హ్యాపీ బర్త్ డే టూ " ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా "

By Srinivas Racharla Jul. 08, 2020, 03:08 pm IST
హ్యాపీ బర్త్ డే టూ " ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా "

స్వదేశంలోనే భారత్ విజయం సాధించగలదనే అపకీర్తిని చెరిపేస్తూ విదేశీ గడ్డపైన జట్టును విజయాల బాట పట్టించిన సారధి సౌరవ్ గంగూలీ. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుపోయిన దశలో జట్టు పగ్గాలు అందుకున్న సౌరవ్ గంగూలీ తన నాయకత్వ ప్రతిభతో టీమిండియాను అగ్రశ్రేణి జట్టుగా నిలిపి భారత ఉత్తమ కెప్టెన్‌లలో గంగూలీ ఒకరిగా పేరొందారు.

ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు "ది ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా" అని కూడా పిలువబడే సౌరవ్ గంగూలీ బుధవారం తన 48 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.ఈ సందర్భంగా అతనికి ఘనతను మరోసారి గుర్తుచేసుకుందాం.

2002 నాట్‌వెస్ట్ సిరీస్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలవగానే స్టేడియంలోని బాల్కనీలో గంగూలీ షర్ట్ విప్పి గిరగిరా తిప్పటం అప్పట్లో సంచలనంగా మారింది. 2001లో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆయన కెప్టెన్సీలో 2-1 తో గెలిచి బోర్డర్-గవాస్కర్ టోపీని భారత్ కైవసం చేసుకుంది. అలాగే 2003-04 బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో స్టీవ్ వా నాయకత్వంలోని కంగారు జట్టును నిలవరించి సమవుజ్జీ (1-1) గా నిలిచింది.

ఇక ప్రత్యర్థి ఆటగాళ్లు తమ నోటి దురుసుతో స్లెడ్జింగ్‌కి దిగుతుంటే భారత క్రికెటర్లు మౌనంగా ఊరుకుండే రోజులకు స్వస్తి చెప్పి గంగూలీ కెప్టెన్సీలోనే దూకుడుగా బదులు ఇవ్వడం మొదలుపెట్టారు.అంతర్జాతీయ క్రికెట్‌లోకి గంగూలీ నాయకత్వంలో యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్,ఆశిష్ నెహ్రా, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి పలువురు మ్యాచ్ విజేతలు ఆరంగేట్రం చేశారు.

అభిమానులలో " దాదా" గా పేరొందిన గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా 146 వన్డేలు ఆడింది. వాటిలో 76 మ్యాచ్‌లను గెలిచి 65 మ్యాచ్‌లలో ఓడిపోగా మరో 5 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. టెస్టు క్రికెట్‌లో అతని కెప్టెన్సీలో భారత్ 49 మ్యాచ్‌లు ఆడి 21 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇక 13 మ్యాచ్‌లలో ఓటమి పాలవగా 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

వ్యక్తిగత రికార్డులు:

2000-2003 మధ్య కాలంలో అత్యధిక పరుగులు చేసిన గంగూలీ కేవలం 73 మ్యాచ్‌లలో 79.04 స్ట్రైక్ రేట్‌తో 3,346 పరుగులు సాధించాడు.ఈ కాలంలో అతని బ్యాటింగ్ సగటు 50.69 కూడా కనీసం 35 మ్యాచ్‌లు ఆడిన అన్ని టాప్-ఆర్డర్ (1 నుండి 4 స్థానాలు) బ్యాట్స్‌మెన్‌ల కంటే అధికం కావడం విశేషం.ఆనాటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌లైన సయీద్ అన్వర్,నాథన్ ఆస్టెల్, హెర్షెల్ గిబ్స్, రికీ పాంటింగ్, మార్క్ వా,ఇంజామామ్-ఉల్-హక్ వంటి వారి స్ట్రైక్ రేట్‌ కంటే గంగూలీ స్ట్రైక్ రేట్‌ (79.04) ఎక్కువ.

రోహిత్ శర్మ తర్వాత ప్రపంచ కప్‌ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు (3) చేసిన భారత బ్యాట్స్‌మన్‌ ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా మాత్రమే.క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్‌లో అరంగేట్రం (1996) చేసిన సౌరవ్ గంగూలీ 131 పరుగులు చేశాడు.2003 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కెన్యాపై 111 పరుగులతో, గంగూలీ ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు అయ్యాడు.

1999 ప్రపంచ కప్‌లో శ్రీలంకపై 183 పరుగులు చేసి 16 ఏళ్ల భారత బ్యాట్స్‌మన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. అదే ఇన్నింగ్స్‌లో అతను రాహుల్ ద్రావిడ్‌తో కలిసి వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.వీరు సాధించిన 318 పరుగులు రెండు వికెట్‌కు మూడో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం.

భారత్ తరఫున లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా గంగూలీ టెస్టులు, వన్డే రెండింటిలోనూఅత్యధిక పరుగులు చేశాడు. లెఫ్ట్ హ్యాండర్‌గా 113 టెస్టులలో 7,212 పరుగులు చెయ్యగా,311 వన్డేలాడి 11,221 పరుగులు సాధించాడు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా దాదా కొనసాగుతున్నాడు.

చివరగా ఐసీసీ చైర్మన్ పదవి రేసులో కూడా పేరు వినిపిస్తున్న గాడ్ ఆఫ్ ఆఫ్-సైడ్ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని iDreamPost టీం కోరుకుంటూ...... హ్యాపీ బర్త్ డే టూ సౌరవ్ గంగూలీ.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp