ఐపీఎల్‌లో టాప్ ఫైవ్ బౌలింగ్ పర్ఫామెన్స్

By iDream Post Apr. 05, 2020, 06:57 pm IST
ఐపీఎల్‌లో టాప్ ఫైవ్ బౌలింగ్ పర్ఫామెన్స్

తొలి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ 2005 ఫిబ్రవరి 17న జరిగింది. రెండు సంవత్సరాల తరువాత ఐసిసి టీ-20 ప్రపంచ కప్ ప్రవేశంతో పొట్టి ఫార్మాట్ రూపురేఖలు మార్చేసింది. అయితే 2008లో ఐపీఎల్ ప్రారంభంతో ఈ మ్యాచ్‌ల క్రేజ్ అమాంతం పెరిగి ఆకాశపు అంచులు తాకింది. పొట్టి ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ అప్పర్ కట్,హెలికాప్టర్ షాట్ వంటి వినూత్నమైన, సృజనాత్మక షాట్లు అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి.

బ్యాట్స్‌మన్‌లు పూర్తి ఆధిపత్యం వహిస్తున్న టీ-20 క్రికెట్‌లో కొంత మంది బౌలర్లు తమ అద్భుత బౌలింగ్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. సుదీర్ఘ టెస్టులు,కాస్త ధీర్ఘ‌మైన వ‌న్డేలాంటి మ్యాచ్‌లలో ఐదు వికెట్లు తీయ‌డ‌మే అంటేనే గొప్పగా భావించే సంగతి తెలిసిందే. కానీ ప్రతి బంతిని బౌండరీకి తరలించాలని చితక్కొట్టే బ్యాట్స్‌మన్‌లను కట్టడి చేస్తూ కేవలం 24 బంతులలో ఐదు వికెట్లకు పైగా సాధించిన ఐపీఎల్ టాప్ ఫైవ్ బౌలర్ల ఘనమైన రికార్డుపై ఒక కన్నేద్దాం...

ఐపీఎల్ నెంబర్ వన్ పర్ఫామెన్స్ బౌలర్ జోసెఫ్‌ :

ఐపీఎల్‌లో అత్యుత్త‌మ బౌలింగ్ గణాంకాల రికార్డును పేస‌ర్ అల్జారీ జోసెఫ్‌ (వెస్టిండీస్‌) త‌న పేరిట లిఖించుకున్నాడు. ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గతేడాది ఐపీఎల్‌-2019లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున అరంగేట్రం చేశాడు. పేస‌ర్ ఆడ‌మ్ మిల్నే (న్యూజిలాండ్) మ్యాచ్ నుండి గాయముతో వైదొలగా అత‌ని స్థానంలో జోసెఫ్‌ తుది జట్టులో స్థానం పొందాడు.అయితే అనూహ్యంగా లభించిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకొని తన బౌలింగ్ సత్తాను చాటాడు.

ముంబై ఇండియన్స్ విధించిన 137 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన సన్ రైజర్స్ ఆరు వికెట్లు కూల్చి ప్ర‌త్య‌ర్థి ప‌త‌నాన్ని జోసెఫ్‌ శాసించాడు. కేవలం 22 బంతులలో 12 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టడంతో 40 పరుగుల తేడాతో ముంబై నెగ్గింది.తన ఆరంగేట్ర మ్యాచ్‌లోనే బంతితో అద్భుత ప్రదర్శన చేసిన జోసెఫ్‌ జరిగిన పన్నెండు ఐపీఎల్‌ సీజన్‌లలో బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.

ఐపీఎల్ బౌలింగ్ అత్యుత్తమ గణాంకాలలో రెండో స్థానం సోహైఎల్‌దే:

2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్ తొలి సీజ‌న్‌లో పాకిస్థాన్‌ క్రికెట‌ర్లు ఆడిన సంగ‌తి తెలిసిందే.పాక్ పేస‌ర్ సోహైల్ త‌న్వీర్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్టు తరఫున ఆడాడు.చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్లలో 14 ప‌రుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.దీంతో చెన్నై 109 ప‌రుగుల‌కే పరిమితం కాగా మరో ఐదు ఓవ‌ర్లు ఉండ‌గానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ లక్ష్యాన్ని సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్-2008 ప్రారంభ‌ సీజ‌న్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో సోహైల్ మొత్తం 22 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ప‌ర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

మూడో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన బౌలర్ జంపా:

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌,చెన్నై సూప‌ర్ కింగ్స్‌ జట్లపై నిషేధం విధించడంతో 2015, 2016 ఐపీఎల్ సీజన్‌లలో గుజ‌రాత్ ల‌య‌న్స్‌,రైజింగ్ పుణే సూప‌ర్ జెయింట్స్ జట్లకు అవకాశం కల్పించారు.అయితే నూతన రెండు జట్లు కేవలం రెండు సీజన్‌లకే పరిమితమయ్యాయి. ఈ రెండు సీజన్‌లలో పుణే త‌ర‌పున ఆడిన ఆస్ట్రేలియాకు చెందిన లెగ్ స్పిన్నర్ ఆడ‌మ్ జంపా ఆరు వికెట్లతో తీసుకొని సత్తా చాటిన మరో ఐపీఎల్ బౌలర్.

స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన జంపా 19 ప‌రుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు.అయితే జంపా బౌలింగ్‌లో రాణించినప్పటికీ బ్యాట్స్‌మెన్‌ల వైఫల్యంతో పుణే జట్టు నాలుగు ప‌రుగుల‌తో ప‌రాజ‌యం పాలైంది.ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ కెరీర్‌లోనూ జంపా అత్యుత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న ఇదే కావ‌డం విశేషం.

నాలుగో స్థానంలో జంబో:

భార‌త లెగ్ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే పేరు వినగానే ఢిల్లీ టెస్ట్‌లో పాక్‌పై ఒక ఇన్నింగ్స్‌లో పదికి ప‌ది వికెట్లు తీసిన దృశ్యం మన మదిలో మెదిలాడుతుంది.అయితే జంబో పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో కూడా తన బౌలింగ్‌కు తిరుగు లేదని నిరూపించాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు త‌ర‌పున బ‌రిలోకి దిగిన కుంబ్లే ఐపీఎల్‌లో అత్యుత్త‌మ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌లలో నాలుగో స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్-2009లో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విధించిన 134 పరుగుల లక్ష్యఛేదనలో చతికిలపడిన రాజస్థాన్ రాయల్స్ 75 ప‌రుగుల‌తో ఓడిపోయింది. కుంబ్లే బౌలింగ్ ధాటికి ప్ర‌త్య‌ర్థి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌మ లోయెస్ట్ స్కోరును న‌మోదు చేసింది.ఈ మ్యాచ్‌లో 19 బంతులు విసిరిన కుంబ్లే కేవ‌లం ఐదు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఐదు కీల‌క‌మైన వికెట్లు పడగొట్టాడు.

టాప్ ఫైవ్ లో భారత పేసర్ లంబూ:

ఐపీఎల్‌-2011లో డెక్క‌న్ చార్జ‌ర్స్ త‌ర‌పున ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్‌ శ‌ర్మ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు.కోచి ట‌స్క‌ర్స్ కేర‌ళ జట్టులోని మ‌హేళ జ‌య‌వ‌ర్థ‌నే,బ్రాడ్ హోగ్,కేదార్ జాద‌వ్‌లాంటి స్టార్ బ్యాట్స్‌మన్‌లకు లంబూ తన బౌలింగ్ పదును రుచి చూపించాడు.ఇషాంత్‌ నిప్పులు చెరిగే బంతుల‌తో చెలరేగిపోయి 3 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.


దీంతో డెక్క‌న్ చార్జ‌ర్స్ 129 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకొని కోచి ట‌స్క‌ర్స్ పై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో పలు జ‌ట్ల‌కు ఆడిన ఇషాంత్‌ డెక్క‌న్ చార్జ‌ర్స్ త‌ర‌పునే అత్యుత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ చేసి ఐపీఎల్ టాప్ బౌలర్లలో ఐదో స్థానాన్ని ఆక్రమించాడు.ప్రస్తుతం ఐపీఎల్‌లో ఈ రెండు ఫ్రాంచైజీ జట్లు ఆడటం లేదు.ఇక భారత టెస్ట్ జట్టులో ప్ర‌ధాన పేస‌ర్‌గా ఎదిగిన ఇషాంత్ ఫాస్ట్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు.

బౌలింగ్ ఉత్తమ ప్రదర్శన చేసిన బౌలర్ల మొదటి ఐదు స్థానాలలో తొలి మూడు స్థానాలు విదేశీయులు సాధించగా తర్వాతి స్థానాలను భారత బౌలర్లు ఆక్రమించారు. ఉత్తమ ప్రదర్శన కనపరిచిన బౌలర్లలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు,మరో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు కావడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp