పార్లమెంట్ ని తాకిన జలజగడం, వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన సరైనదేనన్న కేంద్రం

By Raju VS Jul. 22, 2021, 01:00 pm IST
పార్లమెంట్ ని తాకిన జలజగడం, వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన సరైనదేనన్న కేంద్రం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీలో తలెత్తిన వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. తాజాగా పార్లమెంట్ ని కూడా తాకింది. ఇప్పటికే రివర్ మేనేజ్ మెంట్ బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తెలంగాణా అంగీకరించేది లేదంటోంది. దానిపై న్యాయపోరాటానికి సన్నద్ధమవుతోంది. అదే సమయంలో పలు సవరణలతో దానిని ఆమోదించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ సమయంలో పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. తెలంగాణా ప్రభుత్వ తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టును నిర్మించడంపై లోక్ సభలో ఆపార్టీ ఎంపీలో నిరసనకు పూనుకున్నారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, కృష్ణా జలాల అంశం, పోలవరం నిధులపై చర్చకు పట్టుబట్టారు. అయితే సానుకూల స్పందన రాకపోవడంతో వెల్ లోకి దూసుకెళ్ళి నిరసన తెలిపారు.

శ్రీశైలంలో 800 అడుగల మట్టంలోనే నీటిని తరలిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి జరుపుతోందన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ప్రస్తావించారు. విభజన చట్టం, నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు, తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీల వాదనను కేంద్రం కూడా అంగీకరించింది. ఏపీకి చెందిన ఎంపీల వాదన సరైనదేఃనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసమే, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే గెజిట్ విడుదల చేసినట్టు సభ దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్ సభను స్తంభింపజేయడానికి సైతం సిద్ధపడగా విపక్ష టీడీపీ ఎంపీల నుంచి ఉలుకూపలుకు లేకపోవడం విశేషం. నిజంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం చిత్తశుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు లోక్ సభలో ఆందోళనను సమర్థించాల్సి ఉండగా ఆ పార్టీ ఎంపీలు మాత్రం మౌనంగా ఉండిపోవడం విశేషంగా మారింది.

Also Read : పార్ల‌మెంట్ లో టీడీపీ ఎంపీలు ఎక్క‌డ‌?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp