తూర్పు డీసీసీబీ పీఠంపై ‘మోహన్‌’ ఆశలు

By Jaswanth.T Jun. 15, 2021, 02:00 pm IST
తూర్పు డీసీసీబీ పీఠంపై ‘మోహన్‌’ ఆశలు

విస్తీర్ణం.. జనాభా పరంగానే కాకుండా ఏపీలోని తూర్పుగోదావరి అనేక ప్రత్యేకతలు ఉన్న జిల్లాగా పేరుపొందింది. వ్యవసాయ ప్రాధాన్యత జిల్లాగా ఉన్న ఇక్కడ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (డీసీసీబీ)కి ప్రత్యేక స్థానం ఉంది. డీసీసీబీ ఛైర్మన్‌ పీఠాన్ని రాజకీయవర్గాలు ప్రతిష్టాత్మకంగానే పరిగణిస్తుంటారు. దీని కోసం పలువురు పోటీ పడుతుంటారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చాక తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీకి ఛైర్మన్‌గా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అనంత ఉదయభాస్కర్‌ను నియమించింది.

ప్రస్తుతం ఆయన పదవీ కాలం పూర్తికావొస్తుండడంతో తిరిగి కొనసాగించే అంశంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ పదవిపై అనంతబాబు మొగ్గు చూపుతున్నారన్న టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా డీసీసీబీ పీఠంపై అమలాపురం ప్రాంతానికి చెందిన మిందగుదుటి మోహన్‌ దృష్టి పెట్టినట్లుగా జిల్లాలోని రాజకీయవర్గాల్లో జోరుగానే విన్పిస్తోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన మోహన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంకు చెందిన మోహన్‌ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్నారు. తాత, తండ్రుల కాలం నుంచి రాజకీయ కుటుంబం కావడంతో యువకుడిగా ఉండగానే కాంగ్రెస్‌ పార్టీలో చురుగ్గా వ్యవహరించేవారు. యువజన కాంగ్రెస్‌లో పలు పదవుల కూడా చేసారు. అదే పార్టీ నుంచి అయినవిల్లి మండలం జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ప్రజలతో సత్సంబంధలను కొనసాగించారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీని విభేదించిన వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు. పి. గన్నవరం నియోజకవర్గంకు ముగ్గురు కో ఆర్డినేటర్లను 2014 ప్రాతంలో జగన్‌ ప్రకటించగా, అందులో మిండగుదుటి మోహన్‌ కూడా ఒకరు. అనంతరం కో ఆర్డినేటర్ల మార్పుతో పార్టీ రాష్ట్రకార్యదర్శి పదవిని కేటాయించారు. అప్పటి నుంచి ఆయన వైఎస్సార్‌సీపీలో అమలాపురం ప్రాంతం నుంచి కీలకనాయకుడిగానే కొనసాగుతున్నారు.

డీసీసీబీ ఛైర్మన్‌ పదవికి అనంతబాబుతో పాటు మోహన్‌ పేరుకూడా పరిశీలనలోకొచ్చింది. కానీ పదవి మాత్రం అనంతబాబునే వరించింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గానే మోహన్‌ వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సారి డీసీసీబీ ఛైర్మన్‌ రేసులో మోహన్‌ కూడా ఉన్నట్లు ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. ఒక వేళ పార్టీ అధిష్టానం అనంతబాబును మినహాయిస్తే మోహన్‌కే అవకాశాలు ఉంటాయని ఢంకాభజాయించి చెబుతున్నారు. ప్రస్తుతం వీరవల్లిపాలెం సొసైటీ త్రీమెన్‌ కమిటీ ఛైర్మన్‌గా మోహన్‌ ఉన్నారు. ప్రస్తుతం ఆశావహులకు పదవుల పంపిణీపై సీయం వైఎస్‌ జగన్‌ దృష్టి పెట్టినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో డీసీసీబీ ఛైర్మన్‌ రేసులో మోహన్‌ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. సహకార సొసైటీ పాలకవర్గాలతో పాటు, రాజకీయవర్గాల్లో సైతం ఈ టాపిక్‌ నడుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీకి 50కిపైగా బ్రాంచిలు ఉన్నాయి. వీటి పరిధిలో 296 వ్యవసాయ సహకార సొసైటీలు రూ. 2,500 కోట్లకుపైగా టర్నోవరుతో రైతులకు వివిధ రకాల సేవలందిస్తున్నాయి.

Also Read : నామినేటెడ్ పదవుల పందేరం, పక్కా ప్రణాళికతో జగన్ సిద్ధం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp