బ్యాటింగ్‌లో రైజింగ్ లేక.. ఓటమి ఆపలేక!

By Mavuri S Apr. 17, 2021, 11:21 pm IST
బ్యాటింగ్‌లో రైజింగ్ లేక.. ఓటమి ఆపలేక!

మొదటి మ్యాచ్ ఓడిపోయి, తర్వాత మ్యాచ్ లలో అనూహ్యంగా పుంజుకునే అలవాటు ఉన్న ముంబై దాన్ని కొనసాగించింది. మొన్నటికి మొన్న తక్కువ స్కోరు సాధించి కోల్‌కతా నైట్‌రైడర్స్ ను కట్టడి చేసిన ముంబై ఇండియన్స్ అదే పద్ధతిని శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ మీది కూడా ప్రయోగించి విజయవంతం అయింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచింది అనేదానికన్నా హైదరాబాద్ బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో స్పష్టంగా కనిపించినట్లు అయింది. ముంబై ఇండియన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ కు బలమైన ఝలక్ ఇచ్చింది. తన బలమైన బౌలింగ్ అస్త్రాలతో ముంబై బ్యాట్స్‌మెన్‌ను హైదరాబాద్ మొదట బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. పొదుపుగా పొందికగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడం ముంబై బ్యాట్స్ మాన్ కు కష్టతరమైంది. ఫలితంగా 150 రన్స్ స్వల్ప స్కోర్ చేయగలిగింది. ముంబై ఇండియన్స్ చివర్లో పోలార్డ్ మెరుపులు మెరిపించక పోతే ఆ స్కోరు సాధ్యమయ్యేది కాదు.

ముంబై బ్యాట్స్మెన్లలో వికెట్లు వెంటవెంటనే పడకపోయినా రన్స్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, డికోక్ లు బౌండరీలు సాధించడానికి ఇబ్బందిపడిన, రోహిత్ మాత్రం హిట్టింగ్ వైపు మొగ్గు చూపాడు. వరుస ఓవర్లలో రెండు సిక్స్ లు వేయడంతో మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపించింది. అయితే అంతలోనే విజయ్ శంకర్ వేసిన బాల్ కు భారీ షాట్ ఆడబోయిన రోహిత్ డీప్ లాంగ్ ఆన్ లో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఎంతో సేపు క్రీజ్‌లో నిలబడ లేక పోయాడు. విజయ శంకర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. అయితే హైదరాబాద్ బౌలర్లు అందరూ సమిష్టిగా పటిష్టంగా బౌలింగ్ చేయడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ముంబై పరుగులకు కష్ట పడింది. అయిదో వికెట్ గా బరిలోకి వచ్చిన పొలార్డ్ ఇన్నింగ్స్ చివర్లో అద్భుతమైన సిక్స్ లు కొట్టడంతో ముంబై ప్రతిష్ఠాత్మక స్కోరు చేసింది.

151 రన్స్ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో ఇంగ్లాండ్ హిట్టర్ జానీ బెయిర్‌స్టో ను రంగంలోకి దింపింది. వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్ స్థానంలోనూ బెయిర్‌స్టో వికెట్ కిపింగ్ కూడా చేసాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన జానీ బెయిర్‌స్టో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోపక్క కెప్టెన్ డేవిడ్ వార్నర్ సైతం అతడికి మంచి సహకారం అందించడంతో స్కోరు చాలా వేగంగా పరుగులు తీసింది. బెయిర్‌స్టో బౌల్ట్ బౌలింగ్ లో ఏకంగా 20 రన్స్ సాధించి సవాల్ విసిరాడు. బెయిర్‌స్టో ఊపు చూస్తే మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిసిపోతుంది అని భావించారు. అయితే 22 బాల్స్ ఆడి 42 రన్స్ సాధించిన అతడు అనుకోని విధంగా వికెట్ కోల్పోవడంతో హైదరాబాద్ కు కష్టాలు మొదలు అయ్యాయి. పేలవ ఫామ్ లో ఉన్న మనీష్ పాండే మరో సారి తన తీసికట్టు ఆటతో హైదరాబాద్ కు భారంగా కనిపించాడు. మరో వైపు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బాధ్యతాయుతంగా ఆడుతున్నప్పటికీ అతడికి సహకారం అందించే బ్యాట్స్‌మెన్ లేకపోయారు. నాలుగో వికెట్ గా వచ్చిన విజయ శంకర్ చివర్లో మెరుపులు మెరిపించి నప్పటికీ, 16వ వేసిన కృనాల్ పాండ్యా ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు సాధించి, లక్ష్యాన్ని దగ్గర చేసినప్పటికీ, అతడు కూడా నిలకడగా ఆడి జట్టు విజయం సాధించే వరకు ఉండలేకపోయాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన విజయ శంకర్ ఎనిమిదో వికెట్ గా పేవిలియన్ కు వెళ్లడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. 137 రన్స్ చేసిన హైదరాబాద్ బ్యాట్స్మెన్లు అంతా ఆలౌట్ అయ్యారు.

బౌలింగ్‌లో ఇటు ఫాస్ట్ లోనూ అటు స్పిన్‌లోనూ బలంగానే కనిపిస్తోన్న హైదరాబాద్ కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఎవరూ కనిపించడం లేదు. కేవలం కొత్త వారిని, ఆల్ రౌండర్ లు పేరుతో ఉన్న బౌలర్లను మాత్రమే హైదరాబాదు నమ్ముకుంటోంది. ఫలితంగానే చిన్న చిన్న స్కోర్లను సాధించడానికి హైదరాబాద్ భాషలలో ఆపసోపాలు పడుతున్నారు. ఓపెనర్లు అయిపోగానే హైదరాబాద్ ఆట అంత అయిపోయినట్లుగా అనిపిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ పైన ప్రధానంగా దృష్టి పెట్టకపోతే, ఆ జట్టు కనీసం వచ్చే మ్యాచ్‌లోనైనా ఒక విజయమైనా అందుకునే అవకాశం కనిపించడం లేదు. వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయిన హైదరాబాద్ పరిస్థితికి భిన్నంగా ముంబై తన విజయాల ఖాతా ను మొదలు పెట్టిందని చెప్పాలి.

ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి ఊపు మీద ఉన్న బెంగళూరు టీం అదే ఉత్సాహంతో ఆడుతుందా లేక కనబడుతుందా అన్నది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క వరుస ఓటములతో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ మంచి విజయంతో మళ్లీ విజయాలు నమోదు చేయాలని ఆశతో ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp