మా దిగ్గజ ఆటగాళ్లతోనే నన్ను పోల్చండి అంటున్న పాక్ స్టార్ బ్యాట్స్‌మన్‌

By Srinivas Racharla Jul. 03, 2020, 06:02 pm IST
మా దిగ్గజ ఆటగాళ్లతోనే నన్ను పోల్చండి అంటున్న పాక్ స్టార్ బ్యాట్స్‌మన్‌

క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన క్రికెట్ షాట్లు ఆడుతూ బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తుండడంతో పాక్ అభిమానులు అతడ్ని ముద్దుగా ‘పాక్ కోహ్లీ’ అని పిలుచుకుంటారు.అలాగే పలు సందర్భాలలో పాక్ మాజీ క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీ,తమ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ని పోల్చి మాట్లాడుతుంటారు.

గతంలో ఎవరైనా తనని విరాట్ కోహ్లీతో పోలిస్తే పాక్ యువ బ్యాట్స్‌మన్‌ బాబర్ అజామ్ సంతోష పడేవాడు. స్వయంగా బాబర్ ఎన్నోసార్లు కోహ్లీ స్థాయికి ఎదగాలని,అతడిలా పరుగులు సాధించాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కానీ తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనని పోల్చొద్దని పాకిస్థాన్ లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ కోరి అందరిని ఆశ్చర్య పరిచాడు.

అయితే ఇంగ్లాండ్ పర్యటనకు అతని చేతికి టీ-20,వన్డే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు.ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ గడ్డపై ఎదురయ్యే సవాల్‌ను దృష్టిలో పెట్టుకొని పాక్ మాజీ క్రికెటర్ల నుంచి విమర్శల్ని తప్పించుకునేందుకు కోహ్లీతో పోలికకి పుల్ స్టాప్ చెప్పాలని బాబర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ బాబర్ అజామ్ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,"నన్ను విరాట్ కోహ్లీతో పోల్చకండి.ఎవరితోనైనా పోల్చాలని అనుకుంటే పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్లు జావెద్ మియాందాద్,ఇంజమామ్‌ ఉల్‌ హక్,మహమ్మద్ యూసఫ్,యూనిస్‌ ఖాన్‌లతో పోల్చండి.వారితో నన్ను పోలిస్తే నా ఘనతల పట్ల సంతోషిస్తా.ఇక ఇంగ్లాండ్‌ సిరీస్‌లో నా సహజసిద్ధమైన బ్యాటింగ్‌ని ప్రదర్శిస్తాను. నా షాట్ సెలక్షన్ పిచ్ స్వభావం,బౌలర్‌లకి అనుగుణంగా మార్చుకుంటా’’ అని వెల్లడించాడు.

ఇక ఈ మధ్యకాలంలో ఇద్దరు బ్యాట్స్‌మన్‌లు వ్యక్తిగతంగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్నందున అభిమానులు బాబర్‌ను తరచుగా కోహ్లీతో పోలుస్తున్నారు. పైగా భారత్‌కి విరాట్ కోహ్లీ ఉంటే పాకిస్థాన్‌కి బాబర్ అజామ్ ఉన్నాడంటూ పాక్ అభిమానులు,మాజీ క్రికెటర్లు గర్వంగా చెప్పేవారు.

2008లో ఆరంగేట్రం చేసిన భారత్ సారధి విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులు, 248 వన్డేలు, 81 టీ-20 మ్యాచ్‌లాడాడు.మూడు ఫార్మాట్లలోనూ 50కిపైగా సగటుతో పరుగుల యంత్రం కోహ్లీ 70 శతకాలు సాధించాడు.మూడు ఫార్మాట్లలోనూ టాప్‌-10 బ్యాట్స్‌మన్‌ జాబితాలో విరాట్‌ ఉన్నాడు.ఇక 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన బాబర్ అజామ్ 26 టెస్టులు,74 వన్డేలు, 38 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు.ఇప్పటివరకు పాక్ ఆటగాడు 16 సెంచరీలు చేశాడు. బాబర్ సగటు వన్డేలలో 50కి పైగా ఉండగా,టెస్టులలో 45.12 మాత్రమే సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో కోహ్లీ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ కాగా టీ-20లలో ఆజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే మూడు టెస్టులు,మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీస్‌ కోసం ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 20 మంది ఆటగాళ్ల పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp