వికెట్ కు ముందు, వెనక రాహుల్ జోరు

By Srinivas Racharla Jan. 18, 2020, 02:46 pm IST
వికెట్ కు ముందు, వెనక రాహుల్ జోరు

 తొలి వన్డేలో కమిన్స్ బౌలింగ్‌లో కంకషన్‌కు గురై వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడి తొలి వన్డేలో ఫీల్డింగ్‌కు దిగలేదు.వాంఖేడే వన్డేలో పంత్ స్థానంలో తాత్కాలిక వికెట్ కీపర్ గా రాహుల్ బాధ్యతలు నిర్వర్తించాడు. నిన్నటి రెండో వన్డే మ్యాచ్‌లో పూర్తి స్థాయి వికెట్‌కీపర్‌గా రాహుల్‌ను తీసుకోగా అద్భుత కీపింగ్ తో ఆకట్టుకున్నాడు.స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగులో ముందుకొచ్చి భారీ షాట్ కు ప్రయత్నించగా క్షణకాలంలో రెగ్యులర్ కీపర్ వలె మెరుపు స్టంపింగ్‌తో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను పెవిలియన్‌కు పంపాడు. రాహుల్ చేసిన స్టంపింగ్ కు ఫిదా అయిన నెటిజన్లు సోషల్ మీడియాలో పంత్‌ను విమర్శిస్తూ రాహుల్‌ను పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.

గతంలో మాజీ కెప్టెన్, కీపర్ ఎం.ఎస్. ధోని తన మెరుపు కీపింగ్ తో పాటు ఐదు లేక ఆరు స్థానాలలో బ్యాటింగ్ కు దిగి వేగంగా పరుగులు రాబట్టడంతో పాటు ఉత్తమ మ్యాచ్ ఫినిషర్ గా ఉండేవాడు. నిన్నటి వన్డే మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కె.ఎల్.రాహుల్ ధోనీని తలపించేలా లోఆర్డర్ లో దూకుడుగా ఆడి 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.భారీ స్కోరు దిశగా నడుస్తున్న సమయంలో స్లాగ్ ఓవర్లలో కోహ్లీ అవుట్ అయిన జడేజాతో కలిసి ఆరో వికెట్ కు 58 పరుగులు జత చేశాడు. ఓపెనర్ గానే కాకుండా ఏ స్థానంలోనైనా రాణించగలనని రాహుల్ నిరూపించుకున్నాడు.

దేశవాళీ మ్యాచ్లలో కర్ణాటక జట్టుకు కీపింగ్ బాధ్యతలు అందించే రాహుల్, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-XI జట్టుకు వికెట్ కీపర్ సేవలు అందించిన అనుభవం ఉంది.యువ కీపర్ రిషబ్ పంత్ లభించిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు. కావున రాహుల్ జట్టులో వికెట్ కీపర్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు,తన ఉపయుక్తమైన బ్యాటింగ్ను కొనసాగిస్తే వన్డే మరియు టి20 తుది జట్టులో కచ్చితంగా స్థానమును నిలుపుకునే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp