ఇంగ్లండ్ కు షాకిచ్చిన ఐర్లాండ్

By Kiran.G Aug. 05, 2020, 08:14 am IST
ఇంగ్లండ్ కు షాకిచ్చిన ఐర్లాండ్

మూడో వన్డేలో ఇంగ్లండ్ పై గెలుపు

ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా ఐర్లాండ్ రికార్డ్

మొదటి రెండు వన్డేలు గెలుచుకుని ఊపుమీదున్న ఇంగ్లండ్ జట్టుకు ఐర్లాండ్ జట్టు షాకిచ్చింది. కష్ట సాధ్యమైన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది. మొదటి రెండు వన్డేలలో పరుగులు చేయడానికి ఆపసోపాలు పడిన ఐర్లాండ్ జట్టు మూడో వన్డేలో మాత్రం జూలు విదిల్చింది. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఐర్లాండ్ జట్టు నిలిచింది.

మొదట టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.కెప్టెన్ బాల్బిర్నీ నమ్మకాన్ని నిలబెడుతూ మొదటి ఓవర్లోనే ఇంగ్లండ్ స్కోర్ రెండు పరుగుల వద్దనే జేసన్ రాయ్ వికెట్ ను సాధించాడు ఐర్లాండ్ బౌలర్ యంగ్..జట్టు స్కోర్ 14 పరుగుల వద్ద బెయిర్ స్టో ను మార్క్ అడయిర్ క్లీన్ బౌల్డ్ చేసాడు.దీంతో14 పరుగులకే ఓపెనర్ల వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. ఈదశలో క్రీజ్ లోకి వచ్చిన జేమ్స్ విన్స్ కెప్టెన్ మోర్గాన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ యంగ్ విన్స్ వికెట్ తీయడంతో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లండ్..

సెంచరీతో ఆదుకున్న మోర్గాన్

ఈ దశలో టామ్ బాంటన్(58; 6×4,1×6) తో జత కట్టిన మోర్గాన్(106; 15×4, 4×6) ఇన్నింగ్స్ ను నడిపించాడు.. వీరిద్దరి జోడీ బౌండరీలతో రెచ్చిపోవడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఓ దశలో వీరిద్దరి ధాటికి జట్టు స్కోర్ 380 దాటేలా కనిపించింది.సెంచరీ సాధించి జోరుమీదున్న కెప్టెన్ మోర్గాన్ వికెట్ తీసి వీరిద్దరి జోరుకు బ్రేక్ వేసాడు లిటిల్. అర్ధ సెంచరీ సాధించిన టామ్ బాంటన్ ను డెలాని ఎల్బీగా బలిగొన్నాడు. క్రీజ్ లో కుదురుకుంటున్న మొయిన్ ఆలీని చాంపర్ వెనక్కి పంపడంతో ఇంగ్లాండ్ వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో డేవిడ్ విల్లీ(51; 3×4,3×6) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా టామ్ కరన్ అతనికి సహకారం అందించాడు. దీంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ మూడు వికెట్లు సాధించగా, లిటిల్ మరియు చాంపర్ రెండేసి వికెట్లు సాధించారు.

శతకాలతో రెచ్చిపోయిన స్టిర్లింగ్,బాల్బిర్నీ

కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కి ఓపెనర్లు స్టిర్లింగ్ మరియు డెలాని జోడి శుభారంభాన్ని ఇచ్చారు. కాగా జట్టు స్కోర్ 50 పరుగుల వద్ద డెలాని వికెట్ కోల్పోవడంతో కెప్టెన్ బాల్బీరిన్ క్రీజ్ లోకి వచ్చాడు. వీరిద్దరూ లక్ష్యం దిశగా జట్టుని నడిపించారు. ముఖ్యంగా స్టిర్లింగ్ ఇంగ్లాండ్ బౌలింగ్ పై ఎదురు దాడికి దిగడంతో ఐర్లాండ్ జట్టు లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ఈ దశలో వీరిద్దరూ సెంచరీలు సాధించారు. కాగా జట్టు స్కోర్ 264 పరుగుల వద్ద స్టిర్లింగ్(142; 9×4,6×6) రన్ ఔట్ అయ్యాడు. వెంటనే బాల్బిర్నీ(113; 12×4) కూడా అదిల్ రషీద్ కి చిక్కడంతో గెలుపుపై ఇంగ్లాండ్ కి ఆశలు చిగురించాయి. కానీ కెవిన్ ఒబ్రెయిన్, హరీ టెక్టర్ తో కలిసి మరో వికెట్ కోల్పోకుండా 49.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా ఐర్లాండ్ ని నిలిపారు.

డేవిడ్ విల్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలవగా పాల్ స్టిర్లింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, అదిల్ రషీద్ కి చెరో వికెట్ లభించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp