ఆడ‌ప‌డుచుల‌కు అండ‌గా జ‌గ‌న్ : నేరుగా వారి ఖాతాల్లోకే న‌గ‌దు

By Kalyan.S Aug. 12, 2020, 07:30 am IST
ఆడ‌ప‌డుచుల‌కు అండ‌గా జ‌గ‌న్ : నేరుగా వారి ఖాతాల్లోకే న‌గ‌దు

ఆడ‌ప‌డుచుల‌కు ఆర్థిక స్వావ‌లంబ‌న ల‌భిస్తేనే ఆ కుటుంబం.. త‌ద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయి. ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉండాలంటే ముఖ్యంగా ఆ కుటుంబాల్లో ఆర్థిక క‌ష్టాలు ఉండ‌కూడ‌దు. నిత్యావ‌స‌రాలు, పిల్ల‌ల అవ‌స‌రాల‌కు కావాల్సిన న‌గ‌దు అందుబాటులో ఉండాలి. భ‌ర్త ఇచ్చే న‌గ‌దు కుటుంబపోష‌ణ‌కు స‌రిపోన‌ప్పుడు వాటిని అడ్జ‌స్ట్ చేయ‌డానికి గృహిణులు ప‌డే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని కుటుంబాల్లో భ‌ర్త‌, పిల్ల‌ల‌కు క‌డుపు నిండా భోజ‌నం పెట్టి ప‌స్తులుండే మ‌హిళ‌లూ ఉంటారు. ఒక్కరోజు పనికి వెళ్లకపోయినా కుటుంబాన్ని నెట్టుకురాలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. అటువంటి వారి క‌ష్టాలు విని, పాద‌యాత్ర‌లో క‌ళ్లారా చూసిన జ‌గ‌న్ వారికి ఇచ్చిన హామీ మేర‌కు నేరుగా మ‌హిళ‌ల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేస్తున్నారు. ఓ అన్న‌గా, ఓ త‌మ్ముడిగా వారిని ఆదుకునే విధంగా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఇప్ప‌టికే వైఎస్ఆర్ కాపు నేస్తం ప‌థ‌కం ద్వారా 45 ఏళ్ల‌లోపు అర్హులైన కాపు మహిళల ఖాతాల్లో రూ.15వేల చొప్పున ఈ ఏడాది రూ.353.81 కోట్లు జ‌మ చేశారు. ఇప్పుడు బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల మ‌హిళ‌ల కోసం మ‌రో బృహ‌త్త‌ర ప‌థ‌కాన్ని నేడు ప్రారంభిస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దాదాపు 25 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఒక్క చేయూత ద్వారానే నాలుగేళ్ల కాలంలో నేరుగా దాదాపు రూ.18,000 కోట్లు మహిళల చేతికే ఉచితంగా అందుతాయి. దీంతో పాటు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వరకు ఉన్న విద్యార్థులందరి త‌ల్లిదండ్రుల‌కు అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా ఏటా మ‌రో 15000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. మ‌హిళ‌ల‌కు ఈ స్థాయిలో న‌గ‌దు అందిస్తున్న ప్ర‌భుత్వం బ‌హుశా దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఉండ‌దు.

ప‌థ‌కాల ముఖ్య ఉద్దేశ‌మిదే...

మహిళల్లో ఆర్థిక సుస్థిరత, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటునందించేలా ఈ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బుకు మూడు నాలుగు రెట్లు వివిధ పథకాలు, బ్యాంకుల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు అందించి, ప్రఖ్యాత కంపెనీలు అందించే వ్యాపార నమూనాలతో వారి జీవనోపాథి మార్గాలను పెంచడమే కాకుండా, ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న వారికి చేయూతనిచ్చి ఆదాయ మార్గాలను బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, హస్తకళలు, చిరు వ్యాపారాలు, చేనేత.. తదితర రంగాల్లో ఉన్న మహిళల ఆర్థిక ప్రగతికి ఈ చర్యలు తోడ్పాటునందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

‘చేయూత’ ఆవిర్భావం వెనుక

2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ 14 నెలలపాటు 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఈ సమయంలో వివిధ వర్గాలకు చెందిన వేలాది మహిళలు ఆయన్ను కలుసుకున్నారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. కుటుంబం బరువు బాధ్యతలను మోస్తున్నామని, ఇన్ని రోజులుగా పనిచేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. కుటుంబ అవసరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని, పిల్లల పెళ్లిళ్లు లాంటి బాధ్యతలూ మోస్తున్నామని వైఎస్‌ జగన్‌కు పలు సందర్భాల్లో విన్నపించుకున్నారు. ఒక్కరోజు పనికి వెళ్లకపోయినా కుటుంబాన్ని నెట్టుకురాలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి సమస్యలు చెప్పుకున్న వారిలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యనున్న మహిళలే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు స్థిరమైన ఆదాయమార్గాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడానికి వైఎస్‌ జగన్, వైయస్సార్‌ చేయూత పథకాన్ని వర్తింప చేస్తామంటూ నాడు హామీ ఇచ్చారు. నేడు అమ‌లు చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp