భారత జట్టుకు జరిగిన అవమానం గురించి చెప్పిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్

By Srinivas Racharla Jun. 26, 2020, 10:54 pm IST
భారత జట్టుకు జరిగిన అవమానం గురించి చెప్పిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్

గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌‌ సమయంలో భారత జట్టుకు జరిగిన అవమానం గురించి భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వెల్లడించాడు. తాజాగా భారత్‌ ఆర్మీ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రోజు జరిగిన బాధాకరమైన సంఘటనను ప్రస్తావించాడు.

చిరకాల ప్రత్యర్థి పాక్ అభిమాని దూషణ పర్వం గురించి శంకర్‌ తెలియజేస్తూ "దాయాది పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు తనకు జట్టులో స్థానం కల్పిస్తున్నట్లు యాజమాన్యం తెలియజేసింది. అందుకు నేను సిద్ధంగా ఉండటంతో సంతోషంగా ఒప్పుకున్నాను. తర్వాత నేను మిగితా ప్లేయర్స్ కలిసి కాఫీ కోసం బయటకు వెళ్లాం. అయితే అక్కడ పాకిస్థాన్‌కు చెందిన ఓ అభిమాని మా దగ్గరకు వచ్చి  తిట్లదండకం ప్రారంభించాడు.. పైగా అతను మాపై దుర్భాష‌లాడుతూనే వీడియో రికార్డింగ్‌ చేశాడు. అయినప్పటికి మేము సహనం కోల్పోకుండా మిన్నకుండి పోయాము. భారత్‌-పాక్ మ్యాచ్‌కు సంబంధించి తొలి అనుభవం నాకది" అని పేర్కొన్నాడు. 

ఇక మ్యాంచెస్టర్‌ వేదికగా తర్వాతి రోజు జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మకి తోడుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడి పాక్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. హిట్ మ్యాన్ 113 బంతులలో 14 ఫోర్లు,3 సిక్స్‌లతో 140 పరుగులు చేయగా,కెప్టెన్ విరాట్ కోహ్లీ 65 బంతులలో 7 ఫోర్ల సహాయంతో 77 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పాక్ బ్యాట్స్‌మన్‌లకు తమ అద్భుత బౌలింగ్‌తో భారత బౌలర్లు కళ్లెం వేశారు. ఈ క్రమంలో పాక్ 40 ఓవర్లలో ఆరు వికెట్లకు 212 పరుగులు చేసిన దశలో మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. వాన ఎంతకి ఆగకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్ 89 పరుగుల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు.

ఈ మ్యాచ్‌లో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌కి దిగిన విజయ్ శంకర్ 15 పరుగులు చేసి బౌలింగ్‌లో 5.2 ఓవర్లు వేసి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. తన తొలి బంతికే ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(7)ను ఎల్బీగా ఔట్ చేసిన విజయ్ తర్వాత పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(12) బౌల్డ్‌ చేశాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో తన తొలి బంతికే వికెట్‌ తీసిన మూడో ఆటగాడిగా విజయ్‌ శంకర్‌ రికార్డు నెలకొల్పాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp