నన్ను కెప్టెన్సీ నుంచి అన్యాయంగా తొలగించారు: గంగూలీ

By Srinivas Racharla Jul. 24, 2020, 01:30 pm IST
నన్ను కెప్టెన్సీ నుంచి అన్యాయంగా తొలగించారు: గంగూలీ

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన నాయకత్వ ప్రతిభతో విదేశాలలోను టీమిండియాకి విజయాలను సాధించి పెట్టాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో ఇబ్బంది పడుతున్న జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టిన సౌరవ్ గంగూలీ టీమిండియాని అగ్రశ్రేణి జట్టుగా తీర్చిదిద్దాడు.యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంతో పాటు,భారత జట్టుకు దూకుడు నేర్పించాడు.భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపబడ్డ 'ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా' గంగూలీకి అప్పట్లో అనూహ్యంగా సెలెక్టర్లు మొండిచెయ్యి చూపారు.

2005లో భారత జట్టు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో జింబాబ్వే పర్యటనకి వెళ్ళింది. సిరీస్‌ని గెలిచిన టీమిండియా సొంతగడ్డపై సగర్వంగా అడుగుపెట్టింది. కానీ తర్వాతి సిరీస్‌కి గంగూలీని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించారు.చివరకు జట్టులో స్థానానికి కూడా నోచుకోలేదు.ఆనాటి భారత కోచ్ గ్రేగ్ ఛాపెల్, గంగూలీ మధ్య ఏర్పడిన విభేదాల కారణంగానే దాదా జట్టుకు దూరమయ్యాడు. అయితే తాజాగా అప్పట్లో తనని కెప్టెన్సీ నుంచి అన్యాయంగా తప్పించారని 'ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా' ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "జట్టులో స్థానంపై వేటు పడినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. నేను మైదానంలోకి అడుగు పెడితే పరుగులు సాధించగలనని నాకు నమ్మకం. అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్ తన కెరీర్‌లో వసీమ్ అక్రమ్, మెక్‌గ్రాత్, షోయబ్ అక్తర్‌ లాంటి అగ్రశ్రేణి బౌలర్లని ఎదుర్కోలేదు.కానీ నేను వారిని ఎదుర్కొని పరుగులు చేశాను.ఒక్కసారి కాదు,దాదాపు 10 ఏళ్లు టాప్ క్లాస్ బౌలర్లని ఎదుర్కొన్నాను. కాబట్టి మళ్లీ అవకాశం దొరికితే నిరూపించుకుంటానని నాకు తెలుసు. అయితే జట్టు నుంచి తప్పించడంపై మాత్రం అప్పట్లో చాలా బాధపడ్డాను. కానీ ఒక్క క్షణం కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు’’ అని పేర్కొన్నాడు.

ఇక టీమిండియా కోచ్‌గా గ్రేగ్ చాపెల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గంగూలీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు.ఈ క్రమంలో 2005లో అనూహ్యంగా కెప్టెన్సీతో పాటు,జట్టులో చోటు కూడా కోల్పోయాడు.కానీ దేశవాళీ మ్యాచ్‌లలో పరుగుల వరద పారించి ఏడాదికే సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు.2006లో దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టులో తిరిగి స్థానం సంపాదించిన గంగూలీ బ్యాటింగ్‌లో రాణించాడు.కాగా అప్పట్లో దాదాను తొలగించాలని బీసీసీఐకి చాపెల్ పంపిన మెయిల్ లీక్ అవడంతో భారత క్రికెట్‌లో పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.

కాగా 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన దాదా దేశవాళీ క్రికెట్,ఐపీఎల్‌లో 2012 వరకు కొనసాగాడు. గంగూలీ కెప్టెన్సీలో భారత్ 146 వన్డేలు ఆడి 76 మ్యాచ్‌లను గెలవగా,49 టెస్ట్ లు ఆడి 21 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టుకు 113 టెస్ట్‌లు,311 వన్డే మ్యాచ్‌లలో దాదా ప్రాతినిథ్యం వహించాడు.టెస్ట్ ఫార్మాట్‌లో 42.17 సగటుతో 7212 పరుగులు సాధించగా,అందులో 16 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల విషయానికొస్తే 41.02 సగటుతో 11363 రన్స్ చేసిన గంగూలీ 22 శతకాలు బాదాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp