చివరి 'టెస్టులో' గెలుపెవరిదో?

By Rishi K Mar. 04, 2021, 08:40 am IST
చివరి 'టెస్టులో' గెలుపెవరిదో?

భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న టెస్టు సమరం చివరి అంకానికి చేరుకుంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం తర్వాత అసాధారణంగా పుంజుకున్న భారత్ తన స్పిన్ అస్త్రంతో ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. ముఖ్యంగా మూడో టెస్టులో అహ్మదాబాద్ లోని మొతేర మైదానంలో జరిగిన పోరు రెండు రోజుల్లోనే ముగియడంతో కొందరు మాజీ క్రికెటర్లు పిచ్ తీరుపై విమర్శలు చేసారు. కాగా చివరిదైన నాలుగో టెస్టు కూడా అదే మైదానంలో జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి మళ్ళీ పిచ్ పై పడింది. కానీ ఈసారి జరిగేది డే మ్యాచ్ కాబట్టి మూడో టెస్టులో ఎదురైన పరిస్థితులు ఎదురవ్వకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ టెస్టు మ్యాచ్‌ గెలిచినా, కనీసం డ్రా చేసుఇంగ్లండ్‌కున్నా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు భారత్ చేరుతుంది. ఒకవేళ అనూహ్యంగా భారత్ ఓడిపోతే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న నేపథ్యంలో భారత్ విజయం సాధిస్తే న్యూజిలాండ్ తో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. నేటి ఉదయం 9.30 నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే నాలుగో టెస్టులో భారత్, ఇంగ్లండ్‌లు తలపడనున్నాయి.

ఇంగ్లండ్ ఎదురు నిలిచేనా?

తొలి టెస్టులో భీకర పోరాటం చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ రెండో టెస్ట్ నుండి స్పిన్ ఉచ్చులో చిక్కారు. రూట్, బెయిర్ స్టో,బెన్ స్టోక్స్, క్రాలీ, సిబ్లీలు స్పిన్ ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. గత రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ అందరూ గత నాలుగు ఇన్నింగ్స్ ల్లో చేసిన పరుగులు 134, 164, 112, 81 మాత్రమే. ఈసారి మాత్రం పట్టుదలతో భారత బౌలింగ్ ను ఎదుర్కొని పరుగులు సాధించాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ జట్టు ఉంది. మూడో టెస్టులో కేవలం ఒక్క స్పిన్నర్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు స్పిన్ అవసరం ఏంటో తెలిసొచ్చింది. ముఖ్యంగా మరో స్పిన్నర్ బాధ్యతను తనపై వేసుకుని రూట్ బౌలింగ్ లో చెలరేగి 5 వికెట్లను సాధించాడు. కాగా ఈసారి లీచ్ కి తోడుగా బెస్ తుది జట్టులోకి రానున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌ను తమ బౌలింగ్ తో తక్కువ స్కోరుకే కట్టడి చేయాలని ప్రణాలికలు రచిస్తున్నారు.

భారత బ్యాట్స్‌మెన్‌ పోరాడేనా?

ఏదో స్పిన్నర్ల పుణ్యమా అని తొలి టెస్టు మినహా మిగిలిన టెస్టులు గెలిచిన భారత జట్టును బ్యాట్స్‌మెన్‌ పోరాటలేమి కలవర పెడుతుంది. స్పిన్నర్ల అసాధారణ ప్రదర్శనతో భారత బ్యాట్స్‌మెన్‌ లోపాలు వెలుగులోకి రాలేదు కానీ కోహ్లీ, రహానే, పుజారా, శుబ్‌మన్‌ గిల్‌లనుంచి కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. వీరంతా తిరిగి బ్యాటింగ్ లో సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్షర్ పటేల్,అశ్విన్ మరోసారి సత్తా చాటితే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం. వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులో తీసుకుంటున్నామని కోహ్లీ స్పష్టం చేశాడు. దాంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. రోహిత్ తర్వాత భారత్ తరపున అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌ అశ్విన్ కావడం విశేషం. భారత జట్టు తమ బ్యాటింగ్ లో లోపాలను సరి చేసుకుని సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా భారత జట్టు ఈ టెస్టుతో 550 టెస్టులు ఆడిన నాలుగో జట్టుగా రికార్డు సృష్టించనుంది. మరి స్పిన్ పిచ్ లో గెలిచేదెవరో కాసేపట్లో తెలిసిపోనుంది..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp