రంగుల రాజకీయం - అప్పుుడు మీరు వేశారు కాబట్టి ఇప్పుడు మేము కూడా !!!

By Amar S Dec. 05, 2019, 05:45 pm IST
రంగుల రాజకీయం - అప్పుుడు మీరు వేశారు కాబట్టి ఇప్పుడు మేము కూడా !!!

ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లే పెద్ద మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి.. చిన్న చిన్న తప్పిదాలే భారీ ఉపద్రవాలనూ తెచ్చి పెడతాయి..

2019 ఏపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆపార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేళ్లపాటు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే జగన్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసారు. అవినీతి లేని పాలన అందిస్తున్నారు. వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనూహ్యమార్పులు తీసుకొస్తున్నారు. ఉద్యోగాలు, పెన్షన్లు, ప్రాజెక్టులు, రైతు సంక్షేమం ఇలా ప్రతీ అంశంలో తనదైన మార్క్ చూపిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇంతటి కార్యాచరణ, ప్రజలకోసం ఈస్థాయిలో పధకాలు, నిధులు ప్రవేశపెడుతూ, ముఖ్యమంత్రితోపాటు, అధికారులు, గ్రామస్థాయిలో వలంటీర్లు పనిచేస్తున్నా ప్రజల్లోకి మాత్రం నిత్యం వైసీపీ రంగుల విషయంలో ఎక్కడోచోట వివాదం రేగుతోంది.

సోషల్ మీడియాలో కూడా రంగుల అంశమే సర్క్యులేట్ అవుతోంది. ప్రభుత్వ పధకాలు, ముఖ్యమంత్రి నిర్ణయాలు, అనూహ్య మార్పులకంటే అక్కడక్కడ రంగుల విషయంలో కనిపిస్తున్న వివాదాలే ఎక్కువవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ పదేళ్లుగా ఎదురు చూస్తున్న కార్యకర్తలంతా ఒక్కసారిగా ఉత్సాహానికి లోనైనమాట వాస్తవమే.. అయితే ఈ ఉత్సాహాన్ని ఎక్కడ చూసినా మన పార్టీ రంగులే కనిపించాలనే ధోరణిలో తీసుకెళ్తున్నారు. గతంలో టీడీపీ వేసిన రంగులపై మన రంగులు వేయాలనే కారణంతో కొందరు, పార్టీ దృష్టిలో మరికొందరు, అందరూ వేస్తున్నారు కదా.. మనం ఎందుకు వేయకూడదని ఇంకొందరు ఇలా వైసీపీ రంగులు వేయడం మొదలుపెట్టారు.

మొదట్లో గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు వేయడం పట్ల కొందరు అభ్యంతరాలు తెలిపినా గ్రామ సచివాలయాల వ్యవస్థ కొత్తది కాబట్టి ప్రజలు ఎవరైనా తెలియని వారు చూస్తే గుర్తుపట్టే విధంగా, అన్ని సదుపాయాలు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఒక్కచోటే దొరుకుతుందని, అందుకే ఈ రంగులు వేస్తున్నామని వివరణ ఇచ్చారు. కాబట్టి పెద్దగా దీనిని ఎవరూ వ్యతిరేకించలేదు. అయితే నియోజకవర్గాల్లోని ద్వితియశ్రేణి లీడర్లు, పార్టీ కార్యకర్తలు మాత్రం ఇంకాస్త ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్స్, మంచి నీటిబోరు, జాతీయ జెండాలు, స్మశానాల గోడలు ఇలా ఏది కనిపిస్తే దానికి, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల కార్యాలయాలకు కూడా కూడా పార్టీ రంగులు పూసేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో అధికారుల అత్యుత్సాహం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీలోని గ్రామసచివాలయానికి ఉన్నజాతీయ జెండారంగు చెరిపేసి.. వైసీపీ రంగులు వేయడంతో పెద్ద వివాదం చెలరేగింది. ప్రకాశం జిల్లా పర్చూరులో అయితే ఏకంగా గేదెల కొమ్ములకు సైతం పార్టీ రంగులు వేసేసారు. అలాగే విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం, భైరిపురం పంచాయతీ కార్యాలయంలో ఓ మాజీ సర్పంచ్ తనతల్లి జ్ఞాపకార్థం గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఆ విగ్రహ దిమ్మెకు వైసీపీ రంగులు వేసినట్టు వార్తలు రావడంతో పెద్దదుమారం చెలరేగింది. సోషల్ మీడియాలోనూ ఆ ఫొటోలు సోషల్ వైరల్ కాగా ఆ ఫోటోలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ తమ అధికార సోషల్ మీడియాలో షేర్ చేసారు. త్రివర్ణ పతాకానికి తమ పార్టీ రంగులేసుకొని అభాసులపాలైన వైసీపీ పాఠాలు నేర్వలేదని చంద్రబాబు మండిపడగా.. మొన్న జాతీయ జెండా, ఈరోజు గాంధీ విగ్రహం, రేపేంటి జగన్ రెడ్డీ జీ.? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా వైసీపీ పాలన రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో పాలనలా ఉందని ట్వీట్ చేసారు.

ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వైసీపీ వాళ్ళు రంగులపిచ్చితో జాతీయ జెండాను అవమానించి దేశ ప్రతిష్టను దెబ్బతీసేవరకూ వచ్చిందన్నారు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం చట్ట వ్యతిరేకమన్నారు. కొంతమంది వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు రంగుల విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. టీడీపీ, వైసీపీలు విమర్శ, ప్రతివిమర్శలు చేసుకున్నారు. ఈ అంశంపై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ రంగులేయడం అనే ట్రెండ్‌ను ప్రారంభించిందే చంద్రబాబు నాయుడని, ఈ ట్రెండ్‌ను ఒక్కసారిగా ఆపేయలేమన్నారు.. రంగులు పులిమే ప్రక్రియ మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందని తనదైన శైలిలో వెల్లడించారు.

ఇలా రంగుల రాజకీయం కొంతకాలం నడిచిన తర్వాత సద్దుమణిగింది అనుకునేలోపే మరోచోట రంగులు ప్రత్యక్షమయ్యాయి. విశాఖ జిల్లా మాడుగులలో జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్‌ నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ ప్రారంభించారు. రూ.1.94 కోట్లతో కార్పొరేట్‌ స్థాయిలో అన్ని ఆర్భాటాలతో నిర్మించిన ఈ భవనానికి కూడా వైసీపీ రంగులు వేసేసారు. ఈవసతిగృహంలో 25 గదులు, కిచెన్‌ కం డైనింగ్‌ హాల్, కార్యాలయ గది, మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ పాఠశాలలో చదువులు సాగించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఈ భవనం అందుబాటులోకి తీసుకురావడం మంచి కార్యక్రమమైనా మరికొంతమంది మాత్రం వైసీపీ రంగులు కనిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..

ఈ విధంగా ప్రభుత్వం చేసిన ఎక్కవ మంచి కంటే చిన్న చిన్న పొరపాట్లే ప్రొజెక్ట్ అవుతున్నాయి. గతంలో టీడీపీ హయాంలో వాటర్ ట్యాంకులకు, స్కూళ్లకు, ప్రహరీ గోడలకు, స్మశానవాటికలకు ఇష్టానుసారంగా పసుపురంగు వేయడంవల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రభుత్వ సొమ్మును పార్టీ ప్రచారానికి వాడుకోవడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమయ్యింది. టీడీపీ ఓటమిలో ఇది కూడా ప్రభావం చూపిందనే చెప్పుకోవాలి. కాబట్టి ఈవిషయంలో ప్రభుత్వం పెద్దలు ముందుకు వచ్చి స్పష్టతనివ్వాలని, గత ప్రభుత్వ హయాంలో వేసారు కాబట్టి ఇప్పుడు అసలు పార్టీ రంగులు వేయడం కరెక్టా కాదా అంటూ కొందరు ద్వితియ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు చెడ్డపేరు తీసుకురావద్దని సలహాలిస్తున్నారు. అయితే టీడీపీ హయాంలో ఇష్టానుసారంగా వాటర్ ట్యాంకులకు, అన్నా క్యాంటీన్లకు, గుడులు, బడులు, స్మశానవాటికలకు పసుపు రంగులు అద్దింది నిజమే.. అయితే అప్పుడు చంద్రబాబు హయాంలో చేసారు కాబట్టి ఇప్పుడు మేం కూడా ఇదే మాదిరిగా చేస్తామనడం మాత్రం సరైంది కాదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp