అత్యాచార ఘటనలో అమ్మాయిదే తప్పు

By Kiran.G Nov. 27, 2019, 03:08 pm IST
అత్యాచార ఘటనలో అమ్మాయిదే తప్పు

అత్యాచారానికి సంబంధించిన కేస్ ఒకటి కోర్ట్ లో విచారణకు వచ్చింది. ఇద్దరు లాయర్లు వాదించుకుంటున్నారు. జడ్జ్ గారు వాదనలు వింటున్నారు.

స్వేచ్చా రావ్ :- నా క్లయింట్ ఊరువెళ్తూ అర్ధరాత్రి పూట, ఆటో కోసం ఎదురు చూస్తుంటే ఈ మృగం కర్కశంగా,అమానుషంగా,క్రూరంగా సాటి మనిషి అనే విచక్షణ లేకుండా అత్యాచారం చేసాడు. ఇలాంటి వ్యక్తులను యట తిరగనివ్వకుండా, మరొకరు అలాంటి తప్పు చేయకుండా కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను జడ్జిగారు.

సంస్కృతీ రావ్ :- స్వేచ్చా రావ్ గారి వాదనలో నిజం లేదు జడ్జి గారు. ఈ సంఘటనలో నా క్లయింట్ తప్పు ఏమి లేదు. అసలు అర్ధరాత్రి ఈ ఆడవాళ్ళని ని బయట తిరగమని ఎవరు చెప్పారు. ఆ సమయంలో బయట తిరిగితే ఏ మగాడు ఉరుకుంటాడు. తప్పంతా ఆ అమ్మాయిదే. తాను బయటకు రాకుండా ఉంటే అసలు ఈ ఘోరం జరిగేది కాదు. అసలు ఎటు పోతుంది మన సంస్కృతి?. అర్ధరాత్రి ఆడపిల్లలు బయటకు తిరిగే సంస్కృతి మనది కాదు. ముమ్మాటికీ ఇది ఆ అమ్మాయి నిర్లక్ష్యం వల్లే ఈ తప్పు జరిగింది. ఆఖరికి అర్ధరాత్రి మందులు అత్యవసరమై భర్త ప్రాణాలు పోతున్నా, అర్ధరాత్రి కాబట్టి బయటకు రాకుండా భర్తకు సేవలు చేస్తూ,భర్త పక్కనే భార్య ఉండే సంస్కృతి మనది. ఒకవేళ భర్త చనిపోతే భర్తతో పాటుగా సతీసహగమనం చేసి భార్యప్రేమను నిరూపించుకోవాల్సిన సంస్కృతీ సంప్రదాయం మనది. అలాంటిది ఆడది ఒంటరిగా అర్ధరాత్రి బయటకు రావడమా?హవ్వా ఇదెక్కడి చోద్యం జడ్జి గారు?

స్వేచ్చా రావ్:- సంస్కృతీ రావ్ గారు అంటే ఆడది ఒంటరిగా అర్ధరాత్రి కనపడితే అత్యాచారం చేసేస్తారా?? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు కొంచెమైనా అర్థం అవుతుందా?? అంటే ఆడవాళ్ళ స్వేచ్ఛని హరించేవిధంగా మీ వాదన ఉంది. అమ్మాయిదే తప్పని మాట్లాడటం మీకు న్యాయంగా ఉందా? దీనికి సంస్కృతికి లంకె ఎందుకు వేస్తున్నారు? సంస్కృతీ రావ్ గారి వాదన సమంజసంగా లేదు జడ్జి గారు..

సంస్కృతీ రావ్:- స్వేచ్చా రావ్ గారు అత్యాచారానికి అదొక్కటే కారణమని ఎలా అనుకుంటున్నారు. ఆవిడ ఆ సమయంలో, మోడరన్ డ్రెస్ ధరించింది. అలాంటి బట్టలు ధరించడమే అత్యాచారం చేయడానికి అసలు కారణం. నిజానికి అత్యాచారం చేయాలనే ఆలోచన నా క్లయింట్ కి వచ్చేది కాదు. కాని ఆ డ్రెస్ చూసాకే లేని ఆలోచన తనలో వచ్చింది. ఇది ముమ్మాటికీ ఆ అమ్మాయి తప్పే. ఆ డ్రెస్ కాకుండా నిండుగా ఒంటినిండా శరీరం కనపడకుండా, దుప్పటి లేదా శాలువా ఒకటి కప్పుకుని రావాలి కదా... అది కూడా ఆమె చేయలేదు.. కాబట్టి తనదే తప్పు.. నా క్లయింట్ కి తనని చూడగానే కోరిక కలిగేలా చేసి తప్పు చేసింది.. అసలు మన సంస్కృతి ఎటు పోతుంది.. పరాయి దేశాల వారు మనల్ని చూసి నేర్చుకుంటుంటే, మన ఆడవాళ్లు పాశ్చాత్య దేశాలవారిని చూసి చెడిపోతున్నారు..

స్వేచ్చా రావ్:- సంస్కృతీ రావ్ గారు... అంటే డ్రెస్ సరిగా లేదని అత్యాచారం చేస్తారా?? అసలు మీరు మాట్లాడుతుంది మీకన్నా అర్థం అవుతుందా?? ఆ అబ్బాయి ఆలోచనా విధానం చాలా తప్పు.. ఇలా అడ్డంగా వాదిస్తారెంటి?? తనకి నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఆడవారికి లేదా? మళ్ళీ గౌరవప్రదమైన న్యాయవాద వృత్తిలో ఉండి ఆ అమానుష చర్యను సమర్ధిస్తూ వాదించడానికి మీకు మనసెలా వచ్చింది. ?

సంస్కృతీ రావ్:- ఏంటి అమానుషంగా వాదించేది. అసలు అడ్డంగా వాదించేది మీరా నేనా??. నాకో ఫామిలీ ఉంది. మా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు. సాయంత్రం 5 దాటితే బయటకు వెళ్ళరు. ఒకవేళ వెళ్లినా ఒళ్ళు మొత్తం కప్పుకునేలా బట్టలు వేసుకుంటారు. అయినా సరే చాలా ఆనందంగా ఉన్నారు. అందుకే మా ఫామిలీలో ఉన్న ఆడవాళ్ళ పై అత్యాచారాలు జరగవు. కానీ ఈ అమ్మాయి అలా కాకుండా అర్థరాత్రి రోడ్డు ఎక్కింది. మోడరన్ డ్రెస్ లు వేస్కుని మగాళ్లను రెచ్చగొట్టి అత్యాచారం చేయించుకుని, మళ్ళీ ఏమి తెలియని "నంగనాచిలా" నా క్లయింట్ పై కేస్ పెట్టింది. ఇలాంటి క్యారెక్టర్ లేని ఆడవాళ్ళను చూస్తే నాకు అసహ్యం. మేము మృగాళ్ళం సారూ.. జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్లే. మళ్ళీ తప్పులు వాళ్ళు చేసి కేసులు మాపై పెడితే మేం ఎలా ఊరుకుంటామని అనుకుంటున్నారు.. అసలు మన సంస్కృతిని దెబ్బతీసేలా చేస్తున్న ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మన దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నా క్లయింట్ లో లేని ఆలోచన పుట్టించి, తప్పు పని చేసేలా ప్రోత్సహించిన ఆ అమ్మాయిని కఠినంగా శిక్షించాలని సవినయంగా కోరుతున్నాను జడ్జ్ గారు. ఆ అమ్మాయి చేసిన తప్పు పని వల్ల నా క్లయింట్ పరువు ప్రతిష్టలు మంటగలిశాయ్. అసలు తప్పు చేయని నా క్లయింట్ ని విడుదల చేసి ఇన్ని తప్పులు చేసిన ఆ అమ్మాయిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ నా వాదన ముగిస్తున్నాను.

స్వేచ్చా రావ్:- ?????

అమ్మాయి:- ?????

జడ్జ్:- ????????
(పొలాచ్చి అత్యాచార ఘటనలో దర్శకుడు భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు ఆధారంగా)

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp