ఆగస్టులో భారత్, సఫారీల మధ్య టీ-20 సిరీస్...?

By Srinivas Racharla Jul. 22, 2020, 02:18 pm IST
ఆగస్టులో భారత్, సఫారీల మధ్య టీ-20 సిరీస్...?

ఇది వాస్తవ రూపం దాలిస్తే నిజంగా భారత క్రికెట్ అభిమానులకు శుభవార్తే.తమ అభిమాన క్రికెటర్లు ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడతారోనని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారి కోరిక ఐపీఎల్-2020 సీజన్ కంటే ముందుగానే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక వార్తలోకి వెళ్తే ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 వరల్డ్‌కప్ వాయిదాతో ఐపీఎల్-2020‌ నిర్వహణకు అవకాశం దొరికిన సంగతి తెలిసిందే.అయితే ఐపీఎల్‌కి ముందు భారత క్రికెటర్లకి మ్యాచ్ ప్రాక్టీస్ లభించేలా ఓ టీ-20 సిరీస్‌ని నిర్వహించాలని బీసీసీఐపై ఫ్రాంచైజీలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత మార్చి నుంచి భారత క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు.ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు కేవలం నెట్స్‌ ప్రాక్టీస్‌తో ఐపీఎల్‌లో రాణించలేరని ఫ్రాంచైజీలు వాదిస్తున్నాయి.దీంతో క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ఆగస్టులో ఓ మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందని వార్తలు వెలువడుతున్నాయి.

గత మార్చిలో భారత్,దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగాల్సి ఉంది.కానీ వర్షం కారణంగా తొలి వన్డే రద్దు కాగా కరోనా వ్యాప్తి కారణంగా ఆ సిరీస్‌ని బీసీసీఐ అర్ధాంతరంగా వాయిదా వేసింది.ఇక నాటి నుంచి నేటి వరకు భారత్‌లో క్రికెట్‌‌ మ్యాచ్‌లు నిలిచిపోయాయి.ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి టీమిండియా దక్షిణాఫ్రికా సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.

కాగా ఫ్రాంచైజీలా డిమాండ్ మేరకు ఐపీఎల్-2020 టోర్నీకి ముందు భారత క్రికెటర్ల మ్యాచ్‌ ప్రాక్టీస్ కోసం సఫారీలతో మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ని ఆగస్టులో జరిపేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ కూడా యూఏఈ వేదికపైనే జరుగుతుందని బీసీసీఐ వర్గాలు తెలియజేస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp