బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్

By Srinivas Racharla Jul. 23, 2020, 07:25 pm IST
బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్

కొందరు వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతూ "మోకాలుకీ, బోడి గుండుకు సంబంధం అంటగడుతూ ఉంటారు".అదే కోవలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీ-20 ప్రపంచకప్ వాయిదాకి 12 ఏళ్ల క్రితం ఆసీస్, భారత్ మధ్య జరిగిన సంఘటనకు ముడిపెట్టి తన సంకుచిత బుద్ధిని బయట పెట్టుకున్నాడు.

తాజాగా జియో క్రికెట్‌ యూట్యూబ్ షోలో మాట్లాడిన అక్తర్ బీసీసీఐపై అక్కసు వెల్లగక్కుతూ ‘‘కొన్నిసార్లు మెల్‌బోర్న్‌లో వాళ్లు సులభంగా వికెట్లు సాధిస్తారు. ఎవరైనా మరొక వ్యక్తిని 'కోతి' అని పిలుస్తారు, కానీ దాని నుండి రక్షించబడతారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సిరీస్‌ని బహిష్కరిస్తామనే బెదిరింపులు వస్తాయి. క్రికెట్ బంతిని గోకినందుకు మీ క్రికెటర్లని ఏడాది పాటు నిషేధంతో బాధ పెట్టారు. కానీ కోతి అని పిలిచినవాళ్లని మాత్రం వదిలేశారు. సిరీస్‌ని బహిష్కరిస్తామని బీసీసీఐ వార్నింగ్ ఇవ్వగానే క్రికెట్ ఆస్ట్రేలియా అలాంటి సంఘటన జరగలేదని చెప్పింది. మీ (క్రికెట్ ఆస్ట్రేలియా) నైతిక విలువలు ఇవేనా..?. ఇక ఈ డ్రామా అంతా ఆపండి, మాకు డబ్బులు కావాలి అని చెప్పండి. బీసీసీఐ నుండి డబ్బు వస్తుంది, దానిని మీరు నిశ్శబ్దంగా తీసుకోండి.అలాగే ఐపీఎల్‌కి ఉన్న అడ్డంకుల్ని తొలగించడానికే టీ-20 వరల్డ్‌కప్‌ని బీసీసీఐ వాయిదా వేయించింది’’ అని ఆరోపించాడు.

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ-20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వలేమని తేల్చేసింది. దీంతో మరో ప్రత్యామ్నాయం లేని ఐసీసీ ప్రపంచకప్‌ని గత సోమవారం వచ్చే ఏడాదికి వాయిదావేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌- నవంబర్‌లో ఐపీఎల్‌ 2020 సీజన్‌ని నిర్వహించటానికి బీసీసీఐ ప్రణాళిక రూపొందించింది.

కాగా 2008లో సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా రేగిన వివాదమే "మంకీగేట్". ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌‌ని ‘కోతి’ అని వర్ణ వివక్షత వ్యాఖ్యలు చేసినట్లు భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా హర్భజన్ సింగ్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. కాగా భజ్జీకి సపోర్ట్‌గా నిలిచిన బీసీసీఐ ఆ నిషేధాన్ని ఎత్తివేయకపోతే సిరీస్‌ నుండి వైదొలుగుతామని హెచ్చరించింది. దీంతో వెనక్కి తగ్గిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) హర్భజన్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది.

అదే తరహాలో ఐపీఎల్ కోసం ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియాలను బెదిరించి టీ-20 వరల్డ్‌కప్‌ని వాయిదాపడేలా బీసీసీఐ చేసిందని షోయబ్ ఆరోపించాడు. అయితే పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ చేసిన ఆర్థిక ప్రయోజనాల ఆరోపణలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp