ఐదు సిక్సులతో జీరో నుండి హీరో అయ్యాడు..

By Kiran.G Sep. 28, 2020, 09:36 am IST
ఐదు సిక్సులతో జీరో నుండి హీరో అయ్యాడు..

రాహుల్ తెవాతియా.. ఇప్పుడు ఈ పేరు మారు మ్రోగిపోతుంది. కారణం అతను ఆదివారం రాత్రి ఆడిన సంచలన ఇన్నింగ్స్ మహిమ.. అసలు ఇతడిని బ్యాటింగ్ కి పంపిన కెప్టెన్ నిర్ణయం సరైనది కాదు అని అనుకోని క్రీడాభిమాని ఉండడు అనడంలో అతిశయోక్తి లేదేమో.. కారణం అతడు ఆడిన అత్యంత జిడ్డు ఇన్నింగ్స్ కారణంగా రాహుల్ తెవాతియాను తిట్టుకోని క్రికెట్ అభిమాని ఉండడేమో..కనీసం రిటైర్ హర్ట్ అయినా బావుంటుదేమో అని అభిమానులు ఆశించారు. రాజస్థాన్ శిబిరంలో కూడా చిన్నపాటి అసహనం.. కానీ తనను తిట్టుకున్న అభిమానులు తన గురించి మాట్లాడుకునేంతగా రాహుల్ తివాటియా చెలరేగిపోయాడు. ఒక్కసారిగా విజృంభించి పంజాబ్ నుండి విజయాన్ని లాగేసుకున్నాడు.

రాజస్థాన్ ముందు 224 పరుగుల కొండంత లక్ష్యం... అత్యుత్తమ బ్యాట్స్ మెన్ అయిన బట్లర్ రెండో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టాడు.. ఈ దశలో కెప్టెన్ స్మిత్ తో కలిసి సంజు సాంసన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ రాజస్థాన్ ని ముందుకు తీసుకువెళ్తున్నాడు.. ఈ దశలో ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడుతున్న స్మిత్ కూడా అర్ధ సెంచరీ అనంతరం వెనుదిరిగాడు. అప్పటికి ఓవర్ కి 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి.. ఈ దశలో క్రీజులోకి అనుభవజ్ఞుడైన ఊతప్ప వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ రాహుల్ తెవాతియా క్రీజులోకి అడుగుపెట్టాడు...

స్మిత్ లెఫ్ట్ - రైట్ కాంబినేషన్ కోసమో లేక ఫించ్ హిట్టింగ్ చేయడానికో రాహుల్ తెవాతియాను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా ప్రమోట్ చేసారని సగటు క్రీడాభిమానులు భావించారు. లెగ్ స్పిన్నర్లను అవలీలగా ఎదుర్కొని ప్రతీ బంతిని బౌండరీని దాటిస్తాడన్న నమ్మకంతో స్మిత్ ముందుగా రాహుల్ తెవాతియాను బ్యాటింగ్ కి పంపించాడు. కానీ సీన్ రివర్స్ అయింది.. బౌండరీల సంగతి దేవుడెరుగు. సింగిల్స్ కూడా తీయలేక పోయాడు. కనీసం బ్యాట్ బాల్ కి తాకితే పాపం అన్నట్లుగా తన బ్యాటింగ్ సా..గింది.. దాని ఫలితంగా రాజస్థాన్ సాధించాల్సిన లక్ష్యం అమాంతం పెరిగిపోయింది. చివరి మూడు ఓవర్లలో ఓవర్ కి దాదాపు 17 పరుగులు చేయాల్సిన పరిస్థితి.

సంజు సాంసన్ కూడా సింగిల్స్ తీస్తే రాహుల్ కు బ్యాటింగ్ వెళ్తుందని సింగిల్స్ తీసే సాహసం చేయలేదు. ఈ దశలో కీపర్ కు సునాయాస క్యాచ్ ఇచ్చి సాంసన్ కూడా వెనుదిరిగాడు. సాంసన్ బదులు రాహుల్ తెవాతియా ఔట్ అయితే బాగుండేదని కోరుకోని క్రీడాభిమాని లేడేమో.. ఇక రాజస్థాన్ ఓటమి ఖరారు అయినట్లే అని అందరూ భావించారు. అప్పుడు తనలో ఉన్న అసలు సిసలు హిట్టర్ ని బయటకు తీసిన రాహుల్ తివాటియా మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో రాహుల్ తెవాతియా సాధించిన పరుగులు 8 మాత్రమే.. అందులో ఒక సిక్స్ కూడా ఉంది.

మ్యాచ్ గతిని మార్చిన ఆ ఒక్క ఓవర్

ఒకవేళ రాజస్థాన్ కనుక ఓడిపోయి ఉంటే దానికి కారణం అతనే అయ్యుండేవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 18 వ ఓవర్లో తనలో ఉన్న హిట్టర్ ను నిద్రలేపి కాట్రెల్ ను ఉతికి ఆరేశాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు సిక్సులు కొట్టాడు. బాల్ దొరకడమే ఆలస్యం.. కసిదీరా బాదిన తెవాతియా ఒక్కసారిగా చేజారిపోతున్న మ్యాచ్ ను రాజస్థాన్ చేతుల్లోకి తీసుకొచ్చాడు. వరుసగా నాలుగు సిక్సులు కొట్టడంతో ఐపీఎల్ లో తొలిసారిగా ఆరు సిక్సులను ఒకే ఓవర్లో సాధిస్తాడేమో అన్న ఆశలు కూడా క్రీడాభిమానుల్లో కలిగించాడు. కానీ ఐదో బంతి మిస్ అయింది. కానీ ఆరో బంతికి మరో సిక్స్ సాధించి మ్యాచ్ పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాడు. షమీ ఓవర్లో ఒక సిక్సర్ సాధించి, మరో భారీ షాట్ కి ప్రయత్నం చేసి ఔట్ అయ్యాడు. కానీ అప్పటికే పంజాబ్ కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

20 వ ఓవర్ కాట్రెల్ కు ఇవ్వడానికి భయపడి పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఒక స్పిన్నర్ కి బౌలింగ్ ఇచ్చాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు తివాటియా విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో. తొలి 19 బంతుల్లో 8 పరుగులు సాధించిన తెవాతియా తర్వాతి 12 బంతుల్లో ఏకంగా 45 పరుగులు సాధించాడు. దీంతో 31 బంతుల్లో 53 పరుగులుచేసి ఐపీఎల్ లో తన తొలి అర్ధసెంచరీని సాధించాడు.. అతని బ్యాటింగ్ లో ఏడు సిక్సర్లు తప్ప ఒక్క ఫోర్ కూడా లేకపోవడం విశేషం..మొదట్లో ఎవ్వరు ఎంతగా తిట్టుకున్నా రాజస్థాన్ గెలిచిందంటే కారణం తెవాతియానే.. అతను ధాటిగా బ్యాటింగ్ చేయబట్టే ఐపీఎల్ లో అత్యధిక లక్ష్య ఛేదన రాజస్థాన్ చేయగలిగింది. తన అసాధారణ బ్యాటింగ్ తో జీరో కాస్త హీరో అయ్యి మ్యాచ్ గెలిపించి అభిమానుల మనసులను గెలిచాడు తెవాతియా...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp