పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు.. జడ్పీ పీఠాలు అధిరోహించబోయేది వీరేనా..?

By Karthik P Sep. 19, 2021, 09:30 pm IST
పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు.. జడ్పీ పీఠాలు అధిరోహించబోయేది వీరేనా..?

ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. పంచాయతీ, మున్సిపల్‌ ఫలితాల జోరును అధికార పార్టీ పరిషత్‌ ఎన్నికల్లోనూ కొనసాగించింది. అత్యధిక ఎంపీటీ సీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. అన్ని మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఆ పార్టీ కైవసం చేసుకుంది. కోర్టు వివాదాలతో ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా సమయం వృథా అయిన నేపథ్యంలో.. పాలకవర్గాలను వెంటనే కొలువుదీరేలా రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 24వ తేదీన ఎంపీపీ, 25వ తేదీన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని నోటిఫికేషన్‌ జారీ చేశారు.

దాదాపు రెండున్నరేళ్ల నుంచి ఖాళీ ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు ఇకపై కళకళలాడబోతున్నాయి. ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ పదవులు ఎవరికి కట్టబెట్టాలనేది అధికార వైసీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 13 జిల్లా జడ్పీ పీఠాలకు రిజర్వేషన్ల ఆధారంగా.. ఆది నుంచి పార్టీలో ఉంటూ పని చేసిన వారికి, వివిధ సందర్భాల్లో పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి వైసీపీ అధిష్టానం పెద్దపీట వేయాలని నిర్ణయించుకుంది.

Also Read : ఈనాడు ఉద్యోగుల రిటైర్మెంట్ నిజంగానే స్వచ్చందమా ?

ఉత్తరాంధ్రలో..

శ్రీకాకుళం జడ్పీ పీఠం జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ అయింది. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న వరుదు కళ్యాణికి జడ్పీ పీఠం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. పరిషత్‌ ఎన్నికల ప్రారంభంలో వరుదు కళ్యాణితోపాటు.. అచ్చెం నాయుడుపై పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి కూడా రేసులో ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవికి దక్కడంతో.. వరుదు కళ్యాణికి లైన్‌ క్లియర్‌ అయిందని చెప్పవచ్చు.

విజయనగరం జడ్పీ పీఠం జనరల్‌ అయింది. అయితే ఈ పీఠం బీసీలకే దక్కబోతోంది. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతం అయ్యేలా పని చేసిన చిన్ని శ్రీనుకు జడ్పీ పీఠం దక్కబోతోంది. మంత్రి బొత్స సత్యానారయణకు చిన్ని శ్రీను సమీప బంధువు కూడా కావడంతో ఆయన ఎంపిక లాంఛనమే.

విశాఖ జిల్లా పరిషత్‌ పీఠం ఎస్టీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ పీఠం మాజీ మంత్రి బాలరాజు కుమార్తెకు దక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బాలరాజు.. ఆ తర్వాత జనసేనకు దూరంగా ఉన్నారు. 2020 మార్చిలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

Also Read : బాలాపూర్‌ లడ్డు.. జగన్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన ఎమ్మెల్సీ

గోదావరి జిల్లాల్లో..

తూర్పుగోదావరి జిల్లా పీఠం ఎస్సీ రిజర్డ్వ్‌ అయింది. ఈ పదవి కోసం విప్పర్తి వేణుగోపాల్, మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు కృష్ణారెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరిగేషన్‌ శాఖలో సూపరిండెంటెంట్‌గా పని చేసి రిటైర్‌ అయిన వేణుగోపాల్‌.. పి.గన్నవరం సీటును ఆశించారు. అయితే 2014, 2019లోనూ ఆయనకు దక్కలేదు. పార్టీలో ఆది నుంచి ఉండడం, విద్యాధికుడు కావడం వేణుగోపాల్‌కు కలసి వచ్చే అంశాలు. కుమారుడు కోసం పినిపే కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పినిపేకు ఉన్న మంత్రి పదవి.. ఆయన కుమారుడుకు జడ్పీ పీఠం దక్కే సమయంలో అడ్డువచ్చే అవకాశం ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన కవురు శ్రీనివాస్‌కు ఈ పీఠం దక్కే అవకాశాలున్నాయి. పార్టీలో ఆది నుంచి ఉన్న ఆయన ఆచంట టిక్కెట్‌ ఆశించారు. టిక్కెట్‌ దక్కకపోయినా.. పార్టీ కోసం పని చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన్ను డీసీసీబీ చైర్మన్‌గా నియమించింది. అయితే జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న కవురు.. యలమంచిలి నుంచి జడ్పీటీసీగా గెలిచారు. సీఎం వైఎస్‌ జగన్‌ కూడా కవురు శ్రీనివాస్‌ వైపు మొగ్గుచూపే అవకాశలు మెండుగా ఉన్నాయి.

Also Read : తెలుగు రాష్ట్రాల సీఎంల మనసులోని మాట కూడా చెబుతోన్న రాధాకృష్ణ

కోస్తాలో..

కృష్ణా జిల్లాలో కూడా జ‌న‌ర‌ల్ ఉమెన్ రిజ‌ర్వుడు సీటులో బీసీ మ‌హిళ‌కు అవ‌కాశం ఇచ్చేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే పెడ‌న టికెట్ ఆశించిన ఉప్పాల రాం ప్ర‌సాద్ కుటుంబానికి ద‌క్క‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. జ‌న‌ర‌ల్ ఉమెన్ కి కేటాయించాల‌ని నిర్ణ‌యిస్తే మాత్రం కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ మాజీ ఎమ్మెల్యే దుట్టా రామ‌చంద్ర‌రావు కుమార్తెకి అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా. ఇందులో దుట్టా కుమార్తె , ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ డాక్ట‌ర్స్ వింగ్ అధ్య‌క్షుడిగా ఉన్న డాక్ట‌ర్ గోసుల శివ‌భ‌ర‌త్ రెడ్డి భార్య కావ‌డంతో ఆమెకు క‌లిసి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ బీసీ ఉమెన్ కి చైర్ ప‌ర్స‌న్ ఇస్తే దుట్టా కుటుంబానికి వైస్ చైర్మన్ షిప్ అయినా ఖాయంగా క‌నిపిస్తోంది.

గుంటూరు జడ్పీ పీఠం ఎస్సీ మహిళకి రిజ‌ర్వ్ అయ్యింది. తాడికొండ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ క్రిస్టినాకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తె కూడా రేసులో ఉన్నారు. పోటీ ఉన్న‌ప్ప‌టికీ అధినేత వైఎస్ జగన్ ఆశీస్సులు పుష్క‌లంగా ఉండ‌డంతో క్రిస్టినా కలిసివచ్చే అంశం.

ప్రకాశం జిల్లా పరిషత్‌ పీఠం జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ అయింది. ఈ పీఠం దర్శి మాజీ ఎమ్మెల్యే, దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మకు ఖాయం అయింది. గత ఎన్నికల్లో దర్శి టిక్కెట్‌ను వదులుకున్న బూచేపల్లికి.. జడ్పీ పీఠం హమీ దక్కింది. జనరల్‌ అయితే శివప్రసాద్‌ రెడ్డి జడ్పీ చైర్మన్‌ అవుతారని భావించారు. అయితే జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో వెంకాయమ్మకు వైసీపీ అభ్యర్థిత్వం దక్కింది. ఆమె గతంలో చీమకుర్తి ఎంపీపీగా పని చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జరనల్‌ మహిళలకు రిజర్వ్‌ అయింది. ఈ పదవి ఆనం విజయ్‌కుమార్‌ రెడ్డి కుటుంబానికి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సొంత బ్రదర్స్‌ వైఎస్‌ జగన్‌ను వ్యతిరేకిస్తున్న సమయంలో.. వారిని ధిక్కరించి వైసీపీలో విజయకుమార్‌ రెడ్డి క్రియాశీలకంగా పని చేశారు. విజయ్‌కుమార్‌ రెడ్డికి ఎమ్మెల్సీ పదవికి ఇస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించినా.. మారిన రాజకీయ పరిణామాల్లో అది సాధ్యం కాకపోవడంతో.. జడ్పీ పీఠంపై విజయ్‌కుమార్‌ రెడ్డి కుటుంబంలోని వారిని కూర్చోపెట్టడడం లాంఛనమే.

Also Read : పంజాబ్‌ కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

రాయలసీమలో..

కడప జిల్లా పరిషత్‌ పీఠం జనరల్‌లో ఉంది. ఈ పీఠం రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి ఖారారైంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును అమర్‌నాథ్‌ రెడ్డి వదులుకున్నారు. 2014లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేడా మల్లికార్జున రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ చేరారు. ఆయనకు టిక్కెట్‌ ఇచ్చేందుకు అమర్‌నాథ్‌ రెడ్డి కూడా సుమఖత వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన అమర్‌నాథ్‌ రెడ్డికి జడ్పీ పీఠం దక్కడం ఖాయమే.

కర్నూలు జడ్పీ పీఠం జనరల్‌లో ఉంది. ఈ పీఠాన్ని పార్టీలో ఆది నుంచి ఉన్న ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఖరారైంది. కొమిలిగుండ్ల జడ్పీటీసీగా ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో కరోనా వైరస్‌ సోకడంతో ఆయన మరణించారు. దీంతో జడ్పీ అభ్యర్థి ఎంపికపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ పీఠం ఎవరికి దక్కుతుందో మరికొద్ది రోజుల్లో తేలుతుంది. గత ఏడాది జడ్పీ పీఠాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి ఆశించారనే ప్రచారం జరిగింది.

అనంతపురం బీసీ మహిళ కు రిజ‌ర్వ్ అయ్యింది. క‌దిరి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగ‌ప‌డిన జ‌క్క‌ల ఆదిశేషు కుటుంబానికి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పారిశ్రామిక‌వేత్త కూడా అయిన ఆదిశేషు విష‌యంలో జ‌గ‌న్ సానుకూలంగా ఉండ‌డంతో ఆయ‌న స‌తీమ‌ణికి జెడ్పీ పీఠం దాదాపు ఖరారు అయినట్లే.

చిత్తూరు జిల్లా పరిషత్‌ జనరల్‌లో ఉంది. అయితే ఈ పీఠాన్ని బీసీలకు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ యోచిస్తున్నారని సమాచారం. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామని చెప్పిన జగన్‌.. చిత్తూరు జడ్పీ పీఠాన్ని బీసీలకే ఇవ్వాలని భావిస్తున్నారు. బీసీలకు దక్కితే.. ఈ పీఠం పలమనేరు నియోజకవర్గం, గౌడ సామాజకివర్గానికి చెందిన నేత శ్రీనివాసులు (వాసు)కు దక్కబోతోంది. జనరల్‌ కావడంతో ఈ పీఠంపై ఇతర నేతలు ఆశలు పెట్టుకున్నప్పటికీ.. పార్టీలో ఆది నుంచి ఉన్న వాసు వైపే సీఎం వైఎస్‌ జగన్‌ మొగ్గు చూపనున్నట్లు సమాచారం.

Also Read : ఉత్తరాంధ్ర టీడీపీ నేతల నోళ్లకు తాళాలు వేసిన ఫలితాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp