపించింది.

మదిని చుట్టిన ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ఎక్కువ ఆలోచించడం మంచిది కాదని అనుకుంటూ కొండకు ఆవల వైపు నుండి కిందికి దిగడం మొదలుపెట్టాను. అంత పొద్దున్నే మేతకు వచ్చిన ఆవులు ఆ పుల్ల గెడ్డినే మేస్తూ నన్ను చూసి బెదరుతూ కనిపించాయి.

చిన్నగా నడుచుకుంటూ చేపల దగ్గరికొచ్చాను. మన లెగ్గు ఎఫెక్టేమో రోజూ బాగా దొరికే చేపలు ఆ రోజు పెద్దగా దొరకలేదు. అన్నీ చిన్న చిన్న జిలేబీ చేపలే. చీ ఇంత దూరమొచ్చి ఈ దరిద్రపు చేపలు కొనుక్కోని పోవాల్నా అని సుధాకర్ వాటిని ముట్టను కూడా ముట్టలేదు. సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం అని మేము తలా కేజీ లేదా రెండు కేజీలు కొని, అర్థ కేజీ వొట్టి చేపలు కొనుక్కుని ఇంటికొచ్చాము.

వాటిని చూసినోళ్లంతా ఈ సంబడం కోసమా నాలుగ్గంటలకే లేసి అందరూ బండ్లేసుకునిపోయిందంటూ వేసిన సెతుర్లు మాత్రం ఒక్కరవ్వ ఇబ్బందిపెట్టాయి.

నాకు మాత్రం తొలిసారి నాటు పడవలో తిరిగిన అనుభావాలు, పొద్దున్నే చేపల్ను కాల్చుకుని తిన్న రుచి, కొండపైనుండి సోమశిల జలాలు, సూర్యోదయం అన్నీ కలకాలం గుర్తుండిపోతాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp