సోషల్ మీడియా యుద్ధాలు

By Kiran.G Dec. 07, 2019, 03:18 pm IST
సోషల్ మీడియా యుద్ధాలు

ఒక భారత పైలట్ తీవ్రమైన "మానసిక ఒత్తిడితో" బాధపడుతున్నాడు.. అది ఒకరోజు తీవ్రంగా మారి "పిచ్చి" స్టేజికి మారిపోయింది... కానీ ఎవ్వరూ దాన్ని గుర్తించలేదు.. తానుమాత్రం యధావిధిగా విధులకు హాజరు అయ్యాడు.. ప్రయాణికులతో కలిసి విమానంలో బయలుదేరాడు.. మార్గం మధ్యలో గమ్యస్థానానికి చేరడానికి ముందే అతనిలో ఉన్న పిచ్చి జబ్బు బయటకు వచ్చింది.. ఏం చేస్తున్నాడో విమానం ఎందుకు నడుపుతున్నాడో గుర్తించే స్థితిలో అతను లేడు. పిచ్చిపిచ్చిగా అరుస్తూ విమానాన్ని ఒక కొండకు ఢీ కొట్టాడు. విమానంలో ఉన్న అందరు ప్రయాణికులు ఆ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

విమానం ఎందుకు పడిపోయిందో విచారణ మొదలయ్యింది. ఈలోపు విమాన ప్రమాదం గురించి మీడియాలో హడావిడి మొదలైంది. సోషల్ మీడియాలో మాత్రం విచారం తెలుపుతూ RIP పోస్ట్స్ పెట్టడం మొదలయ్యింది. ఆ పోస్టులు చూసిన అందరూ చు.. చు.. చు.. అంటూ సంతాపం తెలిపారు. పైలట్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా, కొండకు ఢీకొట్టాడని విచారణలో వెల్లడయ్యిందని కొన్నిగంటల తర్వాత వార్తల్లో చెప్పారు. వెంటనే నెటిజన్లు అతని "కులం" ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో వెతకడం ప్రారంభించారు. మొత్తానికి పైలట్ కులం తెలుసుకున్నారు. వెంటనే ఆ ప్రమాదానికి "కులం" రంగు పులిమి, ఒకరి కులాన్ని వేరొకరు తిట్టుకుంటూ సోషల్ మీడియా గోడలపై పిడకలు కొడుతూ కాలం గడిపారు. ఒకరి కులాన్ని మరొకరు పచ్చి బూతులు తిట్టుకుంటూ తమ మనసులో లోలోపల జీర్ణించుకుపోయి నిద్రాణంగా ఉన్న అహాన్ని బయటపెట్టుకున్నారు.

ఈలోపు కొత్త వార్త తెలిసింది. విమానం పడిపోవడానికి ముందు పైలట్ పిచ్చిపిచ్చిగా కేకలు వేసినట్లు, విమానం కాక్ పిట్ రికార్డర్ లో అతని అరుపులు రికార్డు అయినట్లు ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందని, అతను "మతమార్పిడి" చేసుకుని ఉండొచ్చని, అందుకే పైలట్ అలా చేసి ఉండొచ్చని, న్యూస్ ఛానెల్స్ న్యూస్ ని వండి, చూసేవాళ్లకు రుచికరంగా వడ్డించాయి. ఫలానా మతం వాళ్లంతా అంతే.., వాళ్ళందరిని దేశంలోనుండి వెళ్ళగొట్టండి అని కొందరు సోషల్ మీడియా సమరయోధులు గగ్గోలుపెట్టి, మళ్ళీ ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. అది చూసిన వేరే మతస్తులు, మీ మతంలో ఉన్న తప్పులు చూపిస్తున్నామని మాపై అభాండాలు వేస్తున్నారా అని తీవ్రంగా తిట్టుకుంటూ, సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం చేసారు.. ఇలా మతస్తులు కొట్టుకుంటుంటే, మేము ఏ మతానికి చెందినవాళ్ళం కాదు, ఇలా తోటివారితో ఘర్షణ పడాల్సి వస్తుందనే మేము మతాలను నమ్మం, మీలో మీరే తన్నుకుచావండని హేళన చేస్తూ, వెకిలిగా నవ్వారు నాస్తికులు. ఇప్పటికైనా మతాలను వదిలి మనుషులుగా మారండని సోషల్ మీడియాలో ఉపన్యాసాలు ఇవ్వడం స్టార్ట్ చేసారు నాస్తికులు .

ఇలా రెండు రోజులు గడిచాయి. పైలట్ ఇంటిని చెక్ చేసిన పోలీసులకు అతని మెడికల్ రిపోర్ట్స్ దొరికాయి. వాటిపై పరిశోధన జరిగింది. తర్వాత, అతను మానసికంగా కృంగిపోయి, పిచ్చోడు అయ్యి ఉంటాడని ఒక నిర్దారణకు వచ్చారు. ఈలోపు పోస్టుమార్టం రిపోర్ట్ లో అతని జబ్బుపై క్లారిటీ వచ్చింది. కాబట్టి ఆ పైలట్ కి పిచ్చెక్కి ఇదంతా చేసాడని ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు వైద్యులు. కానీ న్యూస్ ఛానెల్స్, ఈ అసలైన "వార్తను" అంతగా పట్టించుకోలేదు. ఈలోపు దేశభక్తి పండుగ వచ్చింది. దానిపై స్పెషల్ బులెటిన్ న్యూస్ వచ్చింది. ఇంతకుముందు సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకున్న పెద్దలందరూ, జాతీయ జెండాని 15 మందికి షేర్ చేసి మీ దేశభక్తిని నిరూపించుకోమని, మనమంతా ఒకే తల్లి కడుపున పుట్టకపోయిన, ఒకే దేశంలో పుట్టిన సోదరులమని, ఒకరికొకరు దేశ భక్తితో కూడిన మెసేజులు,జాతీయ జెండాలు "ఫార్వర్డ్" చేసుకున్నారు,అలా మెసేజులు జెండాలు ఫార్వర్డ్ షేర్ చేసి తమలో దేశభక్తి మెండుగా ఉందని సంతృప్తిగా నిద్ర పోయారు.. మొత్తానికి రెండురోజులు గడిచాయి. పాత సంఘటనపై ఉన్న ఆసక్తి పోవడంతో కొత్త ఇష్యూ కోసం ఎడారివర్షం కోసం ఎంతగా ఎదురుచూస్తుందో,అంతలా ఎదురుచూస్తున్నారు నెటిజన్లు తన్నుకు చావడానికి...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp