ఓవైపు రైతు భరోసా- మరోవైపు ఇన్ ఫుట్ సబ్సిడీ

By Raju VS Oct. 27, 2020, 01:00 pm IST
ఓవైపు రైతు భరోసా- మరోవైపు ఇన్ ఫుట్ సబ్సిడీ

రైతుల పట్ల జగన్ ప్రభుత్వం మరోసారి చిత్తశుద్ధిని చాటుకుంది. రైతు సంక్షేమానికి తాము ఎంత ప్రాధాన్యతనిస్తామో చాటుతోంది. ప్రకృతి విపత్తుల వేళ ఉదారంగా ఆదుకునేందుకు సన్నద్ధమయ్యింది. అదే సమయంలో రైతు భరోసా నిధులు కూడా సకాలంలో విడుదల చేస్తూ పెద్ద మనసు ప్రదర్శిస్తోంది. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా రైతులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ తనదైన శైలిలో సాగుతున్నట్టు స్పష్టమవుతోంది.

ఏపీలో రైతు భరోసా రెండో విడత సాయం నేరుగా రైతుల ఖాతాల్లో చేరింది. వైఎస్సార్ రైతు భరోసా క్రింద 50 .47 లక్షల మంది రైతులకు వరుసగా రెండో ఏడాది లబ్ది చేకూరింది. రూ. 6,797 కోట్ల పథకంలో భాగంగా రెండో విడత సాయం క్రింద రూ.1,115 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తద్వారా 50,47,383 మంది లబ్ధిదారులకు గాను రూ.1,114.87 కోట్ల సాయం దక్కింది. ఈ ఏడాది తొలి విడత నిధులను కరోనా సమయంలోనే మే 15న జమ చేశారు. అప్పట్లో 49,45,470 మంది రైతులకు రూ.3,713 కోట్లు జమయ్యింది.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్‌ 15న వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ రైతుకి ఏటా రూ. 13,500 సాయం అందిస్తున్నారు. దానిని మూడు విడతులగా ఖరీఫ్ లో పంట వేసే ముందు రూ. 7500, అక్టోబర్ లో ఖరీఫ్ పంట కోత సమయం రబీ అవసరాల కోసమంటూ రూ.4000 ధాన్యం ఇంటికి చేరే సంక్రాతి వేళ జనవరి లో రూ.2000 చొప్పున అందిస్తున్నారు. ఈ ఏడాది కరోనా మూలంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దాదాపుగా స్తంభించినా జగన్ మాత్రం వెనకడుగు వేయకుండా భరోసా అందించే ప్రయత్నం చేస్తున్నారు.

తొలి ఏడాది2019 -20 లో 46 .69 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అప్పట్లో రూ.మ6,173 కోట్లను అందించారు. వాస్తవానికి జగన్ తన మ్యానిఫెస్టో ప్రకారం ఏటా రూ.12,500 చొప్పున 5 ఏళ్లలో 50 వేలు ఇస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం దానిని మరో వెయ్యి రూపాయల చొప్పున పెంచి అందిస్తుండడం విశేషంగానే చెప్పాలి. కౌలు రైతులు, ఇటీవ‌లే కొత్త‌గా అట‌వీ హ‌క్కు ప‌త్రాలు పొంది సాగుకు సిద్ధ‌మైన గిరిజ‌న రైతుల‌కు కూడా లబ్ది చేకూరుస్తున్నారు. రెండు విడ‌త‌లు క‌లిపి రూ.11,500 చొప్పున.. 1.02 ల‌క్ష‌ల‌కు పైగా రైతుల‌కు దాదాపు రూ.118 కోట్ల పెట్టుబ‌డి సాయం గత నెలలోనే జమ చేశారు.

అంతేగాకుండా అధిక వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల పంట న‌ష్ట‌పోయిన 1.66 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.135.73 కోట్ల మేర ఇన్ ఫుట్ సబ్సిడీ ప్రకటించారు. ఆ నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పంట నష్టం జరిగిన వెంటనే పరిహారం అందిస్తుండడం విశేషం. ఇంకా అనేక చోట్ల వరద ప్రభావం కనిపిస్తున్నా రైతుల ఖాతాల్లో నష్టపరిహారం చేరుతున్న తీరు ఆసక్తిగా కనిపిస్తోంది. కాగా ఈనెలలో కురిసిన వ‌ర్షాలు.. వ‌చ్చిన వ‌ర‌ద‌ల వ‌ల్ల జ‌రిగిన పంట న‌ష్టానికి న‌ష్ట‌ప‌రిహారం లెక్క‌లు తేల్చేపనిలో యంత్రాంగం ఉంది. లెక్క‌లు పూర్త‌యిన వెంట‌నే ర‌బీ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఆ నష్టపరిహారం కూడా న‌వంబ‌ర్‌లోనే చెల్లించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాంతో వరదలు తగ్గగానే మళ్లీ పంటలు వేసుకునేందుకు అనుగుణంగా నష్టం చేతికి అందుతున్న సమయంలో రైతులు కాస్త సంతృప్తి వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp