రాజన్న రాజ్యం.. పురుడు పోసుకున్న రోజు

By Ramana.Damara Singh May. 14, 2021, 12:30 pm IST
రాజన్న రాజ్యం.. పురుడు పోసుకున్న రోజు

కొన్ని తేదీలకు.. కొన్ని సందర్భాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. చరిత్ర పుటల్లో అవి సువర్ణాక్షరాలతో లిఖితమైన అద్భుత సందర్భాలు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అటువంటి అరుదైన.. అపురూపమైన తేదీ.. 14.5.2004..
ఎందుకంటే అదే రోజు ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఓ కొత్త శకానికి శ్రీకారం చుట్టింది.

త్రేతాయుగం నాటి రామరాజ్యాన్ని తలపించే రాజన్న రాజ్య స్థాపనకు ఆరోజే పునాది పడింది. ఆ రోజే వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరింది. సంక్షేమ రాజ్యానికి బాటలు వేసింది. సుమారు మూడు దశాబ్దాల టీడీపీ పాలనకు చరమ గీతం పాడి రాజన్న రాజ్యం మొదలైంది ఆ రోజే.

Also Read:అంధురాలైతేనేమి ,పెన్షన్ అంతా కరోనా సహాయ చర్యలకు ఇచ్చింది

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా..
పాలకుడంటే ప్రజలపై స్వారీ చేసేవాడు కాదు.. పేదల కష్టాలు తీర్చే.. కన్నీళ్లు తుడిచే.. వారింట సంక్షేమ ఫలాలు పూయించే వాడే నిజమైన పాలకుడు. అతడే నిజమైన రాజు. వైఎస్ కూడా అచ్చం ఇలాగే భావించారు. వారి సంక్షేమాన్ని నిరంతరం కాంక్షిస్తూ ఎన్నో పథకాలు అమలు చేశారు. ప్రజలతో ఆప్యాయంగా అన్నా అని పిలిపించుకున్నారు. అలా రాజన్నగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అటు పేదల సంక్షేమం.. ఇటు రాష్ట్ర అభివృద్ధి.. రెండింటికీ సమ ప్రాధాన్యమిస్తూ తన పాలన కాలాన్ని సువర్ణ యుగంగా తీర్చుదిద్దారు. రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక ముద్ర వేశారు.

వినూత్న కార్యక్రమాలు
అధికారంలోకి రాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003లో ప్రజాప్రస్థానం పేరుతో రాజన్న 1475 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి.. ప్రజల కష్టాలు, సమస్యలు, అవసరాలను స్వయంగా తెలుసుకున్నారు. వాటినే అజెండాగా మార్చుకున్నారు. 2004లో 185 సీట్లతో ఏపీ 14వ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాచరణకు పూనుకున్నారు.

తొలి నిర్ణయంతోనే సంక్షేమానికి ద్వారాలు తెరిచారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేశారు. అది మొదలు వరుసగా ఐదేళ్లు సంక్షేమ ఫలాలు అందిస్తూనే ఉన్నారు. పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారు. ఎన్నో లక్షలమంది రోగులకు పునర్జన్మనిచ్చారు. అనారోగ్యంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108 సర్వీసు, గ్రామీణ ప్రజల ముంగిటికే వైద్యాన్ని అందించే 104 సర్వీసులు ప్రారంభించారు.

Also Read:బెంగాల్ -బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారు ?

డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులు స్వయం సాధికారత కోసం పావలా వడ్డీకే రుణాలు ఇప్పించారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్య, ఉద్యోగాలు పొందగలిగేలా ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తూ ఇందిరమ్మ పక్కా ఇళ్లు పథకం తెచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో లక్షలాది వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా ఈ పథకం అమలులో దేశానికే రోల్ మోడల్ గా నిలిచారు.

మరోవైపు జలయజ్ఞం చేపట్టి 10 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ ను మరో సిలికాన్ వ్యాలీగా మార్చడంతోపాటు.. విశాఖ నగరంలో ఐటీ అభివృద్ధికి బాటలు వేశారు. ఇన్ని కార్యక్రమాల సంక్షేమ క్రాంతి ప్రజల్లో రాజన్న ముద్రను బలంగా వేసింది. విశ్వసనీయతకు ప్రతిరూపంగా నిలిపింది.

చెరగని ముద్ర
ఆ విశ్వసనీయత, సంక్షేమ ముద్రలే 2009 ఎన్నికల్లో వైఎస్ రెండోసారి విజయ ఢంకా మోగించడానికి దోహదపడ్డాయి. అయితే విధికి కన్నుకుట్టింది. రెండోసారి అధికారం చేపట్టిన కొద్దీ రోజులకే రాజన్నను ప్రజలకు దక్కకుండా చేసింది. ఆ షాక్ వందలాది గుండెలను పగులగొట్టింది. రాష్ట్ర ప్రజలను విషాద సంద్రంలోకి నెట్టింది.

అయితే నాన్న లేకపోతేనేం నేనున్నాను.. నాన్నను మరిపించేలా మిమ్మల్ని చూసుకుంటానన్న భరోసాతో యువ కెరటం వైఎస్ జగన్ ప్రజల ముందుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు, ప్రజల ముంగిటికే సంక్షేమ ఫలాలు, నగదు బదిలీ పథకాలు, సచివాలయ వలంటరీ వ్యవస్థల ఏర్పాటు.. తదితర ఎన్నో విప్లవాత్మక చర్యలతో నాటి రాజన్న రాజ్యాన్ని ఇప్పటికీ సజీవంగా నిలుపుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp