జగన్‌ మాటలు.. బాబు చేతలు..

By Kotireddy Palukuri Feb. 21, 2020, 08:11 pm IST
జగన్‌ మాటలు.. బాబు చేతలు..

తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వండివారుస్తున్న మీడియాపై సీఎం వైఎస్‌ జగన్‌ మెతక వైఖరి కనబరుస్తున్నారు. నిరాధారమైన, అసత్య కథనాలు, వార్తలు ప్రచురించినా/ప్రచారం చేసినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ తన ప్రమాణ స్వీకారం రోజునే హెచ్చరించారు. అందులో భాగంగా జీవో కూడా జారీ చేశారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున దూమారం రేగినా ఆయన వెనక్కి తగ్గలేదు. జీవోను వెనక్కి తీసుకోలేదు. అయితే జగన్‌ చెప్పిన ప్రకారం.. జారీ చేసిన జీవో ప్రకారం నడుచుకోవడంలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే మరో వైపు టీడీపీ మాత్రం జగన్‌ చెప్పిన మాటలను తన పరిధి మేరకు పూర్తి స్థాయిలో ఆచరణలో పెడుతుండడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో మీడియాగా పేరొందిన కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు టీడీపీకి వంత పాడుతుంటాయి. అందుకే వాటికి ఎల్లో మీడియా అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయా పత్రికల్లో వచ్చే కథనాలు, ఇతర పార్టీలు అధికారంలో ఉంటే వచ్చే కథనాలకు మధ్య పూర్తి వ్యత్యాసం ఉంటుంది. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై కూడా ఆ పత్రికలు నిత్యం ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తూ ఇబ్బందులు పెట్టాయి. వైఎఎస్‌ఆర్‌ కూడా ఆ రెండు పత్రికలంటూ సంబోధిస్తూ ఆయా పత్రికలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేవారు. వైఎస్‌ జగన్‌ కేసులపై ఈ పత్రికలు చిలువలు పలువలు చేసి రాసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బాబుపై మాత్రం ఈగ కూడా వాలనిచ్చేవి కావు.

అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల ఏపీలో జరిగిన ఐటీ రైడ్స్‌పై ఐటీ శాఖ ఇచ్చిన పత్రికా ప్రకటన ఆధారంగా జగన్‌ పత్రికలో వరుసగా రెండు రోజులు.. ‘‘మచ్చుకు రూ.2 వేల కోట్లు’’.. ‘‘ ఆంధ్రా అనకొండ’’ అనే శీర్షికతో కథనాలు ప్రచురించింది. తమ పార్టీ, అధినేతపై నిరాధారమైన, అసత్య కథనాలను ప్రచురిస్తూ సాక్షి మీడియా విలువల్నీ దిగజారుస్తోందని టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎడిటర్స్‌ గిల్ట్‌ ఆఫ్‌ ఇండియా లకు ఫిర్యాదు చేశారు.

ఐటీ దాడులకు రెండు రోజుల ముందు ఎల్లో మీడియాగా పిలిచే పత్రికల్లో కియా పరిశ్రమ తరలిపోతుందంటూ కథనాలు ప్రచురించారు. పెట్టుబడులు పోతున్నాయంటూ ప్రచారం చేశారు. అంతకుముందు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలంటూ వరుస కథనాలు ప్రచురించారు. ఈ కథనాలను అధికార వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఖండించారు తప్పా ప్రభుత్వం పరంగా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ఆయా పత్రికలు, చానెళ్ల యజమానులపై.. ‘‘మెదళ్లు కుళ్లిపోయాయి’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు గానీ ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాటను, ఆ తర్వాత విడుదల చేసిన జీవోను మాత్రం అమలు చేయకపోవడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp