వైఎస్సార్ చేయూత - మేనిఫెస్టోలో మరో హామీ అమలు నేడే

By Sanjeev Reddy Aug. 12, 2020, 10:30 am IST
వైఎస్సార్ చేయూత - మేనిఫెస్టోలో మరో హామీ అమలు నేడే

2019 ఎన్నికలకు ముందు వైసీపీ మేనిఫెస్టోలో పొందు పరిచిన మరో ముఖ్య హామీ వైఎస్సార్ చేయూత . పాదయాత్రలో 45 ఏళ్ళు పై బడిన వెనకబడిన వర్గాల మహిళల కష్టాలు , కుటుంబ నిర్వహణలో ఇక్కట్లు స్వయంగా చూసిన జగన్ ఎస్సి , ఎస్టీ , బిసి , మైనార్టీ వర్గాలలో 45 ఏళ్ళు పై బడిన మహిళలకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు . 

ఈ విషయం పై మేనిఫెస్టో కమిటీ పలు సమీక్షలు నిర్వహించిన తర్వాత 45 ఏళ్ల వయసులో పెన్షన్ ఇవ్వటం కన్నా వారికి ప్రతి ఏటా ఒకేసారి కొంత మొత్తం ఆర్ధిక సహాయం చేస్తే వారి ఆర్ధిక స్వావలంబనకు దారితీస్తుంది అనే అభిప్రాయంతో ఎన్నికల ముందు 45 ఏళ్ల పెన్షన్ బదులు వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండవ సంవత్సరం నుండి ప్రతి ఏటా 18750 రూ. చొప్పున నాలుగేళ్లలో 75000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు .

మేనిఫెస్టో తమకు గీత , ఖురాన్ , బైబిల్ తో సమానం అని ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం అని చెప్పిన జగన్ ,వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క హామీని అమలు చేయడం ప్రారంభించారు . ఆ క్రమంలో అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుండి అమలు చేస్తామన్న వైఎస్సార్ చేయూత పధకం అమలుకు నేడు శ్రీకారం చుట్టారు .

ఈ పధకం ద్వారా దాదాపు 24 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతుండగా రానున్న నాలుగేళ్లలో ఈ పథకానికి ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయం షుమారు 17000 కోట్లు . ఈ సందర్భంగా లబ్ధిదారులకు బహిరంగ లేఖ రాసిన సీఎం జగన్ , 45 ఏళ్ల పై బడిన వెనకబడిన వర్గాల మహిళలు రోజంతా కష్టపడినా కుటుంబ నిర్వహణ కష్టంగా ఉన్న విషయం పాదయాత్రలో గమనించానని ఆ సందర్భంగా ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చి వారి అభివృద్ధికి బాసటగా నిలిచే క్రమంలో ఈ హామీని నేడు అమలు చేస్తున్నామని తెలిపారు .

ఈ పధకం తాలూకూ లబ్ది వినియోగించుకోవటానికి నిబంధనలు ఏమీ విధించట్లేదు కాబట్టి ఎలా వినియోగించుకోవాలనేది వారి అభీష్టానికి వదిలేస్తున్నామని అయితే తమ అభివృద్ధికి ఆర్ధిక స్వావలంబనకు వినియోగించుకునే వారికి మరింత సహాయ సహకారాలు అందించటానికి సిద్ధంగా ఉన్నామని ఇందుకోసం పలు బ్యాంక్ లతో ఆర్ధిక సహకార ఒప్పందం కుదుర్చుకోవటంతో పాటు , మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులు , పాలు , ఆహార పదార్ధాల మార్కెటింగ్ కి , లాభసాటి ధర అందింవహటానికి పలు కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొన్నామని , ఈ కంపెనీలతో వ్యాపార ఒప్పందంలో ప్రతి మహిళా భాగస్వామి కావొచ్చని , అలా కావాలనుకున్న వారు విలేజ్ వలంటీర్ కి వివరాలు అందించి సెర్ఫ్ లేదా మెఫ్మా ల ద్వారా ఆయా కంపెనీలు , బ్యాంక్ లతో అనుసంధానం అయ్యి వ్యాపారం నిర్వహించుకొని లబ్ది పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp