హ్యాపీ బర్త్‌ డే భల్లే భల్లే హర్భజన్ సింగ్

By Srinivas Racharla Jul. 03, 2020, 03:56 pm IST
హ్యాపీ బర్త్‌ డే భల్లే భల్లే హర్భజన్ సింగ్

అభిమానులు ముద్దుగా భజ్జీ అని పిలిచే భారత 'దూస్రా' ల కింగ్ హర్భజన్ సింగ్ ఇవాళ 40వ పడిలోకి అడుగుపెట్టాడు.హర్భజన్ అనగానే ఐపీఎల్‌లో శ్రీశాంత్‌ చెంప చెల్లుమనిపించడం, సైమండ్స్‌తో 'మంకీ గేట్ ' వివాదం వెంటనే గుర్తుకు వస్తాయి.కానీ టెస్టులలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌ హర్భజన్ సింగేనని మరవకూడదు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి పంజాబీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 1998 ప్రారంభంలో అరంగేట్రం చేశాడు.కెరీర్ ఆరంభంలో తన బౌలింగ్ యాక్షన్‌పై భజ్జీ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సమస్య పరిష్కారం తర్వాత కూడా తన నోటి దురుసుతో హర్భజన్ వివాదాలకు అడ్రస్ గా మారాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ చేపట్టిన క్రమశిక్షణ చర్యలు అతని కెరీర్ ప్రారంభంలో ప్రభావితమయ్యాయి. అయితే 2001లో లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడటంతో కెప్టెన్ సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని జట్టులో చేర్చాలని సెలెక్టర్‌ల పిలుపు హర్భజన్ కెరీర్‌ను మలుపు తిప్పింది.

2001లో భారత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టు సిరీస్‌లో భజ్జీ అద్భుత బౌలింగ్ ప్రదర్శనను కనపరచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఆ టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు.ఇక బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో తన దూస్రా బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మన్‌లను వణికించిన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ 32 వికెట్‌లని పడగొట్టడం ద్వారా జట్టులో స్పిన్నర్‌గా స్థిరపడ్డాడు.ఆ తర్వాత కూడా అనిల్ కుంబ్లేతో కలిసి పలు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్‌‌ విజయాలకి హర్భజన్ బాటలు వేశాడు.

ఐపీఎల్‌ 2008 సీజన్‌లో తనని కవ్వించిన సహచర బౌలర్ ఎస్.శ్రీశాంత్‌పై చేయి చేసుకున్న హర్భజన్ సంవత్సరం పాటు నిషేధానికి గురయ్యాడు.అదే ఏడాది ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని కోతితో పోల్చి ‘మంకీ గేట్’ వివాదానికి తెరలేపాడు.ఈ వివాదాల మధ్య హర్భజన్ సింగ్ కెరీర్ ముగిసిపోయిందని క్రీడా విశ్లేషకులు భావించారు.కానీ భజ్జీ పట్టుదలతో దేశవాళీ పోటీలలో రాణించి తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు.2011లో వన్డే విశ్వవిజేతగా నిలిచిన భారత్‌కి ప్రాతినిథ్యం వహించాడు.ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్ జట్టు తరుపున హర్భజన్ సింగ్ ఆడుతున్నాడు.ఇటీవల సెలక్టర్లు చాన్స్ ఇస్తే మళ్లీ టీమిండియాకి ఆడేందుకు సిద్ధమేనని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ప్రకటించాడు.

2015 లో వన్డే మరియు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన హర్భజన్ సింగ్ 2016లో ఆఖరిగా భారత్ తరుపున టీ-20 మ్యాచ్ ఆడాడు.ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో భజ్జీ 103 టెస్టులు, 236 వన్డేలు,28 టీ-20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు.
iDreamPost టీం నుంచి భల్లే భల్లే హర్భజన్ సింగ్ కి జన్మదిన శుభాకాంక్షలు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp