ప్రతి గుడి, బడి చెంత ఆస్పత్రి

By Ramana.Damara Singh Jun. 21, 2021, 03:09 pm IST
ప్రతి గుడి, బడి చెంత ఆస్పత్రి

ఆధ్యాత్మికానికి గుడి.. చదువు సంధ్యలకు బడి.. ఆరోగ్యానికి ఆస్పత్రి.. ఇదే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి గ్రామంలో గుడి, బడి ఉన్నట్లే.. ప్రతి చోటా వాటి చెంత వైద్యాలయం ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఆ సంకల్ప సాధనకు విప్లవాత్మక నిర్ణయం తీసుకొని.. దాన్ని ఆచరణలో పెట్టేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ పేదల ఆరోగ్య పరిరక్షణకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పనికీ దూర ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులు, పీహెచ్సీలకు పరుగులు తీయాల్సిన శ్రమ, ఖర్చును తగ్గించేందుకు విలేజ్ క్లినిక్స్ దోహద పడతాయని భావిస్తున్నారు.

10,030 క్లినిక్కులు

ప్రతి గ్రామానికి వైద్య సౌకర్యం అందుబాటులోకి తేవడానికి ప్రతిపాదించిన ఈ క్లినిక్కులను 2000 నుంచి 2500 జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,030 కేంద్రాల నిర్మాణం చేపట్టారు. వీటిలో 8585 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ. 1745 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆగస్ట్ 15 నాటికి వీటిని ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించడంతో యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు దూరాభారంగా ఉన్న ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు పరుగులు తీయాల్సిన శ్రమ తప్పించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

వైద్యపరంగా ఈ క్లినిక్కులు మొదటి రిఫరల్ పాయింట్లుగా ఉండాలన్నది లక్ష్యం. సచివాలయం ఉన్న ప్రతి చోటా ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినిక్స్ 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అందుకోసం నర్సింగ్ ఉద్యోగులను ఏర్పాటు చేస్తారు. వీరితోపాటు ఏ ఎన్ ఎం, హెల్త్ అసిస్టెంట్, ఆశ కార్యకర్త ఉంటారు. రోగులకు ప్రాథమిక వైద్యంతో పాటు 90 రకాల మందులు అందుబాటులో ఉంచుతారు. ఇక్కడికి వచ్చే రోగులను అవసరాన్ని బట్టి ఉన్నత వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా.. అన్నీ ఉచితంగా సమకూరుస్తారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అన్ని రకాల వ్యాక్సిన్లు కూడా ఇక్కడే వేస్తారు.

ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఏడాదిన్నర కాలంగా ఎదుర్కొంటున్న కోవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో అటువంటి విపత్తులు ఎదురైతే గ్రామ స్థాయిలోనే కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బోధన ఆస్పత్రుల ఏర్పాటుకు నిర్ణయించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 16 బోధనాస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ మూడో దశ రావచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో రూ. 180 కోట్లతో రాష్ట్రంలో మూడు పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. వీటికి అదనంగా గ్రామస్థాయిలో ఆరోగ్య విప్లవం సృష్టించేందుకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp