ఆసియా ఎలెవెన్ జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు

By Srinivas Racharla Feb. 25, 2020, 08:34 pm IST
ఆసియా ఎలెవెన్ జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు

బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మన్ వందో జ‌యంతి వేడుకల సందర్భంగా మార్చి 18, 20వ తేదీలలో ఆసియా ఎలెవన్‌,వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రెండు టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తుంది.ఈ టీ-20 మ్యాచ్‌ల కోసం వ‌ర‌ల్డ్ ఎలెవ‌న్-ఆసియా ఎలెవ‌న్ జట్లను మంగ‌ళ‌వారం బీసీబీ ప్ర‌క‌టించింది.

ఆసియా ఎలెవ‌న్ జ‌ట్టు కోసం ప్రకటించిన మొత్తం 15 మంది ఆట‌గాళ్లలో ఆరుగురు భార‌త ఆటగాళ్లు స్థానం సంపాదించడం విశేషం.ఈ జ‌ట్టులో భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ,లోకేశ్ రాహుల్‌, ఓపెనర్‌ శిఖ‌ర్ ధావ‌న్‌,వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌, పేసర్‌ మహ్మద్‌ షమి,స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌లకు చోటు ద‌క్కింది.

ఆసియా ఎలెవెన్ జట్టుకు పాకిస్తాన్ ఆటగాళ్లను ఎంపిక చెయ్యని బీసీబీ :
ఆసియా జ‌ట్టులో బంగ్లాదేశ్ నుంచి న‌లుగురు ఆటగాళ్లు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వీరిలో త‌మీమ్ ఇక్బాల్‌, లిట‌న్ దాస్‌, ముష్ఫికుర్ ర‌హీమ్‌, ముస్తాఫిజుర్ ర‌హ్మ‌న్ ఉన్నారు. అలాగే శ్రీలంక నుంచి ల‌సిత్ మ‌లింగా, తిసారా పెరీరా,ఆఫ్గ‌నిస్థాన్ నుంచి ర‌షీద్ ఖాన్‌, ముజీబుర్ ర‌హ్మన్కు చోటు ద‌క్కింది. నేపాల్ నుంచి సందీప్ లామిచానే ఏకైక ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగున్నాడు. మ‌రోవైపు బీసీసీఐ హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆసియా జ‌ట్టులో చోటు దక్కలేదు.

ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడనున్న కోహ్లీ, రాహుల్:

బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా ఆడుతున్న కోహ్లీ ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడే అవకాశం ఉంది.ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనను భారత్ ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చి దక్షిణాఫ్రికాతో మార్చి 12 నుండి 18 వరకు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. వెంటనే మార్చి 29 నుంచి ఐపీఎల్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లితో పాటు రాహుల్‌ ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడతారని బీసీసీఐ తెలిపిందని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ తెలిపారు.

స్టార్ ఆటగాళ్లతో నిండిన ఆసియా జ‌ట్టును ఎదుర్కోబోయే వ‌ర‌ల్డ్ ఎలెవ‌న్ జ‌ట్టుకు దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.ఈ జట్టులో వెస్టిండీస్‌ ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌,పొలార్ట్‌, ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ బెయిర్‌స్టో వంటి అగ్రశ్రేణి ఉన్నారు. రెండు టీ20 మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లోని షేర్ ఇ బంగ్లా జాతీయ స్టేడియంలో నిర్వహించనున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp